"ఇక్కడున్న పేషెంట్లను చూడాలి నేను."
సందేహంగా చుశాడతాను.
"మీరు డాక్టరా?ఎవరు పంపారు?"
అతని కాలర్ ని పట్టుకుని పిల్లిపిల్లను లేపినట్లు లేపాడు నిఖిల్. "నాతోరా!"
"ఏమిటి దౌర్జన్యం?" అన్నాడు క్లర్కు. ప్రాణభయం కనబడింది అతని కళ్ళలో. ఆత్రంగా నాలుగువైపులా చూశాడు తనకి సాయంగా ఎవరన్నా వస్తున్నరేమోనని ఎవరూ లేరు అక్కడ!
తప్పనిసరై, నిఖిల్ వెంట నడిచాడు అతను. అపరిచులని అనుమతి లేకుండా పేషెంట్ల దగ్గరికి తీసుకెళ్ళకూడదని ఆ హిస్పిటల్లో స్ట్రిక్టు రూలు ఉంది. దాన్ని అతిక్రమిస్తున్నాడు తను. అందుకు ఫలితంగా ఏమి శిక్ష విధించబడుతుందో నని అదిరిపడుతోంది మనసు.
కానీ, చెప్పినమాట వినకపోతే నిలువునా ఖూనీ చేసేటట్లు ఉన్నాడు యమకింకరుడిలా ఉన్న ఆ మనిషి.
జంతువులను ఉంచే బోనుల్లాంటి గదులు చాలా వున్నాయి లోపల.
వాటిల్లో ఉన్నారు చాలామంది పేషెంట్లు. భీత హరిణేక్షణలా వాళ్ళని చూస్తోంది రాధ.
ఒక్కొక్క సెల్ దాటుకుంటూ ముందుకు వెళుతున్నారు ఇద్దరూ.
హటాత్తుగా ఆగిపోయింది రాధ.
"నాన్నా!" అంది అస్పష్టంగా.
చూశాడు నిఖిల్.
ఒక సెల్ లో ఇనుపమంచం ఒకటి ఉంది. దానిమీద బొంతలాంటి పల్చటి పరుపు.
ఆ పరుపు మీద పడుకుని ఉన్నాడు అయన. కళ్ళకు గంతల్లా తెల్లటి బ్యాండేజీ కట్టి ఉంది.
"నాన్నా!" అంది రాధ గద్గదికంగా. గొంతు వినబడగానే అయన నెమ్మదిగా మంచం మీద లేచి కూర్చున్నాడు.
"నాన్నా!"
"ఆ ఫైలు పుటప్ చేశారా?" అన్నాడాయన.
కూతురుని గుర్తుపట్టినట్లు లేదు.
"ఫైలా? ఏం ఫైలు?" అంది రాధ అయోమయంగా.
"ఏ ఫైలని అడుగుతున్నారా? ఇంకా నయం! నిన్న ఆఫీసరుగారు అర్జంటని చెప్పలేదూ! ఇవాళ పుటప్ చేసెయ్యాలి"
సందేహంగా నిఖిల్ మొహం చూసింది రాధ. నిఖిల్ ఆమె చేతిని వత్తి తాళాలు తియ్యమని రిసెప్షనిస్టు కి సైగచేశాడు.
తాళాలు తన దగ్గర లేవన్నట్లు తల ఊపాడు రిసెప్షనిస్టు.
తాళం వైపు చూశాడు నిఖిల్.
మాములు కప్పు తాళం అది. దాన్ని చేత్తో కాసేపు తడిమి చూసి ఒడుపుగా చేతి అంచుతో ఒక్క దెబ్బ వేశాడు నిఖిల్.
తాళం ఊడివచ్చింది.
రాధతో కలిసి సెల్ లోకి నడిచాడు నిఖిల్. అయన చెయ్యి పట్టుకుని "రండి వెళదాం" అన్నాడు మృదువుగా.
"ఎక్కడికీ! ఆఫీసుకీ వచ్చి అరగంట కాలేదు. అప్పుడే వెళ్దామంటావూ? ఆఫీసరు దేవాంతకుడురా నాయనా! ఆ ఫైలు పుటప్ చెయ్యకపోతే విరుచుకుతింటాడు."
అవి మతి భ్రమించిన మాటలని గ్రహించాడు నిఖిల్. ధోరణిగా ఆఫీసు విషయాలు చెప్పుకుపోతున్నాడు రాధ తండ్రి.
"ఆఫీసుకొచ్చిన ప్రతి ఫైలుని ముందు సెంట్రల్ డయరీ లో మార్కు చెయ్యాలి. తర్వాత అది బ్రాంచికి రావాలి. బ్రాంచిలో మళ్ళీ డయరీ నెంబరు వెయ్యాలి. తర్వాత నోటు షీటు పెట్టాలి. నోటింగ్ రాసేటప్పుడు పాము చావకుండా, కర్ర విరక్కుండా టాక్ట్ ఫుల్ గా రాయాలి. రాశాక దాన్ని రెడ్ టేపులో చుట్టి పాడ్ లో పెట్టాలి. పాడ్ లో పెట్టాక దాన్ని పాడె ఎక్కించి స్మశానానికి తీసుకెళ్ళి తగలబెట్టాలి. కేస్ క్లోజ్! ఆహ్హహ్హహ్హహ్హ! ఆహ్హహ్హహ్హ!" పిచ్చినవ్వుతో అయన పక్కటేముకులు ఎగిరెగిరి పడడం మొదలెట్టాయి. నవ్వుతో ఒళ్ళంతా కదిలేసరికి అయన కంటినరాలు జివ్వున లాగాయి. వెంటనే పెడబొబ్బలు పెట్టడం మొదలెట్టాడు అయన. "అబ్బా! అబ్బా! అబ్బా! అబ్బా!"
కేకలు వేయడం ఆపడం లేదాయన.
అయన చేతుల కిందగా తన కుడిచెయ్యి పోనిచ్చి లేవదీశాడు నిఖిల్.
వాళ్ళు వెనక్కి తిరగాగానే తెల్లటి బట్టల్లో ఉన్న ఒకతను కనబడ్డాడు. తలుపుదగ్గర నిలుచుని ఉన్నాడు అతను. అతని కళ్ళలో ఆశ్చర్యం కనబడుతోంది.
"ఏమిటిదంతా?" అన్నాడు అనుమానంగా.
వెంటనే నిఖిల్ ఎడమచెయ్యి మెరుపులా జేబులోకి వెళ్లి మరుక్షణంలో తిరిగి బయటికి వచ్చింది.
అతని చేతిలో ఉంది లేటెస్ట్ మోడల్ బెరెట్టా రివాల్వర్. మాములు రివాల్వర్ ల బరువులో సగం ఉంటుంది అది. మాములు రివాల్వర్ లలో కంటే రెట్టింపు బుల్లెట్లు అంటే పదహారు ఉంటాయి దాన్లో. మాములు రివాల్వర్ కంటే రెట్టింపు వేగంతో షూట్ చెయ్యగలదది.
అయితే తలుపు దగ్గర నిలుచున్నా తెల్ల బట్టల మనిషికి ఆ చిన్న రివాల్వర్ గురించి ఇన్ని వివరాలు తెలియవు.
అతనికి అర్ధమయిందల్లా -
ఆ రివాల్వర్ పేలితే తన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని!
అంతే!
"చేతులు మెడవెనక పెట్టుకో!" అన్నాడు నిఖిల్.
