ఆ దీనుడి మీద అంతులేని వాత్సల్యం కలిగి, కళ్ళు మూసుకుని, వేంకటేశ్వరుని ధ్యానించి ఇలా అంది.
"తిరుమలాధీశునిపై నీకు గల భక్తి కారణంగా, ఆయన అనుగ్రహంతో అతి త్వరలోనే వ్యాధి నయం అవుతుంది. కాని, ఒక్కమాట నన్నిక్కడ చూసినట్టు ఎవ్వరితోనూ చెప్పకూడదు. పొరపాటున చెపితే చాలా ప్రమాదం. అంగీకారమేనా?"
"వ్యాధి తగ్గితే స్వామిని దర్శించుకోవచ్చు. అంతకన్నా మహాభాగ్యం మరేం కావాలి. ఎన్ని నియమాలకైనా అంగీకారమే" అన్నాడతడు ఆనందంగా.
"అయితే, కళ్ళుమూసుకో" అంది.
అతడు కళ్ళు మూసుకున్నాడు. నీళ్ళలో మునిగిన అనుభూతి కలిగింది. వెంటనే నీటినుండి పైకిలేచే ప్రయత్నం చేయాలనిపించి చేశాడు. కళ్ళు తెరిచి చూస్తే తిరుమలలో స్వామి పుష్కరిణిలో భక్తజనం మధ్యలో ఉన్నాడు. కొత్తగానీటిలో నుండి పైకిలేచిన అందగాడిని చూచి అందరూ ఆశ్చర్యపోయారు. పుష్కరిణీజుడని పిలవసాగారు. అతడు పూర్వపు సంగతులన్నీ మరచి, తనంతటి వాడు లేడని, అహంకరిస్తూ గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు.
అతడి గ్రామానికి చెందినవారు తీర్థయాత్రలకని వచ్చి, గుర్తుపట్టి పలకరించి, వ్యాధి ఎలా తగ్గిందని అడిగారు. అదంతా తన భక్తి మహాత్మ్యం అనీ, తన భక్తికి మెచ్చిన వెంకటరమణుడు తుంబురుకోనలో ఒక యోగినిగా దర్శనమిచ్చి వ్యాధి తగ్గించాడని చెప్పాడు.
"ఆ యోగిని తరిగొండ వెంగమాంబ కాదు కదా!" అని ఆలయ అర్చకులు అడిగారు.
హెచ్చరిక మరచి "అవును" అన్నాడు.
అంత అతడి తల ముక్కలై చనిపోయాడు.
కాని, వెంగమాంబ ఉనికి తెలిసింది. ఆలయ మహంతు, భక్తులు పౌరులు అందరూ కలిసి, తుంబురు కోనకి వెళ్ళి తిరిగి తిరుమలకి రావలసిందిగా ప్రార్థించారు. అంతమంది ఒక్కసారిగా వచ్చి ప్రార్థిస్తే అది తిరుమల వాసుని ఆజ్ఞగా భావించి "సరే" నంది. వారు తెచ్చిన పల్లకి ఎక్కి, మంగళ వాయిద్యాలు మ్రోగుతూ ఉండగా, తుంబురు కోన నుండి తిరిగి తిరుమలలో తన మఠానికి చేరింది.
తిరుమలలోని తన బృందావనంలోని రాతిమీద చేరగానే, ఆనంద నిలయదర్శనంతోపాటు తన చెలికాని సాన్నిధ్యం వెంగమాంబని ఆనంద డోలికలలో తేలించేది. మనసులో కదలిన భావాలన్నీ కలకదేరి తేటపడి పాటలుగా జాలువారేవి. ఒక్కొక్క భావఛాయ ఒక్కొక్క ప్రసూనమైన కవితా మంజరులుగా రూపు కట్టి పరిమళాలని నలుదిశలా వెదజల్లేవి అవి ఆనంద నిలయవాసుడైన వేంకటపతిని చేరి గిలిగింతలు రేపేవి. మురిసిపోయి ముసిముసిగా చిరునవ్వులు చిందిస్తూ వినోదించేవాడు.
"ఘనుడవై నిర్హేతుకంబుగాఁ దొలుత
కరుణనేలితివి తిక్కక నన్నుకృష్ణ
నిన్నొల్లకావల నే బోవు తఱిని
పోనీక ప్రోచితెప్పుడు నీవు కృష్ణ
లలితంబులైన లీలలు చూపి నన్ను
కోరిమాలిమి చేసికొంటివే కృష్ణ
మద్గురు స్వామివై మంత్రోపదేశ
మిచ్చిత వాదియందిరవుగాఁగృష్ణ
అటుమీద నాత్మతత్త్వార్థ సంగతులు
ప్రియముదీపింపఁ జెప్పితివీవు కృష్ణ
తలఁచిన యపుడె ముందఱ వచ్చి నిలిచి
యెడలేని సంతోషమిత్తువే కృష్ణ
తల్లితండ్రులు సహోదరులైన నన్ను
లీలనీకరణి లాలించరే కృష్ణ
చెలరేఁగి నాకు వచ్చిన యాపదలకు
పరఁగ నీవుండగా బ్రతికిది కృష్ణ
నీవంటి మిత్రులీ నిఖిల లోకములఁ
జేరినే వెదికినఁ జిక్కరే కృష్ణ!
ఎపుడేని రూఢినీ ఋణము నిక్కముగఁ
గోరినేనిక తీర్చు కోలేను కృష్ణ!
...... ... ... ...
తన ప్రియనేస్తం ముఖాన్ని చూస్తూ వెంగమాంబ తన మనోభావాలని విన్నవించుకుంటోంది అలవోకగా మందహాసం చేస్తూ తలపంకిస్తున్నాడు. వెంగమాంబ భావోద్వేగంతో తన్యురాలై పోతోంది...
భావోద్వేగం, కవితావేగం జంటగా పోటీలు పడుతున్నాయి.
... ... ... ... ...
"ఆరీతి బ్రాణప్రయాణ కాలమున
నీవు నాముందర నిలువవే కృష్ణ!"
వెంగమాంబ మిత్రుడు ఆదిరిపడ్డాడు. ముఖంలో కలవరం. తన మిత్రుని ముఖంలోని కలవరం చూడగానే వెంగమాంబ కవితాగానం ఆగిపోయింది. గంటం సాగనంది.
"ఏ భక్తులకైనా ఆపద కలిగిందా? నీ ముఖంలో ఆ బాధ ఎందుకు?" అడిగింది.
"నీవు పలికిన అమంగళం నాకు బాధ కలిగించింది"
తానే మన్నదో ఆలోచించింది. గుర్తుకు తెచ్చుకుంది.
"అది సర్వజీవ సహజలక్షణం. ఎవరికీ దాటరానిది. అవతార పురుషులకే తప్పనిది. సామాన్యజనులనగా ఎంత?"
... ... ... ... ...
"ఊపిరిపోసుకుంటున్న తరుణంలో తోడున్నావు. ఉనికి, మనికి తోడుగా ఉండి సార్థకం చేశావు. ప్రాణప్రయాణ సమయంలోకూడ నీ అండ ఉంటే సుఖప్రయాణం అవుతుంది. అంతకన్నా ఏ జీవి అయినా కోరుకునేదేముంది."
... ... ... ... ...
"జీవితమంతా చేసే సాధన మృత్యువుని చిరునవ్వుతో ఆహ్వానించటానికే కదా! నేర్చిన జ్ఞానమంతా చివరిక్షణంలో మాయమై, మాయకి లోబడి మృత్యువుని చూచి భయపడి, మరొక జన్మకి బీజం వేసుకోటం జరుగుతుంది. శాశ్వత ఆనందధామ ప్రస్థానం మరొక్క జన్మపాటు వాయిదాపడుతుంది. తాత్కాలికమైన విడిదిలో జీవనం గడపాల్సి ఉంటుంది. నీ చెలికి అటువంటి స్థితి అభిలషణీయమా?
"మిత్రమా ఇంతవరకు నాకు అడగకుండానే అన్నీ ఇచ్చావు. ఇది నేను కోరే ఒకే ఒక కోరిక. ప్రాణప్రయాణ కాలంలో నాముందుండ వలసింది."
"మైత్రికోసం ఏదైనా చేస్తాను. అలాగే! నీమాటెందుకు కాదనాలి? అయినా నావెంట తీసుకుని వెళ్ళాలికదా! తప్పదు."
"ధన్యోస్మి! ప్రియమిత్రమా! ధన్మోస్మి!" అంది వెంగమాంబ.
* * *
