ఎగరని గాలిపటాలు
ఆకాశం నిండా రంగు రంగుల పతంగులు కనిపిస్తుంటే అలా చూస్తూ ఎంతోసేపు కూచునిపోయాడు డాబా మీద రాజు. ఈ వూరొచ్చి పదేళ్ళయింది. అమ్మమ్మకి ఒంట్లో బాగాలేదని చూడ్డానికి వచ్చాడు, తల్లితోకలిసి. అమ్మమ్మ ఇంటి ఎదురుగుండా చిన్న గుడిసె ఇప్పుడూ ఉంది. అందులో పాపిగాడు ఉన్నాడా? ఏమో! తనలాగే చాలా పొడుగయి ఉంటాడు. నల్లగా ఉన్నా, భలే అందంగా ఉండేవాడు పాపిగాడు. ఒక్కసారి కనిపిస్తే బాగుండును. తనని గుర్తుపడతాడో, లేదో? రాజు ఆ గుడిసె కేసి చూస్తూ అలాగే కూర్చున్నాడు. క్షణంలో గతంలోకి వెళ్ళిపోయాడు.
* * *
ఆకాశంకేసి చూసి చూసి మెడ నొప్పి పుట్టింది పదేళ్ళ రాజుకి. కళ్ళు మండుతున్నాయి. రెండు నిమిషాలు నేలమీద చతికిలబడ్డాడు. పక్కనున్న పాపిగాడు ఈలోగా పతంగ్ ఎగరేస్తున్నాడు. ఎదురుగా చిన్న గుడిసెలో ఉన్న రత్తి కొడుకు పాపిగాడు. పనిచేయడానికి రత్తి వస్తే దానివెంట వీడూ వస్తాడు. ఈ మధ్య సెలవులని అమ్మమ్మ గారింటికి వచ్చిన రాజుకి వీడితో స్నేహం ఎక్కువైంది. కాని తల్లి కంటపడకుండా పాపిగాడితో ఆడుకొనేవాడు. లక్ష్మి పాపిగాడిని చూస్తే చాలు, విసుక్కుంటుంది. వాడితో ఆడుకోవాలని ఎంత ఉన్నా తల్లి చూస్తూండగా ఆడుకునేందుకు భయం రాజుకి.
రేడియోలో క్రికెట్ కామెంటరీ వస్తోంది. లక్ష్మి రేడియో ముందు నుంచి కదలకుండా కూచుంది. హమ్మయ్య, అమ్మ ఇప్పట్లో బయటికి రాదు. హాయిగా పాపిగాడు, నేను పతంగులు ఆడుకోవచ్చు. రాజు రత్తి గుడిసెలో కెళ్ళాడు. పాపిగాడి చెవిలో రహస్యం చెప్పాడు. ఇద్దరు డాబా మీద కెళ్ళారు ఉత్సాహంగా!
ఆరోజు లక్ష్మి రేడియో వినటం అయిన తర్వాత గుమ్మంలోకొచ్చి నిలుచుంది. 'అబ్బబ్బ, పిల్లాడు పతంగులు గొడవలోపడి అన్నంకూడా తినడం మానేశాడు' అనుకుంటూ గబగబా డాబామీద కెళ్ళింది.
పతంగ్ పిలాయిస్తున్న పాడిగాడిని, చెరఖా పట్టుకున్న రాజుని చూడగానే లక్ష్మి కళ్ళు నిప్పులు కురిశాయి. 'ఎన్నిసార్లు చెప్పాను__ మా వాడితో ఆడద్దని?' లక్ష్మి పాపిగాడి చేతిలోని పతంగ్ లాగేసుకుంది. వాడు ఒక్క క్షణంలో పరిగెత్తి గుడిసెలోకి వెళ్ళిపోయాడు. రాజు చెయ్యి పట్టుకుని లాక్కుపోయింది కిందకి లక్ష్మి. రాజు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. తనకు పతంగులు ఎగరేయటం రాదు. ఎన్నో పతంగులు మామయ్య కొనిపెట్టాడు. పాపిగాడితో కలిసి ఎగరేస్తే- ఛీ, అమ్మ ఒప్పుకోదు. నిజంగా పాపిగాడి అమ్మే మంచిది. రాజు కళ్ళు తుడుచుకున్నాడు.
అమ్మ కొడుతుందనే భయంకొద్దీ కొంచెం అన్నం తిన్నాడు రాజు. 'పడుకో. ఎండలో వెళ్ళకు. చూడు ఎంత నల్లబడిపోయావో!' లక్ష్మి తను పరుపుమీద వాలుతూ రాజును తన పక్కనే పడుకోమంది. కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. నిద్రవస్తేగా! పాపిగాడు ఏంచేస్తున్నాడో? సగం కళ్ళు తెరిచి మెల్లగా చూచాడు. తల్లి నిద్రపోతోంది. అడుగుల చప్పుడు కాకుండా కిటికీ దగ్గరకొచ్చి నిలబడ్డాడు. చిన్న కాగితానికి దారం కట్టుకుని హాయిగా ఎగరేసుకుంటున్నాడు పాపిగాడు గుడిసె ముందు. రత్తి గుమ్మంలో కూచుని చూస్తోంది. తన గదిలో ఎన్నో పతంగులు, జీబాలు అద్దాలు.... ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ పాపిగాడిచేత ఎగరేయిస్తే! రాజు నెమ్మదిగా నడిచి తల్లి గదిలోకొచ్చాడు. లక్ష్మి గాఢంగా నిద్రపోతోంది. తలుపు నెమ్మదిగా దగ్గరగా వేసి గబగబ పతంగులు పట్టుకొని రత్తి గుడిసె దగ్గరికి పరిగెత్తాడు రాజు. పాపిగాడు పతంగులకి కన్నాలు చేసి దారాలు కట్టాడు. కొన్ని పతంగులు ఎగరేశాడు. కొన్నింటిని కోశాడు. రాజు సంతోషంతో పొంగిపోతున్నాడు పక్కన నిలబడి. అమ్మ లేచిందేమోనని ఒక్కసారి గుమ్మంకేసి చూశాడు. భయంతో వణికిపోయాడు. అంతలోనే ఎదురుగా గుమ్మంలో నిలబడి తననే చూస్తోంది లక్ష్మి.... ఇంట్లోకి పరిగెత్తాడు. ఆరోజు బుగ్గలు ఎరుపెక్కేటట్లుగా కొట్టింది లక్ష్మి. ఇంకెప్పుడూ ఆ గుడిసెలో అడుగుపెట్టనన్నాడు.... పాపిగాడితో మాట్లాడనన్నాడు. లక్ష్మి చాలా సంతోషించింది. 'నా బంగారు తండ్రి! మమ్మీ చెప్పినట్టు వింటాడు కదూ.... వాడితో ఆడితే నువ్వూ అలా అయిపోతావంతే!' లక్ష్మి మాటలు వింటూ వూరుకున్నాడు. అమ్మ అక్కడనుండి వెళ్ళిపోయిన తర్వాత ఎంతసేపో వెక్కి వెక్కి ఏడ్చాడు.
ఆ తర్వాత వారం రోజులు రాజు పాపిగాడిని చూడలేదు. ఒకనాడు రత్తిని రహస్యంగా అడిగాడు. పాపిగాడికి జ్వరం అని తెలియగానే గుడిసె దగ్గరికి పరుగెత్తాడు. ఇంతలో తల్లికి తేలుస్తుందన్న భయంతో తలుపు సందులోంచి చాపమీద పడి నిద్రపోతున్న పాపిగాణ్ణి చూచి పరుగెత్తుకు ఇంటికి వచ్చేశాడు రాజు. కాని రాజుకి ఏమీ తోచటంలేదు. తనకి స్నేహితులు లేరు ఇక్కడ. పాడిగాడితో ఆడుకోనీదు అమ్మ. చీ, పాపిగాడి అమ్మే మంచిదని మళ్ళా ఒకసారి అనుకొన్నాడు ఆ పసివాడు.
ఆరోజు లక్ష్మి బజారు కెళ్ళింది. అమ్మమ్మ ఇంట్లో ఎక్కడో ఉంది. రాజు రత్తి గుడిసెలోకి పరుగెత్తాడు. పాపిగాడిని తనతో ఆడుకుందుకు రమ్మన్నాడు. వాడు రానంటే బతిమాలాడు. అమ్మ బజారు నుంచి ఇప్పుడే రాదులే అన్నాడు. పాపిగాడు సంతోషంతో గంతులేస్తూ రాజు వెంట డాబా మీదికి వచ్చాడు.
పతంగులకి దారాలు కట్టాడు పాపిగాడు. చెరఖా రాజు పట్టుకుంటే పతంగులు ఎన్నో ఎగరేసి, కొన్నింటిని కోస్తున్నాడు. రాజు సంతోషంతో, గర్వంతో ఆకాశం కేసి చూస్తున్నాడు. ఎండలో ఎగరేస్తున్న పాపిగాడి కళ్ళు చీకట్లు కమ్మాయి. ఇంక ఎగరవేయలేక మెట్ల దగ్గర వచ్చి కూర్చున్నాడు. రాజు పతంగ్ ఎగురేస్తున్నాడు. ఇంతలో ఉరుము ఉరిమింది. పిడుగు పడింది. "ఈ శని నిన్ను వదలడు." పెద్దగా అరుస్తూ డాబామీద కొచ్చింది లక్ష్మి. మెట్లపైన కూర్చున్న పాపిగాణ్ణి ఒక తన్ను తన్నింది. అంతే. క్షణంలో మెట్లన్నీ దొర్లుకుంటూ కింద పడిపోయాడు. రాజు కొయ్యబారిపోయాడు. లక్ష్మి ఒక్క క్షణం కంగారు పడిపోయింది. వెంటనే రాజును కిందకు లాక్కుపోయి తలుపు లేసేసింది. పాపం, పాపిగాడు! రాజు మనసంతా వాడిమీదే.
ఆ సాయంత్రం లక్ష్మి కిటికీ తలుపు తీసి నెమ్మదిగా చూసింది. గుడిసె ముందు ఎవరూ లేరు. ఆరు గంటలు కాకుండా రాజును తయారు చేసి సినిమాకి బయలుదేరింది లక్ష్మి. సినిమా కనిపించడం లేదు రాజుకి. మెట్లమీద నుంచి దొర్లి పడిపోయిన పాపిగాడే కళ్ళముందున్నాడు.
సినిమానుంచి ఇంటికొచ్చేశారు తల్లీ, కొడుకు. "అవును కానీ, మమ్మీ! పాపిగాణ్ణెందుకు మెట్లమీద నుంచి తోసేశావ్?" రాజు మాటకి గతుక్కుమంది లక్ష్మి. వెంటనే సర్దుకుంది. "నేను తోసేస్తానా! పాపం వాడే కాలుజారి కిందపడిపోయాడు. క్రికెట్ చూపించారు ఎంత బావుంది చూశావా. నీకూ కొనిపెట్టనా బంతి, బాటు అన్నీ?"
రాజు మాట్లాడలేదు. వాడి చిన్న మనసుకి తెలుసు - పాపిగాడు కాలుజారి పడలేదని!
రెండు రోజులు పనికి రాలేదు రత్తి. ఆ రోజు గదులు తుడుస్తూ లక్ష్మితో మాట్లాడుతోంది. పాపిగాడి కాలు విరిగిం దన్నారట డాక్టర్లు. హాస్పిటల్ లో ఉన్నాడట. కట్టు ఇప్పుడే విప్పరట. విప్పినా కాలు వస్తుందో రాదో చెప్పలేమన్నారట. ఈ మాటలన్నీ శ్రద్దగా వింటూ, "అవునే, రత్తీ! నీ అదృష్టం, వాడదృష్టం బాగుంది కనక కాలు విరగటంతో సరిపోయింది. ఇంకేమన్నా అయితే - ఏమన్నా ఉందా?" దీర్ఘంతీస్తూ స్వెటర్ అల్లడంతో మునిగిపోయింది లక్ష్మి.
"అంతే నమ్మగారూ! వాడిరోజు బాగుంది. కాలు విరిగిందంతే!" గబగబా గదులు తుడుస్తూ పోయింది రత్తి. ఈ మాటలన్నీ వింటున్న రాజుకి ఒక్కసారి భయమేసింది. రానంటుంటే బలవంతంగా తీసుకొచ్చింది తను కాదూ ఆనాడు పాపిగాణ్ణి? వాడు హాస్పిటల్లో ఉంటే చూసి వస్తే ఎంత సంతోషించేవాడు. ఈ అమ్మ ఒకర్తి తనమాట ఒక్కటీ ఒప్పుకోదు. క్షణం గుడిసెకేసి చూశాడు. మరోక్షణంలో గదిలోకి పరిగెత్తాడు. కిటికీలో పడేసిన రంగు రంగుల పతంగులన్నీ గాలికి కదులుతుంటే వాటిపైన ఎంతో కోప మొచ్చింది రాజుకి. అన్నింటిని ఇష్టమొచ్చినట్టు చుట్టేసి దారాలతో కట్టేసి అటకపైన విసిరాడు మళ్ళా కనబడకుండా. ఆ తర్వాత కొద్ది రోజులకే రాజు తల్లితో కలిసి తన ఊరు వెళ్ళిపోయాడు.
* * *
ఆకాశం నిండా సంధ్య కాంతులు అలుముకున్నాయి. అక్కడక్కడ పతంగులు ఎగురుతున్న చిన్న చిన్న పక్షుల్లా కనిపిస్తున్నాయి. గుడిసెలో చిన్న దీపం వెలిగింది. మేడమీద నుంచి కిందికి దిగిన రాజు, గుడిసె కెదురుగా ఉన్న సోడా బండిని ఆపాడు.
సోడా చేతి కందించి__ "నేను బాబూ! పాపిగాణ్ణి" అన్నాడు నవ్వుతూ. రాజు చేతిలో సోడా సీసా కింద పడబోయింది. నోట్లో సోడా చేదు విషమల్లే అనిపించింది. గొంతు దిగలేదు. "ఇదిగో" పాపిగాడి చేతిలో రూపాయి పెట్టి చిల్లరకోసం ఆగకుండా లోపలి కెళ్ళిపోయాడు రాజు. 'మా బాబు ఎప్పుడూ మంచోడే!' సోడాబండి నడుపుకుంటూ కదిలిపోయాడు కుంటి పాపిగాడు!
సోఫాలో కూచుని పత్రిక తిరగేస్తున్న తల్లిని చూడగానే ఎందుకో కోపం కట్టలు తెంచుకుంది రాజుకి. అక్కడ నిలబడకుండా చెప్పులు తొడుక్కుని బయటికి నడిచాడు. ఎన్నో రంగు రంగుల గాలిపటాలు ఆకాశంలో ఎగరటం మానేసి, తన మెడచుట్టూ చుట్టుకున్నట్లుగా, ఉక్కిరి బిక్కిరయినట్లుగా అనిపించిందా నిమిషం రాజుకి. కుంటి పాపిగాడి సోడా బండి చప్పుడు చెవుల్లో మారుమ్రోగింది. ఎర్రని లిప్ స్టిక్ పెదాలతో నవ్వుతున్న తల్లి ముఖం భయంకరంగా కనిపించింది కళ్ళముందు. ఎరగని గాలిపటాలెన్నో భీష్మించుకు కూర్చున్నట్లుగా డాబా నిండా చెల్లా చెదురుగా ఉన్నట్లనిపించింది. తల తిరిగినట్లయింది. రెండడుగులు ముందుకు వేసిన రాజు లోపలికొచ్చి చెప్పులు విప్పి గదిలో మంచంమీద వాలిపోయాడు. *
