Previous Page Next Page 
ది పార్టనర్ పేజి 45

 

    "సారీ స్వప్నా......ఎందుకో నా ప్రవర్తన మీద నాకే రోత కలుగుతున్నది. అసలు ఈ జీవితం మీదే విరక్తి కలుగుతుంది." క్షణం ఆగాడు తను.
    "యోగి వేమనవు కావాలను కుంటున్నావా..... లేక నా ముందు ఫోజు కొడుతున్నావా?"
    "నువ్వు ఎలా గయినా అనుకో.....వెళ్ళి పొమ్మంటే వెళ్ళిపోతాను. అంతే తప్ప ఈ విషయంలో నన్ను బలవంత పెట్టకు" నిర్మొహమాటంగా చెప్పాడు సునీల్.
    "సరే బాసూ.....నీ యిష్టం వచ్చినంత కాలం ఇక్కడే వుండు, మా అయన విషయం నువ్వేమీ అలోచించి మనస్సు పాడు చేసుకోకు. ఆయనకు మన ఇద్దరి సంగతి తెలుసు.... అయినా భయపడి అడగలేడు అనుకో .....అలాంటి షాక్ ట్రీట్ మెంట్ యిచ్చానులే.....ఇక జన్మలో మన జోలికి వస్తే ఒట్టు" అన్నది స్వప్న చిరునవ్వుతో.
    సునీల్ అవునని కానీ కాదాని కానీ చెప్పలేదు.
    "కమాన్ బాసూ పడుకుందాం."
    "స్వప్నా....నీకు ఇంతకుముందే చెప్పాను"
    'అబ్బ ....ఆమాత్రం నాకు తెలియదు అనుకున్నావా......చాలా టైం అయిందని పడుకోమంటున్నాను. కానీ నా దగ్గర కాదుగా.....నీ అంతట నువ్వు నన్ను కోరి వచ్చేంతవరకూ నిన్ను రమ్మని అడగను..... సరేనా ....గుడ్ నైట్ బాసూ...."
    అని ఏదో గుర్తుకు వచ్చినట్టు ఫ్రిజ్ తెరిచి మంచినీళ్ళ సీసా ఎత్తి గటగటా తాగింది స్వప్న.
    బెడ్ వైపు అడుగులేస్తున్న ఆమె దృష్టి భర్త తెచ్చి వుంచిన విస్కీ బాటిల్ పై పడింది.
    విస్కీ సీసా, వాటర్ బాటిల్ తెచ్చి సునీల్ ముందు వుంచింది.
    "మనసు బాగోలేదు అంటున్నావుగా ....తీసుకో బాసూ....." అని లైటు అర్పి వెళ్ళి మంచం మీద పడుకున్నది స్వప్న.
    ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు కాని కాస్సేపటికే గాడమయిన నిద్ర మత్తులోకి ఒరిగిపోయింది.
    విస్కీ బాటిల్ ను చూడగానే సునీల్ జిహ్వ జివ్వుమని లాగి నట్టయింది. గ్లాసులోకి వంపుకుని వాటర్ కలుపుకున్నాడు.
    విస్కీ గ్లాసు పెదవులను తాకుతుండగానే సునీల్ లోని వివేకం వెన్ను తట్టి హెచ్చరించింది.
    తను ఇంతకాలం ఈ మత్తుకే దాసోహం అన్నాడు....అమ్మాయిల కౌగిళ్ళలో నలిగిపోయి తిరుగుబాటుగా తాగుబోతుగా .....చివరకు వ్యక్తిత్వం లేని వాడిగా ధీరజ దృష్టిలో నిలబడవలసి వచ్చింది.
    ఇంత జరిగిన తరవాత మళ్ళీ తిరిగి అదే జీవితాన్ని ఆహ్వానించలేక పోతున్నది అతని మనస్సు .....అందుకే గ్లాసులోని విస్కీ కింద వంపేశాడు.
    సోఫాలో కూర్చున్నాడు కుర్చున్నట్టే జారిగిల పడ్డాడు.
    కొన్ని కొన్ని సందర్భాలలో మనిషికి కావలసింది గుండె బరువు చల్లార్చే నిద్ర మాత్రమే. ఆ నిద్రలోకి జరితేనే మనస్సు సేద తీరుతుంది.
    అదే సమయంలో ఆ ఇంటి పెరటి గుమ్మం దూకి లోనికి వచ్చింది ఒక ఆకారం.
    వెనుక వైపు తలుపు అంతకు ముందే తీసి వుంచడం వలన కాబోలు నెట్టగానే తెరుచుకున్నది.
    అడుగుల చప్పుడు కాకుండా అతను నెమ్మదిగా లోనికి ప్రవేశించాడు.
    ఆ ఇంటిలో ఏది ఎక్కడ వుంటుందో ఎవరో పూస గుచ్చినట్టు అంతకు ముందే చెప్పిన విధంగా ఎలాంటి తడబాటు లేకుండా సింహాచలం పడక గదిలోకి ప్రవేశించింది ఆ ఆకారం.
    బెడ్ లైట్ వేసి వుండడం వలన ఆదమరచి నిద్రపోతున్న స్వప్న అతనికి స్వప్నంలా కనిపించింది.
    చకచకా నడిచి బెడ్ ను సమీపించి ఒక నిమిషం ఆమె ముఖం వైపు పరిశీలనగా చూశాడు అతను.
    మరు క్షణమే అతని చేతిలోని కత్తి విసురుగా పైకి లేచింది.
    ఆ క్షణం లోనే చక్ మంటూ ఆ గదిలోని లైటు వెలిగింది.
    ఆవేశంగా చేతిలోని కత్తితో స్వప్న పొట్టలో పొడవబోతున్న వ్యక్తీ అదిరిపడి చివ్వున వెనుదిరిగి చూశాడు.
    స్విచ్ బోర్డు దగ్గర చిరునవ్వుతో కానిస్టేబుల్ సుందరం.
    చేతిలో కత్తితో నిలుచుని ఉన్న సింహాచలం అతనిని చూడడంతో తడబాటుకు లోనయ్యాడు.
    కాని వెంటనే తన కర్తవ్యం గుర్తుకు వచ్చి స్వప్నను పొడవడానికి గిర్రున వెను దిరిగాడు.
    "సింహాచలం అగు .....నా మాట విను"
    సుందరం గాభరాగా కేక పెట్టాడు.
    ఆ అరుపులకు సునీల్ కు  టక్కున మెలకువ వచ్చింది.
    కళ్ళు తెరిచిన వెంటనే కనిపించిన దృశ్యం చూసి చటాలున పైకి లేచాడు.
    ఒకే ఒక్క అంగలో వెనుక నుండి సింహచలాన్ని కౌగలించుకున్నాడు.
    తన ప్రయత్నం విఫలం అవుతున్నది అని తెలిసి ఒక్క విదిలింపు విదిలించాడు అతను.
    సునీల్ పట్టు సడలింది.
    ఉక్రోషాన్ని పట్టలేని సింహాచలం చేతిలోని కత్తిని విసురుగా సునిల్ కు దింపాడు.
    ఆ గందరగోళానికి నిద్రలేచిన స్వప్న ఆ దృశ్యం చూసి మ్రాన్పడిపోయింది.
    అప్పటికే బిలబిల మంటూ వచ్చిన పోలీసు సిబ్బందిని చూసిన సింహాచలం బిత్తరపోయాడు.
    వాళ్ళ వెనుకగా ఇన్ స్పెక్టర్ ధీరజ.
    వచ్చిన వెంటనే సునిల్ పరిస్థితిని అర్ధం చేసుకుని అంబులెన్స్ కోసం కానిస్టేబుల్స్ ను పంపించింది.
    అంబులెన్స్ వచ్చీ రావడంతో సునిల్ హాస్పిటల్ కు తీసుకు వెళ్ళారు.
    "మిస్టర్ సింహాచలం .....యూ ఆర్ అండర్ అరెస్టు"
    ధీరజ గంభీరమయిన స్వరానికి సింహాచలం నిర్లిప్తంగా నవ్వాడు.
    కానిస్టేబుల్స్ అతని చేతికి సంకెళ్ళు వేశారు.
    స్వప్న అప్పటికే తెరుకున్నది.
    "ఇన్ స్పెక్టర్ ....నా భర్తను అరెస్టు చేయడమేమిటి? అసలు మీరంతా ఈ వేళప్పుడు ఇక్కడకు ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారు?" మనస్సులోనే మెదిలే సందేహలన్నింటిని బయట పెట్టింది స్వప్న.
    "స్వప్నా.....సీతాపతిని హత్య చేసిన నేరానికి నీ భర్తను అరెస్టు చేస్తున్నాం."
    పెరటి తోటలో సింహాచలం దాచి పెట్టి వుంచిన రెండు పీపాలను మోసుకు వచ్చి ఇన్ స్పెక్టర్ ముందు వుంచాడు కానిస్టేబుల్ సుందరం.
    వాటిని చూడగానే సింహాచలం ముఖం పాలిపోయింది.
    అవి తమ ఇంటిలోకి ఎలా వచ్చాయో అర్ధం కాక ధీరజ వైపు ఆశ్చర్యంగా చూసింది స్వప్న.
    "వీటిని నీ భర్త రెండు రోజుల క్రితమే కొని పెరటిలో దాచి వుంచాడు."
    'ఆయనకు వీటితో ఏం పని."
    "నిన్ను సునిల్ ను ....సీతాపతిని చంపిన విధంగానే చంపి మీ ఇద్దరినీ చెరొక పీపాలో భద్రంగా దాచి వుంచడానికి....." అంటూ కల్పించుకున్నాడు సుందరం.
    స్వప్న అతని వైపు చురుగ్గా చూసింది.
    "ఎస్,... ఆటను చెప్పింది అక్షరాల నిజం. వైజాగ్ లో లలిత భర్త సీతాపతిని ఇలానే చంపి పీపాలో పెట్టి ఎవరూ గమనించకుండా తెలివిగా నర్శింగిపల్లి వద్ద పాసింజర్ రైలు ఎక్కించాడు. ఆ పీపా విజయవాడ వచ్చి తేలింది. అతనిని ఎవరు చంపారో .....ఎక్కడ చంపారో ....అసలు ఆ శవం ఎవరిదో ఈరోజు వరకూ అంతు తెలియని మిస్టరీగానే వుండి పోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS