Previous Page Next Page 
విష్ణు విలాసిని పేజి 46

    "వెంగమాంబ వేంకటేశ్వరునిలో కలిసిపోయిందట". ఒక అర్చకుడు చూసినట్టే చెప్పాడు.
    "అక్క మహాదేవి శ్రీశైల మల్లికార్జునునిలో కలిసినట్లా?" మరొక అర్చకుని సందేహం.
    "గోదాదేవి రంగనాథునిలో ఐక్యమైనట్లు" ఒక వీర విశిష్టాద్వైతి ప్రతిపాదన.
    "నాకు మాత్రం మీరాబాయిలాగా అనిపిస్తుంది" మరొక బహూభాషా పండితుడన్నాడు.
    "ఇక్కడే దగ్గిరలో ఎక్కడో తపస్సు చేసుకుంటూ ఉండి ఉంటుంది" మహంతు నిర్థారించి చెప్పాడు.
    రకరకాలుగా అనుకున్నారు. కొద్దిమండి పైకి అనకపోయినా మనసులో సంతోషించారు. కాని, వెంగమాంబ కనపడనందుకు బాధపడినవారి సంఖ్యే ఎక్కువ.
                                                         * * *
    వెంగమాంబ రచనా వ్యాసంగం కొనసాగుతూనే ఉంది తపస్సుతోపాటు. ప్రతిరోజూ రాత్రి శ్రీనివాసుడు తుంబురు కోనకేగి వెంగమాంబ రచించిన యక్షగానాలు వింటూ ఉండేవాడు. చెంచు నాటకంలో వర్ణనలు వింటున్నప్పుడు వేంకటాచలపతికి కలిగిన ఆనందం వెంగమాంబ రచనలకి ఊపిరిగా మారి మరిన్ని రచనలు చేయాలనే ఉత్సాహాన్ని కలిగించేది.
    వెంకటేశ్వరుని అభ్యర్థన మేరకు స్వామిని చెంచురూపంలో వర్ణించింది.
    "వినరన్న నేజూచు వెంకటేశ్వరుడు
    మినమినమని చాల మెరసేటిదేమొ
    ఘట్టిగా తలమీద గదియించిదాని
    చుట్టుపూదండలు చుట్టుకున్నాడు
    లలిమించు మొసలి పిల్లలవంటిదేమొ
    తళుకుగా చెవులకు తగిలించినాడు
    పచ్చపచ్చటిదేమొ బహుశానమేన
    నచ్చుగా నందందు నతికించినాడు
    పల్లని కూసేటిగట్లు శ్రీపాద
    పల్లవములయందు భరియించినాడు
    గుండూటి దొక్కటి కూశేటిదొకటి
    రెండుచేతులను ధరియించి యుండాడు
    యెడమచేతను కత్తి యిరవందఁబట్టి
    కుడిచేతధరణిపై గురిబెట్టినాఁడు
    నల్లని మొయిలు వర్ణము గలవాడు
    తెల్లనైతగుపట్టె తిరుమణివాడు
    కలికిచూపులగొప్ప కన్నులవాఁడు
    మొలకనవ్వులవాఁడు ముద్దులవాఁడు
    పసపుఁబూసిన పాతపై హోయల్ మీఱ
    విసువక వలెవాటువేసి వేడుకను
    ప్రాకటంబుగ నొక్కపక్షిపైనెక్కి
    మాకోనలకు వచ్చు, మమ్మెల్ల మెచ్చు
    నలువొప్ప తరిగొండ నరసింహుడంచు
    వెలయమమ్మేలు నా వేంకటేశ్వరుఁడో"
    వింటున్న వేంకటేశ్వరునికి తన నరసింహావతారం, చెంచులక్ష్మితోడి తన ప్రణయం అన్నీ జ్ఞప్తికి వచ్చి సంతోషంతో ఉప్పొంగిపోయాడు.
    వెంగమాంబ కవితా చమత్కృతిని మరింతగా ఆస్వాదించాలని ఆమెను రెచ్చగొట్టినట్లు మాట్లాడాడు.
    "ప్రతిరాత్రి నన్ను చూస్తూ, పగలు చూస్తున్న చెంచులతో పోల్చి వర్ణించావు. అదేమంత ఘనత? శివుని వర్ణించి నీ వర్ణనా చమత్కృతిని ప్రకటించి మమ్మానందింప చేయి" అన్నాడు.
    "ప్రభూ అంతకన్నానా? మీ ఆజ్ఞశిరోధార్యం. శివుని రాక అవధరించండి.
    సలలిత నాగభూషణములతోడ
    పులితోలుతోడ త్రిపుండ్రంబుతోడ
    సమయుక్తమగు జటాజూటంబుతోడ
    గమనీయమగు చంద్రఖండంబుతోడ
    శరదభ్ర శుభలసత్కాంతితోడ
    గరళయుతంబైన కంఠంబుతోడఁ
    బ్రవిమల బ్రహ్మకపాలంబుతోడ
    సవరణగల నాగచర్మంబుతోడ
    నలరారుచున్న ఫాలాక్షంబుతోడ
    నలఘు ప్రకాశాంగుఁడై వేడ్కతోడ
    విమలమై చెన్నొందువృషభేంద్రునెక్కి
    ప్రమథగణంబులు ప్రార్థించి తొలుత
    మనసిజవైరి సమ్మతమునరాగ..."
    "వెంగమాంబా! శివుని రూపం కళ్ళకు కట్టినట్టే వర్ణించావు. సంప్రీతోస్మి" అంటూ అంతర్థానమయ్యాడు తెల్లవారబోతోంది కనక.
    తనకావిధంగా దర్శనమిచ్చిన సోమేశ్వరునికి మనసులోనే అంజలించింది వెంగమాంబ. తన ప్రాణనాయకుని సూచనమేరకు రచించిన, శివపారిజాతంగా ప్రసిద్ధికెక్కిన శివనాటకం శేషశైలవాసునికెంతో ప్రీతి కలిగించింది.
    పగలు రచించటం, రాత్రి తిరు వేంకటపతికి వినిపించి తరించటం, స్వామి పులకించటంగా సాగుతోంది వెంగమాంబ సాధన.
                                  * * *
    వెంగమాంబ రచన చేస్తున్నంతసేపూ ప్రియమిత్రుడు ఏకాగ్రతకి భంగం వాటిల్లకుండా తోడుంటూ ఉత్సాహం కలిగిస్తూ ఉంటాడు. గ్రంథ రచన పూర్తిగావించి, గంటం కిందపెట్టి తనముఖంలోకి చూస్తున్న మిత్రుడిని అడిగింది.
    "నువ్వూ, నా ప్రాణేశ్వరుడు ఒక్కసారి ఎందుకు దర్శనమియ్యరు" అని
    జగన్మోహనంగా నవ్వాడు.
    "ఇద్దరం ఒకచోట ఉండమని తెలియదా?"
    "తలుచుకుంటే రెండు రూపాల్లో ఒకేసారి ప్రత్యక్షం కావటం అసాధ్యంకాదుగా!"
    ఇంతలో ఎవరివో దీనాలాపాలు ప్రశాంతతను భంగపరిచాయి. ఇంకెక్కడి మిత్రుడు? దీనాలాపాలు మరింత దగ్గిరగా దీనంగా వినిపించసాగాయి. గుహనుండి వెలుపలికి వచ్చిన వెంగమాంబకి ప్రాణావశిష్టుడై ఉన్న ఒక కుష్ఠు రోగి కనిపించాడు. ఆకలి దప్పికలతో నీరసించి ఉన్నాడు. వేదన ముఖంలో ప్రస్ఫుటంగా ఉంది. స్పృహలో లేడు. అతడిని చూచి దయామయి వెంగమాంబకి జాలి ఉప్పొంగింది. ముఖాన నీళ్ళు చల్లి, కళ్ళు తెరవగానే తాగటానికి కొన్ని నీళ్ళిచ్చి, తినటానికి పళ్ళు ఇచ్చింది. తేరుకున్నాక "ఎందుకిక్కడికి వచ్చావు?" అని అడిగింది. అతడు నమస్కరించి,
    "అమ్మా! నా పేరు చంద్రశేఖరుడు. దేవతలాగా నా ప్రాణాన్ని రక్షించావు. కాని, దానివల్ల ప్రయోజనమేమిటి? ఈ భయంకరమైన వ్యాధి నన్ను మానవ సమాజానికి దూరం చేసింది. ఇదీ మన మంచికే, దైవానికి దగ్గర కావచ్చుననుకొని అతి ప్రయాసమీద కాంచీమండలంలోని మా గ్రామం నుండి తిరుమల చేరాను. కాని, నా వంటి పాపిష్టి రోగం ఉన్న వాడికి దైవ దర్శనం ఎలా లభిస్తుంది? కనీసం తిరుమలలో శేషజీవితం గడుపుదామన్నా అవకాశం లేకపోయింది. దైవం కూడా చీదరించుకున్నాక బ్రతికి ప్రయోజనం లేదు. ప్రాణాలు వదలుదామంటే, ఆత్మహత్య మహాపాతకం. దిక్కుతోచనివాడినై, ఇది కూడా వేంకటేశ్వరునికి చెందిన అరణ్యం కదా అనే ఆలోచనతో ఎప్పటికో శరీరం పతనం అవుతుంది కదా అని తిరుగుతున్నాను. నడవటం కుదరటం లేదు. ఎంత త్వరగా ముక్తి లభిస్తుందో!" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS