Previous Page Next Page 
ప్రార్థన పేజి 49


    బిగ్గరగా నవ్వుతున్న అతడివైపు ఆమె భయభ్రాంతురాలయి చూసింది. విపరీతమైన వత్తిడితో కూడిన డిప్రెషన్ అతడిని సెమీ-హిస్టీరిక్ గా మారుస్తూంది. ఆమె చప్పున అతడి దగ్గరకు వెళ్ళి అతడి చేతిమీద చెయ్యివేసి "అలా అనకండి, దేముడు మనల్ని చల్లగా చూస్తే ఈ కష్టాలన్నీ తొలగిపోవటం ఎంతసేపు" అంది. అతడు చప్పున నవ్వు ఆపుచేసి, ఆమెవైపు చిత్రంగా చూశాడు.

 

    "దేముడు గురించి మాట్లాడుతున్నావా వసుమతీ నువ్వు! ఈ దేముడి గురించి నాకు బాగా తెలుసు. నా మొదటి భార్య తన దర్శనానికే వెళ్ళివస్తూంటే ఆ కొండలమీదే ప్రాణాలు బలితీసుకున్నాడు. నీవు చెప్పే ఈ దేవుడు మనుష్యుల మూర్ఖత్వాన్ని తన చిద్విలాసాలకి బాగా ఉపయోగించుకునే ఆటగాడు- ఈ దేవుడి గురించి నువ్వు చెపుతున్నావా నాకు?"

 

    "వద్దండి... ఆ భావమే రానివ్వకండి... ప్లీజ్ .... మన పాపకు తగ్గుతే తిరుపతి వస్తామని ఒక్కసారి మొక్కుకోండి. కనీసం మా సంతృప్తి కోసమన్నా అలా చెయ్యండి".

 

    ఒక విజ్ఞాని- మూర్తీభవించిన మూర్ఖత్వంవైపు చూసినట్టు ఆమెవైపు జాలిగా చూసేడు. అంతలో గుమ్మం దగ్గర చప్పుడయింది. జిన్నీ... శ్రీను పిల్లలిద్దరూ నిలబడి తనవైపే చూస్తున్నారు. పినతల్లి కళ్ళలో నీళ్ళు చూసి బెదిరిపోయారో ఏమో గానీ, తండ్రివైపు ఆర్ద్రంగా చూస్తున్నారు వాళ్ళు కూడా.

 

    ఇంతమందిని అతడు కాదనలేకపోయాడు.

 

    వెళ్ళి ఫోటో ముందు నిలుచున్నాడు.

 

    దేవుడు ఎందుకో చిలిపిగా నవ్వినట్టు అనిపించింది.

 

    అతడి మొహంలో ఎన్నడూలేని సీరియస్ నెస్ చోటుచేసుకుంది. కళ్ళు మూసుకున్నాడు. మనసులో అనుకున్నాడు.

 

    "నేనో సైంటిస్టుని! జీవితంలో ఓడిపోయిన సైంటిస్టుని!! దేముణ్ణి నమ్మని సైంటిస్టుని!!! నీ ఆటలు చాలాకాలం నుంచీ గమనిస్తున్నాను. కోర్కె తీరితే మేము నీకు కాన్కలు అర్పించుకోవాలా.... తీరకపోతే అది మా ఖర్మ అనుకోవాలా.... ఇదేం రూలు?

 

    నా భార్యని బలి తీసుకున్న ఓ దేముడా!

 

    నా ప్రియాతి ప్రియమైన కూతుర్ని తీసుకోబోతున్న దానవుడా....!

 

    నేను నిన్ను ప్రార్థించను.

 

    నీతో ఒక పందెం కాస్తాను.

 

    నీకు మూడు గంటల టైమిస్తున్నాను. ఈ మూడు గంటల్లోగా ప్రార్థన కౌంట్ లో 'రెమిషన్' ప్రారంభమయితే సరే సరి, అప్పుడు నేను నీ అస్థిత్వాన్ని వప్పుకుంటాను. అలా జరక్కపోయినా నేను నీ వున్నచోటికి వస్తాను!!! కానీ అప్పుడు బాంబులతో నీ మీదకి దూకి నిన్నూ- నీ విగ్రహాన్ని వేయి ముక్కలు చేయటానికి వస్తాను. ఇన్ని కోట్ల మంది జనాన్ని నీ నుంచి తప్పించిన సంతృప్తితో మరణాన్ని ఆహ్వానిస్తాను. ఎలా వుంది నా ప్రార్థన.

 

    నా ప్రార్థన కోసం- ఈ ప్రార్థన..."

 

                                              5

 

    అతడు తన ప్రార్థన ఎలా పూర్తవుతుందో నిర్ణయించుకోవటానికి ఇంకా మూడు గంటల టైమ్ వుంది.

 

    ఈ లోపులో చెయ్యవలసిన పని మరొకటి మిగిలిపోయింది. అతడా పనిమీదే వెళుతున్నాడు.

 

    కారు లేదు. లాబ్ దగ్గరే వుండిపోయింది. నడుస్తూవుంటే కాలు నొప్పి పెడుతూ వుంది. అయినా దాన్ని లెక్క చేయకుండా సాగిపోతున్నాడు.

 

    అతడు తన ఇన్ స్టిట్యూట్ లోకి ప్రవేశిస్తూ వుంటే కాంపౌండ్ బయట ఆవరణమంతా కోలాహలంగా కనిపించింది. అతడు దాన్ని పట్టించుకోలేదు. ఆ లొకాలిటీ వెల్ఫేర్ అసోసియేషన్ తాలూకు యేదో ప్రారంభోత్సవానికి మంత్రిగారెవరో వస్తున్నారు. అదీ కలకలం.

 

    ఆ రష్ ని తప్పించుకొని అతడు ఇన్ స్టిట్యూట్ లోకి ప్రవేశించాడు.    

 

    కానీ వరండా ముందు నుంచి లోపలికి వెళ్ళలేదు. తను ఉద్యోగాన్నుంచి తొలగిపోయిన సంగతి ఈపాటికే అందరికీ తెలిసిపోయి వుంటుంది. వాళ్ళ సానుభూతి వాక్యాల్ని ఈ పరిస్థితుల్లో భరించలేడు.

 

    వెనుక నుంచి లాబ్ వైపుకు వెళ్ళాడు.

 

    లాబ్ ఇన్ ఛార్జి రమణమూర్తికి తన ప్రపంచమే తనది. మిగతా విషయాలు పట్టవు. భార్గవని చూసి మామూలుగా విష్ చేసాడు. అతడి ఆకారాన్ని చూసి ఆశ్చర్యపడలేదు. భార్గవ తేలిగ్గా శ్వాస పీల్చుకున్నాడు. ఇతడికింకా తెలియదన్నమాట. 'నాకో చిన్న సాయం చేయాలి. ఈ గాస్ ఎనలైజ్ చేసి ఏముందో చెప్పాలి'.

 

    కెమికల్ పరీక్షలకి ఆ పాకెట్ ఇచ్చాడన్న మాటేగానీ అతడికి దానిమీద ఆసక్తి లేదు. అతడి మనసంతా భవిష్యత్తుమీదే ఉంది. కూతురు బ్లడ్ కౌంట్ లక్ష సమీపిస్తుంది. అది దాటితే ప్రతిక్షణమూ ప్రమాదమే. రెండోది తన ఉద్యోగం. చేతకాని డిటెక్టివ్ పనిని చేపట్టి ఉద్యోగం పోగొట్టుకున్నాడు.

 

    "క్యాన్- క్యూర్" మందు బోగస్ అనీ, అది కేన్సర్ ని ఏమాత్రం తగ్గించదనీ నిరూపించితే వచ్చే లాభం ఏమీలేదు. మహా అయితే పార్లమెంట్ లో దీనిమీద ఒక గంట చర్చ జరుగుతుందంతే.

 

    మరెందుకింత రిస్క్ తీసుకుని ఈ పనిచేసేనా అని ఒక క్షణం బాధపడ్డాడు. అంతలోనే తనను తను సమర్ధించుకున్నాడు. వాళ్ళు ఉద్యోగంలోంచి తీసెయ్యాలీ అనుకుంటే ఏ నెపం పెట్టుకుని అయినా తీసెయ్యగలరు. కేవలం అరెస్టు కాబడటం, కోర్టు కేసు ఇవేం అక్కర్లేదు.

 

    అతను తన రూమ్ కి వెళ్ళి కాగితాలు, తన పెర్సనల్ వస్తువులు సర్దుకున్నాడు. పెర్సనల్ అంటూ పెద్దగా ఏమీలేవు. కొన్ని సైన్స్ పుస్తకాలు, పేపర్లు- అంతే. సైంటిస్టులకి అంతకన్నా ఎక్కువ ఏముంటాయి? రాబోయే వ్యక్తికి ఛార్జి అప్పజెప్పటంలాంటివేమీ ఉండవు.

 

    మొహంలో వ్యధనీ, కళ్ళలో బాధనీ కనబడనీయకుండా వుండటము కోసం అతడు చాలా కష్టపడవలసి వస్తూంది. అదృష్టవశాత్తు గదిలోగానీ, చుట్టు ప్రక్కలగానీ ఎవరూ లేరు.

 

    "టెర్మినేట్" చేయబడటం అనేది ఆ ఇన్ స్టిట్యూట్ చరిత్రలో లేదు. కానీ ఇదో రకంగా అటువంటి చర్యే. ఎవరయినా రాజీనామా ఇచ్చినా, రిటైరయినా వున్న కొద్దిమందీ కలిసి పార్టీ ఏర్పాటు చేసుకోవటం అలవాటు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS