Previous Page Next Page 
బస్తీమే సవాల్ పేజి 48


    "ఎందుకురా దాన్నలా ఆడిపోసుకుంటావు. నా బంగారుతల్లి రాణీ."

    "అది బంగారు తల్లా! నయం! అది రోడ్డుమీద నించుని తొడకొడితే మగాళ్ళు కూడా పారిపోతారే, రౌడీరాణి" చెప్పాడు కన్నయ్య.

    "ఆడపిల్ల అది తొడ కొట్టడమేమిట్రా" యాదమ్మ మందలింపుగా అంది.

    "అది కొట్టేదే తొడ. చేసేది సవాల్" అన్నాడు కన్నయ్య.

    దాన్ని రాని అడుగుతాను అంది.

    "బాగా అడుగు" కన్నయ్య అన్నాడు.

    "వయసొచ్చిందన్న జ్ఞానం కూడా లేదు. ఇంకా చిన్నపిల్లననుకుంటోంది. అయినా ఏమిటో దాని ఖర్మ. తల్లిలేని పిల్ల. దాని బాబు తాగి తొంగుంటాడు. ఆడ్ని పోషించాలి. ఇది బతకాలి. మరేం చేస్తుందిరా?"

    "నాలా ఏదన్నా పని చేసుకోవాలి. అంతేకాని రోడ్డుమీద అడ్డమైన తిరుగుళ్ళు ఆటలూనూ"

    పరుశురాంకి కన్నయ్య నచ్చాడు. చిన్నవాడైనా వాడికి గల పరిజ్ఞానానికి అచ్చెరువందాడు.

    "పోన్లే దాని చావేదో అది చస్తోంది. మీకెందుకు వూరుకోండి" అంది.

    "ఈ కోడికూర ఎక్కడిది" అడిగాడు కన్నయ్య.

    "అదే తెచ్చింది నీ అన్నకోసం."

    కన్నయ్య నవ్వాడు.

    "కుష్ కుష్ కోడికూరతో అన్నని బుట్టలో వేసుకుందన్న మాట."

    "నేనేమీ నీ మరదలు బుట్టలో పడలేదురా కన్నా. ఏదో తెచ్చింది తిన్నాను. కోడికూరకే పడిపోతాననుకున్నావా."

    "నాకేం తెలుసన్నా. అది మాయలాడి. నీకు తెలీకుండా నిన్ను ఏ పకోడికో అమ్మేస్తుంది" అన్నాడు కన్నయ్య.

    "ఎందుకురా నీకు అదంటే అంత కోపం" యాదమ్మ తిరిగి అంది.

    "కోపం కాదే. దాని గురించి అన్నకి తెలియాలి కదా. అందుకని చెప్పాను."

    "సరే ఇక పోయి పడుకోండి" అంది యాదమ్మ.

    ఆ రోజు చెప్పినట్టుగానే కన్నయ్య త్వరగా వచ్చాడు. పగలు ఆ బస్తీలో వాతావరణం గమనించి ఆకళింపు చేసుకున్నాడు. పరుశురాం యాదమ్మ ఇంట్లో వుంటున్నట్టు అందరికీ తెలిసిపోయింది.

    కాస్త చదువుకున్నవాడు తమ బస్తీలోకొచ్చి తమ ఇళ్ళ మధ్య వుంటున్నాడని కొందరు ఆశ్చర్యపడ్డాడు. మరికొందరు మెచ్చుకున్నారు.

    ఏదైనా ఆ గుడ్డిదానికి ఓ అండ దొరికిందని సంతోషించారు.

    బస్తీలో జనం వ్యాపారాలు చేసుకుంటారు. కూరలు, పళ్ళూ సీజనల్ వ్యాపారాలు చేస్తుంటారు వాళ్ళు.

    పగలంతా వ్యాపారం, రాత్రి ఆడ మగా పిల్లలు అందరూ కలసి ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ గడుపుతారు.

    మధ్యాహ్నం రాణి కూర పట్టుకొచ్చింది. రాణితో ముచ్చట్లు చెప్పుకోవాలన్నా యాదమ్మ ఇంట్లో వున్నందున మాట్లాడలేదు. ఆ రోజంతా రాణి ఆ ఇంటి ముందు తచ్చాడుతూనే వుంది....

    "గజ్జల గుర్రంలా నిమిషం ఖాళీగా వుండదు" అనుకున్నాడతను.

    బయట గుమ్మం దగ్గిర నిలబడి అడిగాడు.

    "లోపలికి రావచ్చుగా. ఇంటిచుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నావు" అని.

    "నిన్ను చూస్తుంటే ఎవడో సినిమా హీరో గుర్తుకొస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించి" అంది.

    "ఊరికే చూస్తే ఏమొస్తుంది."

    రాణి కిసుక్కున నవ్వింది.

    "రాత్రికి నీ పని పడతాను" అన్నట్టుగా చేత్తో సైగచేసి తుర్రున వెళ్ళిపోయింది.

    "పడుకున్నాక ఏ ప్రమాదం తెచ్చిపెడుతుందో రాక్షసి" అనుకున్నాడు పరుశురాం. రాణి ఏం చేసినా తనకేం భయంలేదు. కానీ బస్తీ జనంతో ఏ మాట వస్తుందో అనే సందేహం.

    "రా అన్నా పోదం" అన్నాడు కన్నయ్య.

    "చెట్టుకింద నేను పడుకోనురా. చెట్టుమీద దెయ్యం వుందని చెప్పింది నీ మరదలు. నా కసలే దెయ్యాలంటే భయం" అన్నాడు పరుశురాం.

    కన్నయ్య ఆశ్చర్యంగా చూశాడు.

    "దెయ్యమా? ఇన్నాళ్ళనుంచి నేను ఆ చెట్టుకిందే పడుకుంటున్నాను. ఒక్కసారీ నాకు కనబడలేదు. అసలు దెయ్యం ఎలా వుంటుందన్నా."

    కన్నయ్య మాటలకి పరుశురాం నవ్వుకున్నాడు.

    "నీ మరదలూ."

    "నిజమే అదే ఓ దెయ్యం! అది నిన్ను బెదిరియ్యడానికి అనుంటుంది. అయినా నీకెందుకు భయం. నేనున్నానుగా. మనం చెట్టుగట్టుపైన పడుకుంటాం. కింద చుట్టూ జనం వుంటారు."

    పరుశురాం ఆలోచించినట్టు నటించి "నాకు తెలీదబ్బాయ్. ఏదైనా గొడవ జరిగితే నీదే బాధ్యత."

    తల్లికి చెప్పి పరుశురాంతో బయటికి వచ్చాడు కన్నయ్య.

    అప్పటికే పక్కలు పరుచుకుని పడుకున్నారు బస్తీజనం కొందరు.

    ఇద్దరు ముగ్గురు అక్కడికి కాస్త దూరంలో చిన్న తబలా పట్టుకుని వాయిస్తూ గానకచేరి చేస్తున్నారు.

    కన్నయ్య పక్కబట్టలు పరిచాక గట్టుమీద కూర్చుని సిగరెట్ వెలిగించాడు పరుశురాం. అతను పేకముక్కలు తీసి ఆడుతుంటే కన్నయ్య చూస్తూ కూర్చున్నాడు.

    "పడుకోవా" అడిగాడు కన్నయ్య.

    పరుశురాం ఆ చెట్టుపైకి చూస్తూ....

    "నువ్వెన్నన్నా చెప్పు. ఈ చెట్టుమీద దెయ్యం వుంది" అన్నాడు పరుశురాం.

    కన్నయ్య పగలబడి నవ్వేసి....


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS