Previous Page Next Page 
బస్తీమే సవాల్ పేజి 45


    కన్నయ్య గిన్నెలు సర్ది తల్లి పడుకున్నాక పరుశురాం దగ్గరికి వచ్చాడు.

    "నీకు పేకాట బాగా వచ్చా?"

    "ఏదో!"

    "నా మరదలు కూడా బాగా ఆడుతుందన్నా!" అన్నాడు కన్నయ్య.

    పరుశురాం ఆశ్చర్యంగా చూశాడు.

    "మరదలా?"

    "అవును. మావ కూతురు. ఈ బస్తీలోనే ఉంటుంది.

    పేక ముక్కలు పట్టుకొంటే ఫటఫట లాడించేస్తుంది."

    పరుశురాం వాడి మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు.

    బల్లమీంచి లేచి గుమ్మంలోకి వెళ్ళి నించుని చూశాడు.

    రచ్చబండపైన, కింద చాలామంది పడుకున్నారు.

    పుచ్చ పువ్వులాంటి వెన్నెల, చల్లని గాలి....

    "నేను అక్కడ పడుకుంటాను" అన్నాడు పరుశురాం.

    "నా జాగా కూడా అక్కడే. పద!" అని రెండు దుప్పట్లు పట్టుకుని తలుపు గొళ్ళెం పెట్టి పరుశురాంతో పాటు రచ్చబండ దగ్గరికి నడిచాడు కన్నయ్య.

    రచ్చబండపైన కొంత జాగా ఖాళీగా వుండడం చూసి అడిగాడు పరుశురాం.

    "ఇక్కడ ఇంతమంది పడుకొన్నారు. మరి యీ జాగాని విడిచి పెట్టేశారే!" అని---

    కన్నయ్య గర్వంగా చూశాడు.

    "ఇది నా జాగా! అందుకే ఇక్కడెవరూ పడుకోరు."

    "ఓహ్.... అదోటుందా?"

    "బస్తీ అంటేనే అంత. రోజూ ఎవరెక్కడ చేరతారో అక్కడే చేరాలి. ఇక్కడ మనుషులు నమ్మితే ప్రాణం ఇస్తారన్నా! లేకపోతే బయటికి తరిమి కొడతారు!" పరుశురాం పక్కనే పడుకొంటూ చెప్పాడు కన్నయ్య.

    "మీ బస్తీ బాగుంది!" అన్నాడు పరుశురాం.

    "పగలంతా వ్యాపారాలకి పోయి సాయంత్రానికి బస్తీ చేరతారు జనం. ఇక సాయంత్రం అంటే కుష్.... కుష్... భలేగా వుంటుందిలే."

    "ఆ కుష్ కుష్ ఏమిటో రేపు చూస్తాగా!" నవ్వాడు పరుశురాం.

    "నేను పొద్దున్నే పనిలోకి వెళ్ళిపోతా! నీ ఇష్టమొచ్చినంత సేపు పడుకో. నేను చెప్తాలే. నిన్నిక్కడ పడుకొన్నందుకు ఎవరూ ఏమీ అనరు. అలాగే సాయంత్రం నేను త్వరగా వచ్చేస్తా. కుష్.... కుష్.... " అన్నాడు కన్నయ్య.

    సిగరెట్ వెలిగించి మర్రిచెట్టు ఆవల మధ్యనుంచి కనిపిస్తోన్న చంద్రుడి వంక చూస్తూ పడుకున్నాడు పరుశురాం.

    అసలే అలిసిపోయి వున్నాడేమో చల్లని గాలికి మగతగా నిద్ర ముంచుకొచ్చేసింది.

    చుట్టూ ఏదో కలకలం.... మాటలు వినబడుతున్నాయి.

    కళ్ళు తెరిచాడు పరుశురాం. బాగా పొద్దుక్కెపోయింది.

    తన చుట్టూ జనం.... ఆడా, మగా, చిన్నా, పెద్ద!

    వాళ్ళు తననెందుకు చూస్తున్నారో అర్ధంకాక కంగారుగా లేచి నిలబడ్డాడు పరుశురాం.

    అప్రయత్నంగా అన్నాడు.

    "బస్తీమే సవాల్"

    అతని మొహంలోకి చూసి అప్పటివరకు ఒలకపోసిన ఒయ్యారాన్ని అప్పుడే విడిచిపెట్టి కంగారుగా పరుగుదీసింది రాణీ.

    అది చూసి చుట్టూ మూగిన జనం అయోమయంలో పడిపోయారు.

                       *    *    *    *
       

    ఒయ్యారంగా నడుం తుప్పుకుంటూ వచ్చి-

    "అత్తా! ఏం చేస్తున్నావు?" అడిగింది రాణీ.

    "రాణీ! వచ్చావా తల్లీ! ఇటొచ్చి కూర్చో" అంది యాదమ్మ మంచం మీదనుంచి లేచి కూర్చుంటూ.

    రాణీ అటూ యిటూ చూస్తూ లోపలికి వచ్చింది. ఆమె కళ్ళు ఎవరికోసమో వెదుకుతున్నాయి.

    "ఏంటి పొద్దున్నే వచ్చావు?" అడిగింది యాదమ్మ.

    "కన్నయ్య ఏడీ?"

    "పనిలోకి పోయాడు"

    రాణీ పావడా సర్దుకొని కూర్చుని ఓ కాలు వూపుతూ "కన్నయ్య బావని కారుకింద పడబోతుంటే ఎవడో పోటుగాడు వచ్చి రక్షించాడటగా! చెట్టుకింద పడుకున్నాడంటే అందరం పోయి చూసొచ్చాం!"

    "బస్తీలో జనం చెట్టుకాడ కొత్త మనిషెవరని అడిగితే విషయం నేనే చెప్పాన్లే. ఇంతకీ రామయ్య బాబుని చూశావా!" యాదమ్మ మొహంలో ఆనందాన్ని చూసి నవ్వుతోంది రాణీ.

    "ఆ చూశాలే! సోడాబుడ్డి మొహం!" మూతి తిప్పింది రాణీ.

    యాదమ్మ ఆ మాటలకి చిన్నబోతుంటే-

    "అదేమిటి! దొరబాబులా వున్నాడని అందరూ అంటుంటే! కళ్ళెట్టుకునే చూశావా!"

    "ఆ కళ్ళతోనే చూశా! నీ కంటే కళ్ళు లేవు కాబట్టి తెలీదు. నీమీద ఒట్టు. సున్నిపిడతలా వున్నాడు. నన్నడిగితే ఇట్టాటోళ్ళని నమ్మకూడదు"

    మేనకోడలి మాటలకి నవ్వింది యాదమ్మ.

    "మనిషెలా వుంటే నాకెందుకు? మా బతుకుల్ని నిలబెట్టాడు. నమ్మకం మాటంటావా? నా దగ్గరేమన్నా సొమ్ముంటే వాడెత్తుకుపోతాడనుకోవచ్చు. ముసలి ముండని, కన్నయ్య పసివాడు"

    "నీ ఉద్దేశ్యం నాకేమీ అర్ధం కావడంలేదు" అంది రాణీ మేనత్త మనసులో అతనిపైన ఇంకేం అభిప్రాయం వుందో తెలుసుకోవాలని.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS