Previous Page Next Page 
మారణహోమం పేజి 48

 

    అలా కళ్ళు పీకేయ్యబడ్డ వాళ్ళెవరూ కూడా ఆ తర్వాత ఎక్కువ రోజులు బతకడం లేదు.'
    "ఇదంతా ఎలా తెలిసింది?"
    "పరమేశ్వర్ అని ఆ హాస్పిటల్ లోనే పనిచేసే ఒకతను ఉన్నాడు. అతనికి అనుమానం వచ్చింది. హాస్పిటల్ నుంచి బయటకు వెళ్తున్న శవాల్లో చాలావాటికి కళ్ళు ఎందుకు ఉండడం లేదని . తర్వాత విషయాలు జాగ్రత్తగా గమనిస్తే అసలు సంగతి బయటపడింది.
    పరమేశ్వర్ మనకి రెగ్యులర్ గా ఇన్ఫర్మేషన్ అందజేస్తూ ఉండే మనుసుషుల్లో ఒకడు."
    నిఖిల్ అన్నాడు "మనకి ఇన్ఫర్మేషన్ అందించేవాళ్ళకి పుష్కలంగా డబ్బు ముట్టజేబుతూ ఉండు. వాళ్ళ సాయం లేకపోతె మనం ఒక్కడుగు కూడా ముందుకు వెయ్యలేం. ఏ విషయములోనైనా సరే! ఓకె!
    ఇంతకీ రాధ తండ్రి విషయం ఏమయింది? అయన ఇంకా ఆ ఇన్ స్టిట్యుట్ లోనే ఉన్నాడా?" అని ఏదో స్పురించినట్లు నుదురు చిట్లించాడు "లేక.............."
    అతని అనుమానాన్ని నిర్ధారణ చేస్తున్నట్లు తలపంకించాడు రాజు.
    "అవును! ఆయనకి కళ్ళు పీకేశారు. గుడ్డివాడయిపోయాడాయన! గుడ్డి పిచ్చివాడు!"
    "షిట్! అన్నాడు నిఖిల్ కోపాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ.
    "అయన ఇంకా ఆ ఇన్ స్టిట్యుట్ లోనే ఉన్నాడు. మనం పూనుకొని బయటికి తీసుకురాకపొతే అయన ఎక్కువ రోజులు బతకకపోవచ్చు. బతికినా చచ్చినా అసలు పట్టించుకునేవాళ్ళెవరు? పిచ్చివాడిని పోషించడానికి ఎవరు తయారుగా ఉంటారు? ఆ వీక్ పాయింటునే ఆధారం చేసుకుని ఈ ఘాతుకాలు చేస్తున్నారు కొంతమంది. అన్ని దానాలకంటే గొప్పదయినా నేత్రదానాన్ని , నెత్తుటి కూటికోసం కక్కుర్తి పడి వ్యాపారంగా మారుస్తున్నారు."
    "ఈ మధ్య బీహార్ లో కూడా ఒక మెంటల్ హాస్పిటల్ లో ఇలాగే జరిగింది! అవునా?" అన్నాడు నిఖిల్.
    అవునన్నట్లు తలపంకించాడు రాజు.
    "ఇవన్నీ రాధకి తెలిశాయా?"
    "రాధ వింటూ ఉండగానే చెప్పేశాడు పరమేశ్వర్. వారించే వ్యవధి లేకపోయింది. " నిఖిల్ ఏమీ మాట్లాడకుండా చూశాడు.
    "మీరు ఓకె అంటే నేను వెళ్ళి........."
    "వద్దు! నేనే వెళతాను" అన్నాడు నిఖిల్.
    ఇద్దరూ రాధ ఉన్న గదిలోకి వచ్చారు. అతన్ని చూడగానే పరిగెత్తుకు దగ్గరికి వచ్చి చుట్టేసుకుంది రాధ. ఇందాకటి నుంచి దుఖం అపుకోవాలని ఆమె చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమయిపోయాయి.
    గుండెలు తరుక్కుపోయేటట్లు రోదిస్తోంది ఆమె.
    ఆమె వెన్ను నెమ్మదిగా నిమిరాడు నిఖిల్.
    "రాదా! జరిగిపోయిన దానికి ఇంక మనం ఏమీ చెయ్యలేం. ఇకముందు ఇంకా ఇలాంటివి ఏమీ జరగకుండా చూడాలి! ధైర్యంగా ఉండు రాదా! నేను వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తాను."
    "మీరు వెళ్ళి తీసుకోచ్చేదాకా నాన్నగారు బతికి ఉంటారంటారా?" అంది రాధ. అతని షర్టుకి తన మొహాన్ని రుద్ది కన్నీటిని తుడుచుకోవాలని వ్యర్ధ ప్రయత్నం చేస్తూ "నాకు నమ్మకం లేదు నిఖిల్! నేనూ మీతోబాటే వచ్చి నాన్నగారిని ఒక్కసారి చూడాలని ఉంది?"
    "వద్దు రాదా! రేపొద్దునలోగా మీ నాన్నగారు ఇక్కడ ఉంటారు."
    "అసలు ప్రాణాలతో బ్రతికి ఉంటె - లేకపోతే ఆయన్ని చివరిసారిగా కూడా చూడలేనేమో! నేనూ వస్తాను నిఖిల్! ప్లీజ్!" అంది చిన్నపిల్లలా అతన్ని మరింత గట్టిగా పట్టేసుకుని.
    ఆమె మొహంలోకి చూశాడు నిఖిల్. ఆ అమ్మాయికి పంతోమ్మిదేళ్ళ కంటే ఎక్కువ వుండవు.
    తనకంటే కనీసం ఏడెనిమిదేళ్ళు చిన్నదయిఉంటుంది ఈ అమ్మాయి.
    అయినా తనని పేరుపెట్టి పిలుస్తోంది "నిఖిల్"ట!
    పరిశీలనగా ఆమె మొహంలోకి కొద్ది క్షణాలు చూసి తర్వాత "సరే పద!" అన్నాడు.
    ఏడుపు దిగమింగి, మళ్ళీ ఒకసారి అతని షర్టు స్లీవ్ కి మొహం ఆనించి, కన్నీటిని అతని షర్టు బ్లాటింగ్ పేపరులా పీల్చేశాక తలఎత్తి అతని కళ్ళలోకి కృతజ్ఞతా పూర్వకంగా చూసింది రాధ.
    "థాంక్స్ నిఖిల్!"
    మళ్ళీ నిఖిల్!
    తన పేరును ఉచ్చరించడానికే గడగడలాడిపోతారు జనం! అలాంటిది ఈ అమ్మాయి ఎందుకు ఆ పేరుని కలవరిస్తున్నట్లు పదే పదే పలుకుతుంది?
    రాధతో కలిసి బయటికి వచ్చాడు నిఖిల్. క్రీనీడలో నిలిపి ఉన్న నల్లటి అంబాసిడర్ కారు ఎక్కారు ఇద్దరూ.
    చాలాసేపటి తర్వాత ఊరి శివార్లలో ఉన్న ఆ మెడికల్ ఇన్ స్టిట్యుట్ కి చేరుకుంది కారు.
    దిగులుగా ఉంది అక్కడి వాతావరణం. ఒక సింగల్ బల్బు నీరసంగా వెలుగుతూ పసుపచ్చ కాంతిని బలహీనంగా పరుస్తోంది.
    రిసెప్షన్ ఆఫీసులో ఒకతను కూర్చుని జోగుతున్నాడు.
    రూడ్ గా అతని భుజంమీద తట్టాడు నిఖిల్.
    "మిస్టర్ ! లే!" ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు అతను.
    "ఏం కావాలి?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS