Previous Page Next Page 
ప్రియతమా! ఓ ప్రియతమా పేజి 4

                


    "ఎయిట్"
    "బాత్రూమ్ లోంచి నిన్నటిలా చిన్న తువ్వాలుతో వచ్చేస్తుందేమో , అందరి ముందూ."
    "నైన్"
    "అందరి ముందూ మాటి మాటికి...."
    "టెన్"
    "ముద్దు పెట్టుకుంటుందేమో!"
    "ప్చ్"
    అతనికో నిమిషం ఏం జరిగిందో అసలు అర్ధం కాలేదు. అర్ధమయ్యేక మంజీర వైపు చూడలేకపోయాడు. తన పెదవుల మీద, కొద్దిగా వెచ్చగా , మెత్తగా అతనికి ఇంకా ఆమె పదవులు అక్కడ ఉన్నట్లు అనిపిస్తున్నాయి.
    "బావుందా?"
    సిగ్గుగా తల వూపాడు.
    "మరి నువ్వెప్పుడూ పెడ్తావూ?"
    "జవాబు చెప్పాలనుకున్నాడు కానీ, రాలేదు.
    "రేపు ప్రొద్దుటే పాలు తియ్యడానికి వస్తావుగా, అప్పుడు నా మంచం దగ్గరకు వచ్చి చప్పుడు కాకుండా , సరేనా!" అడిగింది.
    అశ్వర్ధకి  చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. తన అభిమాన హీరో గెటప్ లో మంజీరతో ఊహించేసుకున్నాడు.
    "రేపు తెల్లవారు ఝామున, మరచిపోకు! వస్తా" అంటూ ఆమె లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది.
    ఆమె వెళ్ళిపోయాక చాలాసేపు అక్కడే కూర్చుండి పోయాడు అశ్వర్ధ. ఆ యువకుడికి ఒక్కసారిగా ప్రపంచం అంతా అందంగా కనిపించసాగింది.
    "గుర్ .....ర్ " అంది పందిపిల్ల. ఎంత ముద్దోస్తోందో?
    "మీ అమ్మ పిలుస్తోంది" జారిపోతున్న లాగూ, ఎగాలక్కుంటూ, కారిపోతున్న ముక్కు చీమిడి ఎగబీలుస్తూ వచ్చి చెప్పాడు పక్కింటి పిల్లవాడు.
    వాడ్ని గట్టిగా బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నడు అశ్వర్ధ.
    ఇంట్లోకి అడుగు పెడ్తుంటే "ఏరా వెధవాయ్! ఇల్లు కనిపించిందా?" తండ్రి అడిగాడు.
    అశ్వర్ధ కి పెదవుల మీదకి నవ్వు ఆగకుండా వస్తోంది.


                                                     *    *    *

    "ఏదో చెప్పాలన్నావుగా , చెప్పరా!" జారిపోతున్న కొంగుని తలపైకి లాక్కుంటూ అడిగింది అరుంధతి.
    "అదే .....నువ్వు కూడా." నసిగాడు నారాయణమూర్తి.
    ఆమె నిట్టూర్చింది.
    అతను చెప్పదలుచుకున్నది ఏమిటో అర్ధం అయినట్లుగా ....."పుట్టిన ఊరూ పెరిగిన వాతావరణం ...." అంది.
    "వదిలి రావడం అంటే బాదే అనుకో! ఇన్నాళ్ళూ పరాయి దేశంలో ఉండటం మూలాన వేరుగా ఉండక తప్పలేదు. ఇప్పుడిలా బావుండదు. మీతో కూడా ఉంటే నాకు తృప్తి లేకపోతే నన్ను నేను క్షమించుకోలేను" అన్నాడు.
    అరుంధతి నారాయణమూర్తి పడుతున్న ఆవేదన తెలిసింది.
    ఎంతో ఉజ్వలంగా ఉన్న భవిష్యత్తు వదులుకొని, భార్యకి ఇష్టం లేకపోయినా స్వదేశానికి తిరిగి వచ్చేయడం వెనకాల ఉన్న కారణం,మంజీర అని భోధపడింది.
    మంజీరని దార్లో పెట్టడం సుమిత్ర వల్ల అయ్యే పనికాదు!
    "ఏమంటావూ?" అడిగాడు నారాయణమూర్తి.
    "ఆలోచిస్తాను"
    అతనేమీ మాట్లాడకుండా , లేచి ఆమె మంచం దగ్గరికి వచ్చి, దుప్పటి ఆమెకి నిండుగా కప్పి, తన మంచం వైపు వెళ్ళాడు.


