Previous Page Next Page 
ప్రార్థన పేజి 46


    అతడు చెప్పటం ఆపాడు. భార్గవ అతడివేపు దిగ్భ్రాంతుడై చూస్తున్నాడు.

 

    "-కానీ నీ మీద మాకు అంత ద్వేషం లేదు. నిన్ను జైలుకి పంపించాలన్నది మా ఆశయం కాదు. బోర్డులో పరువు నిలపాలన్నదే నా ఆకాంక్ష! భార్గవా! సూటిగా అసలు ప్రపోజల్ చెపుతాను విను. సామ్సన్ అండ్ సామ్సన్ కంపెనీ నీ మీద కేసు ఉపసంహరించుకుంటుంది. ఇన్ స్పెక్టర్ రవూఫ్ ని కూడా నేను వప్పిస్తాను. నీ మీద కేసు వుండదు. దీనికి ప్రతిగా, నీ అంతట నువ్వు నీ రాజీనామ పత్రాన్ని సమర్పించాలి. నా పంతం నెరవేరినట్టూ వుంటుంది. నీకు జైలూ తప్పిపోతుంది. ఎలా వుంది నా ప్రపోజల్?"

 

    భార్గవ అవాక్కయి అతడివేపే చూస్తుండిపోయాడు. గుండెల్లో యేదో హోరు ప్రారంభమై ఒళ్ళంతా వ్యాపించింది.

 

    ఎదురుగా టేబుల్ మీద వున్న పేపర్లు అతడిని పరిహసిస్తున్నాయి.

 

    ఎంత నాజూగ్గా వీళ్ళు తన మీద పగ తీర్చుకున్నారు? ఎంత కసి ఉన్నది వీళ్ళలో.... అందుకేనేమో వెళ్ళిపోతున్న వాడికి వెనక్కి పిలిచి అరెస్టు చేయించారు.

 

    భార్గవ మౌనాన్ని ఇంకోలా అర్థం చేసుకున్నాడు శంకర్ లాల్.

 

    "నీకింకో మార్గంలేదు. దీంట్లోంచి ఎలా తప్పించుకోగలనా అని ఆలోచించకు, నీకు ఈ ఛాన్స్ పోయిందంటే రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష తప్పదు. క్రిమినల్ ట్రిస్ పాస్ కి ఒక సంవత్సరం, అస్సాల్టింగ్ పబ్లిక్ సర్వెంట్ కి ఒక సంవత్సరం, మొత్తం రెండు సంవత్సరాలు. నువ్వు కన్విక్ట్ అయిన మరుక్షణం నీ ఉద్యోగం పోతుంది. ఎలాగూ ఉద్యోగం పోవటం ఖాయమైనప్పుడు ముందే దానికి రాజీనామా ఇచ్చేస్తే కనీసం జైలు శిక్ష తప్పించుకుని బయటపడతావు. నిజానికి నిన్నీ విధంగా అడిగే అవసరం మాకు లేదు.

 

    నీ మీద ఏ మాత్రమో అభిమానం వుండబట్టి ఈ వ్యవహారం కోర్టు వరకూ వెళ్ళకుండా ఆపాలని మా ప్రయత్నం. ఏ విషయమూ తొందరగా చెప్పు?"

 

    ఇంక చెప్పటానికేముంది? ఏమీ లేదు.

 

    నాలుగువేపుల నుంచీ ఉచ్చులు బిగిసిపోయాయి.

 

    భార్గవ కాగితాలు దగ్గరికి లాక్కున్నాడు. నీట్ గా టైపుచేసి వున్న తన రాజీనామా పత్రం అది.

 

    దాన్ని అందుకుంటూ ఒకే మాట అన్నాడు.

 

    "కంగ్రాట్స్".

 

    శంకర్ లాల్ చిరునవ్వుతో కలం అందించాడు. భార్గవ సంతకం పెట్టబోతూ ఒక్కసారి అటుచూసేడు. ఇన్ స్పెక్టరూ, హెడ్ కానిస్టేబుల్, పోలీసులూ- అందరూ నాటకంలో పాత్రధారుల్లా ఇటే చూస్తున్నారు. జరుగుతున్న అన్యాయాన్ని అలవాటైన పోలీసు స్టేషన్ అతి సాధారణంగా గమనిస్తూంది. అతడు తలవంచి నెమ్మదిగా సంతకం పెట్టి కాగితాన్ని ముందుకు తోసేడు. ఆ మసక చీకటిలో అతడి మొహంలో భావాలు సరిగ్గా కనపడటం లేదు.

 

    "గుడ్" అంటూ శంకర్ లాల్ లేచి, ఆ కాగితాన్ని మడిచి జేబులో పెట్టుకొని...

 

    "ఈ క్షణమే మీ రాజీనామాని అంగీకరిస్తున్నాను. ఈ రోజునించి మీరూ మా ఉద్యోగి కాదు. పోతే మూడు నెలల నోటీసివ్వకుండా మీరు రాజీనామా చేస్తున్నారు కాబట్టి, మీకు రావల్సిన పి.ఎఫ్. నుంచి అంత డబ్బూ తగ్గించుకోబడుతుంది. మీ అంతట మీరే రాజీనామా చేస్తున్నారు కాబట్టి- మీ కూతురి వైద్యానికి రావల్సిన ఇన్సూరెన్స్ ఈ క్షణం నుంచే ఆగిపోయింది. పదకొండింటి లోపులో మీరు మీ సామానులన్నీ తీసుకుని లాబ్ ఖాళీచేసి నా కప్పగించాలి, గుడ్ బై -" అంటూ వెళ్ళిపోయాడు.

 

    భార్గవ చిత్తరువులా నిలబడిపోయాడు. అంతలో అతడి భుజంమీద చెయ్యిపడింది. తలతిప్పి చూసేడు. రవూఫ్.

 

    "అదృష్టవంతుడివి, తప్పించుకున్నావ్. కానీ అప్పుడే సంతోషపడకు. రవూఫ్ మీద చెయ్యి చేసుకున్న వాడెవడూ భూమ్మీద బ్రతికి బట్టకట్టలేదు. ఎప్పటికయినా 'నా బదులు కూడా' నేనే తీర్చుకుంటాను. అది గుర్తుంచుకో... ఇప్పటికి బ్రతికిపోయావు వెళ్ళు..." కేస్ షీట్ చింపేస్తూ బయటికి తోసేడు. భార్గవ స్టేషన్ బయటకొచ్చి పడ్డాడు. కాలినుంచి తిరిగి రక్తం స్రవించసాగింది.

 

    ఉద్యోగం పోయి, ప్రతిష్ట పోయి, సర్వం కోల్పోయి డెలీరియం స్టేజిలోకి వెళ్ళిన అతని మెదడు దేన్ని ఆలోచించటానికయినా నిరాకరిస్తూంది.

 

    రాత్రంతా నిద్రలేక, ఆహారంలేక వళ్ళు తూలుతూంది.

 

    బట్టలు చినిగిపోయి, జుట్టు చెరిగిపోయి, సభ్య ప్రపంచంలో సభ్యుడిగా గుర్తింపు కోల్పోయి అతడు భారంగా అడుగులు వేయసాగేడు. కనీసం రిక్షాలకి కూడా డబ్బులు లేవు. ఎవరు ఇంటి దగ్గరున్నారో- ఎవరు ఆస్పత్రిలో వున్నారో కూడా తెలీదు. అడుగుతీసి అడుగేస్తూంటే గాయం తాలూకు నొప్పి ప్రాణాల్ని తోడేస్తూంది.

 

    అలాగే కాళ్ళీడ్చుకుంటూ అతడు నెమ్మదిగా సాగేడు.

 

    పోలీసుల కళ్ళపడకుండా అతడు తనతో దాచుకున్న వాయువు తాలూకు గాస్ ప్యాకెట్ మాత్రం ఛాథీ దగ్గర భద్రంగా వుంది.

 

                                               4

 

    అతడు ఇంటికి వచ్చేసరికి పిల్లలిద్దరూ కంగారు పడుతున్నారు. రాత్రంతా ఇంటికి రాకుండా, ప్రొద్దున్నే... పెరిగిన జుట్టుతో, రక్తపు మరకలున్న బట్టలతో కుంటుకుంటూ వస్తున్న తండ్రిని చూసీ జిన్నీ బెదిరిపోయింది.

 

    పిల్లలిద్దరూ అతడి దగ్గరికి పరిగెత్తుకొచ్చారు.

 

    బాధని ఏ మత్రం పైకి ప్రకటించినా పిల్లలు మరింత బెదిరిపోతారనీ, నువ్వు మొహానికి పులుముకుని, వాళ్ళని దగ్గరికి తీసుకుని "అమ్మేది" అనడిగాడు.

 

    "నిన్న ప్రొద్దున్నుంచీ తను కూడా ఇంటికి రాలేదు నాన్నా!" అంది జిన్నీ. అతడికి బాధేసింది. భార్య మీద జాలితో కూడిన సన్నటి అనురాగపు భావం.... ఈ పెళ్ళి ద్వారా ఆమెని అనవసరమయిన జంజాటంలోకి ఈడ్చానేమోనన్న బాధ.... తనని చేసుకోవటం ద్వారా ఏం సుఖపడింది? మొదటి రోజునుంచే ఆస్పత్రులూ- రోగాలూ.

 

    ఆ క్షణమే ఆమె దగ్గరకు వెళ్ళి ఒక ఓదార్పు మాట- ఓ సానుభూతి వాక్యం ఆమెతో పంచుకోవాలని మనసు ఆరాటపడింది. నాకు నువ్వు- నీకు నేను - సుఖాలెలాగూ లేవు. ఉన్న కష్టాల్నే చెరిసగం పంచుకుందాం అని.

 

    అంతలో జిన్నీ దగ్గిరకొచ్చి "నిన్న సాయంత్రం ఎవరో వచ్చి ఈ కవరు ఇచ్చారు నాన్నా" అంటూ అందించింది. చింపి చూసేడు. సైకియాట్రిస్టు దగ్గర్నుంచి రిపోర్ట్. ఆయన తెలిసినవాడు కాబట్టి లేఖ రూపంలో వుంది ఇంగ్లీషులో.

 

    "డియర్ భార్గవా!

 

    మీ పిల్లలిద్దరి కేసులూ పరిశీలించాను. వాళ్ళ సంభాషణ వారానికి రెండ్రోజులు. అలా విచిత్రంగా, వినేవాళ్ళకి అగమ్యగోచరంగా వుండటానికి కారణం ఏమిటా అని ఆలోచిస్తూ వచ్చాను. మొన్న రాత్రి టెలివిజన్ చూస్తూ వుంటే అకస్మాత్తుగా స్ఫురించింది. మీ వాళ్ళిద్దరూ బహుశా శని, ఆదివారాలు అది చూస్తున్నారేమో. వాళ్ళు 'మెలోడ్రమిటిక్'గా మాట్లాడేది ఆది, సోమవారాలైతే, నిశ్చయంగా అది క్రితం రాత్రి చూసిన సినిమా ప్రభావమే అయివుంటుంది. మీరీ విషయం ఈసారి కలిసినప్పుడు ధృవపర్చగలరు. అలాగే, వాళ్ళకి సినిమాలు వీలైనంతవరకూ చూపించకుండా వుండటానికి ప్రయత్నించండి. ముఖ్యముగా నూనూగు మీసాల హీరోలూ, పైట వేసుకునే వయసురాని తల్లులయిన హీరోయిన్లూ వున్న సినిమాలు చూపించకండి. అందులో వాళ్ళు మాట్లాడుకునే బరువైన మాటలు మీ పిల్లల సబ్ కాన్షన్ మైండ్ మీద ప్రభావం చూపించి ఈ రకమైన న్యూరోసిస్ కి దారి తీస్తున్నాయని నా అనుమానం. పిల్లలకి పిచ్చెక్కేది ఆది. సోమవారాలైతే ఇక ఫర్ దర్ ట్రీట్ మెంట్ అనవసరం. మీ టీ.వీ.ని మూత వెయ్యండి చాలు- (సంతకం)" 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS