"వారితో నాకు అర్జంట్ పని వున్నది."
"అంత అర్జంట్ పని ఉంటే ఆసుపత్రికే వెళ్ళలేకపోయావా బాబూ!"
"ఆసుపత్రి పని కాదు, పర్సనల్. అదే వేరే పని ఉన్నది."
"వేరే పనా? మీరు డాక్టర్ అమ్మగారు చుట్టాలా?"
"కాదు!"
"స్నేహితులా?"
"అయితే అంత అర్జంటు పనేంటి నాయనా" ఆమె సాగర్ ను పిచ్చాసుపత్రినుంచి పారిపోయి వచ్చిన వ్యక్తిని చూసినట్టు చూసింది.
"నిజంగా డాక్టర్ గారితో చాలా ముఖ్యమైన పని ఉన్నది. ఆమెగారిని ఒక్కసారి పిలవండి"
ఆమె మళ్ళీ తలుపు మూయబోతుండగా సాగర్ ఆమెను తోసుకొని లోపలకొచ్చాడు. ఆమె కంగారుపడింది. రెండడుగులు వెనక్కేసింది.
"మీరు ఆ డాక్టర్ గారి తల్లిగారా?"
"కాదు"
"మరి వంటమనిషివా?"
"అవన్నీ నీకెందుకూ? ముందు నువ్వు బయటికి నడువ్! అమ్మాయ్ చూడమ్మా యెవరో పిచ్చివాడు లోపలకొచ్చేస్తున్నాడు" ఆమె పెద్దగా కేక పెట్టింది.
"ఆయమ్మా! ఏమిటయింది?" గాబరా పడుతూ డాక్టర్ పరిమళ పరుగెత్తుకొచ్చింది.
"గుడ్ ఈవినింగ్ డాక్టర్"
డాక్టర్ పరిమళ సాగర్ కేసి తిరిగి పరీక్షగా చూసి స్థిమితపడింది. ఆయమ్మ కేసి తిరిగి "ఏమయింది ఆయమ్మా" అని అడిగింది.
"చూడమ్మా! ఈయన వద్దన్నా వినకుండా లోపలకొచ్చేశాడు!"
"సారీ డాక్టర్! నేను చాలా అవసరమైన పనిమీద వచ్చాను. సాయంకాలం నాలుగ్గంటల నుంచీ మీకోసం కాచుకున్నాను. ఈమెగారేమో సరిగా సమాధానం చెప్పదు. పైగా నన్ను బయటకు నెట్టి మళ్ళీ తలుపు బిడాయించేట్టుగా ఉన్నది. అందుకని..."
"అందుకని పర్మిషన్ లేకుండా తోసుకొని లోపలకొచ్చారన్నమాట!" పరిమళ గొంతు తీవ్రంగా ఉన్నది.
"డోంట్ గెట్ అప్సెట్ మేడమ్! అందుకు క్షమాపణ చెప్పుకొంటున్నాను"
"ఓ కే, ఇతకూ మీరొచ్చిన పనేమిటి?"
"మీ హాస్పిటల్లో ఎడ్మిషన్ కావాలి!"
"మీకా?" ఆశ్చర్యంగా అన్నది పరిమళ.
"అవును! నాకే! ఏం నేను పిచ్చివాడిలా కన్పించడం లేదా?"
"అడ్మిషన్స్ అన్నీ మా బాస్ చూసుకుంటారు, వెళ్ళండి" అంటూ వెనక్కు తిరిగింది పరిమళ.
"ఒక్క క్షణం! ప్లీజ్ ఆగండి. మీరు రికమండ్ చేస్తే మీ బాస్ వింటాడు. మీరంటే ఆయనకు చాలా..."
"డోంట్ టాక్ రబ్బిష్ ముందు బయటికి వెళ్ళు! అంతా నాటకం! నీకేం పిచ్చిలేదు. ఏమీలేదు"
"ఎందుకు అలా అనుకుంటున్నారో తెలుసుకోవచ్చా మైడియర్ డాక్టర్!"
"పిచ్చివాడెవడూ తను పిచ్చివాడ్నని చెప్పుకోడు. ఆసుపత్రిలో చేరతానని తనంత తానే రాడు."
"అలాంటి వాళ్ళు పిచ్చివాళ్ళు కాదంటారా?"
"ముమ్మాటికీ కాదు."
"అయితే మాధవి పిచ్చిది కాదన్నమాట!" డాక్టర్ పరిమళ కలవరపడింది.
"మీరు_మీరు...?"
"అవును! నేను సాగర్నే!"
"ఓ మైగాడ్ ప్లీజ్. కమిన్!" అంటూ పరిమళ సాగర్ను డ్రాయింగ్ రూంలోకి తీసుకెళ్ళింది.
"ఆయమ్మా నువ్వు లోపలకెళ్ళు! రెండు కాఫీ! పట్టుకురా!" ఆయమ్మకు పురమాయించింది డాక్టర్ పరిమళ. సాగర్ ను చూసి "ఐదు నిముషాల్లో వచ్చేస్తాను. కూర్చోండి" అన్నది. సాగర్ సోఫాలో కూర్చున్నాడు. గదంతా ఓసారి కలయ చూశాడు. టేబుల్ మీద ఉన్న పత్రికలని తిరగేస్తూ కూర్చున్నాడు.
డాక్టర్ పరిమళ ట్రేతో రెండు కాఫీ కప్పులు పట్టుకుని వచ్చింది.
"ఎందుకండీ మీకీ శ్రమ"
"ఇందులో శ్రమ ఏమున్నదండీ" అంటూ కాఫీ కప్పు అందించింది పరిమళ.
"నిజమే లెండి! మీరు మాధవి కోసం పడుతున్న శ్రమలో ఇదే మాత్రం!" నవ్వుతూ సాగర్ పరిమళ చేతిలోనుంచి కప్పు అందుకున్నాడు. పరిమళ ఆశ్చర్యంతో కళ్ళు తిప్పింది.
"మాధవి సంగతి చాలా రహస్యంగా దాచాం. మీకెలా తెలిసిపోయింది."
"రహస్యాన్ని దాచవలసిన బాధ్యతమీది! తెలుసుకోవాల్సిన అవసరం నాది!"
"తెలుసుకొని ఏం చేద్దామనుకొంటున్నారు?" పరిమళ కంఠం తీవ్రంగా ఉన్నది.
"ఏం చేయాలన్నా మీ సహాయం కావాలి."
"నన్నేం చేయమంటారు!"
"నన్ను మాధవి దగ్గరకు చేర్చండి"
"పిచ్చాసుపత్రిలో చేర్పించమంటారా? అసంభవం. ఇంపాజ్ బుల్! అందుకు మెడికల్ సర్టిఫికెట్ కావాలి. మేజిస్ట్రేట్ సర్టిఫికెట్ కావాలి. మీ తండ్రి అనుమతి పత్రం కూడా కావాలి."
"ఐ నో దెం! అవన్నీ నాకు తెలుసు. అవన్నీ వుంటే మీ సహాయం నాకెందుకూ? అవి లేవు కాబట్టే మీ సహాయం కావాలంటున్నాను. మీ రికార్డులోకి రాకుండా, ఏదోలా మాధవి ఉన్న వార్డులో నేను మూడురోజులుండే అవకాశం కల్పించాలి.
"ఊఁ కల్పించేననుకో మాటవరసకు! ఏం చేస్తావ్?"
"మాధవి పిచ్చి వదలగొడ్తాను."
"అంటే? పెళ్ళి చేసుకుంటావా?" పరిమళ కళ్ళు గుండ్రంగా తిప్పింది.
"పెళ్ళయితే పిచ్చి కుదురుతుందనా? అయితే మీ హాస్పటల్లో చేరిన వాళ్ళందరకూ పెళ్ళిళ్ళు చేసి జబ్బు నయం చేస్తున్నారా డాక్టర్" బిగ్గరగా నవ్వాడు.
పరిమళ వచ్చే నవ్వును ఆపుకుంటూ "నా ఉద్దేశ్యం అదికాదు" అన్నది!
"మీ బాస్ కు పెళ్ళయిందిగా! అయినా ఆ పిచ్చేమిటి"
"మా బాస్ కు పిచ్చా? అని ఎవరు చెప్పారు"
"అదో రకం పిచ్చి! కాకపోతే మీ వెంట అలా ఎందుకు పడుతున్నట్టు?"
"అయినో ఫూల్! అవును ఆ సంగతి మీకెలా తెలిసింది."
