వ్రతం అయింది కానీ....
"అబ్బబ్బబ్బ.... ఈముండాకొడుకుతో చావొచ్చిపడింది!" అంటూ రుసరుస లాడుతూ వచ్చాడు సుబ్బారావు.
"ఎవరా ముండాకొడుకు... , ఏమా కథ?" అడిగాడు మూర్తి ముసిముసి నవ్వులు నవ్వుతూ.
"ఒరేయి .. సమయం, సందర్భం లేకుండా వెధవ జోకులు విసరకు! నాకసలే వళ్లు మండిపోతోంది!"అన్నాడు సుబ్బారావు కోపంగా.
"అయ్యోపాపం....! దగ్గర్లో నీళ్ళు కూడా లేవ్!" అని మరో జోక్ వేశాడు మూర్తి.
"సంతోషించాంలే ... తెలివితేటలకి కాని, ఈపాటికి చాలించు!" అన్నాడు సుబ్బారావు కుర్చీలో కూర్చుని తల పట్టుకుంటూ.
"అసలు ఏం జరిగిందో చెప్పరా....! మిరపకాయలు మింగిన కాకిలాగా ఎందుకలా అరుస్తున్నావు!" అన్నాడు మూర్తి.
"వాడేరా.. మన ఆఫీసర్!క్యాజువల్ లీవు ఇమ్మంటే చాలు - అష్టోత్తరం చదువుతాడు. ఎప్పుడు అడిగినా సరే . 'లేదు' అనే మాట రామనామంలాగా జపిస్తాడు. ఇతరుల అవసరం ఏమాత్రం చూడడు" అన్నాడు సుబ్బారావు చిరాగ్గా.
"అదేమిటిరా - ఆఫీసులో చేతులన్నీ పూర్తిగా వున్నాయిగా!?"
"చేతులేమిట్రా - నీ శ్రాద్దం....!?"
"అదేరా.. .ఆఫీసులో హాండ్స్ ఫుల్ గా వున్నారుగా!"
" ఏమి? ఉంటే యేం...! మనం లేకపోతే ఆఫీసు కుప్పకూలి అందరి నెత్తినా పడేట్లు మాట్లాడుతాడు."
" అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పరా!"
"అలాగే చెప్పబోతున్నాను. అసలు వాడి గదిలోకి వెళ్లడమంటేనే తలనొప్పి! భల్లూకంలాగా కూర్చుంటాడు. నమస్కారం పెట్టినా తలైనా ఎత్తడు. నిద్రపోతున్నాడో తెలియదు, జోగుతున్నాడో తెలిదు. అసలు మనం పెట్టిన నమస్కారమైనా చూశారో, లేదో తెలియదు!"అంటూ ఒక్కబిగిన చెప్పుకుపోసాగాడు సుబ్బారావు.
" ఒరేయ్..నువ్వు చెప్పింది పాయింటే రోయ్! వాడికి తన క్రింద ఉద్యోగులు నమస్కారం పెట్టలేదనుకుంటే భలే కోపం వస్తుంది. అది మనసులో పెట్టుకుంటాడు కూడాను.....!" అన్నాడు మూర్తి సుబ్బారావు వాక్ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ.
"దిక్కమాలిన గోల! వాడి మెల్లకన్ను కాదు కాని, అసలు మన నమస్కారం గమనించిన విషయం కూడా తెలీదు. చూడలేదేమోనని మళ్ళీ మళ్ళీ పెట్దామనుకుంటే తన మెల్లకన్నుని హేళన చేస్తున్నాడని అనుకుంటాడని భయం! వీడితో భలే చావొచ్చిపడిందిరా బాబూ...!" అన్నాడు సుబ్బారావు దిగులుగా.
"అదీ నిజమేరోయ్! ఆ.... వుండు -నేనో ఉపాయం చెప్తాను..." అన్నాడు మూర్తి.
"ఏమిట్రా అది?" అన్నాడు సుబ్బారావు ఆసక్తితో.
"వాడు మెల్లకన్నుతో ఎటు చూస్తున్నాడో తెలీదుకదా! అందువల్ల ఇక ముందు నమస్కారం పెట్టేప్పుడు చేతులు జోడించి ఆయన చుట్టూ ఒక ప్రదక్షిణం చేయి. ఏదో ఒక దశలో వాడి కంటికి నీ నమస్కారం కనిపిస్తుంది!"అంటూ వస్తూన్న నవ్వును ఆపుకుంటూ అన్నాడు మూర్తి.
"ఒరేయ్ ..నీకు తెలీనిదేముంది?" పెళ్లయి గట్టిగా మూడు నెలలు కాలేదు కదా - 'మూఢం ...మూఢం' అంటూ మూఢుఢు మా మామగారు వారం తిరక్కుండా మా ఆవిడని పుట్టింటికి తోలుకుపోయాడు. పోనీ సరదాగా ఓ మూడు రోజులు అత్తవారింటికి వెళ్ళివద్దామనుకుంటే.. ఈ ముండా కొడుకు సెలవు ఇవ్వనంటాడు!" సుబ్బారావు ఎంతో బాధగా వాపోయాడు.
"ఒరేయి.. నీ భార్య ఆవా? గేదా?..... తోలుకుపోడానికి?" అని అడుగుదామనుకున్నాడు కాని, అసలే సుబ్బారావు బాధ పడుతున్నాడని ఊరుకున్నాడు మూర్తి.
" సరదా నీకు కాని..., ఆ నవాబుదేముందిరా?" అన్నాడు.
" నవాబుట?! ఆ నవాబుతనం వాడి పేరులోనే కాని, బుద్దిలో ఏమాత్రం లేదు. ఆఫీసర్ అవగానే సరిపోయిందా? ఆ హుందాతనం చేతల్లో వుండొద్దూ? ఇటువంటి వాళ్లని చూసే ' కనకపు సింహాసనమున' అనే పాట కట్టాడు వేమన....!" అన్నాడు సుబ్బారావు కసిగా.
"ఒరేయ్... ఒరేయి! ఖూనీ.... ఖూనీ!" అని అరిచాడు మూర్తి.
"ఎక్కడ ..ఎక్కడ?" అంటూ కంగారుగా లేచాడు సుబ్బారావు.
" ఇంకెక్కడ...? నువ్వే ఆ హంతకుడివి! ' కనకపు సింహాసనమున' అనేది పాట కాదురా నాయనా - అది పద్యం! దానిని చెప్పింది సుమతీ శతకకారుడు. వేమనగారు కనుక బ్రతికి వుంటే నీ మాట విని నిలువునా ఉరి వేసుకునేవాడు!" అన్నాడు మూర్తి.
" అబ్బ - పోరా! ఎంత కంగారుపెట్టావు? బోడి హాస్యమూ నువ్వూనూ...! ఇల్లుకాలి ఒకడేస్తుంటే ఒళ్ళుకాలి ఇంకొకడు ఏడ్చాడుట. చెప్పేదేదో చెప్పనివ్వకుండా పానకంలో పుడకలాగా అడ్డు వస్తే ఎలా....?" అన్నాడు సుబ్బారావు కోపంగా.
"సరే.... చెప్పు నాయనా! ఇంతకీ సి. యల్. కి. కారణం ఏమని పెట్టావు? సరదాగా అత్తవారింటికి వెళ్తాననేనా?"
"ఛ...నేనేనా అంత తెలివితక్కువ వాణ్ణి? ఓసారి తేలు కుట్టిందని సెలవు చీటీ పంపిస్తే ఆఫీస్ కి పిలిపించి కుట్టిన చోటుని పరీక్షించి, కుట్టిందని నమ్మకం కలగగానే అర్దదినం సెలవు గ్రాంటు చేసిన కర్కోటకుడు ఈ నవాబు. వీడి సంగతి తెలిసే గుండసూదితో వేలిమీద పొడుచుకుని దానికింత మందు రాసి, తేలు కుట్టినట్లు చూపించాను. అటువంటి వీడికి నిజం తెలిస్తే సి. యల్. గ్రాంటు చేస్తాడా?" అన్నాడు సుబ్బారావు.
"మరి.... కారణం ఏమని చూపించావ్?"
"ఎవ్వరూ 'నో' అనడానికి వీలులేని కారణం చూపించానురా."
"ఏమిట్రా అది?"
" శోభనమని వ్రాశానురా...!"
"వెరీగుడ్... నీ బుర్ర అమోఘంరా! ఇంక ' నో' అనడానికి వీలులేదే...!"
"గాడిద కొడుకు బుర్ర - మనకంటే అమోఘంరా ..! పెళ్లయి మూడునెలలు అయితే ఇప్పుడు శోభనం ఏమిటని నిగ్గదీశాడు"
"చంపాడురా...! ఎంతైనా - వాడు ఉద్దండ పిండం!"
"అయ్యా....! మాలో శోభనం పెళ్లయిన వెంటనే చెయ్యరు. ఇంతలో మూఢం అడ్డొచ్చింది. అందువల్ల మా మామగారు ఇప్పుడు ఏర్పాటుచేశారు... అని నచ్చచెప్ప ప్రయత్నించాను."
