"మీ ఆయన స్నానానికి వెడుతూంటే మీరు తువాలు పట్టుకొని బాత్ రూమ్ దగ్గర తయారుకావడం, ఆయన స్నానంచేసి డ్రాయరు వదిలేసి వెడితే ఉతికి ఆరవేయడం, ఆయన లెట్రిన్ కి వెడితే నీళ్లు పోయడం - కడగడం ఒకటి తక్కువగా.... ఇహ భోజనాలు, టిఫిన్ లు ఆయన అభిరుచులకనుగుణంగా స్పెషల్ గా అత్తయ్యకు చెప్పి చేయించడం, ఆయన్ని ఇంద్రుణ్ణో చంద్రుణ్ణో చూసినట్టుగా చూడడం - మిమ్మల్ని మీరు బానిసగా చేసుకొన్నారా, అన్నగారు మిమ్మల్ని మార్చారా అన్నది నాకు అర్దం కాకుండా వుంది?"
"మగడి అవసరాలు చూడడం, పని చెయ్యడం బానిసత్వమా? క్రొత్తగా వింటున్నాను!"
"మగడి అవసరాలు చూడడం, పని చెయ్యడం వాటికీ ఓ హద్దుంటుంది వదినా! ఆయన స్నానం చేస్తూంటే బాత్ రూం గుమ్మంలో తువాలు పట్టుకుని నిల్చోవడం. ఆయన రాజావారిలా కట్ డ్రాయర్ వదిలివెడితే నువ్వు ఉతికివేయడం. ఏం ఆ ఒక్క గుడ్డా ఆయన ఉతికేసుకోకూడదా? ఆయన అంత చిన్న పనికూడా తను చేసుకోకుండా మీ చేత చేయించడం భార్యను ఏ మాత్రం గౌరవించేదీ తెలిసిపోతుంది! భార్య ధర్మం పేరుతో ఎంత నీచమైపోయింది స్త్రీ బ్రతుకు అనిపిస్తూంది నాకు!"
"పెళ్లయిన కొత్త కాబట్టి అన్నయ్య నిన్ను మురిపెంగా చూస్తున్నాడు. పాతబడ్డాక నువ్వూ మాలాంటి ఆడదానివి కాకపోత్ అప్పుడు చూడనా?"
"ఒక మగవాడికి భార్యగా వుండాలంటే, అంత నీచంగా బ్రతకాల్సివస్తే, ఆ భార్యస్థానం నాకొద్దు అంటాను. కాని భార్యపేరుతో బానిసగా మాత్రం బతకను. మీరు చూసేది అదే!" శాలిని చాలా సీరియస్ గా చెప్పింది? "అవునూ! ఇందాక వదినగారితో అన్నట్లు నా బట్టలు నీ చేత ఉతికిస్తాననే బట్టలుతకమని చెప్పలేదా?" అనడిగింది భర్తను.
"నా బట్టలు నువ్వు ఉతకొచ్చు. నీ బట్టలు నేను ఉతకొచ్చు. కానీ, నీ బట్టలు నేనుతికితే చూసేవాళ్లకు బాగుండదు!వాల్ల దృష్టిలో నేనో విచిత్రంగా మారడం నాకిష్టంలేదు!"
"నువ్వు కట్నం వద్దన్నప్పుడూ పూలదండల పెళ్లిచేసుకొన్నప్పుడూ విచిత్రంగానే చెప్పుకొన్నారు కదా జనం.
"ఆ విచిత్రంలో ప్రశంస వుంది. ఈ విచిత్రంలో హేళన వుంటుంది. ప్రజల హేళన భరించవలసిన అసరం రానంత వరకూ మార్పును ఆహ్వానిస్తాను."
"ఒకనాడు బాల్యవివాహాలు వ్యతిరేకించినప్పుడూ, విధవా పునర్వివాహాలు ప్రోత్సహించినప్పుడూ హేళనలే ఎదుర్కొన్నారు ఆనాటి సంఘ సంస్కర్తలు!"
"పెళ్లాం చీరలుతకడం సంఘసంస్కరణ కాదుగా?"
"స్త్రీ పురుష సమానత్వాన్ని ఆహ్వానించడం ఒక విధంగా సంఘసంస్కరణే కృష్ణా!"
"మగవాడు భార్య చీరలుతకడం, వంటచేసి వడ్డించడం, పక్క వేయడం- ఇవిచేస్తే స్త్రీ పురుష సమానత్వం వచ్చేసినట్టూ శాలినీ?" శర్మ ముఖంలో నవ్వు మాయమై సీరియస్ నెస్ చోటుచేసుకుంది.
"స్త్రీ వ్యక్తిత్వం జోలికి పోకుండా వుండడం, ఆమె అభిప్రాయాలను గౌరవించడం, ఆమె ఆదర్సాలను మన్నించడం -స్త్రీ పురుష సమానత్వాన్ని గౌరవించడమని నా ఉద్దేశ్యం! అంతేగాని, నీకు వంటచేసి పెడితే, నువ్వూ నాకువంటచేసిపెట్టాలి. నీ బట్టలు నేను ఉతికితే నా బట్టలు నువ్వెందుకు ఉతకవని, నేను పిల్లల్ని కంటాను నువ్వెందుకు కనవని అంటే స్త్రీ పురుష సమానత్వం అది కాదని నేనంటాను. ఇలా అడుగడుగునా ఫైట్ చేస్తూ వున్నావంటే మనం ఆలూ మగలంగా వుండము. చండీ మొండీ అంటారే! అలా అవుతాం"
"నేను పిల్లల్నికంటే నువ్వెందుకు కనవని మరీ అంత తెలివి తక్కువగా ఫైట్ చేయనులే! కాని, నాకు న్యాయమనిపించినదానికోసం తప్పకుండా ఫైట్ చేస్తాను."
"ఆలూ మగలమధ్య ఉండాల్సింది ఫైట్స్ కాదు. అవగాహన, అనురాగం."
"దాంపత్య జీవితంలో అడుగుపెట్టానుకదా? ఇక నేర్చుకొంటాను పాఠాలు! నా చీరలు ఉతికిస్తానని భయపడొద్దుగాని ఇలా ఇవ్వు, ఉతుకుతాను! నువ్వు గలబరించు" శాలిని కొంగు నడుముకుచుట్టి కుచ్చిళ్లు పైకి దోపి బట్టలదగ్గరికి వెళ్లింది.
"ఆలుమగలు ఆడుతు పాడుతు పనిచేస్తుంటే మధ్యలో నేనేమిటి పానకంలో పుడకలా!" అనుకొని వెళ్లిపోయింది బృందావని.
"ఇన్ని బట్టలు ఒక్కడివే ఉతుక్కునేబదులు నన్ను పిలువకూడదూ సాయం చేయమని."
"పెళ్లికాక ముందు ఉతుక్కునేవాడిని కదా?"
"అప్పుడూ, ఇప్పుడూ ఒక్కటేనా?" అల్లరిగా చూస్తూ చేతుల్లో వున్న నురగతీసి శర్మ ముఖంమ్మీద విదిలించింది.
