జామెట్రీ కాలెక్యులస్
అక్కయ్యకి రెండో కానుపు
తమ్ముడికి మోకాలివాపు
చింతపండు ధర హెచ్చింది
చిన్నాన్నకు మతిభ్రమ కలిగింది
లేచిన మరుక్షణం ఎన్నో ప్రశ్నలు
గోరు చుట్టులా సలిపే లక్షల సమస్యలు
ఆనందాన్ని చంపేందుకు
అనంతంగా ఉంది లోకం
క్యూబా ఉంది కాంగో ఉంది
గోవా ఉంది జావా ఉంది
అడుగడుగునా యుద్ధభయం
మలుపు మలుపునా మృత్యుముఖం
ఆకలి నిరాశ రోగం
అసూయ ద్వేషం స్వార్ధం
రోతపోని చాతకాని
ప్రభుత్వాలు ఉద్రేకాలు
కులాసాని చెడగొట్టేందుకు
అలాస్కాదాకా అవకాశం ఉంది
కొంచెం సేపు స్వప్నంలోకి
గోర్వంకల రెక్కలతో
ఎగిరిపోదా మన్నీ మరచి
అబద్ధాన్ని ఆశ్రయించిన సుఖం
నిజాన్ని నిరూపించే నరకం
కన్న వెయ్యిరెట్లు నయం!
కల ఎప్పుడూ మనిషికి బలం
మిధ్యాజీవన రధ్యలలో
స్వప్నం ఒక సుందర తనుమధ్య
మనసూ మనసూ కలసిన మైమరపుంటే
మద్యం వృధా మాధుర్యం సదా
మనం కట్టుకున్న గాలిమేడల్ని
ఏ భూకంపం పడగొట్టలేదు
మనం విరియించుకున్న తోటలలో
ప్రతి పువ్వూ అనార్తవం నవం నవం.
