"రామయ్యబాబు ఒంటరివాడేనట. అతనికీ ఎవరూ లేరు. వాడిక్కడే వుంటాడు"
రాణీ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిచేసి చూసింది. "ఇక్కడా?"
"అవును. వాడు నిన్న రాత్రినుంచే నా పెద్దకొడుకు అనుకున్నాను. నీకు పెద్దబావ!"
మేనత్త మాటలకి రాణీ మనసు పులకరించింది.
అదే సమయంల గుమ్మంలోకి వచ్చి తనను చూసీచూడనట్టుగా గుమ్మం పక్కకి తప్పుకొన్న పరుశురాంని చూసింది రాణీ.
దాంతో అతన్ని ఓ ఆట ఆడించాలనుకుంది. తను చూసిందప్పుడే కానీ, నిజానికి అతను తన వెనకే వచ్చి బయట నిలబడి తన మాటలన్నీ విన్నాడని రాణీకి తెలీదు.
"అడ్డమైనవాళ్ళనీ 'బావా బావా' అని పిలవడానికి నాకు సిగ్గులేదనుకున్నావా! మా కన్నయ్యే నా బావ బుచ్చిబావ" అంది క్రీగంట గుమ్మం కేసి చూస్తూ.
"నోటికొచ్చినదల్లా వాగకే పిల్లా! రామయ్య నా బిడ్డని చెప్పాను. అడ్డమైనవాడు కాదు. ఈ బస్తీలో మనందరితో కలసి వుంటాడు" యాదమ్మ గర్వంగా చెప్పింది.
"నీ యిష్టం. ఎవరూ లేరంటే నమ్మేదెలా? దొంగో దొరో మనకి తెలీదు. ఏ పోలీస్ స్టేషన్నుంచో పారిపోయొచ్చిన కేసే కావచ్చు"
"నువ్వు నోరు మూసుకోవే!" కోపంగా అంది యాదమ్మ.
"నాకెందుకులే మధ్య. నేనా మనిషిని చూశాను. నువ్వు వాడి మాటలే విన్నావు. అసలే ఇంతింత మాత్రం సంసారం నీది. కన్నయ్య తెచ్చే డబ్బులతో ఈ శాల్తీనెక్కడ పోషించగలవు. అంతకంటే ఓ ఏనుగుని పెంచుకో. ఇల్లు, బట్టలు అన్నీ తప్పుతాయి. మించిపోయింది లేదు. గెంటేయ్" అంది రాణీ.
"ఎందుకే అలా నోరు పారేసుకుంటావు. ఇంట్లోంచి పొమ్మంటే ఎక్కడికి పోతాడు. నాల్రోజులు పోతే మన కన్నయ్య ఏదయినా ఉద్యోగమిప్పిస్తాడు. అది చేసుకుంటాడు" అంది యాదమ్మ.
"ఇదిగో అత్తా! నీకిదే చెపుతున్నా! ఆ సున్నం పిడతగాడ్ని వెంటేసుకుని ఇంద్రుడు, చంద్రుడు అని పొగడకు. నాకు ఒళ్ళు మండిపోతుంది. నా కంటికి పాత కేడీలా కనిపించాడు. ఆ పైన నీ యిష్టం. నాకయితే కష్టపడి 'పని' చేసేవాడిలా కనిపించడం లేదు"
యాదమ్మ చిన్నగా నవ్వింది.
"నీకు యిష్టం లేకపోతే రావడం మానేయవే! రామయ్య కేడీ అయినా దొరబాబయినా వాడు నాకు దేవుడు. నాకు పేగు తెంచుకు పుట్టకపోయినా వాడే నా పెద్దబిడ్డ"
"సరే నే పోయొస్తా" అంది రాణీ గుమ్మంకేసి అతను లోపలకొస్తాడేమోనన్న ఆశతో చూస్తోంది.
"నాయనేం చేస్తున్నాడు?" అడిగింది యాదమ్మ.
"మొన్న తాగిందిప్పటికీ దిగలేదు." అంది.
"నిన్న తాగలేదా?" ఆశ్చర్యంగా అడిగింది యాదమ్మ.
రాణి అదోలా నవ్వి అంది-
"నేను చెప్పింది మొన్న తాగింది దిగలేదని అంటే నిన్న తాగలేదని కాదు"
"ఆడిక బాగుపడడు" అంది యాదమ్మ దిగులుగా.
రాణి చేతి గాజులకేసి చూసుకుంటూ లేచి నించుంది.
"ఆడపిల్లవైనా మగాడిలా తండ్రిని ఆదుకుంటున్నావు. ఆడికి బుద్ధి ఎలా వస్తుందో?" కోపంతో అంది యాదమ్మ.
"పోన్లే అత్తా! ఇలా అనుకుని లాభం ఏముంది?"
"నువ్వో ఇంటిదానివై వెళ్ళిపోతే ఏం చేస్తాడో?"
"రెండూ జరిగేవి కాదు. అటు నాన్న తాగడం మానడు. నాకు పెళ్ళీ జరగదు" అని పరుశురాం తొంగిచూడ్డం గమనించి అంది.
"ఏ మొగుడూ లేనిదానికి మేనత్త కొడుకే దిక్కన్నట్టు ఇక కన్నయ్యగాడు పెద్దయ్యాక ఆడ్ని చేసుకుంటాను"
మేనకోడలి మాటలకి యాదమ్మ గుమ్మనంగా నవ్వుకొంది.
"నే వెళుతున్నా! నీ చుట్టం కొడుక్కి నేను కూర పట్టుకొస్తాను. పొయ్యిమీద అన్నం పెట్టుకో చాలు" అంది రాణి.
"ఏం కూర తెస్తావే?"
"కోడికూర" అని గుమ్మాన్ని సమీపిస్తూ-
"మొహానికి కోడి కూరక్కొటే తక్కువ" అంది.
అక్కడ అతనున్న ఉనికి తనకి తెలీనట్టే కూనిరాగం తీస్తూ జడని ముందుకేసుకుని గుమ్మంలోచి బయటకొచ్చింది. పరుశురాం గభాల్న ఆమె చేయి పట్టుకున్నాడు.
అతన్ని అప్పుడే చూసినట్టు గింజుకోవటానికి ప్రయత్నిస్తూ-
"ఏంటిది? ఆడది కనబడగానే చెయ్యి పట్టుకోవడం నీకు అలవాటా?" కోపం నటించింది రాణి. దాంతో ఆమె రెండోచేతిని కూడా గట్టిగా పట్టుకున్నాడు పరుశురాం.
"చెయ్యొదులు. లేకపోతే అరుస్తాను."
"ఏమని అరుస్తావు?"
"అత్తయ్యా! ఈ మనిషి నన్ను రేప్ చేస్తున్నాడని" గుసగుసగా అంది.
"అదేమిటి, అరవకుండా నా చెవిలో చెపుతున్నావు. చెయ్యమంటావా?"
"ఏమిటి?" కళ్ళు తిప్పుతూ అడిగింది.
"రేపు"
"రేపు కాదు.... రేప్ అనాలి" సవరించింది రాణి.
"వాటి గురించి బాగా తెలుసనుకుంటాను"
"ఛీ పాడు! పోనీ కదాని ఊరుకుంటే ఏంటిది? చెయ్యి వదులు" పరుశురాం పట్టుని మరింత బిగించాడు.
"ప్రస్తుతం నీ చేతులు మాత్రమే పట్టుకున్నాను"
"లేకపోతే ఏం పట్టుకొంటావేంటి?"
అతన్ని వెనక్కి తోయబోయింది.
