నామాలస్వామికి ఏం చెప్పాలో తోచలేదు.
మధ్యవైష్ణవుడు మాత్రం ముఖం అంతా గండరించుకొని,
"అందుకే వేంకటాచల మాహాత్మ్యంలో కూడా చౌడేశ్వరిదేవి ప్రార్థన ఉంది.
'అలకాశినుండి వెలువడి
వలనుగ మాకొఱకు నందవరపురమునఁదా
నెలకొని కుల దేవతయై
యలరుచు మమ్మేలు చౌడమాంబను గొలుతున్'- అని." అన్నాడు.
"చూశావా! నీ సందేహానికి సమాధానం వెంటనే లభించింది. కాశి శివస్థానం. శివుడు పరమభాగవతుడు. నిరంతరం తారకమంత్రాన్ని జపిస్తూ ధ్యానిస్తూ ఉంటాడు. అక్కడినుండి వచ్చిన దైవం విష్ణు పారమ్యం కలిగి ఉంటుంది. దాస దాసోహం అనే సంప్రదాయంలో మనకి చౌడేశ్వరీదేవి పూజనీయ దేవతాస్వరూపమే అవుతుందికదా!"
ముక్కుతూ, మూలుగుతూ నిరసనగా కొంతమంది, అర్థం చేసుకుని సమాధానపడి కొంతమంది మండపంలోంచి చల్లగా జారుకున్నారు.
* * *
కొద్దిరోజుల క్రితం వెంగమాంబ ద్విపద భాగవత రచన పూర్తి చేసింది. ముచ్చటగా ప్రతి అక్షరాన్ని ఆస్వాదించాడు శేషకుధరాధ్యక్షుడు. వెంగమాంబ మనసు నిండినట్లైంది కాని కృతిభర్త తనదో కోరిక మిగిలిందన్నాడు.
"వెంగమాంబా! అన్నీ నాకు అంకితం చేశావే కాని, పూర్తిగా నా గురించి మాత్రమే ఉన్న గ్రంథం రచించావు కావు. నేను కావ్యనాయకుడుగా పనికిరానా?"
"స్వామీ! తమరు నా ప్రాణ నాయకులు, జగన్నాయకులు. కావ్యనాయకత్వం అంటే ఎంత? మీ ఆజ్ఞమేరకి మీ ముచ్చట తీరుస్తాను." వెంగమాంబ సాష్టాంగ ప్రమాణం చేసింది.
శ్రీ వేంకటాచల మాహాత్మ్యానికి శ్రీకారం చుట్టింది. అది బృహత్ప్రయత్నం. తన వైదుష్యం వ్యుత్పత్తి సరిపోతాయా?
"నా చిన్ననాట నోనమాల నైన నా
చార్యుల చెంతనేఁ జదువలేదు
పరఁగ ఛందస్సులోఁబది పద్యములనైన
నిక్కంబుగా నేను నేర్వలేదు
లలికావ్య నాటకాలంకార శాస్త్రముల్
వీనులనైనను వినఁగలేదు
పూర్వేతిహాస విస్ఫురితాంధ్ర సత్కృతుల్
శోధించి వరుసగాఁ జూడలేదు..."
అని డోలాయ మానమనస్కురాలైంది. వెంటనే జ్ఞానోదయమయింది. "తనకు చదువు వలసినంత లేకున్నా 'చదువులలో మర్మం' సద్గురువు దయవలన లభించింది కదా! తనకు పరిజ్ఞానం లేకపోయినా సుజ్ఞానం తరిగొండ నరసింహుడనుగ్రహించాడు కదా! తన రచనలు విని సంతసించి, తననే నాయకుడుగా కావ్యరచన చేయమని తన 'అధినాథుడు' ఆజ్ఞాపించాడు కదా!
"మనసా! చలించకే!
"వివేకమా ! మేలుకొనవే!
"బుద్ధీ! స్థిరంగా ఉండు!"
అని తనను తాను హెచ్చరించుకుని రచన ప్రారంభించింది వెంగమాంబ.
ఎప్పటి రచనలు అప్పుడే భక్తులు, రసజ్ఞులు, కావ్యనాయకుడూ కూడ విని ఆనంద పరవశులౌతున్నారు.
"ఇంత గొప్పగా పద్మావతీ శ్రీనివాసుల శృంగారాన్ని ఎలా వర్ణించగలిగారు తల్లీ!" ఒక భక్తురాలు సిగ్గుపడుతూ, బుగ్గలో కెంపులు పూస్తూ ఉండగా అడిగింది.
"శృంగారాకృతి తోడ వచ్చి పదముల్ శృంగార సారంబుతో
డంగూఢంబుగఁ జెప్పునీవనఁగ 'నట్లే ఁజెప్పలే"నన్ననన్
ముంగోపంబునఁ జూచి, లేచి యట నేమ్రొక్కంగ మన్నించి త
చ్ఛృంగారోక్తులు తానెపల్కి కొను నా శ్రీకృష్ణు సేవించెదన్"-
అని వెంగమాంబ తన ఎదుట కొంటెనవ్వుతూ నిలిచి ఉన్న మిత్రుడికి నమస్కరించింది. శిష్యబృందంలో కలకలం.
"శృంగార వర్ణనలన్నీ కృష్ణుడే రచించాడా?"
"అవును, పాపం! గురువుగారికి శృంగార రసం ఏం తెలుసు? ఆవిడకి తెలిసింది భక్తి ఒక్కటే?"
"అవునవును..."
"దేవుడు రాస్తాడా?"
"ఎందుకు రాయడు? 'అల వైకుంఠపురంబులో...' అని రాసిపోతనగారు ఆపేస్తే పద్యం తరువాతి భాగాన్ని సాక్షాత్తు విష్ణుమూర్తి వచ్చిపూర్తి చేయలేదూ!"
"అంతేలే! మన గురువుగారు కూడ పోతనలాంటి భక్త కవయిత్రికదా!"
వెంగమాంబ పూజామందిరంలోకి వెళ్ళిన తరువాత కూడ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.
"అమ్మగారికి పతివ్రతా ధర్మాలు కూడ ఎంతోబాగా తెలుసు తెలుసా!"- ఒక నడివయస్కుడు తనేదో కొత్త విషయం కనుక్కున్నట్టు చెప్పాడు.
"నీకెట్లా తెలుసు?" ఒక నవయువకుడు ప్రశ్నించాడు.
"భృగుమహర్షి విష్ణువు వక్షస్థలం మీద తన్నినపుడు ఆ తల్లికి కోపం రావటానికి కారణం లక్ష్మీదేవిచేత ఇలా చెప్పించారు.
'పరపురుష పద స్పర్శం
బరుదుగ నురమందు సోక బాగగునే? యం
దురు ప్రేమనుండఁదగునే?
వరపాతివ్రత్య ధర్మవర్తనసెడ'
పరపురుషుడైన మహర్షి స్పృశించటం చేత పాతివ్రత్య ధర్మం చెడింది కనక తను తపస్సు చేసుకోటానికి బయలుదేరిందట.
"అద్భుతం! అమ్మగారి లోకజ్ఞానం మహాద్భుతం!"
"పిచ్చివాడా! అది లోకజ్ఞానం మాత్రమేనా? అది అలౌకిక జ్ఞానం."
"స్త్రీ సహజమైన పాతివ్రత్య ధర్మాలేకాదు. మాతృహృదయం కూడ అమ్మగారికి అవగతమే." ఒకపెద్ద ముత్తైదువు ఎంతో ఆప్యాయంగా చెప్పింది.
"మనకి రోజూ ఆ తల్లి చల్లని తియ్యని ప్రేమని పంచుతూనే ఉంది."
"మనం ఆ అమృతవర్షంలో తడిసి పునీతులమౌతూనే ఉన్నాం కదా!"
అందరూ వెంగమాంబ మాతృహృదయాన్ని గురించి తలొక మాటా చెప్పారు.
"సతీదేవి దక్షయజ్ఞంలో ఆత్మాహుతి చేసుకున్నప్పుడు ప్రసూతి పడిన వేదన వర్ణించటంలో మాతృహృదయాన్ని ఎంతబాగా అర్థం చేసుకున్నారో తెలుస్తుంది" అని ఆ నడివయస్కుడు చెప్పటం మొదలుపెట్టాడు.
