'కా' అనే అక్షరం మామూలుగానే ఉంది. 'శి' అనే అక్షరం మాత్రం తలక్రిందులుగా వ్రాసి ఉంది. "కి"! అలా తల క్రిందులుగా వ్రాయటంలో అభిప్రాయం ఏమిటయి వుంటుంది. అది మరో క్లూ!!
అక్షరాన్ని అలా వ్రాయటంలో అది ఒక గోపురం ఆకారాన్ని గుర్తు చేస్తుంది. అంటే కాశీ ఆలయం అయి వుండాలి.
అవును! అంతే! కాళికాదేవి ఆలయం అదెక్కడుందో మరి?!
ఒకసారి చేసిన తప్పు మరొకసారి చేయధలుచుకోలేదు.
వెంటనే ఆ చిన్న ఆర్టు పేపర్ పీస్ ని చింపి ముక్కలు చేశాడు!
ఆ ముక్కల్ని కూడా ఒకచోట వేయకుండా ఒక్కో ముక్కని ఒక్కో దిక్కుకి విసిరి వేస్తూ ముందుకి నడిచాడు.
కాళికాదేవి ఆలయం ఎక్కడుందో తేల్చుకోవాలి! ఇది చివరి క్లూ!
చిన్నతనం నించి నగరంలో అలాంటి ఆలయం వొకటుందని వినటం కాని చూడటం కాని జరుగలేదు.
ఏమీ తోచనప్పుడు అతనికో చిత్రమయిన అలవాటు. రెండు చేతులూ ఫ్యాంటు జేబుల్లో ఉంచుకుని కంటికి కన్పించిన ఓ చిన్నరాయిని తన్నుకుంటూ ముందుకు నడుస్తున్నాడు.
తనతో పాటుగా తీసుకుపోతున్నాడు!! అలా జేబుల్లో చేతులుంచుకుని రాయిని తన్నుకుంటూ కొన్ని కిలోమీటర్లు నడిచాడు. ఈసారి ఆమె తనని ఫాలో చెయ్యగలగటం అసాధ్యం అనుకున్నాడు.
కాళికాదేవి ఆలయం ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? ఆలోచిస్తూ వొక వీధి దీపం క్రింద నిలిచిపోయాడు.
"హలో! ఆగిపోయారేం?" ఆమె మళ్ళీ ప్రత్యక్షమయింది. నవ్వుతూంది.
"ఓ! ఇంకా నన్ను విడిచి పెట్టలేదన్నమాట!"
"బంగారు బాబువు కదా! ఈ పోటీలో పాల్గొనేందుకు రెండువందల మంది వచ్చారు. చివరికి మనిద్ధరమే మిగిలాం. నా కన్నా నువ్వు ముందున్నావు. మరో గంట తరువాత ఆ బహుమతిని మనిద్దరం పంచుకోబోతున్నాం. ఏం? వింటానికి బాధగా ఉందా?
కాని జరగబోయే వాస్తవం ఇది! నా వాటా నాకు యివ్వకుండా మీరు బహుమతి తీసుకోలేదు! మరి ఈ దశలో మిమ్మల్ని ఎలా విడిచి పెడతానని అనుకున్నారు?" అందామె నవ్వుతూ!
జయసింహకి చిర్రెత్తుకొచ్చింది కాని తన కోపాన్ని దాచుకున్నాడు రవంత అయినా బయట పడలేదు.
"నాతో కలిసి మీరు బహుమతిని పంచుకొనగలిగితే మీరు గొప్పవారనే ఒప్పుకుంటాను. కాని అటువంటి అవకాశం లేదు. ఆ బహుమతిని నేను సంపాదించగల అవకాశాలు లేవు!"
"ఇంతదూరం వచ్చాక తిరిగి పోతారా? నేను నమ్మను"
"వెళ్ళక చేయగలిగేది ఏముంది? ఈ క్లూ కనిపెట్టటం బహుశా సాధ్యం కాదనుకుంటాను. ఒకవేళ తెలిసికొన్న సమయంచాలదు. దయచేసి మీరు తిరిగిపోండి"
"ఓహో! నన్ను తప్పించాలని చూస్తున్నారన్నమాట! నా వాటా నేను ఒదులుకోను. ఇద్దరం కలిసే ప్రయత్నం చేద్దాం"
"కలిసి ప్రయత్నించినా ప్రయోజనం ఉండదు. కాబట్టి కలిసే ఒదులుకుందాం!" అంటూ ఒక చోట నిలిచిపోయాడు జయసింహ!
ఆమె ఆలోచనలు చాలించి అతని ప్రక్కనే నిలబడింది.
నిముషాలు దొర్లిపోతున్నాయి. ఆమె కదలలేదు, అతని ముఖం ఎర్రగా అయిపోయింది. ఉబికి వచ్చే కోపాన్ని బలవంతంగా దిగమ్రింగుకున్నాడు.
"ఈ ప్రయిజ్ లో మీకు వాటా వస్తుందనుకోవటం దురాశ" అక్కసుగా అన్నాడు.
"దురాశపడటం చట్టరీత్యా నేరం కాదని మీకు తెలియదా? ఒక రూపాయితో లాటరీ టికెట్ కొని ఏ శ్రమా చెయ్యకుండా లక్షరూపాయలు రావాలని కొన్ని కోట్లు మంది ప్రజలు కోరుకుంటున్నారు.
నేనూ మీతో పాటుగా శ్రమ చేస్తున్నాను నా వాటా నాకు కావాలను కోవటంలో తప్పేముంది?"
"మీరు చేసిన శ్రమ యేముంది? క్లూలు అన్నీ నేను సంపాదిందించాను___"
"ఈ సారి క్లూ మీకు అర్ధంకాలేదు. అర్ధమయితే నాకు కన్పించే వారు కాదు. నా సహకారం తీసుకోండి! నా వాటా నాకివ్వండి" అంది.
వాటా సంగతి ఎలా ఉన్నా ఈ క్లూ తెలుసుకోవటంలో ఆమె సహకారం తీసుకుంటే తప్పులేదని ఆలోచించాడు జయసింహ!
చేసిన ప్రయత్నం ఇంతటితో ఆగిపోకుండా ముందుకు పోవాలంటే ఆమె సహకారం అవసరమేననిపించింది.
సమయం మించిపోతూ వుంది. ఏదో ఒకటి చెయ్యాలి కదా!
సైకిల్ మీద పెట్రోలు తిరుగుతున్న పి.సి. వారిద్దరూ అలా అనుమానాస్పదమయిన పరిస్థితిలో ఉండటం చూచి ఆగిపోయాడు.
"ఇప్పుడు సమయం ఎంతయింది?" అడిగాడు జయసింహ!
"పదకొండుగంటల ఇరవై నిముషాలు!" చెప్పాడు పి.సి. దగ్గరవుతూ మరో నలభై నిముషాలుంది. సవాయ్ క్లబ్ ఇంచుమించు పది కిలోమీటర్ల దూరంలో వుంది.
ఒకరూ సాధించాలి! పది కిలోమీటర్లు దూరం అధిగమించాలి!
"ఈ సమయంలో మీరు యిక్కడెందుకున్నారు?" ఆలోచనలో పడిపోయిన జయసింహ ఉలికిపడి పోలీస్ కానిస్టేబుల్ వంక చూశాడు.
"మా బంధువు ఒకాయనకి హార్ట్ ఎటాక్ వచ్చింది. చూడటానికి పోతున్నాం! ఏం బంధువులు ప్రమాదంలో వుంటే రాత్రి వెళ్ళకూడదా!"
"ఏదైనా వాహనంలో వెళ్ళాలి! యిలా వెడితే మేము అనుమానిస్తాం."
"మాకు వాహనాలు లేవు. నడిచే వెడతాం"
"అర్దరాత్రి అయింది! మీకు పోలీస్ స్టేషన్ కి రావాలి"
"గుండెపోటు పగలే రావాలని అలా పోలీసులు శాసనం చేశారా?"
"అంత తల బరిసుగా మాటాడితే ఈ రాత్రి నిర్భంధిస్తాం తెలుసా?"
"ఎందుకు తెలియదు పత్రికల్లో చదువుతున్నాం! రాత్రి పూట ఆడవాళ్ళని ఎందుకు నిర్భంధిస్తారో మాకు బాగా తెలుసు!" అందామె.
