"స్వయంగా చూశాను."
"ఓ దట్ మీన్స్ యూ ఆర్ స్పైయింగ్!"
"ఇంకానయం! బ్లాక్ మెయిలింగ్ అనలేదు." సాగర్ నవ్వేశాడు.
"మరి ఇంత తెలివిగలవాడివి మాధవి పట్ల అంత ఇడియట్ లా ప్రవర్తించావేం?" పరిమళ కంఠం తీవ్రంగా వున్నది.
"మాధవికి నేను అన్యాయం చేశానా?" సాగర్ కుంగిపోయాడు.
"అవును అక్షరాలా ఆ పనే చేశారు. మీ వల్లనే మాధవికి ఈ దుర్గతి పట్టింది. పిచ్చి అని చెప్పుకుని, పిచ్చిదానిలా నటిస్తూ, పిచ్చివాళ్ళ మధ్య బ్రతుకుతూంది. కొంతకాలం గడిస్తే మాధవికి నిజంగానే పిచ్చికూడా పట్టవచ్చు."
"డాక్టర్ పరిమళా!" బాధగా అన్నాడు సాగర్.
"ఇంత పిరికివాడివి అసలు మాధవిని ఎందుకు ప్రేమించినట్టు? పెళ్ళి చేసుకునే ధైర్యం లేదు. రోగిష్టి అమ్మకోసం ప్రేమించిన దానికి అన్యాయం చేసేవాడిని ఏమనాలి? తండ్రి పోలీస్ డ్రస్ చూసి అదిరిపోయే కొడుకును ఏమనాలి? వట్టి దద్దమ్మ."
"ఇడియట్, ఫూల్, స్కౌండ్రల్ అని ఆ తిట్టేదేదో ఇంగ్లీషులోనే తిట్టండి."
"మిస్టర్! బి సీరియస్. మాధవి జీవితంతో చెలగాటం ఆడొద్దు. అది మీకు భావ్యం కాదు. దాని పరిస్థితి చూస్తూ వుంటే నా గుండెలు తరుక్కు పోతున్నాయి. ఆసుపత్రికి వెళ్ళగానే ప్రతిరోజూ దాన్ని చూస్తాను. దాన్ని చూస్తూనే నా గుండెలు అవిసిపోతాయి. అది పిచ్చిదానిలా తిరుగుతూ పిచ్చి చేష్టలు చేస్తూ, అందరినీ నమ్మించడానికి ప్రయత్నం చేస్తుంది. గుండెల్లో రగిలి పగిలే అగ్నిపర్వతాలను అణచుకుంటూ పిచ్చిదానిలా నటిస్తున్న మాధవి కళ్ళలోకి నేరుగా చూడలేక రోజూ కుమిలి పోతున్నాను. దానికితోడు నాకు ఈ ఫూల్__ మా బాస్ ఒహడు దాపరించాడు. ఇలాగే కొంతకాలం ఉంటే నాకు మతిపోయేటట్టున్నది. కాని మాధవి కోసమే వున్నాను. నేను కూడా దూరమయితే అది ఇక్కడ ఎలా వుండగలదో ఊహించలేను" పరిమళ విశాలమైన కళ్ళు ఆర్ద్రమైనాయి.
ఆమె కళ్ళలోకి చూస్తున్న సాగర్ కుంగిపోయాడు. నోట మాట రాలేదు. పెదవులు తడారిపోయాయి.
"మిస్ పరిమళా! ప్లీజ్!" అనునయించబోయాడు.
"మీ సానుభూతి గాదు కావాల్సింది. మీ నిర్ణయమేదో తేల్చి చెప్పండి"
"మిస్ పరిమళా!" మీరు కొంచెం ఓపిక పడితే జరిగినదంతా వివరంగా చెప్తాను. మీకు మాధవి చెప్పినంతవరకే తెలుసు. నేను చెప్పేది పూర్తిగా విని నన్నేం చెయ్యమంటారో చెప్పండి."
"ఊఁ! అలాగే చెప్పండి" పరిమళ సోఫాలో జారగిలబడి సాగర్ కేసి చూసింది.
"మా కాలేజి ఫంక్షన్ రోజున......." చెప్పటం మొదలుపెట్టాడు.
25
"ఇదీ కథ. జరిగిందిది! ఇప్పుడు చెప్పండి నేను చేసిన తప్పేమిటి? నేను మాధవికి చేసిన అన్యాయమేమిటో?" సాగర్ బాధగా అన్నాడు.
"సో! సారీ! మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను! క్షమించండి! మానసికంగా మీరెంత బాధపడ్డారో నేనిప్పుడు అర్థం చేసుకోగలుగుతున్నాను. మాధవి కోసం మీరెంత త్యాగం చేశారో కూడా నేను అర్థం చేసుకోగలను!" పరిమళ నిట్టూర్పు విడిచింది.
"ప్రేమికుల మధ్య త్యాగమంటూ ఏమీలేదు. ప్రేమ అన్నిటికీ అతీతమయింది"
"నిజమే! నీకోసం మాధవి పిచ్చిదయి పోవడానికి కూడా సిద్ధమయింది. ఒకళ్ళకోసం ఒకరు ఎంత త్యాగం చేయటానికయినా సిద్ధపడ్డారు."
"అదిగో మళ్ళీ త్యాగం మాటంటున్నారు"
"ఏమన్నా అనండి! నిజమైన ప్రేమకు హద్దులు లేవు. ఎల్లలు లేవు. మీ ఇద్దరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. మీ ప్రేమకు త్రీ ఛీర్స్"
"థాంక్యూ! ఇప్పుడు చెప్పండి నన్నేం చేయమంటారో?"
"మీరేం చేయాలనుకుంటున్నారూ?"
"ఎలాగయినా నాకు మీ హాస్పిటల్ లో ప్రవేశించే అవకాశం మీరు కల్పించాలి"
"హాస్పిటల్లో జేరి దాంతోపాటు మీరుకూడా పిచ్చివాడిలా నటిస్తారు. ఇద్దరూ అలా నటించి నటించి నిజంగానే కొంత కాలానికి పిచ్చివాళ్ళయి పోవడం ఖాయం."
"అలా జరగదు! నేను పిచ్చివాడినయి పోయినట్టు మాధవిని నమ్మించగలిగితే మాధవి తన నటనకు స్వస్థి చెబుతుంది. ఆ తర్వాత__"
"గుడ్ ఐడియా! దటీజ్ పాజిబుల్ ఓ.కె."
"ఆ తర్వాత__" సాగర్ మాటలకు అడ్డొచ్చి పరిమళ అన్నది.
"ముందు భోజనానికి లేవండి. భోజనాలు అయ్యాక తీరిగ్గా కూర్చుని ఆలోచిద్దాం!"
"డోంట్ బాదర్! హోటల్లో భోంచేసి వస్తాను." సాగర్ లేవడానికి ప్రయత్నించాడు.
"డోంట్ బి సిల్లీ! సిడౌన్!" గద్దించినట్లు అని పరిమళ లేచి నిలబడింది.
"ఆయమ్మా! మా ఇద్దరికీ భోజనం వడ్డించు" అంటూ వంట గదికేసి వెళ్ళింది.
26
కనుచీకటి పడుతోంది. డాక్టర్ పరిమళ ఇంటిముందు నల్లటి ఎంబాసిడర్ కారు వచ్చి ఆగింది. డాక్టర్ మూర్తి కారు దిగి గేటుతోసుకొని లోపలకొచ్చాడు. కాలింగ్ బెల్ నొక్కి మెట్లమీద నిలబడ్డాడు. "ఎవరూ" తలుపు తెరచే అడిగింది ఆయమ్మ.
"డాక్టర్ పరిమళ ఉన్నారా?"
ఆయమ్మ ఉలకలేదు పలకలేదు.
"డాక్టర్ గారున్నారా?"
దేవాలయంమీద చెక్కిన బొమ్మలా! ఆయమ్మ నిలబడిపోయింది.
ఈవిడకు ఏమయినా చెముడా! డాక్టర్ మూర్తి పెద్దగా అరిచాడు.
"డాక్టర్ పరిమళ ఉన్నదా!"
ఆయమ్మ ఉలిక్కిపడింది! రెండడుగులు వెనక్కు వేసింది.
ఇదేదో చాదిముండలా ఉన్నదనుకొంటూ డాక్టర్ మూర్తి ఆయమ్మకేసి తేరిపార చూశాడు. మసక మసక చీకట్లో ఆయమ్మ ముఖం సరిగా కన్పించలేదు.
"ఇంకా లైటేయలేదేం?" అంటూ డాక్టర్ మూర్తి మరో అడుగు ముందుకేసి గోడమీద స్విచ్ బోర్డును వెతకసాగాడు. ఆయమ్మ మరో రెండడుగులు వెనక్కేసింది.
