Previous Page Next Page 
ఇదీ కధ! పేజి 47


    "ఎవరు నువ్వు!" పిసుకుతున్న గొంతులో నుంచి తప్పించుకుని వచ్చిన ధ్వనిలా ఉన్నది ఆయమ్మ గొంతు.
    స్విచ్ వెయ్యబోతున్న మూర్తి ఆగి ఆమెకేసి చూశాడు. "ఎవరు నువ్వు" ఎంత భయంకరంగా ఉన్నది ఆ ప్రశ్న? ఏకవచనము ప్రయోగిస్తున్నది. ఈవిడ తను అనుకొన్నట్టు డాక్టర్ పరిమళ వంటమనిషి కాదేమో! తను హాస్పిటల్లో తెలుసుకొన్న వివరాలు బట్టి చూస్తే పరిమళతోపాటు ఒక్క వంటమనిషి మాత్రమే ఉన్నట్టు తెలిసింది.
    "నువ్వు డాక్టరమ్మ పనిమనిషివా?" డాక్టర్ అడిగాడు.
    "కాదు!" ఆయమ్మ గొంతు గీరపోయింది.
    "అయితే వంటమనిషివి అన్నమాట!"  
    "ముందు నువ్వు ఎవరో చెప్పు? ఆయమ్మ అడుగు ముందుకు వేసింది! ఆమె గొంతులో వాడీ వేడీ పసిగట్టిన డాక్టర్ అప్రయత్నంగానే స్విచ్ బోర్డునుంచి దూరంగా జరిగాడు.
    "ఎవరు నువ్వు?" ఆమె కంఠంలో తీవ్రత హెచ్చింది. మరో అడుగు ముందుకు వేసి స్విచ్ బోర్డు దగ్గరకు వచ్చింది.
    ఆమెకు ఎదురుగా నిలబడ్డ డాక్టర్ మూర్తి నిశ్చేష్టుడయ్యాడు. ఇదేదో పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకొచ్చిన బాపతులా వుందనుకొని మరో అడుగు వెనక్కు వేశాడు.
    "మాట్లాడవేం? ఎవరు నువ్వు?"
    "నేను! డాక్టర్ మూర్తిని!"
    "డాక్టరు గారా?" ఆయమ్మ విస్మయంగా అన్నది.
    "అవును డాక్టర్ మూర్తిని! మెడికల్ ఆఫీసర్ని__" అంటూ డాక్టర్ మూర్తి ఆగిపోయాడు.
    ఆయమ్మ స్విచ్ వేసింది. లైటు వెలిగింది.
    ఆ వెలుగులో ఆయమ్మను చూశాడు! అవును! ఆమెను ఎప్పుడో ఎక్కడో? ఆ గొంతు కూడా ఎక్కడో పరిచయమైన గొంతులా వున్నది. మనిషిని పోలిన మనుషులుంటారంటారు.
    ఎదురుగా నిలబడ్డ డాక్టర్ మూర్తిని వెలుగులో చూస్తూ నిశ్చేష్టురాలయిపోయింది ఆయమ్మ!
    "నాగేంద్రం మీకేమవుతాడు?" ఆయమ్మ గొంతు పెకిలించుకొని అడిగింది.
    డాక్టర్ మూర్తి భూమిలోకి కుంగిపోయాడు.
    బుర్ర గిరగిరా తిరిగిపోయింది. నాగేంద్రం నాగేంద్రం! ఏనాడో చనిపోయిన నాగేంద్రం ఇంకెక్కడున్నాడు?
    నాగేంద్రం చనిపోయాడు. మళ్ళీ తిరిగిరాడు.
    "నాగేంద్రం మీకేమవుతాడు?" మళ్ళీ అదే ప్రశ్న. ఆయమ్మకేసి తలెత్తి చూశాడు. ఆమె ముఖం పాలిపోయి వున్నది. వళ్ళంతా చెమటలు కమ్మి వున్నది. తన పరిస్థితీ అలాగే వుంది. వళ్ళంతా చెమటలు పట్టింది. ముఖంకూడా ఆమె ముఖంలాగానే పాలిపోయి వుంటుంది. అది ఆమె చూడగలదు, గ్రహించగలదు.
    "నాగేంద్రం__?" త్రాచుపాము పడగలా ముఖం మీదకు అదే ప్రశ్న విసరబడింది.
    "ఏ నాగేంద్రం?"
    "పీపాల గవరయ్య కొడుకు నాగేంద్రం!"
    "వాడెవడో నాకు తెలియదు."
    "తెలియదా?" నిట్టూర్చింది ఆయమ్మ.
    అంతలో "ఆయమ్మా! ఆయమ్మా!" అంటూ డాక్టర్ పరిమళ ఇంట్లోకి వచ్చింది. వరండాలో నిలబడి వున్న డాక్టర్ మూర్తిని చూస్తూనే ఆగిపోయింది.
    "ఆయమ్మా! చూడూ! రిక్షావాడికి ఏభై పైసలిచ్చి పంపు! నా దగ్గిర చిల్లర లేదు!"    
    "గుడ్ ఈవెనింగ్ డాక్టర్ పరిమళా!" డాక్టర్ మూర్తి అన్నాడు.
    "గుడ్ ఈవెనింగ్! మీరు"
    "డాక్టర్ మూర్తిని!"
    "మిమ్మల్ని ఇంతకుముందు చూశాను!"
    "దటీజ్ రైట్! నేను జ్ఞాపకం ఉన్నానన్నమాట!"
    "మాధవిని హాస్పిటల్లో చేర్పించడానికి మీరేగా వచ్చారు!"
    "అవునవును! యూ ఆర్ రైట్!"
    "ప్లీజ్ కమిన్!" డ్రాయింగ్ రూంలోకి ఆహ్వానించింది పరిమళ. ఆమె వెనకే నడిచి డ్రాయింగ్ రూంలోకి వచ్చి కూర్చున్నాడు డాక్టర్ మూర్తి.
    డాక్టర్ పరిమళ బట్టలు మార్చుకొని తిరిగి వచ్చింది.
    డాక్టరుకు ఎదురుగా కూర్చుంటూ ఆయమ్మను పిలిచి కాఫీ పట్టుకురమ్మని చెప్పింది.
    "ఎప్పుడొచ్చారు డాక్టర్ గారూ?"
    "ఉదయమే! రేపుదయం వెళ్ళిపోతాను. వెళ్ళేముందు మిమ్మల్ని ఓసారి కలిసిపోదామనుకొన్నాను. మీ బాస్ తో ఫోన్ లో మాట్లాడాను!"
    "మాధవిలో ఏమీ ఇంప్రూవ్ మెంటు లేదు. సారీ టు సే దట్?"
    "అదే మీ బాస్ చెప్పాడు. మాధవికి మీకు అంటే చాలా గురి అట, ఆమె ప్రోగ్రస్ మీరే చూస్తున్నారని చెప్పాడు. మీకు మాధవి అంటే చాలా ఇష్టమనీ, ఎప్పుడూ ఆ పిచ్చి అమ్మాయితో కబుర్లు చెప్తూ కూర్చుంటారని మీ బాస్ చెప్పాడు! అందుకే మిమ్మల్ని కలిసి వెళదామని వచ్చాను"
    "ఆమె ఇప్పట్లో నార్మల్ అయ్యే అవకాశాలు లేవు." తనలో కలిగిన కలవరాన్ని దాచుకుంటూ అన్నది.
    "పూర్తిగా ఆశలు వదులుకోవలసిందేనా?"
    "తప్పదు! మనం చేయగలిగిందేమీలేదు."
    "తల్లితండ్రులకు ఒక్కతే కూతురు. జడ్జీ రామనాథంగారు దురదృష్టవంతులు. కన్న తల్లితండ్రులు బాధపడతారు. అది సహజమే కాని మాధవి కారణంగా మరో కుటుంబం కూడా ఇబ్బందుల్లో పడింది."
    "అంటే?" పరిమళ కనురెప్పలు టపటప లాడించింది.
    "నా ప్రాణ స్నేహితుడు సాంబశివరావు డియస్పీ. అతనికి ఒక్కగాను ఒక్కడే కొడుకు, పి.హెచ్.డి. చేస్తున్నాడు. వాడు ఈ పిల్లను ప్రేమించాడు, ఆ ప్రేమ పిచ్చిలో పడి ఉంటే అంతవరకూ బాగానే ఉండేది. కాని ఆ పిల్ల మానసిక స్థితిమీద వీడు పరిశోధనలు మొదలుపెట్టాడు. ఆ దెబ్బతో ఆ పిల్ల పూర్తిగా పిచ్చిదయి పోయింది!"
    "ఓహో! ఇదీ కథ"! పరిమళ కళ్ళు తిప్పింది.
    "ఆ కథ అక్కడితో ఆగినా బాగుండేది! అది అక్కడితో ఆగలేదు. నా స్నేహితుడి కొడుకు_ ఊఁ అన్నట్టు అతని పేరు చెప్పలేదు కదూ! వాడి పేరు సాగర్. ఆ పిచ్చిదాని పిచ్చి కుదురుస్తాననీ వాడు పిచ్చివాడయిపోయి తిరుగుతున్నాడు. వాళ్ళమ్మ రోగిష్టిది. కొడుకు దిగులుతో తండ్రి కూడా మంచం పట్టేట్టున్నాడు, అసలే హై బి.పీ. ఈ దిగులుతో ఏ రోజో ఓరోజు గుండెపోటు రావచ్చు. స్నేహితుడి కుటుంబ స్థితి చూస్తుంటే నాకు మనసు వికలమయి పోతున్నది. సాగర్ ఇప్పటికి ఇల్లు వదిలి పది రోజులయింది. ఇక్కడికే వచ్చినట్టు తెలిసింది. కాని ఇక్కడ ఎంత వాకబు చేసినా అతడుండే చోటు తెలియలేదు."
    "తిరిగి వెళ్ళిపోయాడేమో!"
    "వెళ్ళడు. మాధవిని వదలి వెళ్ళడు. ఈ ప్రాంతంలోనే ఎక్కడో ఓచోట వుండి వుంటాడు. మాధవిని కలవటానికి హాస్పిటల్ కు తప్పకుండా వస్తాడు. మీరు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని మాకు సహాయం చేయాలి."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS