కృష్ణసంబంధి కథలను, నారసింహ విలాస కథ, కృష్ణనాటకం, పారిజాతపహరణం, చెంచునాటకం, శ్రీరుక్మిణీ నాటకం, గోపికానాటకం అనే యక్షగానాలుగా, రమా పరిణయం అనే పెళ్ళిపాటగా రచించిన వెంగమాంబ మనసుకి తృప్తిలేదు. ఎక్కడో పరిపూర్ణతలోపించిందన్న భావన. ఇప్పటివరకు తానుచేసినదంతా చెయ్యవలసిన పనికోసం చేసిన అభ్యాసం మాత్రమే. చెయ్యి తిరగటం కోసం చేసిన సాధన. రచన లోపరహితంగా సాగటానికి చేసిన కసరత్తు. వ్యాసుడు సరస్వతీనదీతీరంలో పొందిన నిర్వేదం వంటిది వెంగమాంబని తపింప చేసింది. ఎందుకు తృప్తినివ్వటంలేదు? అని తనరచనలను నెమరువేసుకుంది.
"అటుగాన నారసింహాంకితశతక
మటమీద నారసింహవిలాసకథయు
నటశివనాటకంబదియునుగాక
నటరాజయోగ సారాఖ్య సద్ద్విపద
నటకృష్ణనాటకంబదియునుగాక
నటపారిజాతాపహరణ సత్కృతియు
నట రమాపరిణయంబను పెండ్లిపాట
యట చెంచు నాటకంబను నొక్క కథయు
మఱియును శ్రీకృష్ణమంజరి యవల
నిరుపమ శ్రీరుక్మిణీ నాటకంబు
కరమొప్పునల గోపికానాటకంబు
విరచించి భక్తితో వేంకటశైల
వరమందు తరిగొండ వాసుడైనన్ను
పరిపాలనముసేయు ప్రభువైతనర్చి
కరుణార్ద్ర దృష్టితో గడతేర్తువనుచు
సరస విజ్ఞాన లక్ష్యము నిచ్చినట్టి
శ్రీనివాసస్వామి శ్రీపాదములకు
బూనియర్పించి తిప్పుడు సంతసమున...
... ... ... ... ..."
ఇప్పుడు సంతసమున ఏం చెయ్యాలి?
ఆలోచన తెమలక గంటం పక్కన పెట్టి కళ్ళు మూసుకుని కూర్చుంది వెంగమాంబ. ఎంతసేపు అలా కూర్చుందో తెలియదు. శేషశైలవాసుని సుప్రభాత సేవకి వెడుతున్న భక్తజన సందోహం కలకలంతో ధ్యాన భంగమైంది. ఒక భక్తుడు గొంతెత్తి కమనీయంగా పాడుతున్నాడు పోతనగారి భాగవతంలోని మొదటి పద్యం.
శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకర
క్షైకారంభకు భక్త పాలన కళాసంరంభకున్ దానవో
ద్రేకస్తంభకు కేళిలోల విలస ద్దృగ్జాల సంభూతనా
నాకంజాతభవాండకుంభకు మహానందాంగనా డింభకున్"
వెంగమాంబకి ఇప్పుడు సంతసమున చేయవలసిన కర్తవ్యం బోధపడింది. గంటం చేతబూనింది. తానింతకు ముందు రచించిన గ్రంథాలన్నింటికి
"ఫలితార్థమైన శ్రీభాగవతంబు
నలప్రథమస్కంధ మాది జేసికొని
క్రమముగా ద్వాదశ స్కంధముల్ వరుస
నమర రచియింతు నంటి నాస్వామి"
అంటూ బాసచేసి తానూ స్వామి సుప్రభాత సేవకు సిద్ధం కాజొచ్చింది.
బాస అయితే చేసింది కాని తానంతటి బృహత్కార్యాన్ని నిర్వహించగలదా? అన్న ఆలోచన తన నిత్యకృత్యాలు నిర్వర్తిస్తున్నంత సేపూ మనసులో మెదులుతూనే ఉంది.
కాని కృత నిశ్చయురాలై తాటియాకులవద్ద కూర్చొని తన ఇష్ట దైవాన్ని తలచి గంటం చేతపట్టింది. అది చకచకాసాగింది.
"ఆనాడు పోతరాజాత్మయందుండి
నానార్థసార నిర్ణయవాక్యములను
బలికించినటువంటి పట్టాభిరాముఁ
డలర నా మీద నేఁడభిమానముంచి
చెలువొప్ప నెపుడునా జిహ్వయందుండి
పలకించినటులనేఁబల్కి తత్కృతిని
శ్రీతరిగొండ నృసింహడనంగ
ఖ్యాతిగా వెలయు వేంకటగిరీశ్వరుని
పదయుగళికి సమర్పణము చేసెదను."
... ... ...
నిరాఘాటంగా పట్టాభిరాముడు పలికించిన తీరులో ద్విపద భాగవత రచన కొనసాగింది.
అపరశుకమహర్షి, అపర పోతన అని అందరూ మెచ్చుకొంటుండగా, శిష్యపరంపర తామరతంపర అయ్యింది. మఠానికి వచ్చేవారి సంఖ్య, భాగవతం వినేవారి సంఖ్య, ప్రతులు వ్రాసేవారు, వ్రాయించుకొనేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోయింది. భక్తి, శృంగార, వైరాగ్య భావాలు ముప్పేటగా సాగిరచన సర్వజనరంజకతను సంతరించుకుంది.
* * *
పుట్టుకతో, ఎవరి ప్రేరణ లేకుండానే, సహజాతంగా వెంగమాంబలో ఉన్న ప్రతిపత్తిభావం, విశిష్టాద్వైత పరిచయంతో బలోపేతమై స్థిరపడింది. దానితో వెంగమాంబ మనఃపరిపక్వతను పరమ ప్రసన్నతను పొందింది. ఆళ్వారుల స్థాయికి చేరుకుందని పరమభాగవతోత్తములైనవారు అనుకోటం కొంతమంది వీరవిశిష్టాద్వైతులకి నచ్చలేదు.
"వారక మానందవర కులబిలను
సారంబుగాఁ బ్రోచు చౌడాంబఁదలచి...
అని శక్తి ఆరాధన వీడనప్పుడు వెంగమాంబ విశిష్టాద్వైతి ఎట్లా అవుతుంది" అని ఒక తిరునామాల వైష్ణవస్వామి సందేహం వెలిబుచ్చాడు.
"ఆళ్వారులంతటి దంటున్నారు ఎంతపాపం! మరెంత ఘోరం?" విసుక్కున్నాడొక మధ్య వైష్ణవుడు.
"రామానుజస్వామికి ద్రోహం చేస్తున్నారు వీరంతా!"
"కులదైవాన్ని నిరసించమని పరమగురువులు బోధించారా?" ఒక వివేకి ప్రశ్నించాడు.
"తాళ్ళపాక వారూ నందవరీక శాఖకు చెందిన వారే! వారికీ చౌడీశ్వరీదేవి ఇలవేల్పు అయి ఉండాలి కదా! వారు విశిష్టాద్వైతం స్వీకరించాక చౌడేశ్వరిని వదిలేశారుకదా!"
"పిచ్చివాడా! వదిలేశారనటం తప్పు. మనకు లభించిన కీర్తనలలో ఆపేరు లేదంతే! లభించనివి ఎన్నో ఉన్నాయికదా! వాటిలో చౌడేశ్వరిదేవిని స్తుతించి ఉండవచ్చు."
"నమ్మకం ఏమిటి?"
"స్తుతించక పోనూ వచ్చు. అంతమాత్రాన వదిలిపెట్టారన కూడదు. అయినా తాళ్ళపాక అన్నమాచార్యులు శ్రీశ్రీశ్రీ ఆదివణ్ శఠకోపయతి వద్ద విశిష్టాద్వైతదీక్ష స్వీకరించారు. వారి కుటుంబంలో శ్రీవైష్ణవం ప్రవేశించింది. వెంగమాంబగారికి ఎవరైనా దీక్షనిచ్చారా?"
