ఉత్తరం మూసేస్తూ చాలాకాలం తర్వాత బిగ్గరగా నవ్వేడు భార్గవ. ఇంతకాలం తల బ్రద్దలు కొట్టుకున్నది ఇంత చిన్న కారణంగానా... మళ్ళీ నవ్వొచ్చింది. పిల్లలిద్దరూ తండ్రినే విచిత్రంగా చూస్తున్నారు.
"ఏమిటి నాన్నా?" అని అడిగింది జిన్నీ.
"ఏం లేదమ్మా" నవ్వాపుకుంటూ మాట మార్చి, "అవునూ- మీరు స్కూలుకి వెళ్ళలేదేం?" అని అడిగాడు. ప్రార్థనకి అంత సీరియస్ గా వుందన్న విషయం సాధ్యమైనంత వరకూ పిల్లలకి తెలియకుండా వుండటం కోసం వాళ్ళని స్కూల్ కి పంపుతూనే వున్నాడు.
"ఈరోజు స్కూల్ కి శలవిచ్చారు".
"ఎందుకు?"
"ఏసుపాదం చచ్చిపోయాడుగా!"
నట్టడవిలో హఠాత్తుగా దావానలం చుట్టుముట్టినట్టూ ఒక వెచ్చటి గాలి అల- అతడిని వణికించి భయభ్రాంతుడ్ని చేసింది. ముందు జరగబోయే సంఘటనకి ఇది తొలి సూచనగా అతడు కంపించిపోయాడు. ఎన్నో రోజులు కూడా రాలేదు. తను ఆస్పత్రికి ఫోన్ చేసి కనుక్కోవటం- వాళ్ళు ఆ కుర్రవాడికి 'అడ్వాన్స్ స్టేజి ఆఫ్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా' అని చెప్పటం... తనకి ఆ కుర్రవాడి తల్లి- ఆ ముసలమ్మ వణుకుతున్న చేతుల్తో దణ్ణం పెట్టి "ప్రభువు నిన్ను రక్షిస్తాడు బాబూ" అనటం అంతా కళ్ళముందు కదలాడింది.
'ఓ ప్రభువా!
చిన్నారి పాపల్ని నిర్దాక్షిణ్యంగా నలిపేసే కేన్సర్ ని సృష్టించిన నీ కరుణా కటాక్షాలు మా కఖ్కర్లేదోయీ, మా బాధలు మేం పడతాం. కేన్సర్ కి వ్యతిరేకంగా మేమే మా శాయశక్తులా పోరాడతాం'.
... స్కూల్లో ఎవరో స్టూడెంటు చచ్చిపోయాడనగానే కుర్చీలో కూలబడి కళ్ళు మూసుకున్న తండ్రిని చూసి, పిల్లలిద్దరూ మొహమొహాలు చూసుకున్నారు.
జిన్నీ తండ్రి దగ్గిరకి వచ్చి 'నాన్నా' అంది.
అతడు కళ్ళు తెరవకుండానే 'ఊఁ' అన్నాడు.
జిన్నీ మరింత దగ్గరికి వచ్చింది. అతడు ఆ పాపని దగ్గరికి తీసుకున్నాడు. మరోవైపు శ్రీనూ వున్నాడు. జిన్నీ తటపటాయిస్తూ మళ్ళీ 'నాన్నా' అంది.
"ఏమ్మా!"
"అక్కయ్యకి- అక్కయ్యకి కూడా కేన్సరటగా"
పక్కనే పెద్ద విస్ఫోటనం జరిగినట్టూ భార్గవ ఉలిక్కిపడి చప్పున కళ్ళు తెరిచి, ఎవరు చెప్పారు?" అన్నాడు.
"పన్నక్క బ్రతకదట. చాలా సీరియస్ గా వుందట..." నీకు తెలియని విషయం మాకు తెలిసింది అన్నట్టూ శ్రీనూ అన్నాడు.
భార్గవ పళ్ళు బిగించి, "ఎవరు చెప్పారు?" అని రెట్టించాడు. అతడి కంఠం అతడికే వికృతంగా ధ్వనించింది. పిల్లలు బెదిరి ఒక అడుగు వెనక్కి వేశారు. అతడు జిన్నీ రెక్కపట్టుకుని విసురుగా దగ్గరకు లాక్కొని మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు.
"శా... శారద టీచర్ చెప్పింది. పిన్ని జాతకం మంచిది కాదట. అందుకే పెళ్ళవగానే ఇళా జరిగిందట"?
భార్గవ కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. అయినా ఆవేశాన్ని అణుచుకోవటం కష్టమౌతుంది.
స్త్రీలో ఇంత కుత్సితము దాగి వుంటుందన్నది అతడి ఆలోచన కందని విషయం. ఎవరి బ్రతుకు వారు బ్రతక్కుండా ఎందుకీ ఆడవాళ్ళు దేముడు తనకిచ్చిన సున్నితత్వాన్నీ- సుకుమారత్వాన్నీ- సినిసిజం, సాడిజంగా మార్చుకుంటారు? మాటల వాంతుతూ ఆలోచన్ల అజీర్తితో బాధపడతారు! ఎక్కడో పరోక్షంలో తాము వదిలిన ఒక చిన్న మాట ఇక్కడో హృదయాన్ని బ్రద్దలు చేస్తుందని ఎందుకు ఆలోచించరు?
"జిన్నీ"
"ఏం డాడీ!"
"కొంచెంసేపు మీ ఇద్దరూ అల్లరి చేయకుండా బైట ఆడుకోండి".
"అలాగే నాన్నా"
"కిటికీ తెరలు దగ్గరికి లాగెయ్యండి".
వాళ్ళు నిశ్శబ్దంగా ఆ పనిచేసి గదిలోంచి నిష్క్రమించారు. గదిలో చీకటి అలుముకుంది. అతడి మనసులోలాగే. అతడు తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు. అకస్మాత్తుగా అతడికి సోమశేఖరం మొదట్లో చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి.
"-అతి కొద్దికాలంలోనే మీరు గొప్ప చిక్కుల్లో పడబోతున్నారు. ప్రపంచం అంతా మీకు ఎదురు తిరుగుతుంది. మీరు పేపర్లలోకి ఎక్కుతారు. వృత్తిరీత్యా కార్యకలాపాల్లోనూ, గృహ సంబంధమైన విషయాల్లోనూ, మొత్తం అన్ని వైపుల్నించీ ఒక్కసారిగా మీకు వ్యతిరేకత కానవస్తుంది- దాంతో మీరు కాలిన పెనంమీద ఆవగింజలా అల్లల్లాడిపోతారు".
అతడికి శేఖరం గుర్తొచ్చాడు. ఎక్కడున్నాడో' అనుకున్నాడు. తన స్నేహితుడు తనకి సాయం చెయ్యబోయి, ఒక నిర్మానుష్యమైన చోట, చెత్తకుండీ పక్కన, కళ్ళుపోయి, ఆ స్థానే రక్తపు గుంటలుపడి, నాలుకతెగి మూగవాడై, చెవి ఎముకలు బ్రద్ధలై జీవచ్చవంలా బ్రతుక్కీ, చావుకీ మధ్య వేలాడుతున్నాడని అతడికి తెలీదు.
ఆ గది నిశ్శబ్దాన్ని చెదురుస్తూ తలుపు దగ్గిర అలికిడి అయింది. అతడు కళ్ళు విప్పి చూసేడు.
గుమ్మం దగ్గర వసుమతి నిలబడి వుంది. ఇద్దరూ ఒకర్నొకరు చూసుకుంటూ అలానే నిశ్శబ్దంగా వుండిపోయారు.
ఎంత దగ్గర- కానీ ఎంత దూరం!
ఆమె ముందుకొచ్చి కిటికీ తెర తీయబోయింది.
"అలాగే వుంచు వసుమతీ, నేనే వెయ్యమన్నాను" అన్నాడు. ఆమె ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.
"ఎలా వుంది పన్నూకి?"
ఆమె తటపటాయించి, "అలాగే వుంది" అన్నది.
"ఎంత కౌంటు?"
"92,000"
అతడు వణికిపోయి "ఎంతా?" అడిగాడు.
"తొంభై రెండు వేలు" అంది. ఆమె కంఠంలో, రాబోయే ఉపద్రవాన్నే ముందునుంచీ వూహించుకుంటూ ఉండటంవల్ల వచ్చిన నిశ్చలత వుంది.
"... అయిపోయింది .... దగ్గిరకొచ్చేసింది..." తనలో తనే గొణుక్కుంటున్నట్టు అన్నాడు. ఆమె అతడి దగ్గరికి వెళ్ళి భుజంమీద చెయ్యి వేద్దామనుకుంది. కానీ ఆ చనువు లేదు. ఈ పరిస్థితుల్లో కావల్సింది చనువా? ... కాదేమో! మనసు పొరల్లో గిల్టీ కాన్షన్ నెస్. ఆమె చెప్పాలనుకుంటూంది.... చెప్పలేకపోతూంది.
