"సర్. నేను 'శుభోదయ' పత్రికా విలేకరిని మాట్లాడుతున్నాను. పొగాకు ధర ఇంత అకస్మాత్తుగా పెంచే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ చర్యమీద మీ అభిప్రాయం ఏమిటి?"
అవతల రామసుబ్బారావు ఈ వార్తావిని నిశ్చయంగా ముందుకు తూలిపడి వుంటాడని ఆమె భావించింది. నిజంగా అలాగే జరిగింది.
ఆ క్షణం నాటికి అతడు రెండు కోట్లకు పైగా పొగాకు అమ్మకం విషయంలో ఫార్వార్డ్ కాంట్రాక్ట్*లో ప్రవేశించే వున్నాడని ఆమెకు తెలుసు.
"ఎవరు చెప్పారు మీకు" అవతల్నుంచి ఉద్వేగం నిండిన కంఠంతో అతడు అడిగాడు.
"ఇప్పుడే సహాయ మంత్రి ప్రబోద్ ముఖర్జీ ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో ఈ విషయం వెల్లడించారని మాకు వార్తా వచ్చింది. ఈ వార్తతోపాటూ మీ అభిప్రాయం కూడా కనుక్కుని వేయమని మా ఎడిటర్ అన్నారు. అందువల్ల మీకు ఫోన్ చేశాను."
అవతల నుంచి రా.సు. వినడం లేదు. ఆలోచనలో వున్నాడు "విజ్ఞాన భవనా-" అని అడిగాడు.
"అవున్ సర్" అంది అనూష. "ఆయన అక్కడే వున్నారు. కావాలంటే ఫోన్ నెంబర్ ఇస్తాను"
"ఎంత?"
"246392" ఆమె ఇంకా ఏదో చెప్పబోతూ వుంటే ఫోన్ కట్ అయింది.
సరీగ్గా అయిదు నిముషాలు ఆగి ఆమె తిరిగి ఢిల్లీ ఫోన్ చేసింది. హరిసేన్ అందుకున్నాడు. ఈసారి వాడి కంఠంలో విజయం సాధించిన గర్వం తొంగిచూస్తూంది.
"ఏం జరిగింది హరిదా?" అని అడిగింది.
"ఆ సుబ్బారావు ఫోన్ చేశాడు మాడమ్. ప్రభోద్ ముఖర్జీ కావాలన్నాడు. ఆయన భోజనంలో వున్నారని చెప్పాను. తనెవరో చెప్తే వస్తారన్నాడు. నిముషం తరువాత మళ్ళీ ఎత్తి స్వరంమార్చి మాట్లాడాను.
* * *
"హాల్లో-"
"నేను సాబ్ రామసుబ్బారావుని మాట్లాడుతున్నాను. మీరూ, నేనూ ఎప్పుడూ కలుసుకోలేదు కానీ కేంద్ర ఆర్ధిక మంత్రి వెంకట్రామన్ సాబ్ కి నేను బాగా తెలుసు. ఇలా చొరవ తీసుకుని మిమ్మల్ని ఫోన్ దగ్గరకు పిలిపించినందుకు నన్ను క్షమించండి ముందు".
"ఓ మీరా! మీరు తెలియకపోవడమేమిటి సాబ్. టొబాకో కింగ్ అని మా వెంకట్రామన్ చెపుతూవుంటారు. చెప్పండి మీకేం చెయ్యగలను?" స్వచ్ఛమైన హిందీలో వంటవాడు నమ్రతగా అడిగాడు.
"ఇప్పుడే తెలిసింది వార్త పొగాకు ధర పెంచుతున్నట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట......"
"అప్పుడే వార్త అంత దూరం ప్రయాణం చేసిందా".
"అది తెలియగానే ఆగలేకపోయాను సాబ్. వెంకట్రామన్ గారికి చేసే ముందు మిమ్మల్ని సంప్రదించడం మంచిదనుకున్నాను. అందుకే భోజనం మధ్యలో మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది. ఇంత అర్థంతరంగా ధరపెంచితే మాలాటి వాళ్ళు ఏమైపోవాలి సాబ్. నాకే ఇరవై ముప్ఫై లక్షల దాకా నష్టం వస్తుంది. కనీసం నెల ముందన్నా నోటీసు లేకపోతే....."
"నెల నోటీసా"
"అవును సాబ్"
"మేము పెంచుదామనుకున్నది కూడా నెల తరువాతేనే"
ఒక్కసారిగా రామసుబ్బారావు కంఠంలో రిలీఫ్ కనపడింది. "నిజంగానా" ఆన్నాడు సంతోషంగా.
"అవును. ధర పెంచే వార్త నిజమేగాని- ఇప్పుడు కాదు. నెల తుర్వాత. ఈ వార్తా మీకు చెప్పినవాళ్ళు బహుశా ఆ విషయం చెప్పడం మర్చిపోయి వుంటారు. అయినా అంత హఠాత్తుగా ప్రభుత్వం మాత్రం ఎలా ధర పెంచుతుంది?"
"థాంక్స్ సాబ్. చాలా థాంక్స్" అప్పుడే రామసుబ్బారావు తనకి ఇందువల్ల రాబోయే లాభాల్ని లెక్క కట్టుకుంటున్నాడు. అలా కట్టుకుంటూనే, "ఇంక ఈ విషయంలో వెంకట్రామన్ సాబ్ దగ్గిరకి వెళ్ళక్కర్లేదుగా సాబ్?" అని నమ్రతగా అడిగాడు. (అడగడం నమ్రత గానే గానీ, అందులో నువ్వు చెయ్యనంటే నీ పై అధికారినుంచి ఈ విషయం చెప్పిస్తాను అన్న సూచన వుంది).
"అక్కర్లేదు. ఈ విషయంలో మీరు నిశ్చింతగా వుండొచ్చు".
"థాంక్స్ సాబ్. ఢిల్లీ వచ్చినప్పుడు కలుసుకుంటాను".
"అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీరు నాకో సాయం చెయ్యాలి."
"చెప్పండి సాబ్. ఏం చెయ్యమన్నా సంతోషంగా చేస్తాను".
"మా స్నేహితుడి చెల్లెలు మీ వూళ్ళో ఒక కంపెనీ- ఏమిటది? ఆ స్టాక్ హొం దానికి జనరల్ మేనేజర్ ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఇవ్వాళో రేపో ఇంటర్వ్యూ, కాస్త చెపుతారా" వివరాలు చెప్పాడు.
"తప్పకుండా సాబ్. ఈ రోజే- ఇప్పుడే జరుగుతోంది. తప్పకుండా చెపుతాను".
"థాంక్స్ సుబ్బారావ్ జీ. మీరు చేసిన ఫోన్ ని ఇలా నా కోసం వాడుకోవడం బాధగా వుంది".
"అదేమిటి సాబ్. మనం మనం ఒకటి. మీరీ విషయంళో నిశ్చింతగా వుండండి. పోతే ధర పెంచడంళో నెలరోజులు ఆగే విషయం-"
"ఆ విషయంలో మీరు నిశ్చింతగా వుండండి"
వంటవాడు- ఉరఫ్- కేంద్ర సహాయ ఆర్ధిక మంత్రి- ఫోన్ పెట్టేశాడు.
* * *
తెరలు తెరలుగా వుస్తున్న నవ్వుని ఆమె బలవంతంగా ఆపుకుని "థాంక్స్ హరిదా. బాగా చేశావు. పోతే చెప్పిన దానికి నీ వంతు కూడా కలిపి మరింత బాగా నటించావు" అంది.
"ఏం చేశాను మాడమ్?"
"అదే- నెలరోజుల తరువాత రేటు పెంచడం"
"ఆ మాత్రం లేకపోతే నాటకం రక్తి కట్టదమ్మా"
"ఏదేమైనా థాంక్స్! ఈ విషయం మాత్రం అన్నయ్యతో చెప్పకు, తిడతాడు. వుంటాను"
"మంచిదమ్మా"
అనూష ఫోన్ పెట్టేసి బయటగదిలోకి వచ్చేసరికి పండా కూడా ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు. ఆమెని చూసి ఫోన్ పెట్టేస్తూ "ఇప్పుడే టి.కె. (టొబాకో కింగ్) ఫోన్ చేశాడు. చాలా పెద్ద ఎత్తులో ఒత్తిడి తెచ్చినట్టున్నావే-" అన్నాడు.
ఆమె నవ్వి వూరుకుంది.
పండా లేస్తూ "ఏ విషయమూ నాలుగైదు రోజుల్లో తెలుపుతాం" అన్నాడు. అతిడ్ బింకానికి ఆమెకి మళ్ళీ నవ్వొచ్చింది. వెళ్ళటానికి ఆయత్తమవుతూ "అతడి మేనల్లుడి విషయమై ఏమీ బాధపడలేదు కదా సుబ్బారావు?" అంది.
"పడడు! ఇది నిజంగా చాలా ప్రతిష్టాకరమైన ఉద్యోగమే. కానీ టి.కే. తన మేనల్లుడికి కావాలనుకుంటే ఇంతకన్నా మంచి ఉద్యోగం వేయించగలడు".
ఆమె వెళ్ళొస్తానని చెప్పి బయటకు వచ్చింది. టైమ్ మూడయింది. లిప్ట్ లో క్రిందికి దిగింది.
స్టాక్ హొం అంతస్థులన్నీ వ్యాపారస్తులతోనూ, బ్రోకర్లతోనూ కిటకిట లాడుతున్నాయి. రెండు లిప్ట్ లున్నా సరిపోవడం లేదు. ఆమె తన కారు దగ్గిరకు వచ్చి లోపల కూర్చోబోతూ వుండగా, గేట్ మాన్ వచ్చాడు.
ఆమె చుట్టూ గీతల మధ్య నిలబెట్టబడివున్న కార్లవంక చూస్తూ అతడితో "ఎవరు ఈ పార్కింగ్ లైన్స్ (కార్లు పెట్టుకోవటానికి అనువుగా నేలమీద గీసే గీతలు) గీయించింది" అంది.
"నేనే మాడమ్"
"45 డిగ్రీల్లో వున్నాయవి. వీటిని రేపు సెలవు రోజున చెరిపించి 55 డిగ్రీలలో తిరిగి గీయించు. ఇంకో ఆరేడుకార్లు ఎక్కువ పడతాయి. డిగ్రీలంటే తెలుసుగా....."
గేట్ మన్ విస్మయంతో "మీరెవరు మాడమ్" అని అడిగాడు.
"స్టాక్ హొం జనరల్ మేనేజర్ని".
..... ...... .......
పండాకి కావలసిన పునర్నిర్మాణం ఆ క్షణం నుంచీ ప్రారంభమయింది.
3
"అమ్మాయ్. ఇక నువ్వు బయల్దేరొచ్చు" అన్నాడు పెద్ద బావగారు పంచాంగం మూసేస్తూ. అప్పటి వరకూ ముళ్ళమీద కూర్చున్నట్టువున్న ఉత్పల 'అమ్మయ్య' అనుకుంటూ లేచింది. అప్పటికే ఇంటర్వ్యూకి అయిదు నిముషాలు ఆలస్యం అయింది. రాహుకాలం అంటూ అంతసేపూ కూర్చోబెట్టేశాడు పెద్దబావగారు. ఈ ఇంటర్వ్యూ సంగతి అప్పుడే తల్లికి తెలిసింది. "మన ఇంటా వంటా లేదు. నువ్వు ఉద్యోగం చెయ్యడమేమిటే" అంటూ విరుచుకుపడింది. ఆవిడకి సర్దిచెప్పే సరికి తల ప్రాణం తోకకి వచ్చింది. ఇంకా నయం. చేయబోయే వుద్యోగం ఏమిటో ఆవిడకి ఇంకా తెలియదు.
ఉత్పల హడావుడిగా మెట్లు దిగింది. మొత్తం కుటుంబం అంతా గ్రూప్ ఫోటోలోలా అరుగుమీద నిలబడింది. ఉత్పల వెళ్ళబోతూ వుంటే చిన్నక్క 'ఒక్కక్షణం ఆగవే' అంది. నిర్మానుష్యంగా వున్నా ఆ సందులో ఒంటి బ్రాహ్మడు ఎదురొస్తున్నాడు.
ఉత్పల నిస్సహాయంగా అటు చూసింది.
'మనం బ్రాహ్మలమైవుండీ మనల్ని మనమే ఇలా తక్కువ చేసుకోవడం దారుణం అక్కా' అంది చిన్నచెల్లి. అదిప్పుడిప్పుడే సమరంగారి ఉపన్యాసాలు వింటూ కాసింత వెలుగు చూడడం నేర్చుకుంటూంది. ఏది ఏమైతేనేం ఉత్పల బస్ స్టాప్ దగ్గిరకి చేరుకునే సరికి మూడూ ఇరవై అయింది. ఇక ఈ ఉద్యోగం మీద ఆశ వదిలేసుకుంది.
బస్ స్టాప్ లో రామబ్రహ్మం ఆమె కోసం ఎదురు చూస్తూన్నాడు. అతడి చేతిలో వేరుశనగ పప్పు పొట్లం వుంది. ఇంత ఆలస్యం అయిందేం" అని అడిగాడు.
"వర్జం, రాహూకాలం చూసుకునేసరికి!"
"ఇంకొంచెం సేపు చూసి వెళ్లిపోదామనుకుంటున్నాను" వేరుశనగ పొట్లం అందిస్తూ అన్నాడు. "ఉహూ వద్దు" అంది. ఆమెకు ఇలా నడిబజార్లో తినడం ఇష్టం వుండదు.
రామబ్రహ్మం ఆ పక్కవీధిలో టైప్ ఇన్ స్టిట్యూట్ లో టైప్ నేర్చుకున్నాడు. బియ్యే పాసయి ఖాళీగా వుంటున్నాడు. ఆమెకూడా టైప్ కి వెళ్ళేది. ఆ విధంగా ఆమెకి పరిచయం. సాయంత్రం పూట పార్క్ లకి వెళ్ళేవారు. ఒకటి రెండు సార్లు సినిమాలకి వెళదాం అని అడిగాడు గానీ ఆమె వప్పుకోలేదు.
"ఉద్యోగం వస్తే నన్ను మర్చిపోతావేమో " అన్నాడు అతడు. ఆమె జవాబు చెప్పలేదు. దూరంగా వస్తున్న వాహనాలకేసి చూస్తూంది. కావలసిన బస్సుమాత్రం రావడం లేదు. పావుతక్కువ నాలుగవుతూంది. ఆమెకి కళ్ళనీళ్ళోక్కటే తక్కువ.
పెద్దబావగారి మీద పీకల్దాకా కోపం వచ్చింది.
"టైప్ అయిపోగానే ఆస్పత్రి దగ్గిరకొస్తాను" అంటున్నాడు రామబ్రహ్మం ఆమె వినడం లేదు. విసుగ్గా వుంది.
ఒక నిర్ణయానికి వచ్చినట్టు "ఎవర్నన్నా లిప్ట్ అడుగుతాను" అంది. రామబ్రహ్మం అదిరిపడి చూశాడు. పార్క్ కి వెళ్ళితేనే నలుగురూ తనవైపు చూస్తున్నారేమో అని బిడియపడే అమ్మాయి- లిప్ట్ అడగడం....
