Previous Page Next Page 
తరిగొండ వెంగమాంబ పేజి 4


    వెంగమాంబ చక్రాల్లాంటి తన కళ్ళను విచిత్రంగా తిప్పుతూ అతనివైపు చూసింది. ఆ తర్వాత స్వామి వైపు చూసింది. జవాబు ఏమని చెప్పాలి. తను పాడిన పాటలు ఎవరు రచించారనీ, ఎవరు నేర్పారనీ అడిగితే స్వామేనని జవాబు చెప్పాలి. కానీ ఈయన నమ్ముతాడా?!
    ఏం మాట్లాడాలో తోచలేదు వెంగమాంబకి.
    "వెంగకి ఇవి ఎవరూ నేర్పలేదు. అప్పటికప్పుడు తనే పాటలు కట్టి పాడుతుంది" అంది వాళ్ళల్లో ఒక పిల్ల.
    ఈ మాటతో ఆ వాగ్గేయకారుడు నిశ్చేష్ఠుడయ్యాడు. ఇంత చక్కని పలుకుబడి, భావసంపద ఉన్న ఈ చిన్నారి సొంతంగా కట్టి పాడిందా! తన చెవులను తనే నమ్మలేకపోయాడు. ఈ పాప సామాన్యురాలు కాదు. అసాధారణ ప్రతిభావంతురాలు. పాట ఈ పాపకు భగవద్దత్తం. ధ్రువుడిలా, ప్రహ్లాదుడిలా బాల్యంలోనే పరిమళించిన భక్తికుసుమం ఈ అమ్మాయి" అనుకున్నాడు.
    "తల్లీ! మీ ఇంటికి తీసుకువెళ్లు, నీ తల్లిదండ్రులను దర్శించుకోవాలనుంది" అన్నాడు.
    వెంగమాంబ అతనిని ఇంటికి తీసుకువెళ్ళింది. పాప వెంట అపరిచిత వ్యక్తిని చూసి కృష్ణయ్య దంపతులు ప్రశ్నార్థకంగా చూశారు. ఆ వాగ్గేయకారుడు వారికి తనను పరిచయం చేసుకుని వెంగమాంబ పాట వినిన సంగతి చెప్పి ఈ పాప గొప్ప  విదుషీమణి అవుతుందనీ, అసమాన వాగ్గేయకారిణి అవుతుందనీ, ఇప్పటికే ధగధగలాడుతున్న ఈ వజ్రం సానబెడితే మరింత ప్రకాశిస్తుందనీ చెప్పి, ఆ దంపతులకు నమస్కరించి వెంగమాంబను దగ్గరకు తీసుకుని బుగ్గలు పుణికి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు.
    కృష్ణయ్య దంపతులను ఆనందంతోపాటు ఏవేవో ఆలోచనలూ ముసురుకున్నాయి. తన చిన్నారి తన పాటతో పడింతులనే మెప్పించడం వారికి సహజంగానే గర్వమూ. ఆనందమూ కలిగించింది. అయితే తమను కలువరపెడుతున్న విషయం వేరే ఉంది. ఇది చిన్నవయసులోనే గంటల తరబడి దేవుడి ముందు గడుపుతోంది. అంతవరకూ ఉత్సాహంగా ఆడుకుంటున్నది కాస్తా హఠాత్తుగా స్తబ్ధుగా అయిపోతుంది. చుట్టూ ఎవరున్నా తన లోకంలో తానుంటుంది. ఒక్కోసారి అదే పనిగా శూన్యంలోకి చూస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఉన్నట్టుండి నవ్వుతుంది. అంతలోనే ఏడుపు ముఖం పెడుతుంది. ఈ పిల్ల ఏ యోగినిగానో , భక్తురాలిగానో మిగిలిపోదుకదా!
    తమ పిల్లలు పసివయసులోనే పరిమళాలు వెదజల్లుతూ పదిమందిలో పేరు తెచ్చుకుంటే ఆనందించని తల్లిదండ్రులెవరుంటారు? తమలానే తమ పిల్లకీ దైవభక్తి, సదాచారం, పెద్దల పట్ల గౌరవప్రపత్తులు అబ్బితే సంతోషించని వాళ్ళెవరుంటారు? కానీ ఈ చిన్నదాని పరిస్థితి వేరుగా ఉంది. ఏదైనా అతికాకూడదు. ఇది యోగినిగా, విరాగినిగా, ప్రపంచం పట్టని భక్తురాలిగా మారిసంసార జీవితాన్ని కాదంటే?! ఆ పరిణామాన్ని జీర్ణించుకోడానికి తామూ సిద్ధంగా ఉన్నారా?
    లేమనే తోచింది కృష్ణయ్య దంపతులకు. కనుక వీలైనంతవరకూ వెంగను కాస్త దారి తప్పించడానికి బాధ్యతగల తల్లిదండ్రులుగా తాము ప్రయత్నించవలసిందే. ఆపైన ఆ సర్వేశ్వరుడి నిర్ణయం.
    ఆ వాగ్గేయకారుడు ఏ ఉద్దేశంతో ఆ సూచన చేసినా అదే తమ ఆలోచనలకూ అనుకూలంగా ఉన్నట్టు తోచింది కృష్ణయ్యకు. "అవును! వెంగను లౌకికమైన చదువులో పెట్టాలి. గురువు వద్ద అమరం, కావ్యాలు చదివింపజేస్తూ దైవధ్యాస నుంచి కొంతైనా పక్కకు తప్పించాలి. అప్పుడైనా అది ప్రపంచంలో పడుతుందేమో!"
    కృష్ణయ్య తన ఆలోచనను మంగమాంబకు చెప్పాడు. మంగమాంబ వెంటనే ఆమోదం తెలిపింది. "అవును, ఇలాగైనా కాస్త మామూలు మనిషి అవుతుందేమో!" అంది.
    ఆ ఊళ్ళోనే సుబ్రహ్మణ్యదేశికులనే పండితుడున్నాడు. కృష్ణయ్య మరునాడు ఉదయమే ఆయన ఇంటికి వెళ్ళి వెంగమాంబకు చదువు చెప్పవలసిందిగా అర్థించాడు. అప్పటికే వెంగమాంబకు చదువు చెప్పవలసిందిగా అర్థించాడు. అప్పటికే వెంగమాంబ గురించి తెలిసిన సుబ్రహ్మణ్యదేశికులు సంతోషంగా అంగీకరించారు.
    సుబ్రహ్మణ్యదేశికులు ఆ ఊళ్ళో విద్యావినయ సంపన్నుడు. మూర్తీభావించిన సహనం, సౌజన్యం. వెంగమాంబను చూస్తూ ఈ పిల్ల  కుశాగ్రబుద్ధి అనుకున్నాడు. ఇటువంటి పిల్లకు చదువు చెబితే తనకూ, గురువుకూ కూడా పేరు తెస్తుందనుకున్నారు. అక్షరాభ్యాసం చేయించి, అ, ఆలు దిద్దించారు. కొద్ది రోజుల్లోనే అక్షరాలు నేర్చి కూడబలుక్కుంటూ చిన్న చిన్న మాటల్ని చదవడం కూడా వెంగమాంబకు వచ్చేసింది.
    చదువు చెబుతూనే మధ్యమధ్య రామాయణ, భారత, భాగావతాలనుంచీ, పురాణాల నుంచీ కథలు చెప్పడం సుబ్రహ్మణ్యదేశికులకు అలవాటు. వెంగమాంబకు ఆ కథలంటే ఎంత కుతుహలమో! నెడద కళ్ళను చక్రాల్లా తిప్పుతూ ఏకాగ్రంగా వింటూ ఉంటుంది.
    ఆరోజు దేశికులవారు పాఠం ప్రారంభిద్దామనుకున్నారు. కానీ ఆరోజు ఎందుకో వెంగమాంబకు చదువుమీద ధ్యాస కుదరడంలేదని ఆయన కనిపెట్టారు. పిల్లల మనసెరిగి చదువు చెప్పడంలో ఆయన దిట్ట.
    "ఈరోజు మంచి కత చెప్పుకుందాం" అన్నారు.
    వెంగమాంబ ముఖం ఉత్సాహంతో వెలిగిపోయింది. సర్దుకుని బుద్ధిగా కూర్చుని చెవులు రిక్కించుకుని గురువుగారి  ముఖంలోకి చూస్తూ ఉండి పోయింది. "అనగనగా ఒక ఏనుగు. పాలసముద్రంలో ఉన్న త్రికూట పర్వతం మీద ఒక పెద్ద వనంలో అది నివసిస్తూ ఉండేది. అదెంత పెద్ద పర్వతమనుకున్నావు! దాని ఎత్తు, వెడల్పు కూడా ఎనభై వేల మైళ్ళు. దానికి మూడు శిఖరాలు. ఒక శిఖరమంతా బంగారమే, ఇంకోటి వెండి, ఇంకోటి ఇనుము. ఆ పర్వతం నిండా ఎన్నెన్నో చెట్లు, సరస్సులు. ప్రపంచంలో ఎన్ని రకాల చెట్లున్నాయో అన్నీ అక్కడే ఉన్నాయి. దేవతలు, కిన్నెరులు, కింపురుషులు- ఒకళ్ళేమిటి ప్రతి ఒక్కరూ ఆ వనాలలో విహరించడానికి, అక్కడి సరస్సులలో జలక్రీడలాడడానికి వస్తుంటారు. ఆ  వనంలో లేని జంతువులు, పక్షులు లేవు. ఏనుగులు కూడా ఎక్కువే. అవి అలసిపోయేంత వరకు ఆ వనంలో యథేచ్చగా తిరుగుతూ ఉంటాయి. అవి సింహాలకు కూడా భయపడవు. తిరిగి తిరిగి దాహం వేసినప్పుడు సరోవరాలలోకి దిగి దాహం తీర్చుకుంటూ ఉంటాయి. మన  ఏనుగు మగ ఏనుగు. ఓ గుంపుకంతకీ రాజన్నమాట. అది ఆడ ఏనుగులతో కలసి ఆ వనంలో ఎక్కడెక్కడో తిరుగుతూంటుంది. అంతలో దానికి బాగా దాహం వేసింది. తీరా చూస్తే దగ్గరలో ఒక్క సరస్సూ కనిపించలేదు. దాంతో అల్లాడుతూనే తిరిగి, తిరిగి వెతికి వెతికి ఎలాగో ఒక  సరోవరాన్ని చేరింది. ఆ ఉత్సాహంతో ఆడ ఏనుగులతో పాటు అందులోకి దిగి ఆనందంగా జలక్రీడలాడింది. తామరపువ్వులన్నీ తెంపి పారేసింది. తొండంతో నీళ్ళు అన్ని వైపులకూ విరజిమ్మింది. సరస్సంతా అల్లకకల్లోలం చేసిపారేసింది. ఆ సరస్సులోనే ఒక పెద్ద మొసలి ఉంది. దానికి ఏనుగుమీద కోపమొచ్చింది. చర చర  ఈదుకుంటూ వచ్చి ఆ ఏనుగుపాదాన్ని కరిచిపట్టింది......."
    వెంగమాంబ భయంగా, సంభ్రమంగా, కళ్ళు పెద్దవి చేసుకుని వింటోంది.
    "ప్రస్తుతానికి కథ కంచికి, మనం పాఠానికి ...... ఏదీ నేను చెప్పినట్లు వల్లించు" అంటూ దేశికులవారు అమరం వల్లేయడం ప్రారంభించారు.
    అమరం వల్లేస్తున్నా వెంగమాంబ ఆలోచనలు మాత్రం ఏనుగు చుట్టూనే తిరుగుతున్నాయి. అప్పుడా ఏనుగు ఏం చేసింది? మొసలి నుంచి విడిపించుకుందా? లేకపోతే మొసలి ఆ ఏనుగును నీళ్ళల్లోకి లాగేసిందా? ఆ ఏనుగును మొసలి నుంచి రక్షించినవారే లేకపోయారా? ఆలోచిస్తున్న వెంగమాంబ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
    "ఇక ఈపూటకు చాలు" అని దేశికులవారు వెళ్ళిపోయారు.
    గురువుగారు వెళ్ళిపోయినా వెంగమాంబ చాలాసేపు అలాగే కూర్చుండి పోయింది. ఆ ఏనుగు ఏమైందో తెలుసుకోవాలన్న ఉత్కంఠ కన్నా ఆ పసిమనస్సులో ఏనుగు ఏమీ  కాకూడదన్న తలంపే బలంగా ఉంది. పూర్తి కథ చెప్పమని గురువుగారిని అడగడానికి భయం వేసింది. పాఠం ముందు, కథ తరువాత అంటారాయన. కానీ తనకు ఆ కథే ముఖ్యమనిపించింది.
    కాస్సేపటికి లేచి వెంగమాంబ వంటింటివైపు వెళ్ళింది. ఆ కథ అమ్మకు తెలుసేమో అడిగి చెప్పించుకుందామనుకుంది. కానీ అమ్మ వంటింట్లో పనిలో సతమతమవుతోంది.
    తలతిప్పి కూతురును చూసి 'ఏం తల్లీ! ఏమైనా పెట్టనా? తింటావా?" అని అడిగింది.
    వెంగమాంబ తల అడ్డగా ఊపింది.
    "అమ్మా, ఆ ఏనుగు కథ నీకు తెలుసా?"
    "ఏ ఏనుగు కథ తల్లీ?"
    "అదే ఓ ఏనుగు చెరువులోకి దిగింది..... మొసలి దాని కాళ్ళు పట్టుకుంది.... ఆ కథ"
    మంగమాంబ కనుబొమలు మడిచి "ఆ కథా? ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను. అంతగా గుర్తులేదే తల్లీ. నాన్నగారిని రానీ. ఆయనైతే బాగా చెబుతారు" అంది పనిలో మునిగిపోతూ.
    వెంగమాంబకు నిరాశ్ కలిగింది. నాన్నగారు సాయంత్రం చీకటిపడేదాకారారు. అప్పుడు బాగా అలసిపోయి ఉంటారు. అడిగినా అంత ఇష్టంగా చెప్పరు. అయినా అంతవరకు తెలుసుకోకుండా తను ఆగగలదా? "ఎక్కడి కెడుతున్నావే?" అని తల్లీ అడుగుతున్నా వినిపించుకోకుండా వెంగమాంబ వీథిలోకి పరుగెత్తింది. ఆ ఊళ్ళో తనకి బాగా చనువున్న మనిషి పూజారిగారు. ఆయనకు తప్పకుండా ఆ ఏనుగు కథ తెలిసుంటుందనుకుని ఆయనింటికి వెళ్ళింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS