తెల్లవారుజామున నాలుగింటికి లేచి ఆసనాలు వేసేవాడు. తరువాత కొంచెంసేపు కసరత్తు చేసేవాడు. పరికరాలు కూడా పెద్దగా లేవు. జైలు వూచలే "బార్" లా పట్టుకొని శ్రమించేవాడు.
"నువ్వు ఎన్నింటికి పడుకొంటావు?" అడిగేడు మొదటి రోజు రాత్రి.
"తొమ్మిదీ- పదీ మధ్య."
"లేవటం?"
"ఐదూ.... ఆరూ."
"ఏమిటి?" అన్నాడు ఆశ్చర్యంగా. "ఎనిమిది గంటలు. ఎనిమిది గంటలు నిద్రలో గడుపుతున్నావా రోజూ" అని ఆగి తనలో తానే "ఎనిమిది గంటలు నిరర్థకంగా..." అని గొణుక్కున్నాడు.
"మరేం చేయాలి?" అర్థంకానట్టు అడిగేను.
ఏం చెయ్యాలో వివరించేడు.....
కాలానికి వున్న విలువేమిటో తెలియజెప్పేడు. తను చేసి చూపించేడు. నేనూ చేసేవరకూ వూరుకోలేదు. మొదట్లో కొంచెం శ్రమ అనిపించేది. కానీ రాను రానూ కొత్త చురుకు బయర్దిరింది నాలో. ఏదో తెలియని హుషారు ప్రవేశించింది. తెల్లవారు జామునే నాలుగింటికి తల క్రిందకి పెట్టి శీర్షాసనం వేసి కొయ్యల్లా నిలబడే మా యిద్దర్నీ గదిముందు పహరా తిరిగే సెంట్రీ ఆశ్చర్యంతో చూసేవాడు.
తాత నా గదిలోకి వచ్చిన రెండో రోజు ననుకొంటా- ఒక రోజు రాత్రి పన్నెండింటికి మెలకువ వచ్చింది అకస్మాత్తుగా. కారణం అతడే.
తలక్రింద చేతులు పెట్టుకొని ఎక్కాలు చదువుతున్నాడు.
........డెబ్భై రెండు' నాలుగులు రెండు వందల ఎనభై ఎనిమిది.
'డెబ్భై రెండు' అయిదులు మూడు వందల అరవై..... 'డెభై రెండు ఆర్లు-'
అతడికి నిశ్చయంగా పిచ్చెక్కి వుంటుందని భావించేను. అదే అడిగేను కూడా.
నవ్వేడు.
"ఏం చెయ్యన్రా అబ్బీ? మెదడు పదును పెట్టే పుస్తకాలు లేవు. ఏదన్నా గొప్ప వ్యూహం రచిద్దామన్నా ఈ గోడలు దాన్ని సాగనివ్వటం లేదు, మరేం చెయ్యను?"
"అందుకని?"
"అందుకని-" నా దగ్గర కొచ్చి కూర్చున్నాడు "ఈ మెదడు ఓ యంత్రం లాటిది. దాన్ని ఎప్పుడూ వాడుతూ వుండకపోతే తుప్పుపట్టి పోతుంది. ఏదో ఒకటి చేసి దాన్ని ఎప్పుడూ నడిపిస్తూ వుండాలి."
"అందుకని అర్థరాత్రిపూట లేచి డెబ్భై రెండో ఎక్కం చదువుతున్నావా?"
"మరేం చెయ్యాలి?"
అవునేం చెయ్యాలి? ఖైదీలకి మంచి పుస్తకాలు యివ్వరు. అంతవరకూ ఎందుకు? బైట ప్రపంచంలో జరిగే విశేషాల్ని తెలుసుకొనే అవకాశం కూడా కలుగజెయ్యరు. ఠాకూర్ లాంటి మేధావిని ఈ జైలు గోడలు బంధించి ఆపు చేయలేవు. ఎప్పుడో అతడు ఈ సంకెళ్ళని త్రెంచుకొని వెళ్ళిపోతాడు.
ఆ సంభాషణ మా మధ్య ఒకసారి జరిగింది.
"నాతో వచ్చెయ్యి" అన్నాడు.
"ఎప్పుడు? పన్నెండేళ్ళు పోయాకా?"
"నువ్వు "వూఁ' అను. వచ్చేనెలలో వెళ్ళిపోదాం."
నవ్వి, "ఇదేవున్నా పెళ్ళి విడిది అనుకున్నావా? - ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవటానికి" అన్నాను.
ఠాకూర్ క్షణంసేపు మాట్లాడలేదు. సాలోచనగా "మనం తల్చుకుంటే పారిపోలేం అంటావా?" అన్నాడు.
నేనో క్షణం మాట్లాడలేదు. తరువాత నెమ్మదిగా అన్నాను - "పారిపోవటం అంత సులభం అనుకోను. ఒకవేళ పారిపోయాం అనుకో. దాని వల్ల సాధించేది కూడా ఏవీఁ వుండదు. మిగతా బ్రతుకంతా క్షణం క్షణం భయపడ్తూ వుండాలి. ఈ న్యాయం , ఈ సంఘం నన్నో హంతకుడిగా ముద్రవేసి, శిక్ష విధించేయి. ఈ సంఘంలో బ్రతుకుతున్నాను కాబట్టి దానికి లోబడి వుండాలనే అనుకుంటాను నే నెప్పుడూ."
"కానీ నేను...." అనబోయాడు.
"నీ సంగతి వేరు" అతని మాటలకు అడ్డుతగిలేను. నువ్వు చిన్నతనం నుంచి అడవుల్లోనే పెరిగేవు. స్వేచ్చ నీ హక్కులా భావిస్తున్నావు. నీకు శిక్ష విధించే అధికారం ఈ సంఘానికే లేదని నీ నమ్మకం. దాన్ని నా మీద ఆపాదించకు. నీ ఆటవిక న్యాయాన్ని నా మీద రుద్దకు."
"నేను అడవుల్లోనే పుట్టి పెరిగేననీ, ఆటవిక న్యాయాన్ని నాకు అన్వయించు కొన్నాననీ ఎందుకు అనుకుంటున్నావు?" తాపీగా అడిగేడు.
"ఏం? నా ఉద్దేశ్యం తప్పా?......ఏం చదువుకున్నావు నువ్వు?"
క్షణం ఆగి నెమ్మదిగా అన్నాడు - "ఆక్స్ ఫర్డ్ నుంచి 'ఎమ్యే; పాసయ్యేను, అబ్బో, యిప్పటి సంగతా ఏమిటి అది-"
దిగ్భ్రాంతితో అతడివయిపు నుదురూ, తీక్షణమైన కళ్ళూ -నేను విస్తుపోయి చూస్తూ వుండటం గమనించి నవ్వేడు.
"ఏం నమ్మకం కుదరటం లేదా?"
"లేదు లేదు. నమ్ముతున్నామ" అన్నాను తడబడుతూ. "ఇంత చదివి ఇలా దొంగగా - బందిపోటుగా బ్రతకడం ఏమిటి?"
"దొంగ - బందిపోటు! ఇవి మీ వ్యవస్థ నాకు పెట్టిన పేర్లు. నాకు నేను పెట్టుకొన్నవి కావు. డబ్బున్నవాడికీ లేనివాడికి మధ్య వ్యత్యాసం తొలగించటానికి ప్రజాస్వామిక పద్ధతుల్ని నీ ప్రభుత్వం ఎన్నుకొంది. పెట్టుబడిదారీ వ్యవస్థని ఇంకో ప్రభుత్వం ఎన్నుకొంది. ధనవంతుల్ని కొల్లగొట్టడం అనే మార్గాన్ని నేను ఎన్నుకొన్నాను."
నిజమే అయివుండవచ్చు. బలహీనవర్గాల్లో, కొండజాతి ప్రజల్లో - నా ముందు కూర్చొని వున్న ఈ వృద్ధుడు ఎంత ప్రాపకం సంపాదించాడో నాకు తెలుసు.
"తను సంపాదించిన ఆస్తుల మీద తనకు హక్కు వుండాలని ప్రతీవాడూ ఆశిస్తాడు. ప్రకృతి మనిషి కిచ్చిన జన్మహక్కు అది."
"సంపాదించటం- అనే మాటకు చాలా అర్థాలున్నాయి."
తరువాత మా సంభాషణ ఆర్ధిక శాస్త్రం వైపు మళ్ళింది. దురదృష్టవశాత్తు నాకు ఏ శాస్త్రంలోను ప్రవేశంలేదు. అతడు చెప్పేదంతా వినటం - చివరలో ఒక అర్థంలేని ప్రశ్నవేయటం - దాంతో అతడికి ఆవేశం పుంజుకొని మళ్ళీ మొదలు పెట్టడం ఇలా సాగేది మా సంభాషణ. కానీ ఎన్నాళ్ళు జరిగినా నా అభిప్రాయం మాత్రం మార్చలేకపోయాడు.
"సరే నీ ఖర్మ" అన్నాడు విసుగ్గా.
"ఈ వ్యవస్థనీ, న్యాయాన్నీ గౌరవిస్తూ ఇందులోనే కూర్చో, నేను మాత్రం వెళ్ళిపోతున్నాను."
"మంచిది....." అన్నాను నవ్వి.
ఆ తరువాత మూడురోజులకి నా దగ్గరగా వచ్చేడు. అప్పుడు వరుసలో కూర్చుని భోజనం చేస్తున్నాం అందరం. నెమ్మదిగా రహస్యం చెబుతున్నట్టు "అదిగో నీ కుడివైపు చూడు.... అరె - అలా తలంతా తిప్పకు.... ఆ తీగెల మధ్య కొద్దిగా జాగా వుంది చూడు -అందులోంచి వెళ్ళిపోదామనుకుంటున్నాను. ఎలా వుంది ఐడియా?" అని అడిగేడు.
అటువైపూ, ఠాకూర్ వైపు చూసి, "నీ శరీరం అందులో పడుతుందని నేననుకోను" అన్నాను. "అదీగాక - ఆ తీగెకి ఏం తగిలినా ఆరు అలారాలు ఒక్కసారి మ్రోగుతాయి...."
"దాన్ని నేను చూసుకొంటున్నాన్లే. సరీగ్గా రాత్రి ఎనిమిది నుంచీ ఎనిమిదింపావు వరకు ప్యూజ్ పోయేటట్టు ఏర్పాటు చేసేను."
"ఎనిమిదింటిదాకా?" ఆశ్చర్యపోయేను. "రాత్రి పన్నెండు దాటిన తర్వాత అయితే బావుంటుందేమో."
"అలా అయితే జైలు వూచలు వంచాలి. అది నువ్వు చేస్తావనుకో. సెంట్రీని చంపాలి.....అది నాకిష్టం లేదు. భోజనాల వేళ అయితే బావుంటుందని నా ఉద్దేశం."
"అందరూ జాగ్రత్తగా వుంటారు ఆ సమయంలో. నీకున్నది పావుగంట మాత్రమే!"
ఠాకూర్ నవ్వేడు.
"అటు దక్షిణంవైపు చూడు" అన్నాడు.
చూసేను. నాకేమీ అర్థం కాలేదు, ఠాకూర్ వైపు తిరిగేను.
"గాలిని జాగ్రత్తగా గమనించు. తేమ యెక్కువలా కనబడటం లేదు? అక్కడ దూరంగా చూడు - నల్లగా కనబడుతోంది. అదీ మేఘం. గాలి నెమ్మదిగా వీస్తోంది. యిటు - సమయంకాని సమయంలో కొంగలు వేగంగా వెళుతున్నాయి. అంటే ఇంకో రెండు గంటల్లో కుంభవృష్టిగా వర్షం కురవబోతుంది."
నాకూ అతడికి కొన్ని విషయాల్లో అభిప్రాయభేదం వుండొచ్చు. అతని వాదనని నేను ఒప్పుకోవచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం. అతడో అద్బుతమైన వ్యక్తి. అతడి జీవితాన్నీ, ఆలోచనల్నీ క్రోడీకరించి ఒక పుస్తకంగా వ్రాస్తే అందులో ప్రతి వాక్యమూ నాలాటి సామాన్యులు తమ జీవితాంతమూ గుర్తుంచుకోవల్సిన సూక్తిగా మారుతుంది.
ఠాకూర్ ఈ విషయం చెప్పిన దగ్గరనుంచీ నాలో ఉత్సుకత మొదలయింది.
అతడి అంచనాని నిజం చేస్తూ - సాయంత్రం అయ్యేసరికి వర్షం మొదలయి, చూస్తూ వుండగానే పెద్దదయింది. హోరున వీచే గాలిలో, ఫెళా ఫెళా ఉరిమే ఉరుముల మధ్య అతడు తప్పించుకున్నాడు. ఏడూ నలభై వరకూ అతడ్ని కనిపెడుతూనే వున్నాను. ఎనిమిదింటికి చూస్తే మా మధ్య లేడు.
నా గుండె వేగంగా కొట్టుకోసాగింది.
ఎనిమిదీ పది.....
ఎనిమిదీ పదిహేను....
మమ్మల్ని మళ్ళీ గదుల్లోకి తీసుకొని వెళ్ళే కార్యక్రమం ఆరంభమయింది అంటే మమ్మల్ని కాపలా కాసేవాళ్ళ ఇంకో రెండు నిముషాల్లో మాలో ఒకడు తప్పించుకొన్నట్టు గుర్తించబోతున్నారన్నమాట.
నా మొహంలోకి రక్తం వడివడిగా ప్రవహింపసాగింది, ఈ కొద్ది సమయంలో అతడు ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరంగా ప్రమాదం నుంచి వెళ్ళి పోయినట్టు.
ఎనిమిదీ పదహారు. వరసలో నిలబడ్డాం, జవాను బ్యాచీలను విడదీస్తున్నాడు.
అంతే-
చెవులు చిల్లులు పడేలా అలారం చప్పుడు వినిపించింది. ఒక్కసారి వాతావరణం చైతన్యం అయింది. జవాన్లు తుపాకులు ఎక్కుపెట్టి, మా చుట్టూ వలయంలా నిలబడ్డారు. మిగతా ఖైదీలలో ఎవరు తప్పించుకొన్నారో తెలియదు. ఎవరో తప్పించుకో ప్రయత్నించారని తెలుసు. అప్రయత్నంగా వారి పెదవులపై చిరునవ్వు వెలిసింది. జైలునుంచి తప్పించుకోవటం..... సామాన్యమైన గెలుపు కాదు.
అందర్నీ గదిలోకి పంపేశారు.
నే నొక్కడినే గదిలోకి వచ్చేసేను.
అర్థం కావటంలేదు నాకు! అలారం ఎందుకు మోగింది. ఎనిమిదీ పదహారు వరకూ కరెంట్ లేదు - ఈ లోపునే ఠాకూర్ వెళ్ళిపోవాలే.... మరి.....
ఆలోచనలతోనే అరగంట గడిచింది-
తలుపులు తెరుస్తున్న చప్పుడు వినిపించింది. చప్పున తలెత్తి చూసేను. ఠాకూర్ విసురుగా వచ్చి ముద్దలా నా ముందు పడ్డాడు. వెనుక తాళం వేసిన చప్పుడు వినిపించింది. చప్పున వంగి, అతణ్ని వెల్లకిలా తిప్పేను. అప్పుడు కనబడిన దృశ్యాన్ని - ఆ తరువాత చాలాకాలం వరకూ మర్చిపోలేకపోయేను అతడి మొహం అంతా నుజ్జు నుజ్జు అయిపోయి వుంది. ముక్కులోంచి రక్తం స్రవిస్తూంది. చేతులమీద లాఠీల్తో కొట్టినట్లు నల్లగా వాతలు తేలినయ్. ఈ అరగంటలోనూ ఈ వృద్దుణ్ని వాళ్ళు చాలా ఘోరమైన చిత్రహింసకు గురిచేసి వుండాలి. నా కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగేయి. ప్రపంచంలోని విజ్ఞానమంతా వ్యక్తులు నిర్మించుకున్న సిద్దాంతాల విభేదాలవల్ల జైళ్ళల్లో మగ్గిపోతోంది.
