వెంగమాంబ తన కుటీరంలో ధ్యానముద్రలో ఉంది. చుట్టూ భక్తులు వచ్చి చేరుతున్నారు. కన్నులు తెరవగానే అందరూ నమస్కరించారు. వెంగమాంబ చిరునవ్వుతో ఆశీర్వదించింది. ఒక భక్తుడు లేచి అన్నాడు
"అమ్మా! నాదొక సందేహం"
అడగమన్నట్టు తల ఊపింది.
"తల్లీ! మీరు ఆరాధించేది తరిగొండ నరసింహస్వామిని, తిరుమల వేంకటేశ్వరుని ఇద్దరూ విష్ణువు అవతారాలే1 మరి శివ నాటకం కూడా రాశారెందుకు? మీరు శివుడిని కూడా పూజిస్తారా?"
"నా సాధన అంతా జరిగింది మదనపల్లెలోని సోమేశ్వరాలయంలో. వారిద్దరికీ తేడా లేదు."
"ధీరయతుల్ వాసుదేవుని విజ్ఞాన
సురుచిర భక్తులఁ జూడఁగాను
నుపనిషత్తులు చెప్పుచో స్మార్తు లా హరిం
జిత్స్వరూపముగ లక్షింపఁగాను
ద్వైతవాదులును భేద శ్రుతిసార మీ
దేవతోత్తముఁ డని తెలియఁగాను
మొనసి వేదాంతంబు లొనరంగఁ జదువు వై
ష్ణవులు మాధవభక్తి సలుపఁగాను".
"అయితే దేవతా స్వరూపాలు వేరుకాని, వారిలో తేడాలేదంటారు అంతేగా" అన్నాడు మరొక భక్తుడు.
శివుడంటేనేమి కేశవుడంటేనేమి
శివకేశవుల చిత్తస్థితి భేదమేమి?
ఆ మహాదేవుడే అచ్యుతుడాయె
శ్రీమహావిష్ణువే శివరూపమాయె ||శివు||
రతిరాజు భ్రమలచే రట్టయ్యేదేమి?
మతిమంతుడైతే యీ మత భేద మేమి? ||శివు డంటే నేమి||
మంచు వంటిది దేహ మని యెంచలేరు
మించుబోణుల గూడి విఱ్ఱ వీగేరు ||శివు డంటే నేమి||
మంచిది, కానిది మది నెంచలేరు
పంచేంద్రియంబుల బడి పొర్లేరు ||శివు డంటే నేమి||
ఆ మహాదేవుడే అచ్యుతు డాయె
శ్రీమహావిష్ణువే శివరూప మాయె ||శివు డంటే నేమి||
ఈ మహాతత్త్వార్థ మిది నిత్య మాయె
సోముడే నరసింహనాము డత డాయె ||శివు డంటే నేమి||
తమకము బో దాయె తాల్మిలే దాయె
తమ గతి గానక తహతహ లాయె ||శివు డంటే నేమి||
స్వామి శ్రీ తరిగొండ నరహరి మాయె
సామాద్రి వాసుడే శివశంభు డాయె. ||శివు డంటే నేమి||
అందరూ "శివు డంటే నేమి...." అంటూ భజనచేస్తూ లేచి వెళ్ళారు.
భక్తులకు ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ, కీర్తనలు పాడి వినిపిస్తూ, ఎవరికెటువంటి కష్టం కలిగినా ఆదుకుంటూ, రచనలు గావిస్తూ తన జీవితాన్ని భగవంతునికి కైంకర్యం చేసింది.
మరొకరోజు ఒక భక్తురాలు "అమ్మగారూ! మీరింత తపస్సు చేసి తెలుసుకున్నదేమిటి? పొందిందేమిటి?" అని అడిగింది.
"సర్వం బ్రహ్మమయం - సద్గురు రాయా!
సర్వం బ్రహ్మమయం
సర్వం బ్రహ్మం - సాక్షిరూపం
నిర్మల చిత్తం - నిత్యానందం ||సర్వం||
సప్తజలములు - సరగున దాఁటితి
గుప్తంబగు ఆ - గుఱిలో గలసితి ||సర్వం||
ముగ్గురి పదమగు - ముక్తిని గాంచితి
త్రిగుణము లణఁచితి - ధీరత గాంచితి ||సర్వం||
గురుతరముగను త్రి - కూటముఁ గాంచితి
యెనసి నినుం గని - నేనే నే నైతిని ||సర్వం||
గొనకొని ఘన తరి - గొండ నృకేసరి
యెఱుకలోని యెఱు - కే నే నైతిని" ||సర్వం||
85 సం|| వయస్సులో కూడ తన సాధనని కొనసాగిస్తున్నది వెంగమాంబ. సమాధిస్థితిలో ఉన్న వెంగమాంబకి బాలసఖుడు కనిపించాడు.
"నన్ను శ్రీనివాసుని ఒక్కచోట చూడాలనుకుంటున్నావుకదూ!" అన్నాడు.
తల ఊపింది వెంగమాంబ.
"అయితే నా వెంటరా!" అంటూ పరుగుపెట్టినట్టు కదిలాడు.
సమాధిస్థితిలో ఉన్న వెంగమాంబలోని జీవాత్మ వెంట కదిలింది.
బాలసఖుడు శ్రీవేంకటేశ్వరుని పక్కగా నిలిచాడు. వెంగమాంబకి ఇద్దరిలో తేడా కనపడలేదు. అంతలోనే ఇద్దరూ ఒకటైపోయారు. తన సుఖుడెక్కడా అని శ్రీవేంకటేశ్వరుని మూర్తిని అంతా స్పృశించి, వెదుకుతున్న వెంగమాంబ స్వామి చేతిలోని పద్మాన్ని స్పృశించగానే అందులో లీనమయ్యింది. పద్మపురేకులు ఆనందంతో పులకించి మరికొద్దిగా విచ్చుకున్నట్టుగా అయినాయి. లక్ష్మీదేవి చిరుదరహాసం చిలకరించింది. స్వామి ఏమీ ఎరగనట్టు గుంభనగా నవ్వుకున్నాడు.
* * *
'తరిగొండమ్మ' పరమపదించింది అన్న వార్త తిరుమలలో క్షణాలమీద పాకిపోయింది. సన్న్యాసిని కనక సమాధి చెయ్యాలి అని నిర్ణయమైంది. తరిగొండలోనా, తిరుమలలోనా? తరిగొండ నృసింహుడే ఇక్కడి వరాహనరసింహుడని, వరాహనరసింహస్వామి ఆలయాన్ని పుట్టిల్లుగా భావించింది కనక వరాహనరసింహస్వామి ఆలయానికి అభిముఖంగా సమాధి చేశారు.
తరిగొండ వెంగమాంబ భౌతిక శరీరం వదలినా, ఈనాటికీ శిష్య ప్రశిష్యులకి, భక్తులకీ, సాధకులకీ దర్శనం ఇస్తూనే ఉంది.
* శుభం *