                                                        *    *    *

    ఒక గొప్ప రచయిత అన్నట్లు థ్రిల్ కూడా వ్యసనం లాంటిదే. ఒకసారి అనుభావించాకా మనసు ఊరుకోదు . పదే, పదే కావాలంటుంది. రిస్క్ ఎక్కువయినా కొద్దీ, థ్రిల్ పెరుగుతుంది.
    మనిషి నిరంతరం థ్రిల్ కోసం అన్వేషిస్తుంటే , గొప్ప అశాజీవిగా మారి ఎటువంటి కష్టానయినా థ్రిల్ గా తీసుకోగలుగుతాడు.
    కానీ, మన థ్రిల్ ఇంకొకర్ని బాధ పెట్టేది కాకూడదు. మన థ్రిల్ ఇంకొకరికి కూడా ఆనందాన్ని పంచేదిగా ఉండాలి.
    అరుంధతి కళ్ళు పత్తికాయల్లా చేసుకుని ఆ ఆకారం ఇంట్లోకి రావడం చూస్తోంది. అరుద్దామంటే గొంతు పెగలట్లేదు.
    ఆ ఆకారం నెమ్మదిగా మంచం పైకి వంగింది.
    తన మీదకు ఎవరో వంగుతున్నట్లుగా తెలిసి, ఆదమరచి నిరురపోని సుమిత్ర టపీమనీ కళ్ళు తెరిచింది. ఎదురుగా మోహంలో మొహం పెట్టి 'అతడు' అశ్వర్ధ!
    "ఏయ్ ఏమిటిది?" అంటూ అరుస్తూ లేచి కూర్చుంది సుమిత్ర.
    తెల్లబోయి చూస్తున్నాడతను. మోహంలో కత్తివేటుకి నెత్తురు చుక్కలేదు!
    అరుంధతి వేగంగా కదిలి సుమిత్ర మంచం దగ్గర కొచ్చి "ఏమిట్రా అదీ!" అంటూ ముక్కున వేలేసుకుంది.
    నిద్రమత్తులో , లేచి వచ్చిన నారాయణమూర్తికి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇంతలో,
    "వాట్ హపెండ్ మమ్మీ!" అంటూ గారంగా అడుగుతూ వచ్చింది మంజీర.
    "వీడూ....వీడూ..... నా మీదకి వంగి ...." సుమిత్ర కోపంగా చూస్తోంది.
    అంతకు గంట క్రితమే , "నేను లోపల పడుకుంటాను, నువ్వు బైట నా మంచం మీద పడుకో, నిద్ర పట్టడం లేదు" అంటూ మంజీర బలవంతంగా పక్కలు మార్చిన విషయం సుమిత్రకు గుర్తు రాలేదు.
    "మైగాడ్! ఈ కంట్రీ బాయ్ కి ఇంత ధైర్యమా? బాగా బుద్ది చెప్పు , డాడీ! లేకపోతే నే చెప్తాను" అంటోంది మంజీర.
    "తల్లిలాంటి ఆవిడతో , నీకిదేం ప్రారబ్ధంరా? అప్రాచ్యుడా!" అంటూ అశ్వర్ధ రెండు చెంపలు వాయించేసింది అరుంధతి.
    "నువ్వు ఆగమ్మా! వాళ్ళ పెద్దవాళ్ళకి కబురు చెయ్యి" అన్నాడు. నారాయణ మూర్తి వారిస్తూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS