పాట పూర్తి అయే సరికి బావిలో నాలుగు మూలలనుండి నీరూరటం ప్రారంభించి చూస్తూ ఉండగానే బావి పూర్తిగా నీటితో నిండిపోయింది. అప్పటివరకు భక్తురాలు, కవయిత్రిగా మాత్రమే అందరికీ పరిచితమైన వెంగమాంబ మహిమాన్వితురాలని పామరులలో కూడ ప్రఖ్యాతి పొందింది.
గంగాభవాని కృపతో ఉత్తరమాడ వీధి ఇంటిలో కూడ చక్కని పూలతోటని తులసీ బృందావనాన్ని, శ్రీనివాసుని కోసం పెంచి పోషించింది వెంగమాంబ. తులసీ దళాలతోనూ, పుష్పాలతోనూ, రకరకాల మాలలల్లి తన ప్రాణనాథునికి అర్పించటం కొనసాగించింది. బావి ఒడ్డున ఒక సమతలమైన శిల. దానిపై కూర్చుంటే స్వామి ఆలయ గోపురం కనపడుతుంది. అది వెంగమాంబకి చాలా ఇష్టమైన ప్రదేశం. ఆలయాన్ని చూస్తూ స్వామిని ధ్యానం చేస్తూ, రచనలు చేస్తూ చాలా సమయాన్ని అక్కడే గడిపేది.
పూలతోపాటు విష్ణుపారిజాతాది కవితా ప్రసూనాలని కూడా ప్రసవించింది ఆ కవితా బృందావనం. ఆ పరిమళాలతో చెలిమి చేయటానికి వచ్చిన తాళ్ళపాకవారి రచనలన్నింటితోనూ పరిచయ భాగ్యం కలిగింది. అక్కడ తనకన్నా ముందున్న, రచయిత్రి మొదటి తెలుగు రచయిత్రి కూడా కాబోలు, తాళ్ళపాక తిమ్మక్క రచించిన సుభద్రా పరిణయం రచనలోని ఆర్ద్రత వెంగమాంబని కదలించింది. ఆ కదలిక రమాపరిణయం అనే పెండ్లిపాటగా అవతరించింది.
* * *
వెలుగుకి నీడ సహజం. వెంగమాంబ రచనా వైదుష్యం ప్రసిద్ధికి రావటం పొరుగున ఉన్న అక్కారం వెంకట్రామయ్య దీక్షితులకి కంటగింపు అయింది. అర్చక సంఘానికి పెద్ద అయిన తన పెద్దరికాన్ని, కీర్తి ప్రతిష్ఠలని, సంపదని గుర్తించటంలేదు అని ఉక్రోషం. వెంగమాంబ వింటోందని నిశ్చయించుకుని తన ఇంటికి వచ్చిన వారితో అతడనే మాటలు ఇలా ఉంటాయి.
"అయ్యో! ఎంత కానికాలం వచ్చింది? ఊరు వెలివేస్తే తిరుమల గతి అయింది. శ్రీనివాసుడెంత చులకన అయ్యాడు?"
"సంప్రదాయం పాటించని వారు శేషాచలపతికి భక్తులంటే నమ్మాల్సి వస్తోంది".
"విధవరాలు లోకమంగళకరునికి పుష్పమాలలందించటమా? అందునా సకేశి!"
"భక్తురాలట! అది భక్తా? రక్తా?"
"బరితెగించిన ఆడది యోగిని ఎట్లా అవుతుంది?"
"రామ రామ! కలికాలం కాకపోతే మావంటి సదాచార పరాయణుల పొరుగున శీలం లేనివాళ్ళు కాపురం. గుర్రం గాడిదా ఒకరాటనే!"
"అది కవిత్వమా! వెర్రిపైత్యమా?"
"ఆడదిరాస్తే బూతుకూతైనా కీర్తన అంటారులే!"
విన్నవాళ్ళెవరూ రామయ్య దీక్షితుల మాటలని పట్టించుకోకపోవటం అతడి ఉక్రోషాన్ని పెంచుతూ పోయింది. వెంగమాంబకి వినిపించాలనే ఉద్దేశంతోనే మాట్లాడిన మాటలు వెంగమాంబ విని కూడా విననట్టుండటం పుండుమీద కారం రాచినట్లవుతోంది. దూషణ, భూషణ, తిరస్కారాలని సమదృష్టితో చూడగలిగిన యోగినిని ఇటువంటి మాటలేవీ చలింపచేయలేవు అన్న సంగతి కూడ తెలియని అజ్ఞాని ఎంత చదువుకుంటే మాత్రం ఏం ప్రయోజనం?
