Previous Page
ది పార్టనర్ పేజి 47

 

    ఒక్కసారిగా వెలుగులో నుండి చీకటి లోకి వెళితే వెంటనే తెలియని భీతి .....మరి చిమ్మచీకటిలో నుండి కమ్మని వెలుగు లోకి వెళితే పట్టరాని సంతోషం, అంటే చీకటి చూడని వారిని వెలుగులో మధురిమ.....వెలుగు చూడని వానికి చీకటి లోని భయం భోధపడినట్టే నా జీవితంలో చేదు అనుభవాలను రుచి చూశాను.
    సంఘంలో మంచీ చెడుల మధ్య సంఘర్శణ .....జీవితంలో అనుకోకుండా ఎదురయ్యే సంఘటనలూ ....మానవ ప్రకృతిలో ని ఊహించలేని నిమ్నోన్నతులూ..... మనలను కదలించి వేసినప్పుడు మనకు మనశ్శాంతి కలిగించేది స్నేహితులతో మనం పంచుకునే అనుభూతులే నని నీ సహచర్యం రుజువు చేసింది. అయినా ఆ గుండె పొరలలో నిక్షిప్తమై వున్న బాధ, నీతో పంచుకునే సాహసం చేయలేకపోతున్నాను.
    అందుకే సుదూర తీరాలకు వెళ్ళిపోతున్నాను.....నా గమ్యం ఏమిటో ఎక్కడకో నిజంగా నాకూ తెలియదు. కాని వెళ్ళాలనిపించింది......వెళుతున్నాను.....నిజంగా మన ప్రేమ ఫలించి మనం ఒక్కటి కావాలని విధి లిఖించిన రాతను మనం దిక్కరించ లేము అన్నది నిజం అయితే ఆ కలయిక కోసం ఎదురు చూడడం మినహా చేయి సాచినా అందుకోలేనంత ఎత్తులో వున్న నీలాంటి ప్రేమ దేవతను పాణి గ్రహణం చేయగల అదృష్టం నాకు లేదనే నిరాశతో నీ హృదయ పీఠాన్ని నుండి దూరమై పోవాలనే నా ఈ గమ్యం లేని పయనం.
    ఎందుకు అలా జరుగుతుందో తెలియదు కానీ.....ఒక్కొక్కసారి ఒక సంఘటనతో మనిషి శిఖరాగ్రాలు మీదకు చేరిపోతాడు. అలానే వొక చిన్న సంఘటన చాలు అతనిని లోయలోనికి విసిరి వేయడానికి .....జీవిత యానంలో ఎదురయ్యే ఈ ఆటుపోటులను తట్టుకోలేక సమాజంపై వున్న కసితో నన్ను నేను చంపుకుని నాతొ పాటు ఎందరో తీరని వ్యధలకు గురి కావడానికి పరోక్షంగా బాద్యుడిని అయ్యాను.
    నువ్వు లేని సమయంలో నీ జీవిత డైరీని చూశాను..... అదే మనం జీవిత కాలానికి సరిపడా అంటే జరగబోయే అరవై సంవత్సరాలు వ్రాసుకునే విధంగా ప్రత్యేకంగా అరవై పేజీలు  వున్న డైరీ ని నువ్వు నాకు .....నేను నీకు ప్రజెంట్ చేసుకున్న విషయం నీకు గుర్తు వుండే వుంటుంది. ఆ డైరీ లోని ఎనిమిది సంవత్సరాల కాలం నా గురించి నీవు వ్రాసిన వొకే వొక వాక్యం నన్ను కదిలించి వేసింది.
    "నా సునీల్ ఎక్కడ వున్నాడో.....ఏం చేస్తున్నాడో .....అతను లేని నా జీవితం వ్యర్ధం..."
    ప్రతి పేజీలోనూ ఇదే మాట కనిపించింది.
    అప్పుడే అర్ధం అయింది నాకు. ఇంతకాలమూ నా తలపులే నీ జీవిత మార్గాన్ని నిర్దేశించాయి అని..... నా గురించి నా పతనం గురించి నేను నీతో సూటిగా చెప్పుకోలేకనే నన్ను పోలీసులు అరెస్టు చేసి తీసుకు వచ్చేటప్పుడు నా డైరీని బయటే వుంచి వచ్చాను. ఎందుకంటె తరువాత నయినా నువ్వు ఆ డైరీని చూస్తావు అనే ఆశ నన్ను అలా చేయించింది.....అది చదివి కూడా నువ్వు నన్ను అసహ్యించుకోలేదంటే నీది ఎంత గొప్ప ప్రేమో అర్ధం అయింది నాకు.
    ఇంతవరకూ నా మనస్సులో నేను పడిన సంఘర్షణకు వొక పరిష్కారం చూపాయి నీ డైరీలోని మాటలు....అందుకే వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను.
    స్వచ్చమైన నీ ప్రేమకు నేను మాలిన్యాన్ని అంట గట్టలేను..... నేను నీ సమక్షంలో వున్నంత కాలం నా జ్ఞాపకాలే నిన్ను వెంటాడు తుంటాయి. అని నాకు తెలుసు....నాలాంటి పాపాత్ముడిని క్షమించి అక్కున చేర్చుకుని లాలించగల నిర్మల మయిన ఔదార్యం నీకు వున్నప్పటికీ సానుభూతి తట్టుకోగల హృదయం నాకు లేదు.
    నిన్నటి వంచనను నేటి కనువిప్పుగా మలుచుకుని రేపటి ఆశా జీవితం కోసం తపించే ఆశా జీవిగా నన్ను మలిచిన నీ స్పూర్తితో మనం కలిసి తిరిగిన సుందర స్వప్నాలను నెమరువేసుకుంటూ సాగి పోతున్నాను.
    నేను గడిపిన జీవితం నన్ను నిరంతరమూ వెన్నాడుతుంటే నీలో అందమయిన కలలను ఎలా వూహించగలను .....అందుకే నా మనస్సుకు ద్రుడత్వం చేకూరి , స్పష్టమయిన నా గమ్యాన్ని నిర్దేశించు'కున్నప్పుడు నీ చేరువలోకే వస్తాను."
    నా పాపాలను ప్రక్షాళన జరిగి .....నేనూ ఒక మనిషినే అన్న ఆత్మ స్థాయిర్యం అలవడిన నాడు నా పయనానికి అర్ధం భోధపడినట్టే.....అంతవరకూ నిన్ను నిరీక్షించమని అభ్యర్ధించడం లేదు.....నా మనస్సులోని వ్యధను నీ ముందు వుంచుతున్నాను.
    నువ్వు ఎవరికి అర్ధాంగిగా వున్నా నన్ను క్షమించే చల్లని హృదయం నీకు ఎప్పుడూ వుంటుందని నాకు తెలుసు.....అందుకే ఈ ఒంటరి పోరాటంలో ఎప్పుడు అలసి పోయినా నీ దరికే చేరతాను.
    కలిసి జీవించాలని సుఖ దుఖాలనూ కలిసే పంచుకోవాలని .....ఆ జన్మాంతం ఆదర్శ దంపతులులా ఉండి పోవాలని బాసలు చేసుకున్నాము. కానీ నీకు బాస చేసినట్టు నా వ్యక్తిత్వాన్ని నిలుపుకోలేకపోయాను. నీలాంటి ఉత్తమ ప్రేయసికి నాలాంటి హీన చరిత్ర కలిగిన భర్త పార్టనర్ గా పనికి రాడు.
    పెళ్ళి అంటే ముచ్చటగా మూడు ముళ్ళ బంధం ఒక్కటే కాదు.....మానసిక అనుభూతి కూడా.....ఆ అనుభూతి లేని భర్త పెళ్ళి పీటల మీద కూర్చునే అర్హతనే కోల్పోతాడు. ఇప్పుడు నా జీవితంలో అదే జరిగింది.
    పవిత్రత అనేది శరీరానికి లేకపోయినా మనస్సుకు వుంటే చాలునని నువ్వు సరిపెట్టుకోవచ్చు. కానీ నా జీవిత భాగస్వామిగా మరొక గడచి పోయిన నా చేదు జ్ఞాపకాలు నీకు ఏదో ఒక క్షణాన విషం చిలికినట్టు జ్ఞప్తికి రాకమానవు. ఇలాంటి వాడికి నా జీవితాన్ని ఎందుకు పంఛి ఇచ్చానా అని అప్పుడు నువ్వు చింతించినా ప్రయోజనం వుండదు.
    నాలాంటి దోషికి ఏ శిక్షా స్మృతి లోనూ ఎలాంటి శిక్ష విధించాలో వుండి వుండకపోవచ్చు. అందుకే నాకు ప్రియాతి ప్రియమైన నీ నుండి దూరంగా వెళ్ళిపోవాలని నాకు నేనే శిక్ష విధించు కుంటున్నాను. పార్టనర్ అంటే స్త్రీ పురుషులు కేవలం బెడ్ పార్టనర్స్ గా మిగిలి పోకూడదు.....మనసా వాచా కర్మణా ఒకరినొకరు అన్నింటా తామే అయి తాద్యాత్మక చెంది అనురాగాన్ని ఇచ్చి పుచ్చుకోవాలి.
    ఆ సశ్చీలత నాలో లోపించింది.....నీకు తెలిసి నిష్క్రమిస్తే నీ కన్నీరు నా కాళ్ళకు బంధాలు వేయవచ్చు. అందుకే నాకు నేనుగా నా స్వయం కృతాపరాదానికి విధించుకున్న శిక్షను ఆనందంగా అనుభవించడానికి గమ్యం కనిపించని శూన్యంలోకి విరాగిలా నడచి వెళుతున్నాను.
    నన్ను నిండు మనస్సుతో క్షమిస్తావు కదూ.....

                                                                                              నీకు ఏమీ కాలేకపోయిన,
                                                                                                      ---సునీల్,


    తన గుండెలలో పదిలపరచుకున్న తన సునీల్ ..... గుండె పెకలించి అతనిని తన నుండి దూరంగా లాక్కు పోతున్నట్టు విలవిలలాడిపోయింది ధీరజ.
    ఆ ఆలోచనకే నవనాడులు తెగిపోయినట్టు అచేతనంగా .....అలానే నిలుచుండి పోయింది.
    ధీరజ చేతిలోని వుత్తరం.... వాళ్ళ అలౌకిక ప్రేమ జ్ఞాపకాలను తట్టి లేపుతున్నట్టుగా రెపరెప లడుతున్నది.


                                                    -------సమాప్తం----------


 Previous Page

WRITERS
PUBLICATIONS