అక్కడే ప్రాచీన విశ్వ విధ్యాలయం తాలుకూ శిధిలావశేషాలు ఉన్నాయి. నిర్జనమయిన రోడ్డు మీద ఆలోచనల తరంగాల మీద తేలిపోతూ నడుస్తున్నాడతడు.
అలా ఎంతసేపు నడవాలో ! ఎక్కడికి పోవాలో! ఒక లక్ష్యం లేదు. ప్రొఫెసర్ శ్రద్దాదేవి అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహించి తిరిగి జ్యోతిని ఆమెకు అప్పగించాలన్న లక్ష్యం అతనిది. ఆ పని చేయలేకపోవటం అతని ఆత్మ లోకంలో గొప్ప తుఫాను రేపింది.
పట్టుదల పెరిగింది. పిడికిళ్ళు బిగుసుకుంటున్నాయి. మరికొంత ముందకు పోయాక ఒక కారు అమిత వేగంతో అతని ప్రక్క నించి దూసుకుపోయింది. అణువుల వైపుగా పోతోంది కారు.
అతడు నిర్విన్నుడయినాడు.
ఆ కారు కొంత ముందుకు పోయాక పెద్ద జర్క్ యిచ్చి ఆగిపోయింది. జయకృష్ణ ముందుకు పోయేందుకు సంశయించాడు. అక్కడే నిలిచి ఆ సమయంలో అటు వైపుగా కారు వోచ్చేందుకు వీలులేదు. ఎలా వచ్చిందా అని ఆలోచించసాగాడు. ఆశ్చర్యం నించి తెరుకోనక ముందే మెత్తని శబ్దంతో మరొక కారు వచ్చి అతని వెనుకగా ఆగిపోయింది.
జయకృష్ణ గమనించలేదు. కాని ఒక బలిష్టుడయిన వ్యక్తీ డోర్ తెరచుకుని క్రిందికి దిగాడు. అతడు అపరిమితంగా ఎత్తరి. పెద్ద పెద్ద అంగలతో వచ్చి జయకృష్ణను వెనుక నించే చేతులతోనే బంధించాడు.
అతడి బాహూ బంధాల నించి బయటపడేందుకు ప్రయత్నించే లోపలే ఆ వ్యక్తీ బలీయంగా అతడిని వెనుక సీట్లోకి తోసేశాడు.
"కదిలేందుకు ప్రయత్నిచకు" అన్నాడు కర్కశంగా. కారు తిరిగి వేగంగా ముందుకు దూసుకు పోయింది.
* * *
అర్ధరాత్రి దాటి ఒంటిగంట అయింది. నాగార్జునసాగర్ డాం మీద దీప తోరణాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. డాంకు ఈశాన్యంగా ఉన్న టైగర్ వాలీలో చీకటి రాసిపోసినట్లుగా ఉంది. ఫిషరీస్ డిపార్ట్ మెంటు క్వార్టర్స్ దాటి మలుపులు తిరిగి ఆనకట్టకు అభిముఖంగా పరుగిడుతోంది కారు.
రివర్ వ్యూ గెస్ట్ హౌస్ కు ఇంకా తూర్పున ఇప్పుడంతా నిర్జన మయిపోయింది. కాని ప్రధానమయిన ఆనకట్ట నిర్మాణంలో ఉండగా అక్కడ కూలిపనులు చేసుకునే వాళ్ళు నివసించేవారు. అప్పుడది జనసాంద్రత హెచ్చుగా వుండే ప్రదేశం. దానికీ, దక్షిణ విజయపురికి మధ్యగా జవహరు కాలువ అని పిలువబడుతున్న నాగార్జునసాగర్ కుడి కాలువ కొండల్లో తొలచిన సొరంగాల వైపుగా పరుగులు తీస్తుంది. మాచర్ల నించి వచ్చే వాహనాలు అ కాలువని దాటేందుకు బలమయిన వంతెన నిర్మించారు.
మార్కెట్టు వెనుక "యి" టైపు క్వార్టర్స్ వున్నాయి. మాచర్ల నించి వచ్చే వాహనాలు రివర్ వ్యూ గెస్ట్ హౌస్ కు పోవాలంటే ముందు రెండు భయంకరమయిన మలుపులు దాటాలి.
తిరుమలకు వెళ్ళే పాత రహదారిలోని మలుపుల్లా అవి చాలా భయం కలిగిస్తాయి.
మలుపు తిరిగాక కారు చాలా ఎత్తుకు వచ్చేసింది. అక్కడి నించి కుడిచేతి వైపుకు చూస్తే దూరంగా పైలాన్ కాలనీ కన్పిస్తోంది. దాని వెనుకగా టైగర్ వాలీ చీకటి నిండిన అగాధంలా మనసుని బితుకుబితుకు మనిపిస్తుంది.
పైలాన్ యివతల అనంతమయిన అగాధంలో నీలినీలి జలధారలు పొంగి పొరలే కృష్ణమ్మ. అటు ఎడమ కాలువకూ , ఇటు కుడి కాలువకూ పంపిణీ అయిపోగా మిగిలిన జలరాశి జలపాతాల వైపుగా సాగిపోతోంది.
నిర్మాణం తొలినాళ్ళలో డాం కు దిగువన కట్టగా మధ్యలో కూలి పోయిన సుదీర్ఘమైన వంతెన తాలూకు అవశేషాలు కనపిస్తున్నాయి. నది ఒడ్డున రివర్ వ్యూ! వేల సంవత్సరాల నించి కాలవాహినిలా అనంతంగా ప్రవహించే కృష్ణ వేణి అందచందాలను ఆ చోటు నించి చూస్తే మనసు మైమరచిపోతుంది.
అక్కడక్కడ ఫోటోలు తీయరాదు అన్న బోర్డులు కన్పిస్తాయి. రివర్ వ్యూ అతిది గృహం దాటి, వంతెన దాటి, మార్కెట్ మలుపులోకి వచ్చాక ఎదురుగా ఎత్తయిన ఎర్త్ డాం కన్పిస్తుంది. అక్కడ నించి కొంత దూరం దక్షిణానికి వెళ్ళి పడమరకు తిరగాలి. ఆ మలుపులోనే ఒక వంక ఆర్ అండ్ బి ఆఫీస్ , మరొక వంక రామాలయం కన్పిస్తాయి. అది దాటి వచ్చాక ఎర్త్ డాం ప్రారంభమయ్యే చోటు వస్తుంది.
అది చౌరస్తా!
ఒక వంకకు పొతే అనువులకు పోయే దారి. ఒక వంకకు పొతే దక్షిణ విజయపురి బస్ స్టేషన్ కు వెళ్ళే దారి. దక్షిణ విజయపురి నర్సరీస్ కూడా డాం మీదికి పోయే రోడ్లు రెండూ ఎదురు బోదురుగా ఉంటాయి. ఆ చౌరస్తా అంత అందమయిన చోటు చూడగలగటం అదృష్టమే అనుకోవాలి.
ఒక వంక దూరదూర తీరాలలోని కొండలే విల్లులుగా వాటి మధ్య ఒదిగిపోయిన విస్తారమయిన రిజర్వాయిర్! మరొక దిక్కున అగాధంలా ప్రవహించే కృష్ణ వేణీ, ఒక వంక అందమయిన గృహాలు , వాటి ఎదురుగా కాంతి పుంజాలు విరజిమ్మే దీపకాంతులతో నిండివున్న డాం! మానవుడు మనవ శక్తితో మానవతకు నిర్మించిన మహోన్నత దేవాలయం అది!
ఆనకట్ట క్రిందనే కుడికాలువ మీద మానవతలో మహానీయతను పాదుకొల్పిన జవహర్ పండితుని శిల్పం. విహయనవీధుల్లోకి శాంతి కపోతాన్ని ఎగురవేస్తున్నట్లు కన్పించే అద్భుత శిల్పం. ఆ ప్రక్కనే దూరంగా పైలాన్ హిల్ కాలనీలు.
అది అంతా సుందరతీరలోకం, మహానీయుల ఆలోచనలకు అద్భుత రూపకల్పనలా ఆంధ్రదేశానికి అందించిన అదృష్టమే ఆ చౌరస్తా! ఒకప్పుడు అక్కడ వేల సంఖ్యలో కూలీలు పనిచేస్తూ వుండేవారు . ఎందరో ఇంజనీర్లూ, ఇతర్లూ తెలుగుతల్లి కంటి వెలుగులా, తెలుగుతల్లి చిరునవ్వు జిలుగులా అద్భుతంగా , మహానీయంగా చిరవిస్మయకరమైన చోటు అది.
అంతటి అద్భుతమయిన చౌరస్తాలో ప్రొఫెసర్ శ్రద్దాదేవిని దింపి కారు వెళ్ళిపోయింది. అది రాత్రి ఒంటిగంట దాటిన సమయం. మనసు నిలువక ఉన్న పళంగా బయలుదేరి వచ్చింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి . కారు దిగేవరకూ అర్దారాత్రి దాటిపోయింది.
దక్షిణ విజయపురికి ఆమె ఇదివరలో వచ్చి వున్నా ఆ దారులు సరిగా జ్ఞాపకం లేవు. నర్సరీస్ కు పోయే రోడ్డుకు పోవాలి. కాని ఎక్కడ మలుపు తిరగాలో తానిప్పుడు గుర్తించలేదు.
దారి కోసం ఎవరినయినా అడగాలి. చెప్పే వారి కోసం అటూ ఇటూ పరిశీలించి చూసింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి .
అడ్డకట్టుతో అరవదేశం నించి వచ్చిన ఒక ఆసామీ అక్కడ టీ కొట్టు నడుపుతున్నాడు. బొగ్గుల కుంపటి మీద టీ నీళ్ళు మరుగుతున్నాయి. ఒకరిద్దరూ నైట్ వాచ్ మన్ లు టీ కోసం వచ్చి అతని దగ్గర నిలబడి టీ నీళ్ళు త్రాగుతున్నారు.
అతడు వారు టీ త్రాగే సమయాన్ని వృధా పోనీవ్వకుండా అరవదేశంలోని అద్బుతమయిన ఆలయాల గురించి మాట్లాడుతున్నాడు . ప్రొఫెసర్ శ్రద్దాదేవి ఆ వంకకు నడవటం ప్రారంభించగానే మాటలు ఆపేశాడు. కనులు అప్పగించి చూడసాగాడు.
ఆ ప్రాంతంలో నివశించే వారంతా ఉద్యోగులు. వారిని చూచేందుకు బంధువులు రాకపోకలు సాగుతుంటాయి. అన్నీ గవర్నమెంటు వారు నిర్మించిన క్వార్టర్స్. ఇంటి నెంబరు తెలిసినా పోయేందుకు దారి తెలియక అరా తెలుసుకునేందుకు ముందుగా కన్పించే అతని దగ్గరకు రావటం పరిపాటి.
