Previous Page Next Page 
కౌగిట్లో కృష్ణమ్మ పేజి 46

 

    శరీరాన్ని సమాధి లోపలకు చేర్చేప్పుడు తీసేందుకు వీలుకాకుండా అమర్చుకున్న ఆభరణాలు రక్తమాంసాలు జీర్నమాయిపోగా స్థాన భ్రంశమయి కంకాళం ప్రక్కనే పడి వున్నాయి.
    అవి ముక్కెర ఒకటి, కంటే రెండు, దండచేతి వలయంకం మూడు, నాగ పడగ నాలుగు!
    వాటన్నింటిని సేకరించాడు జయకృష్ణ.
    బండపూసల ఆభరణాలున్న మట్టి పాత్ర సగం వరకు నిండి వుంది. మిగిలిన చోటు ఖాళీగానే వుంది.
    "లచ్చిమీ!" అని కేకపెట్టాడు జయకృష్ణ.
    కసిగా విసిరిన చాకులా ఖస్సున దూసుకు వచ్చింది లచ్చిమి ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నట్లు!
    "నా కిట్టులో కాన్వాసు గుడ్డతో తయారయిన ఒక సంచీ వున్నది దాన్ని తీసుకురా!" అని చెప్పాడు జయకృష్ణ.
    ఒక యజ్ఞంలా ఎంతో ఉత్తేజితంగా జరుగుతున్న ఆ కార్యక్రమంలో తనకు కూడ రవంత ఉడుతా భక్తిని ప్రదర్శించుకునే పాత్ర దొరికినందుకు పొంగిపోయింది లచ్చిమి.
    వెంటనే తిరిగి వెళ్ళిపోయి కాన్వాసు బట్టతో తయారయిన బాగ్ పట్టుకొచ్చింది. దానిలోంచి కెమెరా తీశాడు జయకృష్ణ.
    స్కేలిటన్ తో సహా అన్నింటినీ అన్ని కోణాలనించి ప్లాష్ తో ఫోటోలు తీసి ఒక్కొక్క వస్తువునీ కాన్వాస్ బాగ్ లోకి సర్దాడు.
    అక్కడ వదిలి పెట్టిన వస్తువులు ఏవీ లేవని నిర్నయమాయక ముందుగా తాను బయటకు వచ్చాడు జయకృష్ణ.
    ఆ వెనుక జ్యోతి వెలుపలకు వచ్చింది. రవి కిరణాలు వెచ్చగా శరీరాన్ని తాకటంతో ఏంతో హాయి అనిపించింది.
    టీతో పాటు బ్రెడ్ తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు.
    కిట్ మోయవలసిన భారాన్నించి విముక్తురాలయింది జ్యోతి. ఆదిమ జనులు తమంత తాముగా ఆ భారాన్ని స్వీకరించటంతో ఉల్లాసంగా నడువసాగింది జ్యోతి.
    తిరిగి వచ్చేటప్పుడు ఏటి గట్టున నడువవలసిన అవుసరం లేదు. దగ్గరలో రహదారులున్న గ్రామం కావటం  నించి చిరిగిరి (శ్రీగిరి) చేరేందుకు నిర్ణయించుకున్నారు జయకృష్ణ.
    ఆదిమ జనులందరికీ వీడ్కోలు చెప్పారు. లచ్చిమిని వెంట బెట్టుకుని అపరాహ్ణం వేళకు గ్రామం చేరుకున్నారు. అక్కడ రవంత అయినా ఆలస్యం చేయక దక్షిణ విజయపురి ప్రయాణమయినారు.

                                        *    *    *

    వర్షం కురిసిన చీకటి రాత్రి శ్వేతకి అత్మరూపంలా కన్పించిన ధవళమూర్తి ని తలుచుకుంటూ , ఆమె హెచ్చరికను మనసులో వుంచుకుని జ్యోతి యోగక్షేమాల గురించి భయపడుతూ క్షణాలు లెక్కించి ఆ రాత్రిని తెల్లవార్చుకుంది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
    తెల్లావారాక ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది.
    ఉపాధ్యాయునిలా వచ్చి ప్రమాదం తలపెట్టిన వ్యక్తిని హిప్నాటిజం లోకి దించి  ఆ సంఘటనని ఒక నాటకీయ సంఘటనలా మార్చగలిగింది తాను.
    కాని  ఆ వ్యక్తి ఎవరో తెలియదు.
    వెంటనే ఆమె పోలీసులకు ఫోన్ చేసింది. ఆమెను తక్షణం బయలుదేరి రావలసిందిగా అర్ధించాడు ఇన్ స్పెక్టర్.
    ఏదో పెద్ద కారణం లేనిదే తనను రమ్మని చెప్పి వుండరని ఆలోచిస్తూ బయలుదేరిందామె.
    అనుకున్నంత వేగంగా తాను జ్యోతిని కలిసేందుకు బయలుదేరలేనని భయపడుతూనే పోలీస్ స్టేషన్ చేరుకుందామే.
    కేవలం సుప్రభాత సమయం కావటంతో స్టేషన్ లోపలా బయటా నిశ్శబ్ధమే రాజ్యమేలుతోంది. రాత్రి డ్యూటీ చేసి ఇంకా ఇళ్ళకు చేరుకోని ఒకరిద్దరు పోలీసులు జోగుతూ కన్పించారు.
    ఆమెను చూడగానే పూర్తీ మెలకువ తెచ్చుకున్నారు. ముఖంలోకి కంగారు కూడా వచ్చేసింది.
    "అయ్యగారు మీ కోసమే చూస్తున్నారు." అంటూ లోపలకు తీసుకు పోయినారు. ఆమెను చూడగానే ఆఫీసర్ లేచి రెండు చేతులూ కలిపి అభివాదం చేశాడు.
    "అమ్మ! నేను మీ విద్యార్ధిని. ఈ కేసులో అతని చేత యదార్ధం చెప్పించాలని ప్రయత్నించాను. కాని ఫలితాంశం శూన్యమయిపోయింది. అతడు కొద్ది క్షణాల క్రితమే మరణించాడు. ఎవరో హత్య చేశారు" అన్నాడు. విభ్రాంత అయిపొయింది శ్రద్దాదేవి.

                                15
    
    ఆ వ్యక్తీ అమాయకుడై వుంటాడనీ , వెనుక ఎవరో వుండి ఈ దురాగతం చేయించినారనీ, పట్టుబడిపోవటానికి కారణాలు నేరాలు చేయటంలో అనుభవం లేకపోవటమే అయి వుంటుందనీ ఊహించి చెప్పాడు ఇన్స్ పెక్టర్.
    పట్టుబడినందువల్లనే ఆ వ్యక్తిని హత్య చేశారనీ , పోలీసుల కస్టడీలో వుండగా అతనిని హత్య చేయాలన్న ఆలోచన చేశారంటే ఆ వెనుక ఉన్నవి బలీయమైన శక్తులు అని కూడా చెప్పాడు.
    చూడవలసిన ఆ వ్యక్తీ శవాన్ని చూసింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. "సోదరీ! నేను నిర్దోషిని" అన్నట్లుగా వున్నాయి చైతన్యరహితమై అర్ధ నిమీలితాలయినా అతని కన్నులు.
    ఇవ్వవలసిన స్టేట్ మెంట్ ఇచ్చేసి బయటపడేసరికి పదకొండు గంటలు దాటింది. తక్షణమే జ్యోతిని చూడాలన్న పట్టుదలతో ముందు నందికొండకు బయలుదేరిందామే.
    
    
                            *    *    *

    చిరిగిరి (శ్రీగిరి) పాడు నించి బయలుదేరిన బస్ ప్రొద్దుపోయిన తరువాత దక్షిణ విజయపురికి చేరింది. అప్పటికి ఐలాండ్ మ్యూజియంలో  తలుపులు మూసి అందరూ తిరిగి వచ్చేశారు.
    దక్షిణ విజయపురి నించి ఏడు కిలోమీటర్ల ప్రయాణం చేసి, మూడు కిలోమీటర్లు లాంచిలో వెడితే కాని ఐలాండ్ మ్యూజియం చేరుకునేందుకు వీలుకాదు. రాత్రి వేళల్లో బస్సులు లేవు. లాంచి బయలుదేరదు. అందు నించి ఆ రాత్రికి తాను సేకరించి తెచ్చిన వస్తువులన్నింటినీ తనతోనే వుంచి కాపాడవలసిన అవసరం వున్నదని గ్రహించి జయకృష్ణ తన యింటికి చేర్పించాడు.
    శ్రీ బృందావన గోయెల్ అర్కేలాజికల్ డిపార్ట్ మెంటు లో తల పండిన మేధావి. ముందుగా తాను వారికి ఈ విషయాలు చెప్పి వాటి సంరక్షణలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందుకు బయలుదేరినాడు జయకృష్ణ.
    అసిస్టెంట్ క్యూరేటర్ గా అతనికి వాటిని ఎలా భద్రపరచాలో తెలుసు. కాని క్యూరేటర్ గారయిన శ్రీ బృందావన గోయెల్ అనుమతి లభించనిదే ఏ పనీ చేయడు.
    యువమేధావి అయిన జయకృష్ణ చేసిన పని జ్యోతి పక్షం నుంచి ఒక సమస్యకు పరిష్కారమయితే అది ఒక అర్కెలాజికల్ విజయం  కూడా అవుతుంది. అందునించి శ్రీ బృందావన్ గోయెల్ అతడు చెప్పినదంతా విని పొంగిపోయాడు.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS