Previous Page Next Page 
అమృతం కురిసిన రాత్రి పేజి 45

అట్లాంటిక్ కల్లోల తరంగాల మేనువాల్చింది నేను
పసిఫిర్ లోతులలో రత్నాల్ని వెదకి తీసింది నేను
ఉత్తర ధృవాన ఒక పాదం దక్షిణ ధృవాన మరో పాదం
సర్వం సహా చక్రవర్తి పదవి సంపాదించుకున్నాను నేను

సంకుచితమైన జాతి మతాల సరిహద్దుల్ని చెరిపివేస్తున్నాను చూడు
అకుంఠితమైన మానవీయ పతాకను ఎగురవేస్తున్నాను చూడు
చరిత్ర రక్త జలధికి స్నేహసేతువు నిర్మిస్తున్నాను రండి
కవి వచస్సవితృకాంతి పూరమిది స్వేచ్ఛగా జలకమాడండి

మధ్యధరా సముద్రతీర ఖర్జూర తరుచ్ఛాయ మధ్యాహ్నవేళ
నీ స్నిగ్ధ కపోల తల్పాన ముద్దిడిన ప్రియసఖుణ్ణి నేను
మౌంట్ వెసూవియస్ ఆగ్నేయ దర్పోజ్వల జ్వాల
వెలిగించి దిగ్భిత్తికలు ప్రకంపింప పాడింది నేను

అమెరికన్ పాల్ రాబ్సన్ సంగీత గీతాన జాలిగా
ఆఫ్రికా అంధకారాటవుల సింహగర్జా నిర్ఘోషగా
కైలాస హిమగళము విడివచ్చు శాంతి సందేశమ్ముగా
పలికింది నేను, మానవాళికి అభయహస్త మిచ్చింది నేను

ఎంత కన్నీరు మున్నీరుగా కురిశాను మీ కోసమై
ఎంత మిన్నేరు పన్నీరుగా దింపాను మీ కోసమై
వర్తమానం నేడు సుందరాభిసారిక వోలె నిలిచి హేలగా
ఆగామి కాల గంభీరస్వామి కంఠాన వేయబోయే మాలగా
నిలిచింది నేను, పిలిచింది నేను, దశదిశల కలిపింది నేను.

        *    *    *   
                    ---1962

        స్వేచ్ఛావిహారం

సరుగుడు చెట్ల నీడలలో
సరదాగా తిరుగుదాం
సగం మబ్బు సూర్యుడి మీద
శాటిన్ తెరలా కప్పుకుంది
సంజ యెరుపు సెలయేటి మీద
చల్లిన తొలి సిగ్గులా వుంది
ఒక్కసారి యిల్లు విడిచి
ఉత్సాహంగా రా చెలీ!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS