Previous Page Next Page 
ది ఎడిటర్ పేజి 46

 

    కాసేపు ,మౌనంగా ఉండిపోయింది హరిణి. తర్వాత అంది-----
    "మీరు అలా ఖచ్చితంగా చెబితే నాకు ఒకటే ఆప్షన్ మిగులుంది."
    "ఏమిటది?"
    "అలా చెయ్యడం నాకు ఇష్టం లేదు కానీ చెయ్యక తప్పదు సార్?"
    "వాటీజ్ దట్ అండ్ వాట్ డూ యూ మీన్?"
    "నా చేతిలో ఒక ఆయుధం వుంది. మీరు నాతో అసభ్యంగా ప్రవర్తించారని ప్రచారం చెయ్యగలను అది నా చేతిలో పని."
    ఆమె మాటలకు స్టన్ అయిపోయినట్లు చూశాడు ఎడిటర్.
    "హరిణీ?"
    చటుక్కున లేచి నిలబడింది హరిణి. తన జాకెట్టుని భుజం దగ్గర పట్టుకుని చేత్తో లాగింది.
    సర్రుమని కాస్త మేర చిరిగింది జాకెట్టు.
    "నో అయ్ విల్ షౌట్! అయ్ విల్ షౌట్ ఫర్ హెల్ప్! నిమిషాల్లో జనాలు పోగువుతారు, ఆ తర్వాత మీరు ........సర్! మీరు మీ డిసిషన్ మార్చుకోడానికి ఇంకో అవకాశం యిస్తున్నాను. ఐ డోంట్ వాన్ ట్ టు క్రియేట్ అన్ ప్లేజెన్ ట్ నెస్! వాట్ డూ యూ సే?"
    ఎడిటర్ ఏమీ మాట్లాడలేదు. రెండు సేకెండ్లు వెయిట్ చేసి, అరవడానికి నోరు తెరిచింది హరిణి.
    
                                                   18

    పాలప్యాకెట్ తేవడం కోసం తూరుపు తెలతెల వారకుండానే లేచి కూర్చున్నాడు అభిషేకాన్.
    లేచీ లేవగానే అతని కళ్ళముందు మెదిలింది ఒక భయానక రూపం.
    కాలభైరవుడి లాంటి కుక్క ఒకటి నిలబడి అతని కాలు అందుకోవడానికి ప్రయత్నిస్తోంది.
    "అమ్మో! అని కీచుగా కేకపెట్టి కళ్ళు నులుముకుని మళ్ళీ చూశాడు అభిషేకన్.
    కుక్క మంత్రమేసినట్లు మాయమై పోయింది. నిట్టూర్చాడు అతను.
    అయితే ఇది కేవలం తన భ్రమేఅన్నమాట! ఆ రోజున అంటే ఉదయార్కర్ ని తను చెత్తకుండీ పక్కన చూసిన రోజున ఒక కుక్క అతని వెంటబడి తరిమింది. ఆ రోజు నుంచి తను కనబడితే చాలు, కొయ్యిమని మొరుగుతూ దెయ్యంలా వెంటబడుతోంది వదలకుండా.
    కుక్కని తలుచుకోగానే వళ్ళంతా చెమటలు పెట్టేశాయి అతనికి. అతి కష్టం మీద లేచి, లుంగీ సరిగా కట్టుకుని, కిచెన్ లోకి వెళ్ళి దేవుడి పటం ముందు నిలబడ్డాడు.
    మొన్నటిదాకా పరమనాస్తికుడు అతను. ఈ కుక్క గండం తగిలాక పరమ ఆస్తికుడయిపోయాడు ఒక్కసారిగా. కిచెన్ లో ఒక చిన్న మందిరం, అందులో మురగన్ , మధుర మీనాక్షి, కంచికామాక్షి కొలువు దీర్చి ఉన్నారు. తమిళనాడులో ఉన్న గూళ్ళు గోపురాలలోని దేవతలా పటాలే అతను తన యింట్లో ఉంచుతాడు. దేవతలకు కూడా భాషాభేదాలు ఆపాదించగల మహా జ్ఞాని అతను.
    సింహాద్రి అప్పన్న, తిరుపతి వెంకన్న, బెజవాడ దుర్గమ్మ వగైరాలనీ అతను పూజగదిలోకి రానివ్వడు. వాళ్ళందరూ తెలుగు దేవుళ్ళని అతని అభిప్రాయం.
    అలాగే రాముడూ, కృష్ణమూర్తి నార్త్ ఇండియన్స్ కాబట్టి అతనికి గిట్టదు.
    ఆ కుక్క బారినుంచి తనని బయటపడవెయ్యమని మధుర మీనాక్షి , కంచి కామాక్షికీ, మురగన్ కి పొర్లు దణ్ణాలు పెట్టి వారి కోసం పరిగెత్తాడు అభిషేకన్. అదురుతున్న గుండెలతో వెనక్కి వెనక్కి చూస్తూ పాల ప్యాకెట్ తీసుకుని తిరిగి వచ్చాడు.
    "అమ్మయ్యా! ఇవ్వాళ్టికి ఇల్లు చేరాను. అని అతను అనుకుంటూ ఉండగానే అతని కాలికి ఏదో వేగంగా వచ్చి తగిలింది.
    గుండె ఆగినట్లు అయింది అభిషేకన్.కి. బొంగరంలా గిర్రున వెనక్కి తిరిగి చూసాడు.
    అతని కాళ్ళ దగ్గర పడి ఉంది న్యూస్ పేపరు. పళ్ళన్నీ బయట పెట్టి మెట్ల కింద నిలబడి వున్నాడు పేపరు బాయ్.
    "పేపర్ ని రాకెట్లా అలా విసరవద్దని చెప్పానా " అని అరిచాడు అభిషేకన్ వెర్రెత్తినట్లు."
    మళ్ళీ పళ్ళన్నీ బయటపెట్టి నవ్వి వెళ్ళిపోయాడు న్యూస్ పేపర్ బాయ్.
    పళ్ళు కొరుకుతూ లోపలికి వచ్చి పేపరు తెరిచాడు అభిషేకన్.
    వెంటనే అతని మోహంలో ప్రేత కళ తగ్గి సంతోషం కనబడింది.
    అతని దృష్టిని ఆకర్షించింది ప్రముఖంగా వున్న ఒక ప్రకటన.
    "సంసారం ఆధు మిన్సారం" అనే తమిళ చిత్రానికి ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ వచ్చినట్లు ఉంది ఆ ప్రకటనలో.
    సంతోషం పట్టలేక ఎగిరి గంతేశాడు అభిషేకన్ ఎగిరి వంటింటి గుమ్మం ముందు వాలాడు. కిచెన్ లోకి తొంగిచూసి "ఇవాళ స్వీట్ ఛాయ్! ఇవాళ మనకు మహా పర్వదినం!" అన్నాడు ఉప్పొంగిపోతూ.
    తర్వాత కూనిరాగాలు తీస్తూ బాత్ రూంలోకి వెళ్ళి షేవింగ్ మొదలెట్టాడు. షేవింగ్ పూర్తయింది. సంతోషంతో తనేం చేస్తున్నాడో తనకే తెలియక , దువ్వెన అనుకుని ఆరేజరుతోనే బట్టతలని రెండు సార్లు దువ్వాడు. బంజరు భూమిని నాగలితో దువ్వినట్లు బట్టతలమీద ఎర్రటి చారికలు రెండు ఏర్పడ్డాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS