"ఓ తెలుసు! ప్రతిరోజూ యీ ఇంటి ముందునించే కదా పోతాను" వారి మధ్య సంభాషణ పెరిగిపోతోంది.
ఎంతసేపు ఎదురు చూసినా ఏమీ జరగక పోవటంతో జయసింహ అసహనంతో చిర్రెత్తిపోయాడు.
అలా ఎంతసేపు కూర్చోవాలి.
ఇంటి వంక పరిశీలనగా చూశాడు. ఇంటి చుట్టూ దీపాలు వెలుగుతున్నాయి. గేటు దగ్గర రెండు పెద్ద కాంతివంతమైన లైట్లు వెలుగుతున్నాయి. గేటు దగ్గర లైట్లు విడుదల చేస్తున్న కాంతి తోటలో కొంతమేర పరుచుకుపోయింది.
ఇంటి చుట్టూ వెళుతున్న దీపకాంతులు అంత దూరం ప్రసరించవు. మధ్యలో ఎత్తుగా పెరిగిన చెట్లు అడ్డు నిలుస్తాయి.
రోడ్డు మీదికి కూడా కాంతిని ప్రసరిస్తున్న ఈ దీపాలను లేపేస్తే నిశ్చింతగా ఆ పూల మొక్క దగ్గరకి చేరుకోవచ్చు.
జరిగింది ఏమిటో తెలుసుకుని గూర్కా దాడి చేస్యటానికి వచ్చేలోగా పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవచ్చు. అయితే ముందుగా ఒక దీపాన్ని పగులకొట్టి రెండో లైటుని పగుల కొట్టేందుకు వీలు కాదు.
ఈలోగా రోడ్డు మీదే దృష్టి నిలిపి ఉంచిన గూర్కా తన ఉనికిని తెలుసుకోవచ్చు. అది చాల ప్రమాదం.
జయసింహ ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చాడు.
రెండు గట్టిరాళ్ళు రెండు చేతుల్లోకి తీసుకున్నాడు. ఒకటికి రెండు సార్లు సరిగా గురి చూసి లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాడు.
అర్జునుదు రెండు చేతులతో బాణాలు విడిచినట్లు సవ్యసాచిలా రెండు చేతుల్లోంచి రాతి ముక్కల్ని ఒకేసారి విసిరాడు.
మనసు మీద తీవ్రమయిన ఒత్తిడి వచ్చినప్పుడే దాని శక్తులు తీవ్రముగా బయట పడతాయి.
కరెంటు దీపాలు రెండూ భళ్ళున బ్రద్దలయ్యాయి! గూర్కా నిర్ఘాంతపోయాడు. ఎవరయినా ఆకతాయి కుర్రాళ్ళు రాయి విసిరారా? లేక ఆ అమ్మాయికి రక్షణ యిచ్చినందుకు ప్రతీకారంగా దాదాలు ఈ పనికిపూనుకున్నారా?
ఒక నిశ్చయానికి రాలేక రోడ్డుమీదికి పరుగుతీశాడు చీకట్లో! రెప్ప పాటు తనూ నిర్ఘాంత పడిపోయింది ఆ అమ్మాయి.
మరుక్షణంలో ఆ పని చేసింది ఎవరో అర్ధం చేసుకుంది. అతని కన్నా ముందుగా లక్ష్యాన్ని చేరుకునే అవకాశం తనకుంది.
కాని ఆ మొక్క ఎక్కడ ఉందో తెలియలేదు కదా!! లేచి నిలబడి బయట నించి రావలసిన ఆకారం కోసం ఎదురుచూస్తోంది!
"కౌన్ హై! బద్మాష్!" అంటూ ప్రారంభించి తిట్టిపోస్తున్నాడు గూర్కా.
చీకటిలో చప్పుడు కాకుండా అతని వెనుకనించి గేటు వైపుగా దూసుకు వచ్చాడు జయసింహ.
తన కన్నా ముందుగా ఆ చోటుకి చేరుకున్న యువతి తన కదలికల్ని జాగ్రత్తగా పరిశీలిస్తోందని ముందుగానే గ్రహించాడు. ఆమెను ప్రక్కదారికి మళ్ళించేందుకు లోపలికి వెళ్ళిపోయాడు నేరుగా!
మొక్కల మధ్య అదృశ్యమై తిరిగి నెమ్మదిగా గేటు వైపు రావటానికి ప్రయత్నం చేస్తున్నాడు. పూల మొక్కల మధ్య నించి వస్తున్నప్పుడు కొమ్మలు రాసుకుని చప్పుడు అవుతోంది. కాళ్ళకి అడ్డం పడుతున్నాయి.
ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయి చీకటిలో అతని కోసం చూస్తోంది. మరింత ముందుకుపోతే వరండాలో వెలుగుతున్న దీపకాంతిలో తన ఉనికి బయట పడిపోతుందని భయపడుతోంది.
నెమ్మదిగా ప్రాకుతూ నేలమీద తడిగా ఉన్నచోట లేచి నడుస్తూ స్టార్ సన్ పూల మొక్క దగ్గరకు చేరుకున్నాడు. క్రొత్తగా నాటిన పూల మొక్క అయినా జీవంతో కళ కళ లాడుతోంది. తెల్లని ఆకులు చీకటిలో కూడా మెరుస్తున్నాయి. దాని గుబురులోంచి చిన్న పోలిథిన్ ప్యాకెట్ బయటకు తీశాడు.
హమ్మయ్య క్లూ దొరకింది. హాయిగా గాలి పీల్చుకున్నాడు.
అడుగు ముందుకు వేయబోతుండగా ఎవరో కాలర్ పట్టుకుని వెనుకకు లాగినట్లు అన్పించింది. నిలిచిపోయాడు.
"ఇక్కడ కూడా దాపురించావా? ఇక్కడ మనం ఘర్షణ పడటం బాగుండదు. ముందు ఈ చోటు విడిచి పారిపోదాం పద" అన్నాడు. ఆ అమ్మాయే తనని నిరోధిస్తూందని భావించాడు జయసింహ!
కాని అతని ఆలోచన తలక్రిందులయింది.
"ఎవరు నువ్వు? ఎందుకొచ్చావు?" మగ గొంతుక విన్పించింది. నిశ్చేష్టుడయి పోయాడు. వెనుదిరిగాడు.
"ఏం! ఎందుకని మాట్లాడవ్? చెప్పు! ఈ రాందుల్లారీ గ్రుడ్డివాడని అనుకున్నావా? అడుగుల చప్పుడు వింటూ నిన్ను ఎంత దూరమయినా తరిమి పట్టుకోగలను. జాగ్రత్త! ఎందుకొచ్చావో చెప్పు!"
"ఓ రాందుల్లారీ! నువ్వేనా! నాకు రావలసిన పది లక్షలు దక్కించుకున్న అదృష్టవంతుడివి కదా! ఇల్లు అలకగానే పండుగ అనుకోకు. నా వివరాలు చెప్పే సమయాలు దగ్గరలోనే ఉన్నాయి" అంటూ ఒక్క విసురున అతని పట్టునించి బయటపడిచీకటిలోకి దూసుకుపోయాడు జయసింహ.
ఎవరూ కన్పించక పోవటంతో తిరిగి వచ్చిన గూర్కా కొయ్యముక్కల గదిలోంచి బ్యాటరీ తెచ్చి వెలిగించాడు.
అప్పటికి ఆ చోటుకి తిరిగి వచ్చిందా అమ్మాయి.
"ఇక్కడంతా గొడవగా ఉంది! నాకు భయం" వెళ్ళిపోతున్నాను అంటూ పరుగు తీసిందామె.
19
జయసింహ ఒకసారి చేసిన తప్పు మళ్ళీ చేయదలుచుకోలేదు. వేగముగా వెళ్ళిపోయి ఓ వీధి దీపం క్రింద ఆ ప్యాకెట్ విప్పాడు. లోపల ఇది వరకు తనకి దొరికిన లాంటిదే మరో ఆర్టు పేపరు మడిచి పెట్టి కన్పించింది?
దానిమీద పెన్సిల్ తో రెండే అక్షరాలు వ్రాసి ఉన్నాయి. "కాళి".
"కాళి?? అంటే ఏమిటి?" ఆలోచనలో పడిపోయాడు. మరో మారు ఆ అక్షరాలకు
పరిశీలించాడు.