అక్కసు పట్టలేక తమ ఇంటిలోని ఎంగిలి విస్తళ్ళని పూలమొక్కల మీద వేయించటం మొదలుపెట్టాడు. వెంగమాంబ ప్రతిరోజూ ఆ ఎంగిళ్లు శుభ్రం చేసి మరీ స్వామి అర్చనకు పూలు కోసేది. అదీ "ఈశ్వరేచ్ఛ" అనుకున్నదే కాని కోపపడలేదు. అయితే, ఆ ఇంట్లో ఆడవాళ్ళని పిలిచి "భగవదర్చనకు పెంచిన పూలని ఆవిధంగా మైలపరచటం మంచిదికాదు" అంది.
వాళ్ళు మాత్రం ఏమనగలరు? తాము కావాలని చేసినపని కాదుకదా అది! ఊరుకున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అదేతంతు.
పూర్ణిమనాటి ఉదయచంద్రుని వెన్నెలలో, తన తులసికోట తిన్నెమీద కూర్చుని, దేవాలయాన్ని చూస్తున్న వెంగమాంబ ధ్యానంలో నిమగ్నమై సమాధి స్థితిలోకి వెళ్ళిపోయింది. నిముషాలు, గడియలు, గంటలు జరిగిపోయాయి. అలవాటుగా తెల్లని సర్పం పడగవిప్పి నీడ పడుతోంది. రామయ్య దీక్షితులు ఇంట్లో రాత్రి భోజనాలు పూర్తయి యథాప్రకారం ఎంగిలి విస్తళ్ళు ఎగిరివచ్చి తోటలో తులసి మొక్కల నభిషేకించాయి. వాటిలో కొన్ని సమాధి స్థితిలో ఉన్న వెంగమాంబ పాదాలమీద పడటంతో సమాధి భంగమైంది.
"ధ్యానానందాన్ని భంగం చేసిన వాడి వంశం నిర్వంశం అగుగాక". అన్నది ఆవేశంగా.
అర్థరాత్రి తలుపు కొడుతుంటే తెరిచిన వెంగమాంబకి ఏడుస్తున్న రామయ్య దంపతులు కనిపించారు. వారింటినుండి ఏడుపులు, పెడబొబ్బలు వినవస్తున్నాయి. దంపతులు వెంగమాంబ కాళ్ళమీద పడి "అమ్మా వెంగమ్మా! నా వంశాన్ని రక్షించు. నీ శాపాన్ని మరలించు. రాత్రికి రాత్రి నీ శాపం వల్ల మా కుటుంబ సభ్యులలో చాలామంది విరేచనాలు వమనాలతో బాధపడి అకాల మరణం పొందారు. నీవు తప్ప మాకు గతిలేదు. నీ ఘనత తెలియక చులకన చేశాం. మన్నించు" అంటూ అనేక విధాల ప్రాధేయపడ్డారు.
ఈ మాటలతో ఎన్నడూలేనిది తాను కోపపడి తిట్టిన సంగతి గుర్తుకు వచ్చింది వెంగమాంబకి.
"నీవు పశ్చాత్తాపంతో పునీతుడవయ్యావు. కనక ఇకపై మీ కుటుంబం ఏకప్రాణి మాత్రంగా శేషించి ఉంటుంది. ఇదంతా భగవంతుడి లీలగా భావించి సన్మార్గంలో జీవించు" అంటూ ఓదార్చి పంపింది.
అక్కా రామయ్య దీక్షితులని ఓదార్చి పంపింది కాని, వెంగమాంబ ఈ సంఘటనతో చలించి పోయింది. "ఒక్క శాపంతో తపశ్శక్తి నిర్వీర్యమైపోతుంది. తన స్వామి పెట్టిన పరీక్షలో తాను విజయం పొందలేదు. సర్వజీవులు విష్ణు స్వరూపాలని దర్శించింది కాని, వారి చేష్టలలో వాసుదేవుని దర్శించటం ఇంకా పూర్తిగా రాలేదు. అందుకు కొంతకాలం మానవులకి దూరంగా ఉండటం మంచిది" అని తలచింది. ఏకాంతవాసానికి తగినతావు 'తుంబురుకోన' అని నిశ్చయించి, ఎవ్వరికీ చెప్పక ఒంటరిగా బయలుదేరింది. తుంబురుకోనలో ఉన్న గుహలలో ఒకదానిలో తీవ్రమైన తపస్సు చేయసాగింది.
తపస్తీవ్రతకి శరీరం అంతా కాగి, ఆ వేడికి మనసు వేగి, ఏమారుమూలనైనా దాక్కుని ఉన్న ఇంద్రియ ప్రకోపం ఆవిరై నానాటికి నిర్మల రూపంతో భాసించసాగింది.
ఒకనాడు వెంగమాంబ కనిపించకపోతే అందరికీ ప్రశ్నార్థకం అయింది. ఆ మర్నాటికి అనేక కథలు పుట్టుకుని వచ్చాయి.
