Previous Page Next Page 
ది ఎడిటర్ పేజి 48


    చిన్నగా నవ్వాడు బ్రహ్మచారి.
    మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు ఉదయార్కర్.
    మూడు వారాల క్రితం జరిగిన ఆ సంఘటన అతనికి ఇంకా కళ్ళకు కట్టినట్లే కనబడుతుంది.
    ట్రాప్ లో ఇరుకున్న తన కాలికి చాలా పెద్ద గాయం అయింది. ట్రాప్ లో నుంచి తనని తప్పించి దగ్గరలోనే ఉన్న ఒక మూలిక తాలూకు పసరు తనకి పూసాడు బ్రహ్మచారి.
    అప్పుడు హటాత్తుగా చెట్ల చాటు నుంచి బయటికి వచ్చాడు ఒక లంబాడీ. జరిగినదానికి విచారం ప్రకటించి తనతో రమ్మన్నాడు గాయం తగ్గేదాకా తన ఇంట్లో ఉండమని కోరాడు.
    ఆ లంబాడీ అతను మాట్లాడుతుండగానే, తుమ్మల బయలు జాతరకి వచ్చిన ఒక చెంచు యువకుడు వాళ్ళవైపు రావడం మొదలెట్టాడు.
    అతన్ని చూడగానే లంబాడీ మోహంలో రంగులు మారాయి.
    "దొరా! అదిగో! ఆ చెంచు మనిషి వస్తున్నాడు ఇక్కడికి. అతను మిమ్మల్ని తనతో వచ్చి తన ఇంట్లోనే ఉండమని అడుగుతాడు. కానీ దొరా! నేనే ముందు చూసిన! నేనే ముందు మీతో మాట్లాడిన! నేనే ముందు మిమ్మల్ని మా ఇంటికి రమ్మని అడిగిన! అందుకని మీరు ముందు మా తండాకే రావలె. మా తేనే ఒక్క దినం ఉండాలే. కదన వద్దు దొరా!" అన్నాడు చాలా అభిమానంగా, చాలా అమాయకంగా.
    ప్రాణాలు కడబట్టిపోయేంత బాధని అనుభవిస్తున్నా తనకి ఆశ్చర్యం కలిగింది అతని మాటలు వింటుంటే.
    ఎక్కడ బంధువులు వచ్చి ఇంటిమీద పడతారో అని హడలి చచ్చిపోయే పట్నవాసపు మనుషులు మధ్య పెరిగాడు తను.
    అలాంటిది ---
    తమ ఇంట్లో ఆతిధ్యం స్వేకరించాకుండా వెళ్ళిపోతారేమో అని తల్లడిల్లిపోతున్నాడు ఈ ఆటవికుడు. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఆతిధ్యం ఇచ్చే అవకాశం కోసం తపించిపోతున్నాడు.
    చాలా చిత్రంగా వుంది ఇది!
    లంబాడీ అతను అలా ప్రాధేయపడుతుండగానే ఆ చెంచు మనిషి దగ్గరికి వచ్చాడు.
    "వారేవా! లంబాడీ మొనగాడు అప్పుడే పట్టేశాడా మిమ్మల్ని!" అని నవ్వి "సరే! వాళ్ళ తండాలో ఒకరోజు వున్న తర్వాత మిమ్మల్ని నేను మా గూడేనికి తీసుకెళతాను. ఇంతకీ ఏ పట్నం దొరా మనది?" అన్నాడు సాదరంగా.
    చెప్పాడు బ్రహ్మచారి.
    తర్వాత లంబాడీ అతనూ చెంచు మనిషి ఇద్దరూ కలిసి కూడాబలుక్కుని తనని చేతులమీద మోస్తూ లంబాడీ తండాకీ తీసుకెళ్ళారు.
    తను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు చెంచు మనిషి.
    ఆగంతుకుల అలికిడి వినగానే లంబాడీ అతని భార్య, అతని కూతురు బయటికి వచ్చారు. అతిదులని చూడగానే వాళ్ళ మొహాలు సంతోషంతో వికసించాయి.
    లంబాడీ స్త్రీ లోపలికి వెళ్ళి చిన్న బిందేలా ఉన్న చెంబుతో నీళ్ళు తెచ్చి ఇచ్చింది. తనని ఒక మంచం మీద పడుకోబెట్టారు లంబాడీ అతనూ అతని భార్యా కలిసి. మిగతా వాళ్ళంతా కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చారు.
    తర్వాత తమకోసం జొన్నలూ, పెసరపప్పు కలిపిన పులగం తయారయింది.
    అందరూ దాన్ని తింటున్నంత సేపూ లంబాడీ అతను అక్కడే కూర్చుని , తను ఎవరో, తన తల్లిదండ్రులు ఎవరో , తాతముత్తాతలు ఎవరో , ఏడు తరాల వరకూ ఏకరవు పెట్టాడు.
    అతను చెబుతున్నంతసేపూ అక్కడే గుంజను అనుకుని నిలబడి వింది అతని కూతురు - తోజోది. పదిహేడు, పద్దెనిమిదేళ్ళు ఉంటాయి ఆ అమ్మాయికి. అసలే పెద్దవయిన తన కళ్ళని మరింత విప్పార్చి చూస్తూ వింటోంది ఆమె.
    ఆమెకి ఉన్నంత అందమైన ముక్కుని తను ఎక్కడా చూడలేదు ఇంతవరకూ!
    ఎక్కడా! ఎప్పుడూ కూడా!
    తండ్రి తన కుటుంబం తాలుకు వివరాలన్నీ చెబుతున్నప్పుడు తన పేరు రాగానే మనునెగ్గుతో తలపక్కకి తిప్పుకుంది తేజోది. ఆమె పెదిమలు అతికొద్దిగా విప్పారి అతి తెల్లటి పలువరుస అందంగా మెరిసింది.
    తేజోది!
    చిత్రమైన పేరు.
    తేజవతికి అది అప్రభ్రంశం అయి ఉండవచ్చా?
    ఏమో?
    ఈ కీకారణ్యలలో ఇంతటి అందగత్తె వుంటుందని ఎవరన్నా ఊహించగలరా అసలు.
    అడవి గాచిన వెన్నెల అంటే ఇదేనా?
    తనలో ఉన్న రచయిత మేల్కొన్నాడు. ఈ అపురూపమైన అందాన్ని ఏ పదాలతో కాగితం మీదకి ట్రాన్స్ ఫర్ చెయ్యగలనా అని ఆలోచించడం మొదలెట్టింది తన మనసు.
    తేజోది!
    తేజోది
    తన ఆలోచనలు అలలు అలలుగా ఆమెని తాకినట్లు ఆమె కొద్దిగా కదిలి, తర్వాత నెమ్మదిగా లోపలికి తప్పుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS