అరుస్తానా?
అరుస్తే నా గొప్పేంవుంది?
ఒకటి తరువాత ఒకటి, వరుసగా రెండు చేతులమీదా వాతలు పెట్టుకున్నాను. చర్మంకాలేలా కాదు. మాంసం కాలేలా...పళ్ళు బిగపట్టి- బాధని పెదాలమధ్య నొక్కిపట్టి....
"నీకేమైనా మతిపోయిందా? ఏమిటి నువ్వు చేస్తున్నది?" ఆయనొచ్చి గరిటని విసుగ్గా లాక్కొన్నారు. కానీ అప్పటికే నేను చెయ్యదల్చుకున్నది చేసేశాను.
తరువాత ఆ గాయాలు మానటానికి నెలరోజులు పట్టింది.
ఆ నెలరోజులూ ఆయన తిడుతూనే ఉన్నారు. చెప్పానుగా - మనం కరెక్టని నమ్మిన భావాలు, అభిప్రాయాలు, పక్కవాళ్ళకి ఎంతో తెలివితక్కువగా అనిపిస్తాయి.
2
ఆ రాత్రి నా జీవితంలో ఓగొప్ప మలుపుకి నాంది అని నేను అనుకోలేదు. నా భర్తకూడా 'అమాయకంగా' నిద్రపోతున్నాడు. రాత్రి రెండున్నరకి మోగింది ఫోను. ఆయనకి అలా ఫోనులు రావటం మామూలే. మానేజింగ్ డైరెక్టర్ కదా కానీ సంభాషణ పూర్తవగానే, అంత హడావుడిగా ఆయన ఎక్కడికి బయల్దేరారో మాత్రం అర్ధంకాలేదు. అవతలినుంచి ఏం చెప్పారో అర్ధంకాలేదు గానీ ఈయన మాట్లాడింది వినపడింది.
"..."
"ఎవరూ?"
"...."
"ఓ నువ్వా ఏమిటి?"
"..."
"ఎవరూ సత్యనారాయణేనా?... అవును అటువంటి ప్రోగ్రాం ఏదో ఉందని సాయంత్రం చెప్పాడు. ఇంతకీ అర్దరాత్రి నాకెందుకు ఫోన్ చెయ్యటం?"
"..."
"వ్వాట్... నీకేమైనా పిచ్చెక్కిందా?"
ఇదీ సంభాషణ. సత్యనారాయణంటే బహుశ మా ఫామిలీ ఫ్రెండ్ అయివుంటాడు. పోలీస్ స్టేషన్ లో ఇన్ స్పెక్టర్. సాయంత్రం మా ఇంటికొచ్చింది తనే. "ఏం చెల్లెమ్మా, రాత్రికి మీ ఆయన్ని నాతో తీసుకుపోనా?....రైడింగ్ కి" నవ్వుతూ అడిగాడు కూడా.
మరిప్పుడు ఫోన్ లో అతడి ప్రసక్తి ఎందుకొచ్చింది?
మామూలప్పుడయితే పట్టించుకోకపోదునుగానీ, ఆయన మొహంలో ఆ తొందర....నాకెందుకో చాలా అసహజంగా అనిపించింది. ఏం జరిగిందో తెలుసుకోక పోతే నిద్రపట్టేలా లేదు.
సత్యనారాయణ ఇంటికి ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారని చెప్పింది వాళ్ళావిడ. తిరిగి అక్కడికి చేస్తే ఆయనే తీశాడు.
"ఇప్పుడు మా యింటికి ఫోన్ చేసింది మీరేనా?" అని అడిగాను.
"ఎవరు తరళా? ...ఆఁ .... నేనే చేయించాను".
"ఆయన అర్జెంటుగా బయల్దేరారు ఏమిటి సంగతి"
"అబ్బే- ఏదో చిన్న వ్యవహారం నువ్వు పడుకోమ్మా పది నిమిషాల్లో పంపించేస్తాను" పోలీసు తెలివితేటలు అమలు జరుపుతున్నట్లు అన్నాడు. నేనేమీ తక్కువ తినలేదు.
"ఆయన్నేం కంగారుపడవద్దని చెప్పండి. నేనిక్కడ ధైర్యం చెప్పాననుకోండి. అక్కడ మీరుకూడా చెప్పండి!" అన్నాను.
"తప్పకుండా అయినా నీకెందుకు భయం చెల్లెమ్మా, ఇలాటి కేసులు నేను లక్ష చూశానుగా నిముషాల్లో సెటిల్ చేస్తాను".
"ఆయన బెదిరిపోతున్నారు".
"బెదురా? బెదురెందుకు? అయినా ఇదంతా ఆ యస్సై వెంకటపతి ఇంతవరకూ తీసుకొచ్చాడు. ఆ ఫోటో చింపేస్తే పోయేదికదా అనవసరంగా మా ఇద్దరికీ ఫోన్ చేసి అర్దరాత్రి రప్పించాడు".
"ఫోటోతోపాటు ఇంకేమైనా వున్నాయేమో"
"లేవు లేవు రాగానే నేను చేసిన మొదటిపని అదే అంతా వెతికింహాను. ఆ అమ్మాయి దగ్గిర ఇంకేం దొరకలేదు"
మొట్టమొదటిసారి నా మనసులోకి ఏదో అనుమానం నీడలా ప్రవేశించింది. ఎంతో తెలివితేటలతో నేను లాగుతున్న విషయాల్లో చివరిదాని దగ్గిర ఏదో మెలిక పడినట్టు అనిపించింది.
అమ్మాయి-
రైడింగ్-
ఫోటో-
చీకట్లో చివరి బాణం వదిలాను. "ఏమంటుంది ఆ అమ్మాయి? అమ్మాయంటే, ఆ రైడింగ్ లో పట్టుబడిందేనా? ఆ ఫోటో తనది కాదంటుందా?"
"ఎందుకు కాదంటుంది? మీ ఆయనే తన తండ్రి అంటుంది. అయినా ఎక్కడ సంపాదించిందో మన ఆనందరావు ఫోటో! రెండు తగిలిస్తే అదే చెపుతుంది. అంతా మా యస్సై చేశాడు. అనవసరంగా మీ నిద్ర డిస్టర్బ్ చేశాడు...." చెప్పుకు పోతున్నాడు ఇన్ స్పెక్టర్ సత్యనారాయణ.
నా చెవులు వినటం ఎప్పుడో మానేశాయి. భూమి గిర్రున తిరుగుతున్నట్టు అనిపించింది. అతడన్నట్టు మా ఆయన ఫోటో ఆ అమ్మాయికి ఎక్కడో దొరికింది కాదు.....అదే అయితే, ఫోన్ రాగానే ఆయన అంత కంగారుపడరు.
...వందరూపాయలు దొంగతనం చేశావా అని అడుగుతున్నప్పుడు నేను నా కూతురి మొహంలోకి సరిగ్గా చూడలేదు కాబట్టి అది దొంగకాదని అప్పుడు తెలియలేదు. ఫోన్ వింటున్నప్పుడు మా ఆయన మొహం నాకింకా జ్ఞాపకం వుంది. అది అయోమయం కాదు. భయంతో కలిగిన కంగారు. మొదటిసారి చేసిన తప్పు ఈసారి చెయ్యలేదు. నేను - బాగా ఆలోచించాను.
ఇప్పుడు నాకు మొత్తం అంతా అర్ధమైంది.
-రాత్రి జరిగిన రైడింగ్ లో సత్యనారాయణ కొందరమ్మాయిల్ని పట్టుకొచ్చి స్టేషన్ లో పడేసి, ఇంటికెళ్ళి పడుకున్నాడు. అందులో ఒక అమ్మాయి, మా ఆయన ఫోటో చూపించి, 'ఈయనే నా తండ్రి' అనేసరికి వెంకటపతి కంగారుపడి, అటు ఇన్ స్పెక్టర్ కీ, ఇటు మా ఆయనకీ వరుసగా ఫోన్ లు చేశాడు. ఈయన హడావుడిగా పరుగెత్తారు.
నా మెదడు మొద్దుబారుతున్నట్టు తోచింది. ఫోన్ పెట్టేస్తున్నప్పుడు ఆయన మొహ భంగిమ ఒక ఫోటోలా నా మనసులో ముద్రితమైపోయింది.
ఇక ఇంట్లో ఒక క్షణం ఉండలేకపోయాను.
అక్కడ పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న దేమిటో తెలుసుకోవాలి. ఆయనకీ ఆ అమ్మాయికీ జరుగుతూన్న సంభాషణ వినాలి.
మేడదిగి క్రిందకొచ్చాను. కారు ఆయన తీసుకెళ్ళారు. సాహితి సాకేతల స్టాండర్డ్ వుంది. దాంట్లో బయల్దేరాను. అయిదు నిముషాలు అటు ఇటుగా బయల్దేరిన మా గురించి వాచ్ మెన్ ఏమనుకున్నాడో?
