Previous Page Next Page 
కె. ఆర్. కె మోహన్ కథలు పేజి 46

    
    ఈ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయి బెలూన్ లాగా ఉబ్బిపోయాడు పేరయ్య. పేరయ్య చదువుకోలేదు కాని - తెలివితేటలు వున్నవాడు, కార్యసాధకుడు. తన కొత్త పదవిలో ఇబ్బందిలేకుండా ఉండడంకోసం నమ్మకస్తులైన కొందరు సలహాదారులను ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్లు పేరయ్యకు ముందుగా తనభాషను మార్చుకోవలసిన అవసరం  వుందని చెప్పారు. ఉపన్యాసాల్లో సంస్కృత పదాలు ఎక్కువగా వాడితే వినడానికి బాగుండడమేగాక, ఆ వ్యక్తిపట్ల  ప్రజల గౌరవం ఇనుమడిస్తుందని చెప్పారు. దాంతో పేరయ్య  సంస్కృత పదాలు ఎక్కువ వుండే తెలుగు పత్రికలు, పుస్తకాలు చదవసాగాడు.


    పేరయ్య యమ్మెల్యేగా వుండిన రోజుల్లోనూ, మంత్రిగా వుండిన రోజుల్లోనూ అనేక సాంస్కృతిక సంఘాలతో సంబంధాలు పెట్టుకున్నాడు.  ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కావడంతో సాంస్కృతిక సంఘాలన్నీ కలిసి పేరయ్యకి ఘన సన్మానసభ ఏర్పాటు చేశాయి.


    వేలాదిమంది హాజరైన ఆ సభలో పేరయ్యను పూలమాలలతో అలంకరించి 'అపరభోజుడనీ, అభినవ కృష్ణదేవరాయ' లనీ - ఇలా, ఇలా... .అన్నివిధాలా పొగిడారు సమావేశకర్తలు.


    "నేను కళావంతుడిని కాకపోయినా, నన్ను ఇంత ఘనంగా సన్మానించారంటే.... ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను" అంటూ ప్రారంభించాడు.


    సభ చప్పట్లతో, నవ్వులతో దద్దరిల్లిపోయింది. అదంతా తనపట్ల అభిమానం అనుకున్న పేరయ్య -

 
    "కళలకు మనదేశం పుట్టినిల్లు. మన ప్రజలు ఎంతో పేదరికంలో వున్నా కూడా ఇంతమంది కళావంతులు ఈ గడ్డమీద వున్నారంటే అది ఈ దేశపు గొప్పతనాన్ని చాటుతోంది" అంటూ ఉపన్యాసం కొనసాగించాడు.


    సభలో మళ్లీ చప్పట్లు, ఈలలు కూడా తుఫాను గాలిలా హోరు పలికాయి. అధ్యక్షులవారు నెమ్మదిగా  పేరయ్య చెవి దగ్గర"కళావంతులు అనకండి, కళావంతులు అనకండి - కళాకారులు అనండి" అని చెప్పారు.

 
    తన మాటలో ఏదో లోపం వుందని గ్రహించుకున్న పేరయ్య తన మాటని 'కళాప్రియులు' గా మార్చి ఉపన్యాసం పూర్తిచేశాడు.

 
    సభ ముగిసింది.


    కారులో తిరిగి వెళ్తుండగా సహాయకుడు చెప్పాడు - "కళావంతులు అంటే ఒకప్పుడు వేశ్యవృత్తి చేసి, ఆ వృత్తి మానేసి గౌరవంగా జీవిస్తున్న కులస్థులు" అని!


    "అలాగా.. కళను కలిగినవారు కళావంతులు అనుకున్నాను. ధనవంతులు, బలవంతులు లాగా...! ఈ సంస్కతంతో మాచెడ్డ చిక్కొచ్చిందయ్యా!" అంటూ ఫెడీ ఫెడీ నవ్వాడు పేరయ్య.


    ఉన్నట్లుండి ఒక్క కుదుపుతో కారు ఆగింది.


    "ఏమైంది డ్రైవరూ?" అని అడిగాడు పేరయ్య.


    "స్పీడ్ బ్రేకరుంటే అడ్డు వచ్చింది సార్!" అన్నాడు డ్రైవర్.

 
    "మరి.. ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నట్లు? పి. యే.  నోట్ చేస్కో - కమిషనర్ తో ఈస్పీడ్ బ్రేకర్లను ఆరెస్ట్ చేయమని చెప్పు" అన్నాడు.


    "స్పీడ్ బ్రేకర్ అంటే... రోడ్డు మీద వాహనాల వేగాన్ని తగ్గించేందుకు ఎత్తుగా వేసే దిమ్మ!" అని సహాయకుడు నెమ్మదిగా చెప్పాడు.


    "అలాగా....!" అంటూ పెడీఫెడీ నవ్వాడు పేరయ్య.


    దారిలో జనరల్ హాస్పిటల్ కనిపించింది. ఆకస్మికంగా దాన్ని తనిఖీ చేయాలని బుద్ది పుట్టింది పేరయ్యకి.

 
    వెంటనే కారుని హాస్పిటల్ లోకి పోనిమ్మన్నాడు. ఒక మామూలు వ్యక్తిలాగా ఆస్పత్రిలో తిరగసాగాడు.  లోపల ఒకచోట 'లేబర్ రూం' అని వున్న బోర్డు కనిపించింది.


    అది చూసి మాజీ కార్మిక నాయకుడు పేరయ్యకు చెప్పలేని సంతోషం వేసింది. "మన ఆస్పత్రులు చాలా అభివృద్ది చెందాయయ్యా! ఫ్యాక్టరీలలోనే కాకుండా, ఆస్పత్రులలోకూడా లేబర్ కోసం సెపరేట్  గదులు పెట్టారు" అన్నాడు ప్రక్కవారితో.

 
    "లేబర్ రూం అంటే... పురిటి గది!" అని నెమ్మదిగా చెప్పాడు సహాయకుడు.


    "భలేగా వుందే.... "అంటూ మళ్ళీ ఫెడీఫెడీ నవ్వసాగాడు పేరయ్య అమాయకంగా.

 
    నవ్వు ఆగక ముఖం తిప్పుకున్నారు పక్కనున్న వాళ్లు.


    మర్నాడు.. .ఒక కుటుంబ సంక్షేమ కార్యక్రమానికి అధ్యక్షత వహించాడు పేరయ్య. ప్రారంభోపన్యాసంలో -


    "మహాజనులారా! భారత కాలంలో కర్ణుడు గొప్ప గొప్ప దానాలు చేసి దానకర్ణుడు అన్న బిరుదు పొందాడు. అచ్చు ఎరుగని రోజుల్లో విద్యాదానం అన్నిటిలోకి గొప్పదానం. ఈ కలికాలంలో గర్బాదానం బహుళ ప్రచారం పొందింది. కాని, ఈ ఆకలి కాలానికి ఇది తగదు" అంటూ ఛలోక్తులతో ఉపన్యాసం మొదలుపెట్టాడు.


    హాలు చప్పట్లు, ఈలలతో దద్దరిల్లిపోయింది.


    "అమాయకుడిగా కనిపించే పేరయ్య ఎంత అర్దవంతంగా మాట్లాడే స్థాయికి ఎదిగిపోయాడు!?" అని ఆశ్చర్యపోయారు అందరూ.


    ఉపన్యాసం అయిన తర్వాత ఒక కొత్త హాలుకి ప్రారంభోత్సవం చేయవలసి వుంది. "గది ద్వారానికి అడ్డంగా వున్న రిబ్బన్ ను కత్తిరించండి" అన్నాడు పి. యే.


    అయితే... బానపొట్ట అడ్డు రావడంతో ఆ రిబ్బన్ పేరయ్యకి కనిపించలేదు. అటూ ఇటూ చూశాడు.  ప్రక్కనే ఒక చిన్నపిల్ల జడనుంచి రిబ్బన్ వేలాడుతుంటే కసుక్కున దానిని కత్తిరించేశాడు. చప్పట్లతో హాలు దద్దరిల్లిపోయింది.

 
     ఆ సమయంలో ద్వారానికి వున్న రిబ్బన్ కనిపించింది పేరయ్యకి. దాన్నకూడా కత్తిరించి "ఈ పాప రిబ్బన్ కత్తిరించడంలో నా ఉద్దేశం మీకు అర్దమయ్యే వుంటుంది. ఈ పాప కొన్నేళ్లలో జీవితం లో అడుగుపెడ్తుంది. తన రిబ్బన్ కత్తిరింపు - కుటుంబాన్ని అదుపు చేసుకునే అవకాశాన్ని ఆమెకు జ్ఞాపకం చేస్తుంది. అలాగే అందరు స్త్రీలకూను!" అంటూ సర్దుకున్నాడు.


    "అబ్బో... పేరయ్య పొట్ట - ఉపాయాల పుట్ట!" అనుకున్నారు అందరూ.

 
    సభ జయప్రదంగా ముగిసింది.


    సభకు హాజరైన పౌరులు పేరయ్య ప్రసంగంలోని వ్యంగ్యాన్ని చర్చించుకొంటూ వెళ్లిపోయారు.


    ముఖ్యమంత్రిగారు పరివారంతో సహా ముఖ్య అధికార్ల నుండి, ప్రముఖుల నుండి సెలవు తీసుకుని నిష్క్రమించారు.

 
    పేరయ్య తన మాటలతో, చేతలతో దేశ ప్రజలను నిత్యం నవ్వించసాగాడు. పత్రికలవారికీ, కార్టూనిస్టులకీ కావలసినంత ముడిసరుకును అందజేయసాగాడు. అనుభవంతో పాటు తన పదవిని  పదిలం చేసుకోడానికి సొంత వర్గాన్ని ఏర్పరుచుకోసాగాడు. చాటున నవ్వుకున్నా  ఎదుట మాత్రం 'పేరయ్యకి జై!' అనేవారి సంఖ్య ఎక్కువ కాసాగింది.

 
    పేరయ్యతోపాటు మాయాదేవి చిత్రాలు కూడా కార్టూన్లలో రాసాగాయి.  ఇవన్నీ చూసి మాయాదేవికి ఒళ్ళు మండిపోయింది. ఏకులాంటి పేరయ్య మేకులా అవుతాడని ఆమె  అనుకోలేదు. గొడ్డలిదాకా రాకుండా గోటితోనే తుంచివేయాలని అనుకుంది.


     'పేరయ్య అసమర్దుడు' అన్న ప్రచారం ముమ్మరం అయింది. పార్టీ సభ్యుల అభీష్టం మేరకు అంటూ ఏడాది అయిందో, లేదో... పేరయ్యని ముఖ్యమంత్రి పదివినుంచి దింపేసింది.

 
    'ముఖ్యమంత్రి పేరయ్య' మామూలు యమ్మెల్యే అయిపోయాడు.


    ఆరాత్రి పేరయ్యకి ఒక కల వచ్చింది -


    తాను గోదావరి ఒడ్డున బట్టలు ఉతుకుతున్నాడట. అందరు తనని "పేరిగా..!" అంటున్నారట.

 
    "నన్ను పేరిగా అంటారేమిటి? నా పేరు పేరయ్య. నేను ఈ దేశానికి రాజుని!" అంటూ గట్టిగా అరుస్తూ నిద్రలేచాడు.


    "అయ్యో ..ఇదంతా కలేనా?" అనుకున్నాడు. మళ్ళీ పడుకున్నాడు కాని, నిద్రపట్టలేదు. గుండెల్లో ఎవరో "పేరయ్య రాజంట!"  పేరయ్య రాజంట!" అని పదేపదే  అవే  మాటలు అంటున్నట్లు అనిపించసాగింది.


                           - విజయ మాస పత్రిక.... మార్చి' 86 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS