Previous Page Next Page 
యువత నవత పేజి 49

    "ఏయ్! ఇదేంపని?"

    "తెలియదా?  పెళ్లాం సరసమాడుతోందని?"

    "నన్నూ ఆడమంటావా?"

    "ఆడమనేగా?"

    శర్మ హుషారుగా ఈలవేశాడు. బట్టలుతకడానికి పెట్టుకొన్న నీళ్ల బకెట్ అమాంతం  లేపి శాలినిమీద గుమ్మరించేసాడు.
 
    "ఇటువంటి సరసమా నేనాడమంది? ఈ అవతారంతో యింట్లోకి యెలా వెళ్లాలి?" శాలిని ఏడుపుముఖం పెట్టేసింది.

    "వెళ్ళను."

    "బాత్ రూమ్ లోనే సమాధి అయిపోనా? తడిచీరతో ఇంట్లోకి యెలా వెళ్ళను?"

    "వెడితే ఏం?"

    "అయ్యవారి నిర్వాకం అందరికీ తెలియాలి కాబోలు! కాస్త చీర తెచ్చిపెడుదూ!"

     "బృందని తెమ్మని చెబుతాను"

    "నువ్వు తెస్తే ఏం?"

    "మనం ఒంటరి కాపురం చేసినప్పుడు నువ్వు యేం చెబితే అది చేస్తాను. ఇప్పుడుమాత్రం నా పరువు కాపాడు. పెళ్లాం చీరలు మోశానని చెవులు కొరుక్కుంటారు."

    "ఎవరు?"

    "ఇది చూసినవాళ్లు, విన్నవాళ్లు."

    "ప్రపంచాన్ని చూసి నువ్వు బాగా  భయపడే మనిషిలా వున్నావు. మనం చేసేపని తప్పని మన మనసు ఒప్పుకోనంతవరకు మనం యెవర్ని చూసి భయపడాల్సింది లేదంటాను."

    "అయితే నువ్వే యింట్లోకి  వెళ్లిచీర మార్చుకోరాదూ? మగడు సరసమాడితే తప్పులేదుకదా?"

    "వెడతాను. నాకేం సిగ్గులేదులే!" బింకంగా అంది శాలిని. తడిచీర తోటే బట్టలుతికి శర్మకు ఆరవేయడానికి ఇచ్చేసి, మరో రెండు చెంబులు మీద గుమ్మరించేసుకొని, చీరనుండి కారుతున్న నీళ్లను పిండేసి ఇంట్లోకి వెళ్లింది శాలిని.

    అత్తగారు చూసి అంది - "చీరమీదే స్నానం చేసావా? అదేంపని? పిలిస్తే పొడిచీర నేనో, బృందో తెచ్చిపెట్టేవాళ్లం కదా?"

    "నిన్నా, మొన్నా చెయ్యని స్నానం ఈరోజు చేస్తుందా? అది కాదులే అమ్మా! అన్నయ్య నీళ్లు పోసేసినట్టున్నాడు"అంది బృంద.

    "అన్నయ్య నీళ్లెందుకు పోస్తాడు?"

    "ఆలు మగల బాత్ రూం సరసాలే అమ్మా!"

    "చిన్న కొంప! మామగారు, ఆడపడుచు మొగుడు వాళ్లు చూస్తే ఏమనుకొంటారు? ఛీ!ఛీ! ఎంత కొత్తదంపతులయినా నలుగురున్న కొంప అని గుర్తుపెట్టుకొంటే బాగుంటుంది" అత్తగారు చిరాకుగా అంది.

    మొదటిసారిగా అత్తవారింట్లో శాలిని మనసు చివుక్కుమన్నట్లుగా అయింది.

            *    *    *    *
   
    బజారునుండి పువ్వులు తెచ్చాడు బృంద కిషన్ రావు. బృంద తీరికగా కూర్చొని పొందిగ్గా దండకట్టి సగంమాల త్రుంచి జడలో తురిమి అద్దంలో చూచుకొంటూంటే వెనుకనుండి వచ్చి భార్య భుజాలమీద చెయ్యేసి పూలలో ముక్కుదూర్చి గట్టిగాపీల్చి "మల్లెపూలు వాసన చూడాలంటే ఆడవాళ్ల జడల్లో ఉండగానే చూడాలి!" అన్నాడు.

     వంటగదిలోంచి పద్మావతి, పెరటిలోంచి శాలినీ ఒక్కసారే వసారా లోకి అడుగువేసి, ఆలుమగల సరాగాలు చూడకూడదన్నట్టుగా వేసిన అడుగు వెనక్కి తీసుకొని వెళ్లిపోయారు.

     ఇలాంటి దృశ్యాలు అప్పుడప్పుడూ కనబడుతూనేవుంటాయి అందరి కళ్ళలో. పగలే తలుపులుమూసి గదిలో చేరుతారు.

    నలుగురున్న చిన్న ఇళ్ళలో ఎలా మసలుకోవాలో కోడలికి నీతులు చెప్పే అత్త నలుగురున్న  ఇళ్ళలో ఎలా మసలుకోవాలో కూతురికి చెప్పదు


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS