Previous Page Next Page 
యువత నవత పేజి 45

   
    పావుగంట తర్వాత శర్మ లేచాడు.

     "ఈరోజు చెబుతావుకదా?"

    "చెబుతాను! మరి నువ్వు?"

    "రేపు నేను మూడుగంటలకి వస్తాను ఇక్కడికి. నాతో రావాలి నువ్వు! మా వాళ్లకి పరిచయం చేస్తాను. చేశాకే చెబుతాను."

    "ఎదురుచూడకుండా చెప్పిన టైంకి రావాలినువ్వు!"

    "వస్తాను!"

    శర్మ వెళ్లిపోయాడు.

     శాలిని ప్లేట్లు తీసుకొని లోపలికివెళ్లింది.

     అప్పటివరకు రాధమ్మ శాలిని సంగతే మాట్లాడుతున్నదానిలా టక్కున నోరుమూసుకొంది. కాని చాలా ఉద్రేకపడినట్టుగా ఎర్రబడిన ఆ ముఖమే చెబుతూంది.

     శాలిని ప్లేట్లు కడగడానికి పెరట్లోకి వెడుతూంటే.....

    "ఏమనుకుంటుందోనని మనసులో పెట్టుకొంటే ఎలాగండీ? అడగండి."

    "నువ్వడగరాదూ?"

    "నేనడిగితే నువ్వేమిటి? నీ సంస్కారం ఎంత? అన్నట్టు మాట్లాడుతుంది."

    "ఉండు! తరువాత అడుగుతాను, ఇంతలో కొంపలేమీ అంటుకుపోవుగాని!"  నరహరి కొంచెం విసుగ్గా అన్నాడు.

     "విసుక్కుంటారెందుకు? అదేమైనా తప్పటడుగువేస్తే, తల్లిని ఆ మాత్రం చూచుకోలేకపోయావా? అని నన్నే దులుపుతారుకదా మళ్లీ?"

    "దానిస్కూల్లో  పనిచేస్తున్న టీచరుకు కాస్త టీ, ఫలహారం పెట్టి మాట్లాడగానే అది తప్పటడుగు వేసినట్లా? మీ ఆడవాళ్ల ఆలోచన అంతకు మించి పోదుకదా? చదువుకొని, ఉద్యోగం చేస్తున్న ఆడపిల్ల మగవాళ్లంటే మడికట్టుకొన్నట్టుగా ఎలా వుంటుంది చెప్పు? మాట్లాడగానే  మైలపడ్డట్టుగా కంగారు పడతావేం?"

    "ఊరికే మాట్లాడడం, ఇంకోరకంగా మాట్లాడడం ఆడమనసు కనిపెడుతుందండీ! మీరైతే అడిగిచూడండి! బాంబు ప్రేలుతుందో లేదో..... ఏ కులమో ఏమిటో...."

    "జెట్ లా ఎంతదూరం దూసుకుపోయాయే నీ ఆలోచనలు."

    శాలిని ప్లేట్లు తుడిచి బోర్లించింది.

     నరహరి ఫలహారం చేసి, పేపరు చూస్తున్నాడు.

 అమ్మా నాన్న అడగలేక లోపలే ఉండిపోవడం, తను దాగుడు మూతలాడడం ఇదంతా అవసరమనిపించింది శాలిని సూటిగా మొదలుపెట్టింది.

     "శర్మని నేను ఇంటికి పిలిచి మర్యాదలు చేశానని, ఫ్రీగా మాట్లాడానని అమ్మకి కోపం వచ్చినట్టుంది"

    "పాతకాలం మనిషి! ఏదో అంటుంది. నువ్వేం అనుకోవద్దమ్మా! ఇద్దరూ సిటీవాల్లు సిటీకి దూరంగా ఆ పల్లెలో ఇద్దరూ కలిసి పని చేస్తున్నారు. స్నేహంగా పిలిచి మర్యాదలు చేస్తే ఏవేవో అర్దాలు తీయడం వెర్రితనం అమ్మా! ఒకచోట పని చేస్తున్నప్పుడు ఈ మర్యదలూ మాటలూ తప్పవు.ఇవి తప్పుపట్టాల్సినివీ కాదు."

    "అలా తప్పుగా అనుకోకపోవడం మీ సంస్కారమౌతుంది. కాని, ఇంకా మగస్నేహితుల్ని సంపాదించుకునేంత అభ్యుదయంగా ఎదగలేదు నాన్నా మీ కూతురు. మేం ఒకరికొకరు నచ్చాము. పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాము. ఆ సంగతి చెబుదామనే అతడిని ఈరోజు ఇంటికి పిలిచి మీకు పరిచయం చేసాను."

    "ఏకులం?" లోపలనుండి దూసుకువచ్చి కొట్టినట్టుగా అడిగింది రాధమ్మ.

    "భయపడకమ్మా! వాళ్లూ బ్రాహ్మలే!"

    "నియోగులేనా?"

    "మద్య బ్రాహ్మిన్స్"

    "వాళ్లకీ మనకీ ఎలా కుదురుతుంది? మనచేత వాళ్లు తినరు వాళ్ళ చేత మనం తినం. భోజనాలే లేనప్పుడు పెళ్లిదాకా ఎలా వెళతావే? ఆడపిల్లను ఒంటరిగా ఉద్యోగాలకు పంపిస్తే ఇలా కొంపమీదికి కంప తెచ్చి పెడతారనే ఆరోజు ఆ ఉద్యోగానికి వెళ్లొద్దన్నాను. అప్పుడోయుద్దమే చేసావు." ఎత్తి పొడిచింది తల్లి.

    "కులాలు మతాలే ఎగిరిపోతుంటే నువ్వు శాఖల్ని పట్టుకు అరుస్తావేమిటమ్మా?"

    "వాళ్లింట్లో ఆచారం వున్న బోడెమ్మలుంటే నీచేత మంచినీళ్లుకూడా తాగరు తెలుసా? అప్పుడు నువ్వు కరణం పిల్లవైనా, మాలపిల్లవైనా ఒక్కటే. అలాంటి అవమానాలు పొందాల్సినఖర్మ నీకేమిటి? మన ఇళ్లలో లక్షణమైన సంబంధాలు దొరకవనా?  గతిలేనట్టుగా  ఆ సంబందం చేసుకోవడం ఎందుకు?"

s
    'నేను కాపురం చేసేది బోడెమ్మలతోకాదు. మగడితో.'

    "ఈనాటి యువతరం ఆలోచనలు ఇలా వున్నాయి. ఒక్క మగడు తప్ప ఇంకెవరూ అక్కరలేదనుకొనేస్థితికి వచ్చేశావు. ఆ మగాడన్నవాడు అంతవాడు కావడానికి  వెనుక ఎవరున్నారు? అతడిమీద ఎవరెవరు ఆధారపడి వున్నారు? వాళ్ళ ఆచారాలేమిటి? సంప్రదాయాలేమిటి? వాటి గురించి ఆలోచించే అవసరం లేదన్నమాట" అన్నాడు నరహరి కొంచెం సీరియస్ గా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS