"మరీ అంత కానికులందాన్ని కాదుగా నాన్నా? వాళ్ళలోనన్ను కలుపుకోకపోవడానికి?మరీ అంత సంకుచితులూ, ఛాందసులూ అయితే వాళ్లకి దూరంగా వుండిపోవడంతో నాకేంపోదు."
"ఎంతసేపూ నీగురించే ఆలోచించుకొంటావుగాని ఆ అబ్బాయి తలిదండ్రుల గురించి ఎందుకాలోచించవు?"
"ఆ ఆలోచన ఆ అబ్బాయే చేస్తాడు! నాకవసరంలేదు."
"వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే?"
"ఒప్పిస్తానన్నారు!"
"ఒప్పుకుంటే మంచిదే. చక్కగా పందిరివేసి, ఇంటిముందు పెళ్లి చేసి అన్ని లాంఛనాలతో అత్తవారింటికి పంపిస్తాం. అలా కాకుండా ఏ రిజిష్టరు మ్యారేజో, దొంగ పెళ్లో అయితేమటుకు మా మనస్సులు చచ్చేదాకా కుమిలి పోతుంటాయని గుర్తుపెట్టుకో!" అంది తల్లి.
మరోరోజు శర్మ వచ్చి శాలినిని తీసుకెళ్లాడు. ఈ ఇంటికి కాబోతున్న కోడలని పరిచయం చేశాడు స్నేహితురాలని కాకుండా.
శాలినిని ఇంటికి సాగనంపి తిరిగి వచ్చేసరికి ఇంట్లో పెద్ద దుమారమే చెలరేగింది. పెద్ద యుద్దమే చేశాడు శర్మ. చివరికి గెలిచాడు.
"ఎలాగో మా గొంతులమీద కూర్చొని పెళ్లికి వప్పించావు. ఇచ్చిపుచ్చుకోడాల విషయం మాత్రం పూర్తిగా మాకే వదిలిపెట్టాలి" అన్నాడు తండ్రి రామమూర్తి.
"ఇచ్చి పుచ్చుకోడాలేమిటీ?"
"పెళ్లంటే ఇచ్చిపుచ్చుకోడాలుండవా?"
"అంటే కట్నకానుకలేనా? అదేం కుదరదు. ఒక్కపైసా కూడా మీరు కట్నం అడడానికి వీల్లేదు. ' ఖచ్చితంగా చెప్పాడు శర్మ.
"అంత గతిలేని స్థితిలో వున్నారా నీ కాబోయే అత్తగారు? కూతురి పెళ్లికి ఏం తీసిపెట్టకుంటారా?"
"తీసి పెట్టారేమోగాని, మనం ఒక్కపైసాకూడా పుచ్చుకోవద్దు!"
"అదేమిట్రా? మనం ఒక్కరం తీసుకొంటున్నామా? అందరిళ్లలో ఉన్నదేకదా?"
"అందరూ రోత తింటున్నారని మనమూ తిందామా?"
"బంగారానికీ, బట్టలకీ, పెళ్లి ఖర్చులకీ కావాలికదా డబ్బు?"
"వినాయకుడి బొడ్డుగిల్లి వినాయకుడికీ నైవేద్యం పెట్టినట్టుగా, వాళ్లని పిండి వాళ్ల పిల్లకు పెట్టడం ఏం మర్యాద నాన్నగారూ? మనకున్నది పెడదాం. లేకుంటే లేదు. ఇహ పెళ్లి ఖర్చు అంటారా! నాకు ఈ సాంప్రదాయపు పెళ్ళిళ్లమీద సదభిప్రాయం లేదు. చెల్లెలి పెళ్ళిలో జరిగిన పోట్లాటలూ, హైరానా, దుబారా అవన్నీ చూసాక భార్యాభర్తలుగా జీవించడానికి ఇంత తతంగం అనవసరంమంటాను."
"ఒస స్త్రీ, ఒక పురుషుడు పెళ్లి చేసుకొని దాంపత్యం నెరుపుతున్నారని నలుగురికీ తెలియాలంటే ఇంత తతంగమూ అవసరమే కదా."
"నలుగురికి తెలియడమే ముఖ్యమనుకొంటే ఒక పేపరు అనౌన్సుమెంటివొచ్చు. రెండు మనసులు కలిసి జీవించడానికి మంత్రాలు, బాజాలు బంధువులకి భోజనాలు ఇవి అవసరం లేదని నా అభిప్రాయం."
"జాతి సంస్కృతిలో ఇవి ఒక భాగంరా, పెళ్ళిళ్లు, పేరంటాలు పండగలు పబ్బాలు ఇవి ఖర్చు అనుకొని, అర్దంలేని వనుకొని మానేస్తే మనిషి జీవితం యాంత్రికమైపోదూ"
"మగపిల్లాడి పెళ్లి అనుకోగానే మీరు ఏడాదిక్రితం చెల్లాయ్ పెళ్ళికి పడిన యాతన మరిచి పోయినట్టున్నారు. వరకట్నం పాతికవేలకు తక్కువైతే ఆ సంబంధం పోతుందని చటుక్కున ఒప్పేసుకుని కట్నం డబ్బులు భర్తీ చేయడానికి ఎందరికాళ్లు పట్టుకొన్నారు. ఇంకా ఆ బట్టలకి. బాకీ, పెళ్ళి తాలూకు చిల్లరబాకీలూ మీ ప్రాణాన్ని పిండుతూనే వున్నాయి అంత అవస్థపడి మీరా పెళ్ళిచేస్తే పెళ్ళిలో మర్యాదలు సరిగా జరగలేదని పెళ్లికొడుకు బావగారు మీ బావమరిదిని కొట్టొచ్చాడు, బంధువులలో పట్టుకోకపోతే పెళ్ళింట్లో ఒక ఖూనీ ఖచ్చితంగా జరిగిపోయేది. అప్పుడు అందరూ విసుక్కున్నారు రిజిష్టరు మారేజో, పూలదండల పెళ్లో అయితే ఈ హైరానా వుండదు కదాని! కాలానుగుణంగా సంప్రదాయాలు, ఆచారాలు మార్చుకోవాలి నాన్నగారూ. అసలు శాస్త్రాలకి కాలం తీరిపోయింది. శాస్త్రాలలోని విషయాలను ప్రస్తుతం యంత్రయుగంలో వున్న మనం జీవితంలో పెట్టాలనుకోవడం వట్టి హాస్యాస్పదం. "
