Previous Page Next Page 
ఇదీ కధ! పేజి 48


    "ఓ! ష్యూర్! ఏం చేయమంటారు."
    మాధవిని చూడడానికి వచ్చినప్పుడు సాగర్ ను పిలిపించి మాట్లాడండి. మాధవి స్థితి పూర్తిగా చెప్పండి. ఆమె నుంచి అతడి మనసు తిప్పే ప్రయత్నం చేయండి. సాగర్ తల్లి, తండ్రి వున్న స్థితి తెలియచేయండి. మాధవికి ఈ జన్మలో ఆ పిచ్చి కుదరదనే నమ్మకం సాగర్ కు కలిగితే అతడి భ్రమలు వీడిపోతాయి. ఇంటికి వచ్చేస్తాడు. ఇది మీరొక్కరే చేయగలిగిన పని. సాగర్ తల్లిదండ్రులు మీకు ఎంతో ఋణపడి వుంటారు."
    "స్నేహ ధర్మాన్ని పాటించే మీరు ఇంత శ్రమ తీసుకుంటున్నారా?" పరిమళ ఆశ్చర్యంగా అన్నది.
    "నిజం చెప్పాలంటే ఇందులో నా స్వార్థం కూడా కొంత లేకపోలేదు. అమ్మాయ్ పరిమళా! నిన్ను నాకన్నకూతురులా భావించి చెప్తున్నాను. నాకు ఒక్కతే ఆడపిల్ల. అదీ తల్లి లేని పిల్ల. అది మూడునెలల వయసులో వుండగా నా భార్య మరణించింది. ఆ పసిగుడ్డును నా గుండెలమీద పెంచుకొన్నాను. అది ఈ సాగర్ ను ప్రేమించింది. సాగర్ మళ్ళీ మాకు దక్కకపోతే మా రెండు కుటుంబాలు సర్వనాశనమయి పోతాయి. వాడిని చూస్తే ఆ పిచ్చిదాని మైకంలో పడి పిచ్చివాడయి పోతున్నాడు" డాక్టర్ మూర్తి కాఫీ కప్పులతో వచ్చిన ఆయాను చూసి ఆగిపోయాడు.
    "అదేమిటి ఆయమ్మా? అలా చూస్తూ నిలబడిపోయావేం? డాక్టర్ గారికి కాఫీ ఇవ్వు!" ఆయమ్మను పరిమళ మందలించింది.
    కాఫీ కప్పు అందిస్తున్న ఆయమ్మ చెయ్యి వొణికింది. అందుకొంటున్న డాక్టర్ మూర్తి చెయ్యి పట్టుతప్పింది. కప్పు గచ్చుమీదపడి బద్దలయింది. కాఫీ తొణికి డాక్టర్ మూర్తి చొక్కాపైన పడింది.
    "ఫూల్! ఇడియట్!" పరిమళ ఆయమ్మను కేకలు వేసింది. లేచివెళ్ళి డాక్టర్ మూర్తికి టవల్ తెచ్చి అందించింది.
    "ఇంకా ఏం చూస్తున్నావ్? పో! వెళ్ళి ఇంకో కప్పు కాఫీ కలిపి పట్టుకురా" ఆయమ్మను గద్దించింది డాక్టర్ పరిమళ.
    డాక్టర్ మూర్తి కాఫీ మరకలు తుడుచుకొని టవల్ పరిమళకు అందించాడు. తెల్లటి చొక్కామీద అసహ్యంగా కనిపిస్తున్న మరకలు చూస్తుంటే పరిమళకు డాక్టర్ మూర్తి మీద సానుభూతి కలిగింది. ఆయమ్మ మీద కోపం వచ్చింది.
    "ఐయామ్ సారీ సార్!" అన్నది.
    "మీరు బాధ పడొద్దు. హోటల్ కెళ్ళి చొక్కా మార్చుకుంటాను. అవును_మీ పనిమనిషి _ అదే వంట మనిషి _ పేరేమిటన్నారు, ఆయమ్మ కాదూ? చాలా విచిత్రమయిన మనిషిలా ఉన్నది. మీరు రాకముందు కూడా చాలా తమాషాగా ప్రవర్తించింది!"
    "చాలా మేధకురాలు. మంచిది కూడాను. మరి ఈ రోజు ఎందుకిలా ప్రవర్తించిందో నాకు అర్థం కావడం లేదు"
    "వంట్లో బాగాలేదేమో!"
    "ఇంకా నయం, మెదడులో సరిగా లేదేమోనన లేదు!" పరిమళ నవ్వుతూ అన్నది.
    "నిజం చెప్పాలంటే నా అభిప్రాయం అదే!"
    "డాక్టర్!"
    "అవును! ప్రతిరోజూ పిచ్చివాళ్ళను చూసే మీకు మీ ఇంట్లో మనిషిని మతి తప్పినా మీరు గుర్తుంచలేదు. ఇంకా మొదటి దశలోనే ఉన్నది. మీ హాస్పిటల్ లో చేర్పించి చెక్ చేయించడం మంచిది."
    "మూర్తిగారూ! మీరేమంటున్నారూ?"
    "అదే! సింపుల్ మీ ఆయమ్మకు పిచ్చి పట్టింది. మీరొచ్చేముందు ఏవేవో మాటలు మాట్లాడింది, తర్వాత ఆమె వాలకం ఎలా ఉందో మీరే చూశారుగా!"
    "ఇంకొంచెంసేపు మీతో మాట్లాడితే ముందు నాకు పిచ్చి పట్టేట్టుంది" పరిమళ చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి.
    డాక్టర్ మూర్తి పెద్దగా నవ్వసాగాడు.
    "ప్లీజ్ స్టాపిట్! దయచేసి నవ్వాపండి!"
    డాక్టర్ మూర్తి ఇంకా పెద్దగా నవ్వుతూ లేచి అడుగు ముందుకు వేశాడు.
    పరిమళ ముఖం పాలిపోయింది.
    "మై డియర్ చైల్డ్! ఎందుకు ఖంగారు! రిలాక్స్ యువర్ సెల్ఫ్! ఆయమ్మను గురించి నువ్వు ఆదుర్దాపడవద్దు! మీ బాస్ తో మాట్లాడతాను. నీకు మంచి వంటమనిషిని చూసి పెడతాను."
    "ఇంకా నయం! వంటచేసి పెడతానన్నారు గాదు!"
    "ఓ.కే. నువ్వు కావాలంటే అదీ చేస్తాను!"
    "ఏమిటీ! మీరు వంట చేస్తారా?" పరిమళ క్రింది పెదవి నొక్కుకుంది.
    "నో! నో! జస్ట్ ఏ జోక్! నువ్వు మా ఆయమ్మను వదిలి ఉండలేవని తెలిసి అలా అన్నాను. ఇంతకీ ఆమె ఎవరూ? ఏ ఊరూ?" అంటూ డాక్టర్ మూర్తి మళ్ళీ కూర్చున్నాడు. లేచినవాడు అలాపోక మళ్ళీ కూర్చోవడం పరిమళకి చికాకు కలిగించింది. డాక్టర్ మూర్తి ఆయమ్మ గురించి ఎందుకు ఆరాలు తీస్తున్నాడూ? మూర్తిని చూడగానే ఆయమ్మ ఇలా ఎందుకు అయిపోయింది? మాధవి గురించి సాగర్ చెప్పినదంతా మననం చేసుకొన్నది పరిమళ. సాగరూ_ మాధవీ_ మూర్తీ కథలో యీ ఆయమ్మేమిటి పానకంలో పుడకలా. పరిమళ తన చిరాకును కప్పిపుచ్చుకుంటూ చిరునవ్వుతో డాక్టర్ మూర్తి కేసి చూసింది.
    "అసలు ఆయమ్మదే వూరో నాకు తెలియదు. నాకు ఊహ తెలిసిన దగ్గర్నుంచి మా ఇంట్లోనే ఉన్నది. ఇంట్లో మనిషిగానే ఉన్నది. మా అమ్మ నాన్న ఆమెను చాలా గౌరవంగా చూసుకొంటారు. నన్ను ఆయమ్మే పెంచింది. చిన్నప్పుడు మేమంతా ఆమెను 'ఆయమ్మ' అని పిలిచేవాళ్ళం. చివరకు ఆమెకు ఆ పేరే స్థిరమైయింది. వాస్తవానికి ఆమె అసలు పేరేమిటో నాకు తెలియదు, ఏ వూరో అసలు తెలియదు." పరిమళ ఆగి డాక్టర్ కేసి చూసింది. డాక్టర్ మూర్తి నొసలు ముడిపడి ఉన్నాయి.
    "ఏమిటి? ఆలోచిస్తున్నారూ?"
    డాక్టర్ మూర్తి ఉలిక్కిపడ్డాడు! అంతలోనే సర్దుకొని_
    "అబ్బే ఏమీ లేదు! ఆయమ్మ కథ చాలా మిస్టీరియస్ గా ఉంటేను?" అన్నాడు మూర్తి.
    "ఆయమ్మ మీకేమయినా__?" పరిమళ ప్రశ్న కొరడా దెబ్బలా తగిలింది డాక్టరు మూర్తికి.
    "వాట్ డూ యూ మీన్?" మూర్తికంఠం తీవ్రంగా ఉన్నది.
    "పోనీ ఆమె మీకు తెలుసా?"
    "నో! నో! నాకు తెలియదు!"
    "పోనీ, లోగడ ఎక్కడన్నా చూశారా?"
    "డాక్టర్ పరిమళా?"
    పరిమళ అదిరిపడింది! అతని కళ్ళు చూస్తుంటే ఆమెకు వణుకు పుట్టింది.
    "ఏమిటో చాలా క్రాసు ఎక్జామిన్ చేస్తున్నావ్?" డాక్టర్ మూర్తి గొంతు మారిపోయింది.
    పరిమళ కలవరపడింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS