కానీ అంతకుమించి ఏమీ ఆలోచించలేదు. ఆశించలేదు.
ఇవాళ హటాత్తుగా ఈ ఇంటర్నేషనల్ టెర్రరిస్టులని కలుసుకోవలసి వస్తుందని కలలో కూడా అనుకోలేదు తను!
జపాటా! అబూనిడాల్!
అసలు వీళ్ళందరి దృష్టి తనమీద ఎందుకు పడింది?
ఒక సీన్ లో బాగా నటించిన చిన్న నటుడిని నిర్మాతలు గుర్తించి హీరోగా చేసేసినట్లా?
వీళ్ళు చెప్పేదాన్ని చూస్తే తనని వీళ్ళు హీరో చెయ్యదలుచుకోలేదు అతి పెద్ద విలన్ని చెయ్యదలుచుకున్నారు. టెర్రరిస్టుని చెయ్యదలుచుకున్నారు.
కానీ తను దానికి చచ్చినా ఒప్పుకొడు. తను ఇప్పుడు చేసున్నదంతా దేశం కోసమే!
దేశద్రోహుల లాంటి టెర్రరిస్టులతో తను చేరడు. తన మీద ఎంత ఫ్రెజర్ వచ్చినా సరే!
నెవర్!
అదంతే!
అలా నిశ్చయించుకున్నాడే గానీ ఒకనాడు తాను అబూనిడాల్ ని మించిన టెర్రరిస్టు అవుతానని ఉహించలేకపోయాడు నిఖిల్.
అప్పట్లో -
* * *
తలతో బ్యాండేజ్ తో తిరిగి వచ్చిన నిఖిల్ ని చూడగానే కళ్ళెంబడి నీళ్ళు తిరిగాయి రాధకి.
రాజూ, బిల్డింగ్ వాలా , తక్కిన వాళ్ళు అందరూ నిఖిల్ చుట్టూ మూగారు!
జరిగినదంతా ఎవరికీ చెప్పలేదు నిఖిల్. రాధ వైపు తిరిగి కసురుతున్నట్లు అన్నాడు "ఇప్పుడేమయిందని? ఎందుకా ఏడుపు?"
"ఇంత ఘోరం నేనెప్పుడూ చూడలేదు!" అంది రాధ. విశాలమైన ఆమె నయనాలు జలపాతాలయిపోయాయి.
జరగరానిది ఏదో జరిగిందని అర్ధమయింది నిఖిల్ కి.
"ఏమయింది?" అన్నాడు జాగ్రత్తగా.
కంపిస్తున్నా గొంతుతో చెప్పడం మొదలెట్టింది రాధ. ఆమె ఒక్కొక్క సంగతి చెబుతూ వుంటే వినేవాళ్ళు గుండెలు నీరయిపోయాయి.
అందరూ కోయ్యబొమ్మల్లా నిశ్చలంగా నిలబడిపోయారు.
* * *
షాకులో ఉన్న రాధ మధ్య మధ్య ఆగుతూ మాటలకోసం తడుముకుంటూ చెబుతూ ఉంది. సగం సగం వాక్యాలతో ఆమె చెబుతున్నది సగమే అర్ధమవుతోంది వినేవాళ్ళకు.
అందుకుని రాజు వైపు చూశాడు నిఖిల్.
"పక్కగదిలోకి వెళ్దాం" అన్నట్లు సైగ చేశాడు రాజు.
ఇద్దరూ పక్కగదిలోకి నడిచారు.
"ఏమయింది?" అన్నాడు నిఖిల్.
"పెద్ద ట్రాజెడీ! రాధ తండ్రికి పిచ్చెక్కింది."
కొద్దిక్షణాలు మౌనంగా ఉండి , "వివరంగా చెప్పు" అన్నాడు నిఖిల్.
దీర్ఘంగా శ్వాస తీసుకుని చెప్పడం మొదలెట్టాడు రాజు.
"మొదటినుంచి రాధ తండ్రి అర్భాకుడే! బక్కప్రాణం. బతుకు పోరాటంలో దెబ్బ మీద దెబ్బ తిని అలిసిపోయి ఉన్నాడు. అయితే ఈసారి ఆయనకు తగిలింది మాములు దెబ్బ కాదు. చావుదెబ్బ! ఆ దెబ్బకు ఆయనకు మతి భ్రమించింది."
"అంటే?"
"వయొలెంట్ గా మారిపోయాడు మనిషి, రాధ సవతి తల్లి , బంధువులూ అందరూ కలిసి ఆమెని నిర్ధాక్షిణ్యంగా ఇంట్లో నుంచి తరిమేయ్యగానే తనూ వలవల ఏడుస్తూ రోడ్డుమీద పడ్డాడు అయన. వెళ్ళి పోలీస్ స్టేషన్ మీద రాళ్ళు వేశాడు. ఒక కానిస్టేబుల్ వచ్చి ఆయన్ని ఇంటి దగ్గర దింపేసి వెళ్ళాడు బలవంతంగా.
ఇంటికొచ్చినా అయన మాములు మనిషి కాలేదు. చేతికి ఏది దొరికితే దాన్ని అందరిమీద విసరడం మొదలెట్టాడు. బంధువులు మూడు రోజులు ఓపికపట్టి, ఆయన్ని ఒక మెంటల్ హాస్పిటల్ లో చేర్చారు."
"తర్వాత?"
నిట్టూర్చాడు రాజు.
"అక్కడే పెద్ద పొరబాటు జరిగిపోయింది."
"ఏమిటది?"
"అతన్ని చేర్చింది ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో కాదు!"
"కాదా? మరి ఎక్కడ?"
"సిటీ అవుట్ స్కర్ట్స్ లో పెట్టారు ఒక కొత్త ఇన్ స్టిట్యుషన్, మెంటల్ పేషెంట్స్ కోసం. ఆ వీదీలోనే ఉండే పెద్ద మనిషి ఒకాయన పూనుకుని రాధ తండ్రిని అందులో చేర్పించాడు . అందుకుగానూ ఆ తర్వాత అతనికి బాగా డబ్బు ముట్టచెప్పబడిందని విన్నాను."
ఆశ్చర్యంగా చూశాడు నిఖిల్.
"పిచ్చాసుపత్రిలో చేర్చినందుకు డబ్బా? అదేమిటి?"
కసిగా తల పంకించాడు రాజు.
"అదొక కొత్త వ్యాపారం! ఆ మెంటల్ ఇన్ స్టిట్యుట్ అనేది అంతా పైన పటారం లోన లొటారం! మతి చలించిన మందభాగ్యులను అందులో చేరుస్తారు. తమకేం జరుగుతుందో తమకే తెలియని స్థితిలో ఉన్న ఆ పేషెంట్ల కళ్ళు పీకేసి, బాంబేలో కొన్ని ప్రయివేట్ హాస్పిటల్స్ కి అమ్మేస్తున్నారు. అంతా అతి రహస్యం. అక్కడ కళ్ళు పీకేసి అమ్ముకుంటున్నరన్న సంగతి మూడో కంటివాడికి కూడా తెలియదు. పేషెంట్లు పాపం ఏమీ తెలియని స్థితిలో ఉంటారు.
