"మనిషి నొక్కసారి చూస్తే లక్షలమందిలో వున్నా గుర్తుపడతాను నేను. ఈ పరుగు రాయ్ పట్టు ఉడుం పట్టు" అన్నాడతను గంభీరంగా.
"కాదని చెప్పడంలా! దేన్నో చూసి నన్ననుకుంటే ఎలా? ఇంకా నయం పెళ్ళయినట్టు లేదు. లేకపోతే కనబడిందాన్నల్లా నా పెళ్ళామే అనేవాడివి!"
"టోకరా కొట్టకు ఢంకా ఫలాస్ అయిపోతావ్. నీ సబ్బుబిళ్ళ మొహాన్ని నేను మర్చిపోయాననుకుంటున్నావా?"
"నాది సబ్బుబిళ్ళ మొహమా? రుద్దుకొంటావా?"
"రుద్దుకోడం కాదు. నా సొమ్ము నాకివ్వకపోతే ఉతుక్కొంటాను"
"ఏయ్! ఏమిటా గలీజు మాటలు" కోపంతో అంది రాణి.
"గలీజు మాటలే! ఇంకా బూతులొచ్చు నాకు. సోడాబుడ్డి మొహంగాడ్ని, సున్నపు పిడతని, పాత కేడీని. పోలీసు స్టేషన్నించి పారిపోయొచ్చిన దొంగని. నా సొమ్ము వెయ్యి రూపాయలు నాకివ్వకపోతే ఏం చేస్తానో తెలుసా?"
"ఏం చేస్తావ్!" విసురుగా అడిగింది.
పరుశురాం పకపకమని నవ్వేశాడు.
"దొరికిపోయావే చిలకలూరిపేట చిలకమ్మా! ఏం చేస్తావ్? అని ప్రశ్నించటంలోనే నువ్వు నాకు సొమ్ము ఇవ్వాలన్న విషయాన్ని ఒప్పుకున్నావు. ఇప్పుడు చెప్తాను విను. నిన్ను రూపాయికో ముద్దు చొప్పున ముద్దు పెట్టుకుంటాను"
"ఆ.... వెయ్యి ముద్దులా?"
"గుడ్.... వెయ్యి రూపాయలని కూడా ఒప్పేసుకున్నావు."
రాణి ఒయ్యారం ఒలకబోస్తూ అంది.
"ఊరికే నా మీద విరుచుకుపడుతున్నావు. నాకు తెలీదు. నువ్వంటే నాకెంతో ఇష్టం!"
"విరుచుకుపడితే మాత్రం నష్టమేమిటి ఇష్టమే అంటున్నావుగా!"
"అబ్బా! ఆ ఇష్టం వేరు!"
"మాట తప్పించకు. డబ్బు సంగతి మాట్లాడు" అన్నాడతను.
"ఇప్పుడు లేవయ్యా! ఆ డబ్బుతో ఓ చీర కొనుక్కున్నా! నాన్నకి సారాకి వంద ఖర్చయింది.
ఇంట్లో సరుకులు తెచ్చాను మిగిలింది మస్తానుగాడు కమీషను తీసుకున్నాడు. ఇంకెక్కడుందయ్య సొమ్ము!"
పరుశురాం ఆమెని గుచ్చి గుచ్చి చూస్తున్నాడు.
"నీ ఒళ్ళంతా సొమ్మే!"
"ఎక్కడుందయ్యా సొమ్ము! ఇవి గిల్టు గాజులు."
అతను నవ్వాడు.
అర్ధనగ్నంగా బయటికి పొందిన ఆమె శిఖరాగ్రాలకేసి చూస్తూ.
"చూసుకో" అన్నాడు సైగచేస్తూ.
ఒక్కసారి గుండెలకేసి చూసుకుని పవిట సరిచేసుకుని-
"ఛీ.... నువ్వు నిజంగా దొంగవే!" అంది చేతుల్లో మొహాన్ని కప్పేసుకుంటూ.
"చెప్పు సొమ్ము ఎలా ఇస్తావు!"
"వాయిదా పద్ధతిలో!"
"అయితే మొదటి ఇన్ స్టాల్ మెంట్ తీసుకోనా!" అడిగాడు.
"నా దగ్గర ఏం లేదుగా ఇప్పుడు"
"అంతా నీ దగ్గరే వుంది"
"ఉంటే తీసుకో"
అతను ముందుకి వంగి ఆమెని ముద్దు పెట్టుకోబోతున్నట్టు నటించాడు.
"అమ్మో! ఈ సొమ్మును మాత్రం ఇవ్వను" అంటూ గబుక్కున కిందకి జారిపోయింది రాణి.
"నువ్వెట్టాంటి దానివైనా నా సొమ్ము నాకిచ్చేవరకు నీ సొమ్ముని దోపిడీ చేయడానికే చూస్తుంటాను" అన్నాడు పరుశురాం.
"నీకోసం కోడి కూర తెస్తున్నాను అది తిని పడుకోడం కాదు. రాత్రికి చెట్టుకింద పడుకొంటావుగా! బస్తీమే సవాల్! అప్పుడు చూద్దూగాని నా తడాఖా!" అని రాణి తుర్రుపిట్టలా పరుగుతీసింది.
పరుశురాం నవ్వుకొంటూ లోపలకి నడిచాడు.
20
"నా మరదల్ని చూశావంటగా?" అడిగాడు కన్నయ్య.
"చూశాను"
"కుష్ కుష్ ఎలా వుంది" మళ్ళీ అడిగాడు.
"నీ మరదలంటే ఏ చీమిడిముక్కు పిల్లో అనుకున్నాను. ఒట్టి కేడీలా వుంది."
"నిజమే అన్నా. ఒట్టి రౌడీమేళం. పోకిరీ వెధవల్ని వెంటేసుకుని మూడు ముక్కలాట ఆడుతుంది. జనాన్ని మోసంచేసి డబ్బు కొట్టేస్తదట!"