Previous Page Next Page 
యువత నవత పేజి 47

   
    సింపుల్ గా రిజిష్టర్ మారేజ్ చేసుకొంటామని శర్మ చెప్పడంవిని, శాలిని తల్లిదండ్రులు ఎగిరి గంతేయలేదు.

     "అది నీ ఆదర్శం. కాని, మేం ఆడపిల్లను  పంపించలేంకదా? దాని పెళ్లికోసమే నేను నెల నెలా బాంక్ లో డబ్బు వేస్తూ వచ్చాను. పాతికవేలున్నాయి. వాటితో మీ సంసారానికి కావలసినవి కొని ఇస్తాను" అన్నాడు నరహరి.
 
     "మా సంసారానికి ఒక్కొక్కటే మేమే కూర్చుకోగలమండీ! కట్నం వద్దని చెప్పి అది కానుకలరూపంతో గ్రహించమంటారా? వద్దు అనుకొన్న తరువాత మీది పూచికపుల్ల కూడా వద్దు మాకు" చెప్పాడు శర్మ.
 
     రాధమ్మ అందిII "నువ్వు నిండుమనసుతో ఏమీవద్దు అనుకోవచ్చు కాని, మీ వాళ్లు వేలకి వేలు కట్నం మోసుకొని ఇంటి గడపలో కాలు పెట్టాల్సిన కోడలు వట్టి చేతులతో వస్తుందంటే ఏ అత్తగారికి ఆమె మీద ఏం గౌరవముంటుంది? మా అమ్మాయిని ఎన్నైనా ఎత్తిపొడవచ్చు,"తిట్టొచ్చు!అయినా మేం ఇచ్చేది అప్పుచేసో , ఏదో చేసో ఇవ్వడంలేదు దానికోసం తీసిపెట్టిందే ఇస్తున్నాము."

    "నాకు మాత్రం పిల్ల తప్ప ఇంకేమీ వద్దండీ! శాలినిని అడగండి. తనేమంటుందో?" అన్నాడు శర్మ.

    "నేను శర్మ ఆదర్సాలను గౌరవించాలనుకుంటున్నానమ్మా!" అంది శాలిని.

    "రేపొద్దున నువ్వే దెప్పుతావే నాకేమిచ్చావని? ఆ రుక్మిణమ్మ కూతుర్ని చూడడంలేదూ? అల్లుడు కట్నమక్కరలేదని పెళ్లి చేసుకున్నాడు. కట్నం తీసుకొంటే  ఇచ్చేవాళ్లు కాదా? నాకు గాజులు చేయించండి నెక్లెస్ చేయించండి. నాకు సిటీలో ఒక ప్లాట్ కొనిపెట్టండి అని ఆ కూతురు ఒకటే తగాదానట!"

    "నేనెప్పుడూ తగాదా చేయను. ఆ మాట రాసిమ్మంటే రాసిస్తాను."

    "కూతురికి మగడిని కానీకట్నం లేకుండా సంపాదించుకొన్నామని ప్రపంచం ఆడిపోసుకొంటుదమ్మా మమ్మల్ని" అన్నాడు నరహరి.

    "ఎవరో ఏదో అనుకొంటారన్న డాంబికానికిపోయి చాలామంది జీవితాలు దుఃఖభూయిష్టంగా, సమస్యల మయంగా మార్చుకొంటున్నారండీ ఈ ప్రపంచంలో" అన్నాడు శర్మ.

                                              *    *    *    *
   
    పెళ్లయిన వారం లోపలే అత్తవారింటికి కాపురానికి వచ్చింది శాలిని.

    మడి అంటూ వంట, భోజనాలు అయ్యేదాకా కోడల్ని వంటింట్లోకి రానివ్వడంలేదు అత్త పద్మావతి. శర్మ మేనత్త ఒకామె వితంతువు కూడా ఇక్కడే వుంటుంది. పిల్లలులేరు. పంటల సీజన్ లో వెళ్లి కౌలు డబ్బు తెచ్చుకొంటుంది.

    "నాకు జీవితంలో మిగిలింది ఈ మడీ ఆచారమేకదా? మేనల్లుడు కదా అని ఎప్పుడైనా వాడింటికి వచ్చి ఓ పూట భోజనం చేసే అదృష్టం లేకుండా చేశాడు శర్మగాడు" అని, నిర్మొహమాటంగా శాలిని ముఖంమీదే అనేస్తుందావిడ! ఎక్కడ తాకి మైలపడేస్తుందో నన్నట్టుగా ఆవిడ చీర కుచ్చిళ్లు కాళ్ళసందుకు దోపుకుంటూ దూరదూరంగా తొలగిపోతూంటుంది.

     వాళ్ల బాధ అర్దం చేసుకొన్న శాలిని వాళ్ల మాటల్నీ, ప్రవర్తననీ అట్టే పట్టించుకోదు, రెండు రోజులు ఇలా వుంటుంది. తరువాత అంతా కలిసిపోతామన్న ధైర్యం ఆమెకుంది.

                                                                           8

    శర్మ బాత్ రూమ్ లో బట్టలుతుక్కుంటున్నాడు.

     "బట్టలన్నీ నువ్వు ఉతుక్కుంటున్నావేంటి? వదిన ఉతకదా? శర్మ చెల్లెలు బృందావని అడిగింది.
 
    "ఉతుకుతుందో, ఉతకదో నేను అడగలేదు! కాని, నా బట్టలు నేను  ఉతుక్కోక ఆవిడనెందుకు ఉతకమనాలి?"

    "బట్టలుతకడానికీ, బట్టలు వేయడానికీ, వండి పెట్టడానికీ కాకపోతే ఇంకెందుకు పెళ్లాం?" బృందావని ఆశ్చర్యంగా అడిగింది.

     "ఆవిడకు మొగుడెందుకో, నాకు పెళ్లాం అందుకే, అంతకుమించి లాభాలు కోరితే ఆవిడ గోలపెడుతుంది. మీ వదిన అంటే ఏమనుకొన్నావో ఆవిడ చాలా స్వతంత్ర భావాలుకల వ్యక్తి" అటువైపు వచ్చిన శాలినిని ఓరగా చూసి అన్నాడు శర్మ.

    "పెళ్లికాకముందు నీ బట్టలు అమ్మా, నేను ఉతికే వాళ్లంకదా? మా చేత ఎలా ఉతికించుకొనేవాడివి?"

    "నీ బట్టలు మేం ఉతికాం మా బట్టలు నువ్వుతుకు అని మీరనరన్న  ధైర్యంతో!"

    "వదిన అంటుందా తన చీరలుతకమని!"

    "అదే భయం!"

    "అవునా, వదినా? అన్నయ్య చేత నీ చీరలు. లంగాలు ఉతికించుకొంటావా!" కళ్లు ఇంతింత చేసుకొని విస్మయంగా అడిగింది బృందావని.

     "ఆయన డ్రాయర్లు, పంచెలు నా చేత వుతికించుకున్నప్పుడు, ఆయన చేత నా చీరలు, లంగాలు ఉతికించుకొంటే తప్పేమిటి?" అంది శాలిని.

     "ఛీ  ఛీ! మగడి చేత బట్టలుతికించుకోవడమా? అనుకోడానికే కంపరంగా వుంది."

    "నాకూ మొన్నటినుండి కంపరంగా వుంది! తెలుసా?"

    "ఎందుకు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS