అడవి దారులు తిరగవెయ్యండి. కొండ గుట్టలయినా , చెట్టులుండే పట్టులయినా శోధనం చెయ్యండి.
దోరబిడ్డల్ని దొరకపుచ్చుకుని రాలేకపోతే రగతాలు వారపొయ్యండి. ప్రాణాలనే పణమెట్టండి. పొండిరా పొండి. దొర బిడ్డలతో తిరిగి రండి" అంటూ ముందుగా తానే రెండు దిక్కులా పదును పెట్టి వుంచిన యినుప పలుగును దొరకపుచ్చుకుందామే.
అందిన ఆయుధాలు పట్టుకుని అన్ని దిక్కులకూ బయలుదేరినారు ఆదిమజనులు. పులులవాత పడ్డారో, పురుగు ముట్టి పోయినారో , అలుగుల ఎలుగుల పాలయినారో!
దిక్కుల వెంట వింటి విడిచిన బాణాల్లా పరుగులు తీసారు. ఆదిమ జనులు. అందిన అడివిదారుల వెంట శోధించటం ఆరంభించినారు.
తప్పించుకు పోయిన వేటను తలుచుకుంటూ మీసాలు నొక్కుకుంటూ కొండ గుహలో షికారు చేస్తున్న మృగ రాజులా పలుగు చేతపట్టి చెట్టు క్రింద పచారు చేస్తోంది చెంచులచ్చిమి. ఏ దిక్కు నుంచి ఏ వార్త వస్తుందో అని మధ్య మధ్య ఆశగా తలయెత్తి చూస్తోంది.
ఎటునించి ఏ వార్తలూ రాలేదు. పోయినవారు కనిపించకుండానే పోయినారు. ఒక్కరూ తిరిగి రాలేదు.
ఆదిమ జనులలో తప్పి జారి వచ్చిన ఒక అవిటివాడు వేగంగా పరుగు తీయలేక ఆయుధం పట్టుకుని నింపాదిగా నడిచాడు. అందరికన్నా వెనుకపడిన అతని వంక ఓరగా గుర్రుమని చూచింది చెంచులచ్చిమి.
అతడి గుండెలు గుబగుబలడినాయి. మంది పనిలో తొందర మాని సోమరి అయినాడని ఆమె శిక్షించవచ్చు. గూడెం పెద్దలకు చెప్పి కూకలు పెట్టించవచ్చు.
ముందు ఆమె దృష్టి పరిధుల నించి తప్పుకోవాలి. కాని శరీర పరిస్థితి అందుకు అనుకూలం కాదు. అతడు అవిటివాడయినా ఉపాయశాలి. అందు నించి ఆమె దృష్టి కోణం నించి తపుకోవాలని వుపాయం వెదుకసాగాడు.
దగ్గరలో అతనికి రాకాసి గుడిని బయల్పరిచేందుకు తాము త్రవ్విన గొయ్యి అతనికి కన్పించింది. ప్రస్తుతానికి దానిలో తలదాచుకుంటే గండం తప్పుతుంది.
అటువంటి అవకాశం అంతదగ్గరలోనే అందివచ్చినందుకు మహాదానందపడిపోతూ మెట్ల మీదుగా సమాధి గుడి లోనికి దిగిపోయాడు అతడు.
చివరి మెట్టు దిగుతూనే అతనికి లోపల దొరబిద్దలు కన్పించారు. దొర కూర్చుని ఆమె ముఖంలోకి ఆదుర్దాగా చూస్తున్నాడు. అతని తొడపై తల పెట్టుకుని పడుకుని వుంది దొరసాని.
"ఓరోరి ఇక్కడున్నారే దొరబిడ్డలు! దొరబిడ్డలిరుగో!" అంటూ కీచుమని అరిచాడతను.
వేట తప్పి విచారగ్రస్తయై గుహ లో తిరిగే మృగేంద్రంలా పలుగు పుచ్చుకుని పచారు చేస్తున్న చెంచులచ్చిమికి ఈ అరుపులు విన్పించినాయి.
తల వొంచుకు పచారు చేస్తున్న అలికిడి విని గరిక దుబ్బల క్రిందికి దూరిన సర్పరాజులా ఆమె శబ్దాలకై ఎదురు చూస్తోంది. ఆశించిన అరుపులు చెవి సోకినాయి.
మబ్బుల మాటు నించి దబ్బున దూకి పడున్న ఉల్కలా , జలపాతంలా రివ్వున మరుక్షణంలో రాకాసి గుహ దాపులకు చేరుకుంది.
దొరబిడ్డలిద్దరూ సమాధి గుహలో చిన్ని ఆరు రెండు సమాధికి ఆవల రాతి పలక దగ్గర కన్పించడంతో ఆమె ఆరాటం మాటుమాయమయింది. వెంటనే పరుగు పరుగున తిరిగి వెళ్ళి చెట్టెక్కి చిత్రమయిన కూత పెట్టిందామే. సమీపంలో వుండి అన్వేషణ కార్యక్రమంలో లీనమయిన రామదండు లాంటి ఆదిమ జనులు కొందరు ఆమె పెట్టిన కూతను అందుకున్నారు. దాని అర్ధం వారికి తెలుసు.
తిరిగి రమ్మని ఆదేశించటమే అది!
వెంటనే ఎక్కడి వారక్కడ వున్న చెట్ల పైకి ఎక్కి అదే కూత పెట్టారు . క్షణాల మీద అడవి దారుల వెంట దూరం పోయినవారికి కూడా వార్తలు అందినాయి. బిలబిలమంటూ అందరూ తిరిగి వచ్చేశారు.
వారందరినీ వెంట పెట్టుకుని విప్పారిన ముఖంతో, ఆనంద వివశమయిన మనసుతో తిరిగి వచ్చింది చెంచులచ్చిమి, విజయ గర్వంతో దొరబిడ్డలను వారికి చూపింది.
అనందం పట్టలేక వారంతా చిత్ర విచిత్రమయిన శబ్దాలు చేశారు. కొందరు చేతులెత్తి నాట్యాలు చేశారు.
అప్పటికి జ్యోతి రెప్పలు రవంత పైకి లేచినాయి. ఉచ్చ్వాస నిస్వాసాలు దీర్ఘాతరమయినాయి. ముఖంలో మంద స్థితి మటుమాయమై జీవ చైతన్యం తాలుకూ వెలుగు జిలుగులు చోటు చేసుకున్నాయి. బిగుసుకుపోయి పాల మీగాడలా పాలిపోయిన పెదవులు పగడాల వలె అరుణవర్ణంగా మారుతున్నాయి.
పూర్తిగా రెప్పలు విప్పింది జ్యోతి.
ఎట్ట ఎదుట జయకృష్ణ చిరునవ్వుతో కన్పించాడు. ఆమె పెదవులు పూర్తిగా విచ్చుకున్నాయి.
"జయా! నేను ఇక్కడకు ఎలా వచ్చాను?" అని అడిగిందామె.
"కాలు నొప్పి పెడుతోంది. ముందు నువ్వు లేచి కూర్చోవాలి " అన్నాడు జయకృష్ణ చిరునవ్వు నవ్వుతూనే!
చివాలున లేచి కూర్చుంది జ్యోతి.
"జయా! ఏమిటీ దుస్థితీ. నాకోసం నీవు ఇలా కూర్చుని ఎంత సేపయింది? ఏమయింది జయా?" అని అడిగిందామె.
జయకృష్ణ అలసట తీర్చుకుంటున్నట్లుగా దీర్ఘంగా విశ్వసించాడు. లేచి నిలిచి ఒళ్ళు విరుచుకున్నాడు. నిద్రలేమి శీతలాన్ని అని వార్యంగా ఎదుర్కొంటున్న అలసట అతనిని బాగా కృంగదీశాయి. దానికి తోడు జ్యోతికి ఏమవుతోందోనన్న కంగారు మరింతగా అతనిని దిగజార్చింది.
దాంతో అతడు మరింత నిర్జీవ ప్రతిమలా అయినాడు. ముఖం వాడి వుత్త అయిపొయింది. జుట్టు చెరిగి వెంట్రుకలు చికాకుగా నుదురు మీదికి వచ్చాయి.
"జ్యోతి ! ఆ సంగతులన్నీ తరువాత. ముందు రాకాసి గుహ లోపల ఉన్న చిన్న సమాధి లోని వస్తువులను సేకరించాలి. నీకు నిస్సత్తువుగా ఉంటే బయటకు వెళ్ళిపో. చేయగలిగితేనే సాయం చెయ్యి. ఆ పని పూర్తీ అయాక నీ ప్రశ్నలన్నింటికీ నింపాదిగా సమాధానం చెప్తాను." అన్నాడు జయకృష్ణ.
అర్కేలాజికల్ కార్యకర్తలా అతడు క్రియాశీలుడు అయినాడు. జ్యోతి అతనికి సాయం చేయాలనే సంకల్పించింది. వాస్తవానికి ఆమె శరీరం నిస్సత్తువగా వుంది.
కనులు విప్పితే కళ్ళు తిరుగుతున్నాయి. కాళ్ళు కదిపితే తేలిపోతున్నట్లుగా అన్పించాయి.
అయినప్పటికీ కర్తవ్యాన్ని స్మరించి, ఆ ప్రయత్నంలో ఎదురయిన అనుభవాల నించి కలిగిన భయాన్ని విస్మరించి కార్యరంగంలోకి దిగిందామె.
ఆరడుగుల పొడవూ, రెండడుగుల వెడల్పూ కలిగిన రాళ్ళు ఎదురుబదురుగా నేలలో అమర్చి ఉన్నాయి. వాటి ఎదురుగా రెండడుగుల పొడవున మరి రెండు రాతి పలకలు అమర్చారు. అదంతా కలిపి దీర్ఘాచతురస్త్రాకారపు తోట్టిలా తయారయింది.
దానిలో శ్వేతకి తాలుకూ శరీర అవశేషాలు కన్పించినాయి. రక్త మాంసాలు పూర్తిగా శిధిలమయిన కంకాళమది. దాని ప్రక్కన రెండు మట్టి పాత్రలున్నాయి.
ఒక పాత్రలో శ్వేతకి సజీవురాలాయి వుండగా ధరించిన బండపూసల ఆభరణాలు, ఆమె వాడిన చిన్నిచిన్ని లోహ వస్తువులూ వున్నాయి. మరొక పాత్రలో ఆమె పరలోక ప్రయాణం అలసట లేకుండా సాగేందుకు ఆహారం వుంచారు కాబోలు. ఇప్పటికీ అదంతా రూపుమాపి మట్టిలా అయిపొయింది.
