రత్నాకర్ పండిట్ ఏడాది తిరక్కుండానే ఆకస్మికంగా గుండెపోటుతో మరణించాడు. దాంతో ప్రధాని పదవికి వయోవృద్దులు, అనుభవ వృద్దులూ పోటాపోటీలు పడసాగారు.
చివరికి వారిలో వారు తేల్చుకోలేక, రాజీ అభ్యర్దిగా.. .బంగారుబాబు కుమార్తె కావడం ప్రధాన అర్హతగల మాయాదేవికి కాయం చేశారు.
తనకి ఆ పదవి రాకపోయినా నా వాడికి రాకూడదనే భావం ప్రబలంగా ప్రతి అభ్యర్దిలోనూ వుండడంతో, మాయాదేవికి ఈ పదవి సులువుగా దక్కింది. పైగా... అనుభవ వృద్దులు - అనుభవంలేని ఆ అబలను అడ్డుపెట్టుకొని అసలు పెత్తనం అంతా తామే చలాయించవచ్చునని అంతరంగంలో ఆశించారు.
అయితే... అచిరకాలంలోనే మాయాదేవి తాను 'అబల' కాదనీ, మగవారిని ముక్కు పట్టుకుని ఆడించగల 'మేటి' అని నిరూపించుకుంది. తనకి ప్రమాదం తెచ్చిపెట్టగలరని అనిపించిన వారందర్నీ కొట్టకుండా, తిట్టకుండా -కీళ్లు విరిచి మూల కూర్చోబెట్టింది. ఆ విధంగా కేంద్రంలో తన పదవిని పదిలం చేసుకున్నాక దృష్టిని రాష్ట్రాలవైపు మళ్ళించింది.
అప్పడు ఆంధ్రప్రదేశ్ లో సంతోషస్వామి ముఖ్యమంత్రిగా వున్నాడు. ఆయన కొంచెం గట్టివాడు. ఆయన వల్ల ఎప్పటికైనా తనకి ప్రమాదం వుండగలదని భావించింది మాయాదేవి. ఏదో ఒక కారణం చేత విద్యార్దులు రాష్ట్రంలో అలజడి చేస్తుంటే, ఆ అవకాశం తీసుకుని సంతోషస్వామి చేత రాజీనామా ఇప్పించి, ఆయనకు తన కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించింది. తనకి విధేయుడుగా వుంటూ, తన చెప్పుచేతలలో వుండే అర్దనారీశ్వరరావుని ముఖ్యమంత్రిని చేసింది.
వెంటనే ఆఘమేఘాల మీద పేరయ్య హస్తనకు పరుగెత్తాడు. ఆమె పాదాల మీదపడి "తల్లీ.. జగన్మాతా! నాకు మంత్రి పదవి కటాక్షించి, మరింతగా ప్రజాసేవ చేయడానికి వీలు కల్పించు' అని ప్రార్దించాడు.
అమ్మగారు చిరునవ్వు నవ్వి, "నీ విషయం పరిశీలిస్తాను" అని హామీ ఇచ్చింది.
అమ్మగారు నవ్విందంటే అర్దం - కార్యం అయ్యిందనే! అర్ద నారీశ్వరరావు మంత్రివర్గంలో పేరయ్యకు స్థానం లభించింది. ఆ దెబ్బతో ఆరణాల కూలీపేరయ్య ఆంధ్రప్రదేశ్ మంత్రి అయిపోయాడు.
'విద్య యొసగును వినయంబు' అన్నారు పెద్దలు. పేరయ్యకి రాజకీయ విద్య మరింత వినయాన్ని నేర్పింది. మంత్రి కాగానే తొలుదొల్త ఢిల్లీకి ఎగిరి అమ్మగారి ముందు వాలి తన కృతజ్ఞతలు తెలుపుకున్నాడు పేరయ్య.
ఎప్పుడూ చిరునవ్వుతో సాగనంపే మాయాదేవి - ఈసారి పేరయ్యతో కొంచెంసేపు ఆంతరంగికంగా మాట్లాడింది.
"చూడు పేరయ్యా... ఈ దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి అంతః శత్రువులు ఎందరో వున్నారు. ఎన్నో విదేశీ హస్తాలు కనిపించకుండా పనిచేస్తున్నాయి. ఇటువంటి సమయంలోనే నీలాంటి నమ్మకస్తుల సేవలు ఎంతైనా అవసరం. మీ ముఖ్యమంత్రిగారు ఏమీ చేస్తున్నదీ ఓకంట కనిపెట్టి, రెండో కంటికి తెలియకుండా ఆ సమాచారాన్ని నాకు అందిస్తూ వుండు. నువ్వు చాలా పైకి వస్తావు" అని చెప్పింది.
"మహాప్రసాదం జగన్మాతా! అంతకంటేనా...!?" అంటూ తిరిగి భాగ్యనగరానికి లంఘించాడు పేరయ్య.
పునాది గట్టిగా కట్టిన తర్వాత ఇల్లు త్వరత్వరగా పూర్తి అయినట్లు కేంద్రంలో తన వర్గాన్ని ఏర్పాటు చేయసాగింది మాయాదేవి. ఏ ముఖ్యమంత్రీ బలపడి సొంత వ్యక్తిత్వం చూపించకుండా వుండేందుకు ప్రతి రాష్ట్రంలోనూ అసమ్మతి వర్గాన్ని సృష్టించి పెంచి పోషించసాగింది. ఆంధ్రరాష్ట్రంలో ఇంకొకందుకు అల్లకల్లోలం ఏర్పడితే ఆ అవకాశం తీసుకుని, ఆ ఊపులో అర్దనారీశ్వరస్వామి కొట్టుకుపోయేట్టు చేసింది.
తర్వాత సజల నయనారావుని - సమర్దుడన్న భావంతో కుర్చీలో కూర్చోబెట్టింది. ఆయన నిజంగా సమర్దుడే కాని, సిద్దాంతాలంటూ వ్రేలాడుతూ.. .అమ్మగారికి అనుకున్న విధంగా విధేయుడు కాలేకపోయాడు.
దాంతో - మరుసటి ఎన్నికలలో ఆయనకి పోటీగా మంత్రదండ మహారాజు మెజార్టీతో గెలిచి, సజల నయానారావు నామరూపాలు లేకుండా పోయాడు.
ముఖ్యమంత్రులు మారినా... పేరయ్య మంత్రిపదవికి మాత్రం ముప్పు రాలేదు. ఆయన అమ్మగారికి అంతకంతకీ మరింత సన్నిహితుడు కాసాగాడు.
'దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి' అన్న సామెతలో అచంచల విశ్వాసం వున్నవాడు మంత్రదండ మహారాజు. క్షణక్షణానికి మారే రాజకీయాల్లో తన పదవి ఎన్నాళ్ళు వుంటుందోనని, వున్నవాళ్ళే ప్రతినిమిషాన్ని నగదుగా మార్చుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. మంత్రదండాన్ని తిప్పుతూ ప్రతిపనికీ రేట్లు పెట్టాడు. రోజుకి లక్ష రూపాయలనైనా చూడందే ఆయనకి నిద్రపట్టేది కాదట!
ముఖ్యమంత్రులు ఎవరు వచ్చినా ఢిల్లీ సామ్రాజ్యానికి కప్పం కట్టడం తప్పనిసరి! ఢిల్లీకి చెల్లించవలసిన కప్పంలోకూడా మంత్రదండ మహారాజు కన్నాలు పెట్తున్నాడని మాయాదేవికి తెలిసింది. ఆ సమాచారం పేరయ్యవంటి విధేయుల మూలంగా అందిందేనని వేరే చెప్పనక్కరలేదు.
వెంటనే అసమ్మతి వర్గాలు విజృంభించాయి... మంత్రదండ మహారాజుని మార్చాలని!
కొత్త ముఖ్యమంత్రిని గురించి ఆలోచిస్తుండగా మాయాదేవి కళ్ళముందు పేరయ్య విగ్రహం మెదిలింది.
'ఈ అమాయకుడు ఈ నిష్కపటి; ఈ నమ్మకస్తుడు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ వంటి అగ్రరాష్ట్రం గుప్పెట్లో వుంటుంది. ఇక.... సమర్దవంతమైన పరిపాలనా? అది ఎరికి కావాలి? ఎటువంటి పరిపాలననైనా ఢిల్లీ నుంచి, భారత యుద్దంలో శిఖండిని అడ్డుపెట్టుకున్నట్లు పేరయ్యను అడ్డుపెట్టుకుని నడపవచ్చు' అని అమ్మగారికి అనిపించింది.
వెంటనే ఆఘమేఘాల మీద హస్తినకి రావలసిందిగా కబురు వెళ్లింది పేరయ్యకు. ఇప్పటికీ తమ ఫోటోలతోపాటు బంగారుబాబు చెప్పుల్ని కూడా పేరయ్య తన పూజా మందిరంలో పెట్టి పూజిస్తాడన్న విషయం వేగుల ద్వారా గ్రహించింది.
పేరయ్య విమానాన్నే తన రెక్కలుగా చేసుకుని ఢిల్లీలో వాలాడు. "తల్లీ ఆజ్ఞ!" అంటూ అమ్మగారికి పాదాభివందనం చేశాడు.
"చూడు పేరయ్యా! నువ్వు నమ్మినబంటువన్ విషయం నాకు తెలుసు. నమ్మినవారిని కరుణించి యథోచితంగా సత్కరించడం మా వంశాచారం. మీ సేవలను మరింతగా ఉపయోగించుకోడానికి నీమీద అత్యంత గురుతరమైన బాధ్యతను పెడుతున్నాను. ఇకముందు నువ్వే ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రివి. ఈ బరువును నీవు మోయగలవా?"అని అడిగింది మాయాదేవి.
"తల్లీ! రామబాణంకంటే రామనామం గొప్పదని ఆంజనేయస్వామి నిరూపించలేదా! ఆ స్వామి నాకు గురువు. నిత్యమూ నీ నామాన్ని స్మరించే నేను -నీ ఆశీస్సులతో ఎంతటి పనినైనా చేయగలను" అన్నాడు పేరయ్య.
అంతే...మంత్రదండ మహరాజు మంత్రదండం పనిచేయక ఆగిపోయింది. 'ఆయన ముఖ్యమంత్రిని ఆయెనే...' అంటూ ఆనందమానందంగా పాటలు పాడారు. డప్పులు కొట్టారు, బొట్లు పెట్టారు, దండలతో ముంచెత్తారు, ఊరూరా - వాడవాడా ఊరేగించారు. సన్మానాలు చేశారు. ఇంద్రుడనీ - చంద్రుడనీ, కంతుడనీ - జయంతుడనీ పొగిడారు. 'ఆరణాల కూలీనుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరకూ...!' అంటూ పుస్తకాలు రాశారు.
