Previous Page Next Page 
ది పార్టనర్ పేజి 46

 

    'అందుకే అదే విధంగా మీ ఇద్దరినీ ఫినిష్ చేసి ఈ రెండు పీపాలలో పెట్టి ఈసారి విజయవాడ నుండి వైజాగ్ వెళ్ళే పాసింజర్ లో పంపడానికి ప్లాన్ సిద్దం చేసుకున్నాడు."
    అంటున్న ధీరజ వైపు నిలువు గుడ్లు వేసుకుని చూస్తుండిపోయింది స్వప్న.
    తన రహస్యం అంత తేలిగ్గా వాళ్ళకు ఎలా తెలిసి పోయిందో సింహాచలానికి అంతు పట్టలేదు.
    "మిస్టర్ ....నువ్వే చాలా తెలివయిన వాడివి అనుకుంటున్నావు కదూ.....కానీ ఆరోజు నువ్వు పనిగట్టుకుని వచ్చి ఆ శవాన్ని గురించి రిపోర్ట్ చేసినప్పుడే నాకు నాపై అనుమానం వచ్చింది. దగ్గరగా వున్న మీ ఆర్.సి. ఎస్. ఆఫీసర్లకు ఇన్ ఫామ్ చేయకుండా నాకే వచ్చి చెప్పడం.....అదీ గాక రైల్వే ఫోన్ సి,ఆంట్ టి ఫోన్ రెండూ మా స్టేషన్ లో వుండి కూడా ఫోన్ లో చెప్పకుండా నువ్వే ప్రత్యేకమయిన శ్రద్ధ తీసుకుని చెప్పడం చుశావ్ ఎందుకో నీ చర్యలు నాకు అనుమానంగా తోచాయి.
    'అప్పటి నుండీ నిఘా వేయమని నీ మిత్రుడు అయిన మా కానిస్టేబుల్ సుందరాన్ని నియమించాను. అందుకే నీ భార్యతో పరిచయం పెంచుకుని నీ మూవ్ మెంట్స్ తెలుసుకుందామను కున్నాడు. కానీ నీ భార్య అతనిని అపార్ధం చేసుకున్నది. దర్యాప్తు ఎంతవరకు వచ్చింది అంటూ నువ్వే గొంతు మార్చి నాకు ఫోన్ చేసిన విషయం కూడా నాకు అప్పుడే తెలుసు.....కానీ ఇప్పటి వరకు పూర్తీ ఆధారాల కోసం ఆగవలసి వచ్చింది."    
    ధీరజ తనను ముందే అనుమానించింది అన్న నిజాన్ని యింకా జీర్ణించుకోలేకపోతున్న సింహాచలం చెవికి ఆమె మాటలు వినిపించడం లేదు.
    "సీతాపతిని హత్య చేసింది నువ్వేనని పాపం లలితకు నిజంగానే తెలియదు. విస్కిలో వాటర్ బాటిల్ లోనూ మత్తుమందు కలపడం వలన ఆ నీళ్ళు తాగిన లలిత, విస్కీ తగిన సీతాపతి మత్తులో వుండిపోయారు. ఆ సమయంలో ఆతనిని చంపి పీపాలో పెట్టి శవాన్ని కనిపించకుండా మాయం చేయడం వలన భర్త ఏమయ్యాడో తెలియక లలిత అలా చెప్పిందని నా పరిశోధనలో తెలిసింది."
    "అబద్దం.....అతనిని నేను చంపడం ఏమిటి? నాకేం తెలియదు ఇన్ స్పెక్టర్.
    "మిస్టర్ ....ఆధారాలు లేని నిందను వేయడం లేదు నేను....ఆ శవాన్ని పార్శిల్ చేయడానికి ఒక గొనె సంచి అవసరం అయింది. ఆ వీధిలోనే వున్న గొనె సంచీలు అమ్మే షాపుకు వెళ్ళి ఒక గొనె పట్టాను కొని తెచ్చావు. అంతకు ముందే ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్ వాళ్ళు లాట్ గా అమ్మిన గోనే సంచులలో నుండి ఒకదాన్ని నీకు అమ్మినట్టుగా అతను చెప్పాడు.
    "శవాన్ని పార్శిల్ చేసిన గొనె సంచి పై ఉన్న గుర్తును గుర్తుపట్టి అది తను అమ్మిందే నని ఒప్పుకున్నాడు కూడా .......నువ్వు నీకు తెలిసిన రిక్షా వెంకటేశ్వర్లు సాయంతో ఆ పీపాను తీసుకువెళ్ళి నర్శింగుపల్లి స్టేషన్లో రైలు ఎక్కించావు. అతని రిక్షాలో నువ్వే ఆ పీపాను తీసుకెళ్ళి నట్లు రైలులో ఎక్కించినట్టు అతను నిజాన్ని ఒప్పుకున్నాడు. అయినా నువ్వు ఇంకా బుకాయిస్తూనే వున్నావు."
    సింహాచలం తల వంచుకున్నాడు.
    "ఇంతవరకు పీపాలోని శవం కేసులో హంతకుడిని పోలీసులు గుర్తించలేదు కాబట్టి అదే పక్కీలో కులట అయిన నీ భార్యను అతని ప్రియునితో కలిపి చంపి మరో రెండు పీపాలను పార్శిల్ చేద్దాం అనుకున్నావు....సరిగ్గా లలిత భర్తను ఎలా చంపావో అలానే సునీల్ ను చంపడానికి ప్లాన్ చేశావు. కాని సునీల్ విస్కీ జోలికి వెళ్ళకపోవడం వల్లనే అతను వెంటనే మేల్కొన్నాడు. నీ భార్య మాత్రం మత్తులోనే వుండి పోయింది."
    అంత వివరంగా చెబుతున్న ధీరజ మాటలను కాదు అని బుకాయించ లేకపోయాడు సింహాచలం.
    "భాద్యత తెలిసిన ఒక పోలీస్ ఉద్యోగివి అయి వుండీ లలితతో నీచమయిన అక్రమ సంబంధం పెట్టుకుని .....అంతే కాకుండా అతని భర్తను మానవత్వం మరచి రాక్షసంగా హత్య చేసినందుకు నిన్ను ఆ దేవుడు కూడా క్షమించా లేడు. చట్టం నీకు విధించే మరణ శిక్ష కాకుండా ఆ అధికారమే నాకు వుంటే ఈ క్షణమే నిన్ను కాల్చి చంపెదాన్ని ....." చీదరించు కున్నది ధీరజ.
    పూర్తిగా తనను గురించి తెలిసిపోయినందుకు గానీ .....ఎలా చంపిందీ పూస గుచ్చినట్టు వివరిస్తున్నందుకు గాని కిమ్మనకుండా తలవంచుకున్నాడు ఆర్.ఫై.ఎఫ్. హెడ్ కానిస్టేబుల్ సింహాచలం.
    విజయవాడ నగర ప్రజలకు సంచలన వార్తగా మిగిలిపోయిన గొనె పట్టాలోని శవం .....చివరకు ఆ విషయాన్ని తొలుతగా రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసిన సింహాచాలాన్నే అరెస్టు చేయడం ప్రజలలో సంచలనాన్ని కలుగజేసింది."


                                                         *    *    *

    సునీల్ పొట్టలో కత్తి లోతుగా దిగడం వలన రక్తం చాలా పోయింది.
    అతనికి ఇప్పుడు ఆపరేషన్ చేసి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో వుంచారు.
    సీతాపతి కేసులో తన దర్యాప్తు పూర్తీ కావడంతో ఇన్ స్పెక్టర్ ధీరజ వారం రోజులు శెలవు పెట్టింది.
    సునీల్ కు స్పృహ రావడంతోనే తన ఎదురుగా వున్న ధీరజను చూశాడు.
    వెంటనే ముఖం ప్రక్కకు తిప్పుకున్నాడు.
    ధీరజ అతని నుదుటి పై చెయ్యి వేసింది.
    "వద్దు  ధీరజా .....నన్ను తాకవద్దు .....మలినమయిన ఈ శరీరాన్ని తాకి నువ్వు మలిన పడవద్దు."
    అస్పష్టంగా అతని పెదవులు కదిలాయి.
    ఆపరేషన్ చేతిన మత్తులో నుంచి ఇంకా అతను బయట పడలేదు. అస్పష్టంగా అతను గొణుక్కుంటున్నంత లోనే నిద్రలోకి జారిపోయాడు.
    "ప్చే...... " ధీరజ భారంగా నిట్టూర్చింది.
    సునీల్ పూర్తిగా కోలుకున్న తరువాతే అతనిని కలవడం మంచిదని ....ఈలోపు తను తిరిగి అతని కంటపడి ఇన్ ఫిరియారిటీ కాంప్లెక్స్ కు గురిచేసే కన్నా మానసికంగా మనిషి అయిన తరువాతే రావడం మంచిది అనుకున్నది ధీరజ.
    అతనిని జాగ్రత్తగా చూసే బాధ్యతను అక్కడ డ్యూటీ నర్సులకు అప్పజెప్పి వెను దిరిగింది ధీరజ.
    రెండు రోజుల తరువాత హాస్పిటలు నుండి వెంటనే రమ్మని ఫోన్ చేస్తే బయలుదేరి వెళ్ళిందామె.
    అతను వుండవలసిన బెడ్ పై రెపరెప లాడుతున్న ఉత్తరం .
    ప్రియతమా ........
        నన్ను క్షమించు......నా మనసులోని మాటను నీ ముందు వుంచితే నువ్వు ఒప్పుకోవని తెలుసు....అందుకే నువ్వు లేని సమయం చూసి వీడ్కోలు తీసుకుంటున్నందుకు నాది పిరికి చర్యగా భావించకు.....జీవితంలో ఓడిపోయినంత మాత్రాన.....నా గమ్యాన్ని సరిగా నిర్దేశించుకోలేనంత మాత్రాన విసిగి వేసారిపోయి ఈ జీవితాన్ని చాలించే పిచ్చి ప్రయత్నం చేయను కాబట్టి నువ్వేం దిగులు పెట్టుకోకు.
    కొందరు సుఖాల కోసమే పుట్టి వుంటారు కాబోలు .... మరికొందరు దుఃఖాల కోసమే జన్మించి వుండవచ్చు. కానీ ఒక విధంగా సుఖం లోనే కూరుకుపోయి వున్న వాళ్ళకు అందులోని మాధుర్యం కానరాకపోవచ్చు ఆ మార్పులు ఏవో వస్తూ పోతూ వున్నప్పుడే అందులోనే మంచి చెడ్డలు అవగతం అవుతాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS