- నాకేమీ తెలీదండీ. ముందు తెల్లకాగితం మీద వ్రాసివ్వటమే నేమో అనుకున్నాను. అలా వ్రాసిస్తే కానీ ప్రార్థనకి ట్రీట్ చెయ్యనన్నాడు డాక్టర్. ఇంతలో లాయరొచ్చాడు. అతడిని చూసి చట్టబద్ధ ఉత్తరాన్ని అతడు తయారు చేస్తాడనుకున్నాను. ఇక్కడ కాదు, కోర్టుకి వెళ్ళాలన్నారు. మేజిస్ట్రేటు సమక్షంలో అంతా చెయ్యాలన్నారు. అప్పటికే కాలు వెనక్కి తీసుకోలేనంత ముందుకు వెళ్ళిపోయాను. ఏం చెయ్యను? నేను చూస్తూ వుండగానే అంతా జరిగిపోయింది. నన్నొక బొమ్మలా బోనులో నిలబెట్టారు. చివరికి కోర్టు ఆర్డరిచ్చింది. నిస్సహాయంగా- నిశ్శబ్దంగా అంతా చూస్తూ వుండాల్సి వచ్చింది. ప్రార్థన మీ కూతురేనండి, నాకేమీ అధికారం లేదు. ఇప్పుడిక ఆ ఆస్పత్రి అధికారులకి ఏమీ చెప్పలేను. కాలిన ఈ చేతుల్తో వాళ్ళ పాదాలనే ఆకుల్ని పట్టుకుని ప్రార్థించలేను. కానీ నన్ను మీరు అర్థం చేసుకోవటం కోసం నా గుండెకోసి ఇవ్వాలని ఎవరయినా శాసిస్తే దానికి ఆనందంగా సిద్ధపడతాను, అయ్యో - మీకెలా చెప్పనండీ ఇదంతా.
ఆమె చివరికి ఏమీ చెప్పలేదు, చెప్పే ధైర్యం లేదు. ప్రపంచంలో ఏ భాష కూడా ఆ భార్యా భర్తల మధ్య వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ ని పోగొట్టలేదు.
అతడు ఆమె ఇంకా అక్కడే నిలబడి వుండటం చూసి, ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూసేడు. ఆమె ఏదో చెప్పబోయి, తటపటాయించి 'ఏం లేదు' అని వెనుదిరిగింది.
ఆమె గుమ్మం దగ్గరికి చేరుకుంటూ వుండగా వెనుకనుంచి నెమ్మదిగా వినపడింది- 'వసుమతీ' అని!
ఆమె ఆగింది.
"నా ఉద్యోగం పోయింది వసుమతీ!"
ఒక సన్నటి గాలి తెమ్మరవచ్చి కిటికీ తెరల్ని కదిల్చింది. ఒక వణుకు ఆమె శరీరాన్ని కదిల్చింది. స్థబ్దతనుంచి తేరుకుని ఆ మాటల్ని అర్థం చేసుకోవటానికి రెండు నిముషాలు పట్టింది. నెమ్మదిగా- చాలా నెమ్మదిగా ఆమె వెనుదిరిగింది. తెరల సందుల్లోంచి వచ్చే సూర్యకిరణం ఆమె మొహంమీద చీకటిని వెలుగుతో మిశ్రమం చేస్తూంది.
"నిజం. నా ఉద్యోగం పోయింది. పోవటమేమిటి? నేనే రాజీనామా ఇచ్చాను. ఇలా చెప్పుకుంటే కొంచెం గౌరవంగా వుంటుంది కదూ!"
ఆమె మాట్లాడలేదు. ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఆమె మౌనాన్ని అతడు ఇంకోలా అర్థం చేసుకున్నాడు- నవ్వేడు.
నవ్వుతూనే, "తప్పదు వసుమతీ! నన్ను పెళ్ళి చేసుకున్న నేరానికి నాతోపాటూ నా పిల్లల్ని కూడా ఇకనుంచి నువ్వే పోషించాలి" అన్నాడు.
ఆమె గాలిలా అతడి దగ్గిరకి దూసుకువెళ్ళలేదు. "అంతమాట అనకండీ" అంటూ అతడి కాళ్ళ దగ్గిర వాలిపోలేదు. ఉన్నచోటనే నిలబడింది. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అరచేతులు చెమట పడుతున్నాయి. అన్ని రోజుల్నుంచీ ఆమె పడుతున్న శ్రమా, నిద్రలేని రాత్రిళ్ళు కలిగించిన అలసటా, ఆస్పత్రి పెట్టిన కష్టం- అన్నీ ఒక్కసారిగా ఆమెని నలువైపుల నుంచీ చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరీ చేసేయి. తడారిన గొంతుతో "ఏ... ఏమిటండీ మీరంటున్నది?" అని మాత్రం అనగలిగింది. అప్పటి వరకూ పళ్ళ బిగువున అదిమి పెట్టిన అలసట, నెమ్మదిగా నెమ్మదిగా ఆమెని ఆక్రమించుకుంటూంది.
అతడు లేచాడు. నడుస్తూ వుంటే కాలు బాధ పెడుతుంది. కిటికీ వద్దకు వెళ్ళి తెర పక్కకి లాగేడు. లాగుతూ తనలో తను అనుకుంటున్నట్టూ నెమ్మదిగా అన్నాడు. "...ఇన్సూరెన్సు కూడా రాదు. ఇప్పటి వరకూ అయిన ఖర్చుకి వచ్చే గ్రాట్యూయిటీ అదీ సరిపోతుందేమో!"
ఈ లోపులో ఆమె కాస్త తేరుకుంది. "ఉద్యోగం రాజీనామా చేసేరా? ఎందుకండీ" అంది బేలగా.
"వేల వేల మంది ప్రార్థనల్ని నా సూడో- మెడిసిన్స్ తోనూ, టానిక్స్ తోనూ చంపెయ్యలేక".
ఆ జవాబుకి తిరుగు ప్రశ్న లేదు.
అతడి దగ్గరికి వెళ్ళి "పోన్లెండి, ఇక్కడ కాకపోతే ఇంకొకచోట వస్తుంది ఉద్యోగం" అంది తమకితామే ధైర్యం చెప్పుకుంటున్నట్టూ.
అతడు పేలవంగా నవ్వేడు. "అదంత సులభంకాదు, పోతే అంతకన్నా ముఖ్య సమస్యలు ఇంకా కొన్ని వున్నాయి. వారం పదిరోజుల్లో ఈ క్వార్టర్సు ఖాళీ చెయ్యాలి. కనీసం నెల రోజులన్నా టైమ్ ఇస్తారని నేను అనుకోను. మనం ఇంకో ఇంటికి మారాలి, చాలా చిన్న ఇంటికి. ఈ పరిస్థితుల్లో నెలకి వందా రెండొందలకన్నా ఎక్కువ అద్దె ఇచ్చుకోలేమేమో! అవునా" అంటూ తిరిగి నవ్వేడు. ఆమె అతికష్టంమీద దుఃఖాన్ని ఆపుకుంటూంది.
"మన బ్యాంకు బాలెన్స్ ఎంతుంది వసుమతీ?"
హఠాత్తుగా అతడడిగిన ప్రశ్నలకి ఆమె వెంటనే జవాబు చెప్పలేక ఆలోచించి "ఆరేడు వేలదాకా వుండొచ్చు" అంది.
అతడు తిరిగి తనలో తాను ఆలోచించుకుంటూ అన్నాడు. "కారు అమ్మటం గురించి ఈ రోజే పేపర్లో ఒక ప్రకటన ఇవ్వాలి..." అని ఆగి మళ్ళీ నెమ్మదిగా- "ప్రార్థన తల్లి తాలూకు బంగారం కాస్త లాకర్ లో వుంది. దాన్ని తియ్యాలి" అన్నాడు.
ఆమె చప్పున "ఎందుకండీ ఇప్పుడే అవన్నీ ఆలోచించటం" అంది. అతడు అర్థంకానట్టు ఆమెవైపు చూశాడు. "ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఆలోచిస్తాం? ఆస్పత్రి వాళ్ళు మన పేరు ప్రఖ్యాతులు చూసి కట్టవలసిన డబ్బుకి వాయిదా ఇవ్వరుగా. నిన్నటికి బిల్లు ఎంతయింది?"
"పద్దెనిమిది వేలు"
"అది ఎప్పటిలోగా కట్టాలి?"
"రేపటిలోగా".
"మరి!"
దీనికి ఆమె మాట్లాడలేకపోయింది. అతడు ఆమె దగ్గరికి వెళ్ళి- "చెప్పు, ఎక్కణ్ణుంచి తెస్తాం? కార్లో ఆస్పత్రికి వెళ్ళి 'మా దగ్గిర డబ్బులయిపోయినయ్. ఇంతవరకూ చేసిన ట్రీట్ మెంట్ చాల్లెండి' అందామా?" అన్నాడు.
అతడి మాటల్లో వ్యంగ్యం వున్నా అది ఆమెని సంతోషపెట్టింది. ప్రార్థనకి ట్రీట్ మెంట్ కొనసాగించటానికి అతడు ఈ మాట ద్వారా పరోక్షంగా తన అంగీకారం తెలుపుతున్నాడు. ఆమెకెందుకో అది శుభ సూచకంగా కనిపించింది. వీటికన్నా ముఖ్య విషయం- కోర్టు విషయము! ఇక అది అతడికి తెలియవలసిన అవసరం లేదు. అతడు ప్రార్థనకి ట్రీట్ మెంట్ నిరోధించకపోతే ఆ కోర్టు కాగితం కేవలం ఆస్పత్రి రికార్డుల్లోనే వుండిపోతుంది. అంత వత్తిడిలోనూ ఆమె కాస్త వెసులుబాటుగ ఫీలయింది.
"మనకే ఇలా వుంటే ఈ కేన్సర్ అనే మహమ్మారి ఒక మధ్య తరగతి కుటుంబంలో వస్తే ఎలా వుంటుంది?"
ఆమె తలెత్తి చూసింది.
"ఎవరయినా ఒక కథ వ్రాస్తే బావుణ్ణు! ఒక సగటు గుమాస్తా తన కూతురి పెళ్ళికోసం జీవితాంతం కష్టపడి- ఓ పదిహేను వేలు సంపాదిస్తాడు. సంబంధాలు చూస్తూ వుండగా తండ్రికి కేన్సరని తెలుస్తుంది. ఇప్పుడతడు ఏం చేస్తాడు? ముసలి తండ్రిని మరో ఆర్నెల్లపాటూ బ్రతికించుకోవడానికి ఆ డబ్బంతా ఖర్చుచేస్తాడా? రోగాన్ని దాచిపెట్టి చౌక మందులువాడి, చూస్తూ చూస్తూ తండ్రిని శ్మశానానికి అర్పిస్తాడా? - కూతురు పెళ్ళి ముఖ్యమా? .... కాటికి కాళ్ళు సాచిన తండ్రి జీవితం ముఖ్యమా? ఏది ముఖ్యం...? బావుంది కదూ.... మనిషి సెంటిమెంటు మీద దేముడు ఆడిన మెలోడ్రామా... ఎలా వుంది.... హ్హాహ్హా .... టైటిల్ పెద్దదయిపోతుందేమో.... 'దేముడూ.... ది సాడిస్ట్' అన్న పేరు బావుటుంది, హ్హాహ్హా..."
