Previous Page Next Page 
ఇదీ కధ! పేజి 49


    "అబ్బే అదేమీ లేదు. ఆయమ్మ గురించి మీరింతగా శ్రద్ధ తీసుకుంటే మీకేమయినా తెలిసిన మనిషేమోననిపించింది!"
    "ఆయమ్మను గురించి కాదు నా బాధ! నీ గురించే! ఆ పిచ్చిదాన్ని ఇంట్లో పెట్టుకుంటే నీకే ప్రమాదమని!"
    "థాంక్యూ సార్! నాకూ అలాగే అనిపిస్తుంది. ఆయమ్మను హాస్పిటల్లో ఎడ్మిట్ చేయిస్తాను. రేపే మా ఆయమ్మను రమ్మంటాను. నాకు ఇక్కడ ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఆయమ్మ నాతోనే ఉంటుంది. చిన్నప్పట్నుంచి ఆమెతో నాకు ఉన్న అనుబంధం వాస్తవాన్ని గుర్తించడానికి అడ్డొచ్చింది. ఇప్పుడు ఆలోచించి చూస్తే ఆమె గత రెండు మూడు నెలలుగా అదోలా ప్రవర్తిస్తున్నట్టు తోస్తున్నది. నేను అంతగా పట్టించుకోలేదు. థాంక్యూ డాక్టర్. మీరు నా కళ్ళు తెరిపించారు!" డాక్టర్ పరిమళ నిట్టూర్పు విడిచింది.
    "డోంట్ వర్రీ! నాకు చేతనైనంత సహాయం చేస్తాను. రేపే ఆయమ్మను వదిలించుకో! ఒకోసారి ఇలాంటి వాళ్ళు చాలా వైలెంట్ గా మారిపోతారు. నీకు పిచ్చివాళ్ళ గురించి తెలియందేమీ కాదు. పైగా వంటరిగా కూడా వుంటున్నావు."
    "అలాగే డాక్టర్!"
    డాక్టర్ మూర్తి లేచి నిలబడ్డాడు. పరిమళ కూడా లేచి నిలబడింది.
    "సాగర్ విషయం! నేను చెప్పింది మరిచిపోవద్దు!"
    "అలాగే"
    "వస్తా! గుడ్ నైట్!" డాక్టర్ మూర్తి పరిమళ ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు. కారెక్కుతున్న మూర్తిని పరిమళ భయం భయంగా చూసింది. మూర్తి వెళ్ళగానే గేటు మూసి ఇంట్లోకి పరుగెత్తింది. వరండాలో నిలబడివున్న ఆయమ్మను చూసి ఖంగారు పడింది.
    "ఆయమ్మా! నువ్విక్కడేం చేస్తున్నావ్?" గద్దించి అడిగింది.
    "అదేనమ్మా! ఆ నాగేంద్రాన్ని చూస్తున్నాను!"
    "నాగేంద్రమా?" పరిమళ తెరిచిన నోరు తెరిచినట్టే వుండిపోయింది.
    "అదేనమ్మా నన్ను పిచ్చాసుపత్రిలో చేర్పించమన్నాడే వాడే నాగేంద్రం!"
    "అయితే నువ్వు డాక్టర్ మూర్తి మాటలన్నీ విన్నావన్నమాట?"
    "డాక్టర్ మూర్తా?" ఆయమ్మ గొంతు కీచుమన్నది.
    కాలింగ్ బెల్ మోతకు ఇద్దరూ ఒక్కసారిగా ఎగిరిపడ్డారు.
    "మళ్ళా ఆ నాగేమ్ద్రం వచ్చాడేమో అమ్మాయ్! తలుపు తీయొద్దు!" ఆయమ్మ ఆదుర్దాగా అన్నది.
    కాలింగ్ బెల్ విడవకుండా మ్రోగుతూ ఉంది. "డాక్టర్ మూర్తి అయితే వదిలిపెట్టడు. ఆయమ్మా! నువ్వు వంటగదిలోకి వెళ్ళి కూర్చో?" అంటూ పరిమళ ఆయమ్మను రెక్కపుచ్చుకొని లోపలికి నెట్టింది! ఆయమ్మ అదోలా చూస్తూ వంటగదికేసి వెళ్ళింది. పరిమళ వణుకుతున్న వ్రేళ్ళతో తలుపు గడియ తీసింది.
    "హల్లో డాక్టర్ పరిమళా!" అంటూ సాగర్ లోపలకు తోసుకు వచ్చాడు. పరిమళ అడుగు వెనక్కు వేసింది.
    "తలుపు మూసేయ్! డాక్టర్ మూర్తి మళ్ళీ వచ్చినా రావొచ్చు" సాగర్ పరిమళను హెచ్చరిస్తూ అన్నాడు.
    "సాగర్! ఏమిటి హడావుడి! ఇంత రాత్రప్పుడొచ్చావ్? డాక్టరు మూర్తి నీకోసం గాలిస్తున్నాడు!" పరిమళ సాగర్ వెంటరాగా డ్రాయింగ్ రూంలోకి నడిచింది.
    "ఆ సంగతి నాకు తెలుసు! ఇంతవరకు అతడికి కన్పించకుండా ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నాను. అతడు వెళ్ళడం చూసే లోపలకు వచ్చాను!" సాగర్ సోఫాలో జారగిలబడి కూర్చున్నాడు.
    పరిమళ అతడికి ఎదురుగా కూర్చుని "ఏమిటి హడావుడి? మాధవి ఎలా వున్నది?" అని అడిగింది.
    "మాధవికేం? నాటకం బాగానే ఆడేస్తున్నది. మూర్తి ఇంతసేపు ఉన్నాడెందుకూ? ఏం మాట్లాడాడు?"
    "మాధవి పిచ్చిదని నిన్ను నమ్మించి ఇంటికి పంపించివేయమన్నాడు. మా ఆయమ్మనేమో పిచ్చాసుపత్రిలో చేర్పించమన్నాడు!"
    "ఆయమ్మను పిచ్చాసుపత్రిలో చేర్పించడం ఏమిటి?"
    "అదే మిస్టరీ! దానికి తగ్గట్టు ఈ ఆయమ్మ ఆ డాక్టర్ మూర్తిని చూసి "నాగేంద్రం" అంటున్నది. నాకు నిజంగా మతిపోతున్నది. రేపోమాపో నేనే పిచ్చాసుపత్రిలో చేరాల్సి వచ్చేట్టున్నది" డాక్టర్ పరిమళ నుదుటకు పట్టిన చెమటను తుడుచుకొన్నది.
    సాగర్ నిర్ఘాంతపోయాడు. కొద్ది నిముషాలు అతడి నోట మాట రాలేదు. గజిబిజి ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయింది.
    ఉండి ఉండి ఒక్కసారిగా లేచి "ఆయమ్మా!" అని కేక పెట్టాడు.
    డాక్టర్ పరిమళ సోఫాలో అదిరిపడింది. సాగర్ అరుపు విని ఆయమ్మ పరుగెత్తుకు వచ్చింది.
    "ఆయమ్మా! డాక్టర్ మూర్తి నీకు తెలుసా?" ఆత్రంగా అడిగాడు.
    "మూర్తి కాదు నాగేంద్రం!"
    "అదే నాగేంద్రమే! అతడు నీకు తెలుసా?"
    "తెలియటమేమిటి? అతడు నాకు తాళి కట్టినోడు."
    "అతడు నీ భర్తా?" సాగర్ ఎగిరి గంతేసినంత పని చేశాడు.
    "ఆఁ! ఆ ముదనష్టపాడు నా భర్తే" ఆయమ్మ కసిగా అన్నది.
    "ఆయమ్మా! నీకేం మతిపోయిందా?" పరిమళ అరిచింది. విస్మయంగా ఆయమ్మకేసి చూసింది.
    "ప్లీజ్! మీరూరుకోండి! ఆయమ్మను చెప్పనివ్వండి" చిక్కుపడ్డ దారపు వుండలో కొస దొరికినట్టు ఆశగా ఆయమ్మ కేసి చూస్తూ అన్నాడు సాగర్.
    "ఆయమ్మా! నువ్వతడ్ని బాగా గుర్తుపట్టావా?" మనిషిని పోలిన మనుషులుంటారు."
    "బాగా గుర్తుపట్టాను బాబూ! ఇంట్లోకి వచ్చినప్పుడు మసక చీకటిగా వున్నది. ఆ చీకటిలోనే నేను ఆనమాలు పట్టాను. వెలుతుర్లో చూశాక నా అనుమానం తీరిపోయింది. మాట్లాడాక నాగేంద్రమే అన్న నమ్మకం కుదిరింది. ఐదేళ్లు కాపురం చేశాను. కట్టుకున్న మొగుడ్ని గుర్తుపట్టలేనా?"
    "అతడు నిన్ను గుర్తుపట్టాడా?"
    "ఆఁ! నన్ను చూసిన మరుక్షణంలోనే గుర్తుపట్టి వుండాలి. అందుకే లైట్ వెయ్యకుండా అడ్డొచ్చాడు. నేను తనను గుర్తుపట్టానని తెలిశాక మనిషి పూర్తిగా అడ్డం తిరిగాడు. "నాగేంద్రం" అని నేను పిలిచినప్పుడు అతడి ముఖం చూడాలి. అతడి ప్రవర్తన చూశాక నాకు అతడు ముమ్మాటికీ నాగేంద్రమే అన్న నమ్మకం కుదిరింది. మనిషిలో పెద్దగా మార్పు రాలేదు. సన్నగా వుండేవాడు, కొంచెం లావయ్యాడు. ఖాకీ బట్టల్లో మొరటుగా కన్పించే మనిషి సూటుబూటు వేసుకొని నాజూగ్గా కన్పిస్తున్నాడు. మాటల్లో మార్పున్నది. కాని గొంతులో మార్పులేదు. అవే చూపులు! మార్పేమీ లేదు."  
    "మీరు ఎలా విడిపోయారు? ఎన్నాళ్లు అయింది?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS