డియర్ యంగ్ స్కాలర్! నీకు మంచి భవితవ్యం వున్నదని నిరూపించుకున్నావు. సాహసోపేతమైన ఈ విజయాన్ని సాధించటంలో నీ భవితవ్యానికి బంగారు బాటలు పడినాయి.
రేపే నేను పైకి వ్రాసి నీ ఎబిలిటీస్ ని అందరూ గుర్తించేలా చేస్తాను. అది నా కర్తవ్యం. నీ సీనియర్ గా నా భాద్యత" అంటూ భుజం చరచి పైపు లోంచి గుప్పున పొగ వోదిలినాడు శ్రీ బృంద్ఫావన్ గోయెల్. జయకృష్ణకు సౌజన్యపూరితమయిన వారి మాటలు విన్న తరువాత కనులు చెమరించినాయి.
"సర్! మీరు ప్రోత్సహించి దారి చూపనిదే నేను ఈ విజయాన్ని సాధించలేను. ఈ విజయానికి మీ సహకారమే లేకపోతే నేనేమి చేయగలను. అందు నించి నేను ముందుగా మీకు థాంక్స్ చెప్పుకోవాలి" అన్నాడు జయకృష్ణ వినయంగా.
"ఒకే మైడియర్ యంగ్ స్కాలర్! ఎలాగాయితేనేం సాధించావు. ఇది నీకే కాకుండా ఈ దక్షిణ విజయపురి లోని అర్కేలాజికల్ డిపార్ట్ మెంట్ యూనిట్ అందరికీ గర్వకారణం.
అందుకు నిన్ను మనసారా అభినందిస్తున్నాను. అంతేకాదు ఈ రాత్రి నీకు విందు చేస్తున్నాను." అంటూ అప్పటికప్పుడు ఫోన్లు చేసి, మనుషుల్ని పంపి యూనిట్ అందరినీ పిలిపించారు శ్రీ బృందావన్ గోయెల్, అందరినీ సమావేశపరిచాడు.
"డియర్ కొలీగ్స్! యంగ్ స్కాలర్ జయకృష్ణ సాధించిన విజయం అపూర్వమయినది. మన విజయపురి అర్కేలాజికల్ యూనిట్ గర్వించదగినది.
అందునించి అతడిని గౌరవించెందుకు అనుకోండి, అతనికి ఆశీస్సులందించెందుకు అనుకోండి -- ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను, అతని గౌరవార్ధం నేను యిచ్చే విందులో మీరంతా పాల్గొనాలని కోరుతున్నాను.
మన యూనిట్ లోని ఒక సాహసి సాధించిన సహసోపేతమయిన ఈ విజయం వల్ల నేను వ్యక్తిగతంగా ఎంతో గర్విస్తున్నాను. ఆనందిస్తున్నాను. జయకృష్ణ యంగ్ స్కాలర్ దిగ్రేట్! హాట్సాఫ్ టు యూ. కమాన్ క్లాప్స్" అంటూ ముందుగా తానే క్లాప్స్ కొట్టడు శ్రీ బృందావన్ గోయెల్. యూనిట్ అంతా క్లాప్స్ కొట్టారు.
ఫిల్టర్ హౌస్ పరిసరాలు వారి హర్షధ్వానాలతో మర్మోగినాయి. వారి అనందం వరద కృష్ణమ్మ లా పొంగి పొరలింది.
మిత్రులంతా జయకృష్ణ ను అభినందించారు. అతడు ఈ సాహసోపేతమైన ప్రయోగంలో ఎదురయిన అనుభవాలను వివరించాలని పట్టుపట్టారు. జయకృష్ణ లేచి వచ్చి చెప్తూ వుంటే ఒక వీరగాధ వింటున్న వారిలా తన్మయులయినారు కొలీగ్స్.
జ్యోతిని చూడాలని వారంతా పట్టుపట్టారు. మరునాడు ఐలాండ్ మ్యూజియంలో జ్యోతిని అందరికీ పరిచయం చేస్తానని వాగ్ధానం చేశాడు జయకృష్ణ. అతడు యింటికి తిరిగి వచ్చేసరికి బాగా ప్రొద్దుపోయింది.
ఎర్త్ డాం నించి దక్షిణానికి వస్తే నర్సరీస్ కన్పిస్తుంది. నర్సరీస్ ఎదురు రోడ్డుకి పడమరగా ఉన్నవి అన్నీ ఏ.యి. క్వార్టర్స్ పది పన్నెండు క్వార్టర్స్ ఒక బ్లాకుగా ఉన్నాయి. బ్లాక్ అంతా నిశ్శబ్దం రాజ్యమేలుకొంటోంది. ఎక్కడా దీపకంతులు లేవు. దీపకాంతులన్నీ మలిగినాయంటే కరెంట్ పోయిందనే అర్ధం చేసుకున్నాడు జయకృష్ణ.
క్వార్టర్స్ ఎదురుగా చిన్నిచిన్ని పూల తోటలు. వాటిని కవర్ చేస్తూ నాలుగు అడుగులకు మించని ఎత్తులో కాంపౌండ్ వాల్స్. అలవాటయిన దారి కావటం నించి నేరుగా వెళ్ళి యింటిముందు ఆగి నాలుగు ప్రక్కలా చూశాడు జయకృష్ణ. కష్టపడి సాధించింది తానే అయినా అది ప్రభుత్వానికి చెందవలసిన పురాతన వస్తువులు.
ఈ రాత్రికి వాటిని భద్రంగా కాపాడి డిపార్ట్ మెంటు కి అప్పగించటం తన భాద్యత. ఎక్కడో కీచురాళ్ళు కిర్రుమంటున్నాయి.
రిజర్వాయర్ మీదినించి విసురుగా వొస్తున్న గాలి చెంపల్ని తాకుతోంది . గేటు లోపల కాలు పెట్టాడు అతడు.
ఇంటిలో అలికిడి వినిపించలేదు. జ్యోతి నిద్రపోయి వుండాలని అనుకుంటూ తలుపు మీద చేయి వేశాడు. అవి ఇంటి యజమాని కోసమే ఎదురుచూస్తున్నట్లుగా తెరచుకున్నాయి.
లోపల అంతా నిశ్శబ్దం.
తనకోసం ఎదురుచూస్తూ వుంటారని ఆశించిన జ్యోతి కాని, లచ్చిమి కాని ఇంట్లో వున్నారని అనిపించలేదు. అతనికేదో అనుమానం వచ్చింది. అది క్షణక్షణానికి బలీయమయింది. టార్చిలైటు తీసి ఇల్లంతా కలయవెదికాడు జయకృష్ణ. ఇంట్లో వుండవలసిన మనుషులు లేరు.
ఎంతో శ్రమపడి సాహసాలకు ఒడిగట్టి సంపాదించి తెచ్చిన రాకాసి గుడిలోని అవశేషాలు కూడా కన్పించలేదు. అనుమానం నిజమయింది. నిర్జీవంగా కూలబడిపోయినాడు అతడు. తెల్లవారితో సేకరించి తెచ్చిన ప్రాచీనవస్తువులన్నీ డిపార్ట్ మెంట్ కి అప్పగించాలి. జ్యోతిని ఐలాండ్ మ్యూజియంలో తన మిత్రులకి పరిచయం చెయ్యాలి.
అప్పటికి సమయం పన్నెండు గంటలయింది.
మరో అయిదున్నరగంటలు గడిస్తే తెల్లవారిపోతుంది. ఈలోగా అదృశ్యమయిన పురావస్తువుల్ని సంపాదించాలి. అంతకన్నా ముందుగా తాను నమ్మిక కల్గించి ఆశ్రయమిచ్చిన జ్యోతి ఏమయిందో తెలుసుకోవాలి. ఈ రెండు పనులూ చేయలేకపోతే ఇటు శ్రీ బృందావన్ గోయెల్ దృష్టి లోనూ, అటు ప్రొఫెసర్ శ్రద్దాదేవి దృష్టిలోను తాను దోషి కావచ్చు. లేకపోతే అసమర్ధుడు కావచ్చు. జయకృష్ణ ఆలోచనలో ఇది ఒక చాలెంజ్ అయింది.
ఇప్పటి కిప్పుడు ఇలా జరగటం అనేది అనూహ్యమయిన విషయం. ఇంతపూర్వమే ఇలా జరగటానికి కొంత పూర్వరంగం ఉండి వుండవచ్చు. కాని అదేమిటో తానింతవరకూ గుర్తించలేదు. ఆలోచనలో మునిగి చాలా పరధ్యానంగా అలాగే ఎర్త్ డాం మీదికి నడిచాడు జయకృష్ణ.
వృశ్చిక రాసి ఇంకా పశ్చిమానికి వాలిపోలేదు. జరీపూలు కుట్టిన నల్ల దుప్పటిలా ఉంది ఆకాశం. ఆ ప్రాంతాలు ఆ వేళకు దాదాపు నిర్ణయమయినాయి. ఎర్త్ డాం ప్రక్కనే కొట్టు దగ్గర వాచ్ మన్ లు ఒకరిద్దరూ టీ త్రాగుచూ కబుర్లాడుకుంటున్నారు. టోల్ గెట్ దగ్గర గుమస్తా రుసుం వసూలు చేసుకోవటంలో నిమగ్నుడయి వున్నాడు.
కరెంటు వచ్చింది. అల్లంత దూరంలో ఉన్న రామాలయం గోపురం మీద దీపం వెలిగింది. డాం పొడవునా దీప తోరణాలు కన్పిస్తున్నాయి. అది దక్షిణ విజయపురిని బస్ స్టాప్ నించి అడవులకు వెళ్ళే రోడ్డు. మలుపు తిరగాగానే ఆర్.అండ్. బి ఆఫీస్ . ఒకవంక రామాలయం. మరికొంచెం ముందుకు పొతే చెక్ పోస్టు, ఎర్త్ డాం అక్కడ ఆసాంతమవుతుంది.
ఇంకా ముందుకు పొతే రోడ్డుకి ఒకవంక యి.యి. క్వార్టర్స్ ! వాటి ఎదురుగా లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఎత్తయిన వృక్షాల మధ్య ఒదిగిపోయి కన్పిస్తుంది. అక్కడ నించి విశాలమయిన , నీలినీలి కృష్ణా జలధారలతో వ=నిండిపోయిన సాగరం. ఎత్తయిన అలలు వచ్చి రాళ్ళను డీ కొంటున్నాయి. జలసాగారం మీద చీకటి గుంపులు గుంపులుగా తచ్చాడుతోంది. ఒకవంక డాం మీది పాలకాంతులు , మిగిలిన అన్ని వంకలా జలసాగారం మీద చీకటి రాకాసి! కనుచూపు మేర జలరాశి! దాన్ని చుట్టి వున్న ఎత్తయిన కొండలు!
లేక్ వ్యూ గెస్ట్ హౌస్ దగ్గర మరో మలుపు. అక్కడ ఇంకా ముందుకు పొతే ఒక వంక రిజర్వాయర్. మరొక వంక ఫిలర్ హౌస్. ఆ తరువాత రోడ్డు చిట్టడివిలోకి చొచ్చుకుపోతుంది.
చేయవలసిన కార్యక్రమం గురించి ఒక విస్పష్టమయిన అవగాహన లేకపోయినా ఇంకా ముందుకు పోతున్నాడు జయకృష్ణ. అలా కొన్ని కిలోమీటర్లు నడిస్తే గాని పురాతన కళా సంపద అయిన కార్తికేయ , నారదీశ్వరస్వామి ఆలయాలున్న అనుపులు రావు.
