కానిస్టేబుల్ ఉలికిపడి చూచాడు.
"మీరు త్వరగా వెళ్ళిపొండి! మరొకసారి కన్పిస్తే విడిచి పెట్టటం జరగదు" అంటూ వెళ్ళిపోయాడు.
ఆమె కిలకిలా నవ్వింది. టెన్షన్ భరించలేకుండా వున్నాడు జయసింది___!
"మనిద్దరం పోటీపడి యిలాగే తిరుగుతుంటాం! ఈ రాత్రికి పెట్రోల్ తిరుగుతున్న పోలీసులు మనల్ని తీసుకుపోయి ఒకే సెల్ లో తోసేశారనుకోండి? అప్పుడేమవుతుంది?
ఎలా ఉంటుంది మీకు?" అని అడిగిందామె.
గుర్రుమని చూచాడు జయసింహ!
"ఎందుకలా చూస్తారు? ఏ పరిస్థితిలోనూ పన్నెండుగంటలు అయిందాకా నేను మిమ్మల్ని ఫాలో చేస్తాను. ఛేజ్ చేస్తాను.
శనిగ్రహంలా మీ వెంట పడతాను విడిచి పెట్టను.
నాకు భాగం యివ్వటానికి బాధపడి మీరు ఇంకా మొండికేశారనుకోండి ఆ ప్రయిజ్ యిద్దరికీ కాకుండా పోతుంది.
రెండోది మనిద్దరం ఎంచక్కా హాయిగా ఒకే సెల్ లో____"
"స్టాపిట్! డోంటాక్ రబ్బిష్!"
"అయితే నేను చెప్పినట్లుగా వినండి! స్టార్ సన్ పూల మొక్క దగ్గర దొరికిన క్లూ ఏమిటి?" అని అడిగిందామె?
ఈ పరిస్థితిలో ఆమె నించి తప్పుకోవటం అసాధ్యం! ఆమెను ఎలా తప్పించాలనుకున్నది క్లూ దొరికాక చూసుకోవచ్చు. తుది నిర్ణయాన్ని ఆమెకు అనుకూలంగా తీసుకున్నాడు.
"కాళి ఆలయానికి పోవాలి! అదెక్కడుందో?" అన్నాడు.
అతని మాట విని ఆమె నవ్వింది! రోడ్డు మీద రెండు వంకలా చూచింది.
దూరాన్నించి దగ్గరవుతున్న ఆటోని ఆగమంటూ చెయ్యిఊపింది.
ఆటో ఆగిపోగానే ఎక్కి కూర్చుంది.
"థాంక్యూ! మీ మేలు మర్చిపోలేను! త్వరగా పోనీ డ్రైవర్!" అంది____
"నన్ను కూడా ఎక్కనివ్వండి!" అన్నాడు జయసింహ ఆదుర్దాగా!
"అర్ధరాత్రి సమయం. ఆడదాన్ని కాబట్టి ఆటో కావాలి! మీరు మగధీరులు కదా! పిక్క బలం చూపించండి బై! థాంక్యూ! టాటా!" ఆమె నవ్వుతూ చెయ్యి ఊపుతోంది.
అమిత వేగంతో దూసుకు పోతున్న ఆటో వంక నివ్వెరపోయి చూస్తున్నాడు.
క్షణకాలం నివ్వెరపోయాడు. పరుగు తీసి ఆటోని అందుకోవటం అసాధ్యమని అర్ధమయిపోయింది.
పిచ్చెత్తిన వాడిలా అయిపోయాడు జయసింహ! వెనుక సైకిల్ మీద వస్తున్న వ్యక్తిని లాగి ముఖంమీద కొట్టాడు. అతడు పడిపోగానే సైకిల్ తీసుకుని తొక్కటం ప్రారంభించాడు.
ఆటో కనుచూపు మేర దూరంలో కన్పిస్తోంది. దాన్ని సైకిల్ మీద అందుకోవటం అసాధ్యమే! అయినా పట్టు విడువకుండా సైకిల్ ఫెడల్స్ మీద తన శక్తి అంతటినీ కేంద్రీకరించాడు.
ఆటో దృష్టి వలయంనించి తప్పుకు పోకుండా ఉండేందుకు అతని పూర్తి శక్తిని ఉపయోగించాల్సి వస్తోంది. వాహనాల రాకపోకలు కూడ మరి ఎంతగానే వున్నాయి.
పది నిముషాల ప్రయాణం తరువాత నేరుగా వెడుతూ ఓ మలుపులో మరో ఆటోని గుద్దేశాడు. సైకిల్ ముందు చక్రం వంగిపోయింది. ఒకతను ఓ ప్రక్కకి ఒరిగిపోయాడు డ్రయివర్ దిగి వచ్చాడు!
సైకిల్ తిరిగి ప్రయాణానికి పనికి రాదు. ఆటోవాలా నుండి పడుతున్నాడు.
"రోడ్ తేర్ చాప్ కా!?" అంటున్నాడు సమాధానంగా సైకిల్ ని విడిచిపెట్టి ఆటోలో కూర్చుని స్టార్ట్ చేశాడు జయసింహ!
దాన్ని ముందుకి దూకించాడు. అతని ప్రయత్నాన్ని నిరోధించ లేకపోయాడు. కాని డ్రయివరు వెనుక సీటు అందుకున్నాడు.
"ది మాక్ ఉల్టా హాగ యు క్యా?" అన్నాడు వేగానికి ఊగిపోతూ!
"అరె చుప్ రహా!" యాక్సిలేటర్ పూర్తిగా తిప్పేశాడు జయసింహ!
మరో పది నిముషాలకి ముందు వెడుతున్న ఆటో దగ్గరయింది. అది ఇంచుమించుగా మురికివాడ అని చెప్పుకోవచ్చు.
ఒక చోట ముందు ఆటో ఆగిపోయింది.
దూరంగా ఒక వీధి మలుపులో తన ఉనికి గుర్తించకుండా క్రిందికి దిగి పరిశీలనగా చూస్తున్నాడు.
ఆమె ఆటో డ్రయివర్ తో పేచీ పడింది. డబ్బు యివ్వకుండా వెళ్ళటం ఎలా? తనదీ అదే పరిస్థితి!
ప్రక్క వీధిలోంచి అడ్డదారిన ఆ వీధిలోకి వచ్చాడు వీధి మొగదల ఆటో డ్రయివర్ తో ఆమె వివాదం యింకా పూర్తి కాలేదు.
అతను అర్ధం కాని ఉర్దూలో ఏదో అంటున్నాడు. బహుశా తిట్లు కాబోలు! వాటికి ఆమె జవాబు చెప్పాలని ప్రయత్నిస్తోంది.
అక్కడ దిగి వెళ్ళాలని ప్రయత్నిస్తోందంటే కాళికాదేవి ఆలయం ఆ ప్రాంతాలలోనే ఉండాలి కదా!
జయసింహ ముందుకి పోయాడు.
ఆ వీధి ఆసాంతమవుతున్న చోటున మరింత ఊణ్డఃఊ౮ఊ పోయే అవకాశం లేకుండా అడ్డుగా నిర్మించి ఉంది ఓ చిన్న ఆలయం. చాల ఇరుకుగా ఉన్న చిన్న గది చుట్టూ కేవలం మూడు అడుగుల వెడల్పు వరండా! దాని చుట్టూ ఎవరో ధర్మాత్ములు చేయించి యిచ్చిన గ్రిల్స్ వున్నాయి.
చిన్న గదికి తలుపులు లేవు అడ్డుగా ఊచలు బిగించారు.
అడ్డు అనేది లేకుండా పోవటం నించి కాళికాదేవి మూర్తి ఎర్రని నాలుక పగలయితే వీధి చివరి దాకా కన్పిస్తుంది.
వరండా తలుపులు తెరిచే ఉన్నాయి. రెండు మెట్లు ఎక్కి వరండాలోకి చేరుకున్నాడు జయసింహ. కటకటాల్లోంచి కన్పించే అమ్మవారిని ప్రమిద వెలుతురులో చూశాడు.
